మొదటి భాగం తరువాత………….
–
అభివృద్ధి పేరుతో…
ఈ వాదనతో ఉన్న రెండో సమస్య ఏమిటంటే, ధరలపై కేంద్రీకరించడం ద్వారా మరింత మౌలికమయిన రాజకీయ సమస్యను విస్మరించింది. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం రైతుల నుండి భూములను బలవంతంగా గుంజుకుని ప్రైవేటు కంపెనీలకు ఎందుకు ఇవ్వాలి? కనీసం ఆంగ్లంలో అనుబంధాలు ఇచ్చినప్పటి నుండి… భూములను ఒక గ్రూపు ప్రజల నుండి తీసేసుకుని మరో గ్రూపుకు (సాధారణంగా సంపన్నులు) ఇవ్వడాన్ని “ప్రజా” లేదా “జాతీయ” లక్ష్యాన్ని నెరవేర్చడంగా ప్రభుత్వాలు సమర్ధించుకున్నాయి. గత శతాబ్దంలో ఈ కార్యాన్ని సాధారణంగా అభివృద్ధి పేరుతో నిర్వహించారు. ఆర్ధికవేత్తలలో అత్యధికులు ఏమంటారంటే భూములను వ్యవసాయం కంటే “అధిక విలువ”తో కూడిన వినియోగంలోకి తెస్తే గనుక అది అభివృద్ధి అవుతుందని; ఆ కారణం చేత అది “ప్రజా లక్ష్యం” నెరవేర్చడం అవుతుందని భావిస్తారు. కానీ అభివృద్ధిలో ఏమేమి ఇమిడి ఉంటాయి, ఆ అభివృద్ధి రైతులను వారి భూముల నుండి వెళ్లగొట్టేటంతటి “ప్రజా లక్ష్యం”తో కూడుకుని ఉన్నదా అన్నది సాంకేతిక సమస్య కాదు, కనీసం న్యాయపరమైన సమస్య కూడా కాదు, అది రాజకీయ సమస్య. అది చారిత్రక దృక్పధంతో పరిశీలించవలసిన రాజకీయ సమస్య.
స్వాతంత్రానంతర కాలంలో భారత రాజ్యం ప్రభుత్వరంగ ప్రాజెక్టుల కోసమే ఎక్కువగా భూములను స్వాధీనం చేసుకుంది. భూ స్వాధీన చట్టం (ఎల్.ఎ.ఎ) కింద ప్రైవేటు కంపెనీల కోసం భూములను స్వాధీనం చేసుకోవడమూ చట్టబద్ధమే. కానీ అప్పుడు ఉనికిలో ఉన్న అభివృద్ధి నమూనా వల్ల అది పరిమిత స్ధాయిలోనే అమలు చేయబడింది. ఆ నమూనాలో ప్రభుత్వరంగమే మౌలిక సౌకర్యాలను నిర్మించింది. ఆర్ధిక వ్యవస్ధ యొక్క “కమాండింగ్ హైట్స్” (ఆర్ధిక వ్యవస్ధలోని కీలక రంగాలను ఉద్దేశిస్తూ లెనిన్ మొదట ఈ పదాన్ని వాడారు -అను) ను ప్రభుత్వరంగమే అదుపు చేసింది. భూముల స్వాధీనాలలో అత్యధికం ఆనకట్టలు నిర్మించడానికి, గనుల తవ్వకానికి, పరిశ్రమల స్ధాపనకు ఉద్దేశించినవి. ఈ ప్రాజెక్టుల కోసం పదుల మిలియన్ల (కోట్ల) సంఖ్యలో ప్రజలు తమ భూములు కోల్పోయారు. కానీ ఈ ప్రాజెక్టులన్నీ రాజ్యం నేతృత్వంలో సాగే అభివృద్ధి కోసమేనని, అది జాతీయ ప్రయోజనాలను నెరవేర్చుతుందని ప్రజలకు నచ్చజెప్పడంలో నెహ్రూవియన్ రాజ్యం సఫలం అయింది. దరిమిలా ఈ అభివృద్ధి కోసం అంటూ భూములను కోల్పోయినవారు, ‘కుంభకోణం’గా చెప్పదగిన రీతిలో అత్యంత తక్కువ నష్టపరిహారం మాత్రమే పొందారని ప్రజలు ఎత్తి చూపడం మొదలుపెట్టారు. 1980ల నాటికి ‘నర్మదా బచావో ఆందోళన్’ లాంటి గ్రూపులు మరింత మౌలికమైన ప్రశ్నను సంధించాయి: ఎవరికోసం ఈ అభివృద్ధి?
