ఇమాం మద్దతుకు ఎఎపి తిరస్కరణ!


Syed Ahmed Bukhari

Syed Ahmed Bukhari

ఢిల్లీ ఎన్నికలపై బి.జె.పి పెట్టుకున్న ఆశల్ని ఎఎపి వమ్ము చేసేట్లే ఉంది. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఢిల్లీ ఇమాం మద్దతు కోసం ఎదురు చూస్తుంటే ఆ ఇమామే ఎదురొచ్చి మద్దతు ఇస్తానంటున్నా ‘వద్దు, పొమ్మని’ ఎఎపి తిరస్కరించింది. ఫలితంగా, ఢిల్లీ ఓటర్లను మత ప్రాతిపదికన చీల్చే అమూల్య అవకాశం బి.జె.పికి దూరం అయింది.

జామా మసీదు షాహీ ఇమాం సయ్యద్ బుఖారి ఇటీవల ఎఎపి పార్టీకి మద్దతు ప్రకటించారు. ఎఎపి కోరనప్పటికీ ఆయనే స్వయంగా ముందుకు వచ్చి ఢిల్లీ ముస్లిం ప్రజలు ఎఎపి కి ఓట్లు వేయాలని కోరారు. భారత దేశంలోని లౌకిక వాతావరణం చెడిపోకుండా ఉండాలంటే హిందూమతతత్వ బి.జె.పిని ఓడించాలని, దేశంలో లౌకికవాదం నిలబడితేనే ముస్లింలకు రక్షణ ఉంటుందని చెబుతూ ఆయన ఎఎపికి ఓట్లు వేయాలని కోరారు.

“మతతత్వ శక్తుల నుండి దేశం తీవ్ర ప్రమాదం ఎదుర్కొంటోంది. వారికి ముస్లింలే లక్ష్యంగా ఉన్నారు. వారిని ఎదుర్కోవాలన్నా, వారి పురోగమనాన్ని అడ్డుకోవాలన్నా, ఈ దేశ రాజ్యాంగం యొక్క పవిత్రతను కాపాడుకోవాలన్నా సెక్యులరిజాన్ని పదిలపరుచుకోవాలి. అందుకు తగిన మార్గాలను వెతుక్కోవాలి. నిజాయితీ కలిగిన సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి వీలుగా ఎఎపి కి మద్దతు ఇవ్వండి” అని సయ్యద్ బుఖారి ఢిల్లీ ముస్లింలకు పిలుపు ఇచ్చారు.

బుఖారి మద్దతును ఎఎపి నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. “షాహీ ఇమాం మద్దతును ఎఎపి ఖండిస్తూ తిరస్కరిస్తోంది. ఎటువంటి కుల, మత రాజకీయాలకైనా ఎఎపి వ్యతిరేకం. ఇమామ్ బుఖారి ఐడియాలజీకి ఎఎపి మద్దతు ఇవ్వదు. ఆయన మద్దతు మాకు అవసరం లేదు” అని ఎఎపి నాయకుడు సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. “ఎఎపికి భారత దేశంలోని సామాన్య ప్రజల మద్దతు కావాలి. వారి మద్దతు కోసం ఎఎపి ప్రయత్నిస్తూనే ఉంటుంది” అని ఎఎపి నేత కుండ బద్దలు కొట్టారు.

ఎఎపి నుండి ఇలాంటి స్పందన ఎదురవుతుందని బహుశా బుఖారి ఊహించి ఉండరు. ఆయనే కాదు. 1947 నుండి సెక్యులరిజం పేరుతోనే దేశంలో నిర్విఘ్నంగా కొనసాగుతూ వస్తున్న వివిధ కుల, మత, ప్రాంతీయ రాజకీయాలకు అలవాటు పడిపోయిన రాజకీయ పార్టీలన్నీ ఈ స్పందనను ఊహించి ఉండవు. ఎన్నికలు వస్తున్నాయంటేనే కుల నాయకులను, మతతత్వ సంస్ధలను, అనేకానేకమంది బాబాలను  ప్రసన్నం చేసుకునేందుకు క్యూలు కట్టే రాజకీయ పార్టీలనే చూసి ఉన్న రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు కూడా ఇలాంటి స్పందన ఊహించి ఉండరు.

బుఖారి మద్దతును స్వీకరించినట్లయితే ఎఎపికి వ్యతిరేకంగా హిందూ సెంటిమెంట్లను రెచ్చగొట్టడం బి.జె.పికి మరింత తేలిక అయి ఉండేది. మతపరంగా ముస్లింల నుండి వచ్చే ఓట్లను కాలదన్నుకోవడం ద్వారా ఎఎపి ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ప్రజల న్యాయమైన సమస్యల ప్రాతిపదికన మాత్రమే ఎన్నికలు జరగాలన్న ప్రాతిపదిక అది. రాజకీయాలనేవి ప్రజల ఆర్ధిక జీవనానికి పొడిగింపు మాత్రమే తప్ప ప్రజలను పక్కదారి పట్టించి వారిని మోసపుచ్చే ఎత్తుగడలు కావని నిర్ధారించే ప్రాతిపదిక అది.

ఎఎపి, ఈ ప్రాతిపదిక పైన ఎంతకాలం కొనసాగుతుంది అన్నది అప్పుడే చెప్పదగిన సంగతి కాదు. ఆ పార్టీ ఆచరణను ఇంకా చూడవలసే ఉంది. అధికారంలోకి వచ్చాక సామాన్య ప్రజల ప్రయోజనాల కోసమే కట్టుబడి ఉంటుందన్న సంగతి కనీస కాలం పాటు రుజువు కావలసిన అగత్యం ఇంకా మిగిలే ఉంది.

