బ్లిజ్జర్డ్ అంటే హిమపాతం. మంచు తుఫానుతో పోలిస్తే తీవ్రత ఎక్కువ కలిగినది. రెండు లేదా మూడు అడుగుల ఎత్తున మంచు కురవడంతో పాటు గంటకు 35-50 మైళ్ళ వేగంతో సముద్రం మీది నుండి చలిగాలులు వీచడం బ్లిజ్జర్డ్ లక్షణం. అలాంటి తీవ్రమైన హిమపాతం జనవరి చివరి వారంలో అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను గజ గజ వణికించింది.
హిమపాతానికి ముందు అమెరికా చరిత్రలోనే అత్యంత తీవ్రమైన మంచు తుఫాను ఈశాన్య అమెరికాను చుట్టుముడుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వారి అంచనాలకు తగ్గట్లుగానే తీవ్రమైన హిమపాతం ఈశాన్య అమెరికాలోని పలు నగరాలను, హైవేలను, రైల్వే ట్రాక్ లను ముంచేసింది.
హిమపాతం ధాటికి దాదాపు నాలుగు నుండి వారం రోజుల వరకు వివిధ నగరాల్లో విమాన ప్రయాణాలను రద్దు చేశారు. కనీసం 10,000కు పైగా విమానాలను రద్దు చేశారని వార్తా సంస్ధలు తెలిపాయి. ఫిలడెల్ఫియా నుండి బోస్టన్ వరకు ఉన్న కారిడార్ మొత్తం రెండు నుండి మూడు అడుగుల లోతున మంచులో కప్పబడిపోయిందని తెలిపాయి.
వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించడం వలన జనం చాలా వరకు ఇళ్లలోనే ఉండిపోయారు. ప్రయాణాల జోలికి పోలేదు. అసలు ఇళ్ల నుండి బైటికి రావద్దని, కార్లు ఇతర వాహనాలను బైటికి తేవద్దని పోలీసులు హెచ్చరించడంతో జనం సరుకులు కూడా ముందుగానే కొని ఇళ్ళలో నిల్వ చేసుకున్నారు. ఒక దశలో అనేకమందికి షాపుల్లో సరుకులు దర్శనం ఇవ్వలేదు. కాస్త ఆలస్యం చేసినవారు పరిమిత సరుకులతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
న్యూయార్క్, మసాచూసెట్స్, కనెక్టికట్, ఫిలడెల్ఫియా, మెయిన్ తదితర రాష్ట్రాలన్నీ హిమపాతానికి గురయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల్లో 250 మైళ్ళ మేర (400 కి.మీ) వ్యాపించి ఉన్న ఏరియా హిమపాతం వల్ల కురిసిన మంచులో మునిగిపోయింది. చెప్పడానికి మంచు అనడమే గాని అది ఇండియాలో వాడుకలో ఉన్న మంచును పోలి ఉండేది కాదు. అక్కడ హిమపాతంలో మంచు ఉంటే అచ్చంగా ఐస్. ఆ మంచుతో రోడ్లు మూసుకుపోతే భారీ లోహ కోరలు తొడిగిన వాహనాలు వినియోగిస్తే తప్ప ఆ ఐస్ ను తొలగించడం సాధ్యం కాదు. ఆ సంగతి కింది ఫొటోల్లో చూడవచ్చు.
కఠినంగా ఉండే ఐస్ ను తొలగించడం కోసం అక్కడి వర్కర్లు ఉప్పును వినియోగిస్తారు. మొదట ఉప్పు జల్లి దానివల్ల ఐస్ కరిగి బలహీనపడినాక ఇనుప కోరల పరికరాలతో తొలగిస్తారు. నివాస గృహాల వద్ద కురిసే ఐస్ ను వర్కర్లు తొలగిస్తే రోడ్లు, ట్రాక్ లు, ఇతర విశాలమైన పబ్లిక్ స్ధలాల్లో వాహన పరికరాలనులను వినియోగించి తొలగిస్తారు.
బ్లిజ్జర్డ్ ధాటికి న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియా లాంటి నగరాలను సైతం రెండు, మూడు రోజుల పాటు మూసివేశారు. ఫలితంగా 6 కోట్ల మంది జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. అనగా జనవరి చివరి వారంలో అమెరికా ప్రజల్లో 20 శాతం మంది ఇళ్ల నుండి బైటికి రాలేదన్నట్లు!
న్యూయార్క్, న్యూ జెర్సీ, కనెక్టికట్, రోడ్ ఐలాండ్, మసాచుసెట్స్ రాష్ట్రాలు ముందుగానే ఎమర్జెన్సీ ప్రకటించాయి. ఆ విధంగా చాలా వరకు ప్రాణ నష్టాన్ని నివారించాయి. మంచుకి భయపడి సబ్ వే వ్యవస్ధను మూసివేయడం ఇదే మొదటిశారని న్యూయార్క్ రవాణా అధికారులు పేర్కొనడం విశేషం. 2012లో మంచు తుఫాను సమయంలో పాఠశాలలకు సెలవులు ఇవ్వనందుకు విమర్శలు ఎదుర్కొన్న న్యూయార్క్ గవర్నర్ ఈ సారి ఆ తప్పు చేయలేదు. ట్రావెలింగ్ పైనా నిషేధం విధించారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లు కూడా ఆయనను అనుసరించారు.
ఫోటోలను బోస్టన్ గ్లోబ్ పత్రిక ప్రచురించింది. ఇంకా అనేక పత్రికలు వందల కొద్దీ ఫోటోలను ప్రచురించాయి. వాటిలో ఇవి కొన్ని మాత్రమే.