నయా ఉదారవాదం నీడలో భూముల అన్యాక్రాంతం
ఆర్ధిక సరళీకరణ చేపట్టినప్పటి నుండి ప్రైవేటు కంపెనీల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు భూములను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టడంతో ఈ ప్రశ్న మరింతగా సందర్భ శుద్ధిని సంతరించుకుంది. 1990ల ఆరంభంలో ప్రారంభించిన సంస్కరణల విధానాలు ప్రైవేటు రంగానికి మరింత ప్రాముఖ్యత ఇచ్చాయి. ఆ ప్రైవేటురంగం కేవలం వస్తువుల తయారీ (మాన్యుఫాక్చరింగ్) కోసమే కాకుండా రియల్ ఎస్టేట్, ఖనిజ వనరుల వెలితీత… ఇంకా పి.పి.పి (ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) ఒప్పందాల కింద ఉండే అనేక మౌలిక నిర్మాణాలకు భూములను డిమాండ్ చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు ఈ తరహా పెట్టుబడుల కోసం పరస్పరం పోటీ పడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పద్ధతి ప్రకారం ప్రైవేటు కంపెనీల వినియోగం నిమిత్తం భూములను స్వాధీనం చేసుకుంటున్నాయి. ఎలాంటి ప్రైవేటు లక్ష్యం కోసమైనా సరే… అవి సంపన్నుల ఇళ్ల కాలనీలు కావచ్చు, హోటళ్లు, ప్రైవేటు కాలేజీలు కావచ్చు, చివరికి ఫార్మూలా 1 కారు రేసుల కోసం నిర్మించిన ట్రాక్ ల కోసం కూడా భూములు లాక్కున్నారు. 2000ల దశాబ్దం మధ్యలో మొదలైన ప్రత్యేక ఆర్ధిక మండళ్లతోనూ (సెజ్ లు), భూములు స్వాధీనం చేసుకుని వేలం వేసే అర్బన్ డెవలప్ మెంట్ ఆధారిటీల స్ధాపన తోనూ ఈ ప్రక్రియ నూతన ఎత్తులకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంచక్కా ప్రైవేటు పెట్టుబడుల కోసం పనిచేసే భూముల బ్రోకర్లుగా అవతరించడంతో ‘డిస్పొసెషన్ విండ్ ఫాల్’ ను స్వాయత్తం చేసుకోవడమే భూముల స్వాధీనానికి ప్రధాన లక్ష్యం అయింది. భూముల లావాదేవీల్లో సాగిన తీవ్రస్ధాయి అన్యాయాల ఫలితంగా గత పదేళ్ళలో ‘భూముల కోసం యుద్ధాలు” ఉత్పన్నం అయ్యాయి. అంతిమంగా ఎల్.ఎ.ఆర్.ఆర్ చట్టం రూపకల్పనకు రాజకీయ ఒత్తిడి పెరిగిపోయింది.
ఇప్పుడు ఇండియా ఎదుర్కొంటున్న సమస్య రాజకీయాలే తప్ప ధరలు కాదు: ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం రైతుల నుండి భూములు స్వాధీనం చేసుకుని ప్రైవేటు కంపెనీలకు పునః పంపిణీ చేయాలా? సరళీకరణ ప్రబోధకులు దీనికి ‘అవును’ అని సమాధానం ఇస్తున్నారు. “స్వేచ్ఛా మార్కెట్” ఆర్ధిక వ్యవస్ధలో ప్రైవేటు భూములను “ప్రభుత్వమే” స్వాధీనం చేసుకుని ఇతరులకు అప్పజెప్పాలని వారు అంగీకరించడం ఒక అభాస! ఇలా జరిగే ఆర్ధిక వృద్ధి బొట్లు బొట్లుగా పేదవారిపైకి రాలి పడుతుందనీ, భూములు కోల్పోయిన గ్రామీణ ప్రజాలపైకి కూడా అలాగే రాలి పడుతుందని వారు నచ్చజెపుతారు. తమ ఆర్ధిక వృద్ధి నమూనాకు ప్రజాస్వామ్యం కూడా ఆటంకమే అని అంగీకరించడానికి వారు తరచుగా సిగ్గు పడరు. మరోవైపు అనేకమంది రైతులు తమ అనుమానాలకు గొంతు ఇస్తూనే ఉన్నారు. తమకు ఇచ్చే నష్టపరిహారం చాలా తక్కువని మాత్రమే కాకుండా ప్రైవేటు కంపెనీలకు లాభాలు అప్పగించడం ప్రజా లక్ష్యం కాదని కూడా రైతులు వాదిస్తున్నారు. సెజ్ లు, హై-టెక్ పార్కులు, రియల్ ఎస్టేట్ కాలనీలు… ఇవన్నీ “అభివృద్ధి” లో భాగం అనీ, అవి తమకు ఉద్యోగాలు, వివిధ లబ్దిలూ చేకూరుస్తాయని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈ లక్ష్యాల కోసం భూములు సేకరించడాన్ని సవాలు చేయడానికి వారు ఎన్నికల ప్రజాస్వామ్యం లాంటి వ్యవస్ధలను కూడా వినియోగించుకున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే గత దశాబ్దంలో సాగిన భూముల ఆందోళనలన్నీ అభివృద్ధి మరియు ప్రజాస్వామ్యం అనే అంశాలపై తలెత్తిన మౌలిక విభేదానికి (వైరుధ్యం) ప్రతిబింబమే.
పారిశ్రామిక కారిడార్లు, స్మార్ట్ సిటీలు మొదలైన భారీ ప్రాజెక్టులలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా వేగవంతమైన ఆర్ధిక వృద్ధి సాధించాలని ప్రస్తుత ప్రభుత్వం ఆశావాహ పధకాలను రచించుకుంది. అలాంటివాటికి భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రజాస్వామిక ప్రక్రియను నాశనం చేయడానికి సైతం తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవలి ఆర్డినెన్స్ ద్వారా అది స్పష్టం చేసింది. మరిన్ని రైతుల ఆందోళనలు బద్దలయితే ప్రజాస్వామ్యానికి ఎదురు కాగల ప్రమాదాలు ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి?
…………………………………అయిపోయింది.
(మైఖేల్ లెవీన్ ఈ వ్యాసానికి రచయిత. ఆయన బాల్టిమోర్ -అమెరికా- లోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.)
వ్యాసకర్తకు ఈ దేశ చట్టాలు,పరిపాలన మీద అవగాహన బాగానే ఉన్నట్లుందే!!!
Reblogged this on మావో ఆలోచనా విధానం.