ఇతర పార్టీల నిజ స్వరూపం ఇప్పటికే రుజువైపోయిన సంగతిని కూడా ఢిల్లీ ప్రజలు గుర్తించాల్సి ఉంది.

16 thoughts on “ఇమాం మద్దతుకు ఎఎపి తిరస్కరణ!

 1. ఆప్ సాంప్రదాయేతర పార్టీ అని నిరూపించుకుంది(మీరన్నట్లు రాబోయే రోజులలో ఏమౌతుందో చూడాలి.కానీ, ఇప్పటికైతే సంతోషమే!)

 2. ఆప్ ను మీడియానే బ్రష్టు పట్టిస్తుంది. సాంప్రదాయ రాజకీయాలకు అలవాటు పడిన ప్రజలకు భిన్నంగా ఉండే రాజకీయ నాయుకలను అర్ధమవకుండా వారిని పిచ్చి వారికింద జమ కట్టేలా చేస్తుంది.

 3. బ్రతకడం కోసం బతుకును ఇచ్చిన అమ్మనైనా అమ్మవచ్చు కానీ ఆ అమ్మకే బతుకునిచ్చిన మాతృ దేశాన్ని అమ్మకూడదు , కమ్యూనిస్ట్ గా బ్రతకడం కన్నా నేషనలిస్ట్ గా చావడం మేలు , దెశ నిర్మానం కోసం మీ జ్ఞానాన్ని వినియోగిస్తారని , శాంతిని ప్రేరేపిస్తారని ఇప్పటికి ఆశిస్తున్నా, బారతీయుడిగా బతకడం నేర్చుకోండి my dear comrade

  దేశ రాజదాని ఎన్నికల విషయంలో ప్రజలను అమాయకులని చేయాలని మీ వ్యూహాలను రచించడం కోసం సరస్వతి ని ఉపయోగించవద్దు. Dont weave conspiracies to make the people chunk of sheep

 4. మనలో చాలా మంది కి ఇలా కులానికి మతానికి అతీతమైన పార్టీ, అలాంటి నాయకుడు రావాలి, కావాలి అని ఉంటుంది.. నిజానికి ఇలాంటి ఆదర్శ బావాలు కలలు గానే ఉందిపోతాయి… మన ఊహలకి అద్దం పట్టే ఒక నేత దొరికాడు… మనం initiate చెయ్యలేకున్న కనీసం ఆ అదర్శానికి మద్దతు ఇద్దాం. అలాంటి ఆదర్శాన్ని అర్దం చేసుకోవలి అంటే కుల మత రాజకీయాలకి అలవాటు పడిన మన జనాలకి అంత సులబం కాదు. కానీ truth ని ఎంతో కాలం దాచలేరు అది నిప్పు లాంటిది కాబట్టి.

 5. పోతుగారి గారు, మీకు సంబంధించినవారిని ఎవర్నైనా అమ్ముకోండి (ఆ అమ్మగారికి నా క్షమాపణలు). ఎలాగైనా చావండి. మాకు అభ్యంతరం లేదు. దయచేసి ఇతరుల అమ్మల జోలికి, ప్రాణాల జోలికి మాత్రం పోకండి.

  మీరు కళ్ళు తెరిచి చూస్తే ప్రస్తుతం మాతృదేశాన్ని అమ్మే కార్యక్రమం జోరుగా సాగుతున్న సంగతి తెలుస్తుంది. భూసేకరణ చట్టం సవరించి మరీ ఇష్టారాజ్యంగా మన భూముల్ని విదేశీ కంపెనీలకు ఇచ్చేయడానికి ఆర్డినెన్స్ జారీ చేసింది మీరు చెప్పిన సో కాల్డ్ ‘నేషనలిస్టు’లే. జాతీయ ఉపాధి చట్టాన్ని నీరుగార్చి దేశ పామర ప్రజలకి అందుతున్న కాస్త కూలీ/ఉపాధి కూడా దక్కకుండా చేస్తున్నది వారే. స్మార్ట్ సిటీల పేరుతో విదేశీ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నది ఆ ‘నేషలిస్టు’ పార్టీయే. ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో ఆర్ధిక కార్యకలాపాల్ని దేశీయ కంపెనీలకి బదులు విదేశీ కంపెనీలకి అప్పజెపుతూ బొట్టు బెట్టి పిలుస్తున్నది ఆ ‘నేషనలిస్టు’లే.

  ‘కమ్యూనిస్టు’ అంటే అర్ధం ఏమిటో మీకు ఎలాగూ తెలియదు. కనీసం ‘నేషనలిస్టు’ అంటే ఏమిటోనన్నా తెలుసుకోగలరని నా కోరిక. జాతీయతత్వం కులాలు, మతాల్లో ఉండదు. వాగాడంబరంలో అసలే ఉండదు. దేశ సంపదను విదేశీ కంపెనీలకి అప్పజెప్పడంలో ఉండదు. దేశ వనరులని కులమతాలకు అతీతంగా దేశ ప్రజలకి వినియోగపెట్టడంలోనూ, దేశ ప్రజలకి ఉపాధి అవకాశాలు పెంచడం లోనూ ఉంటుంది. జాతీయతత్వం అంటే అదే. అందువల్ల ముందు మీరు అమాయకత్వం నుండి బైటికి రావాల్సిన అవసరం బాగా కనిపిస్తోంది. ఆ తర్వాత మీ యిష్టం.

 6. దేశ మాతకు క్షమాపణ చెప్పినందుకు సంతోషం, వనరుల సమ పంపిణి కోసం హింసని ఆయుధంగా చేసుకునే మార్గాన్ని యవరూ సమర్దించారు , అలా సమర్దిన్చినట్లయితే హింసతో మనుగడ అసాద్యం , మానవ కల్యాణానికి , విశ్వ కల్యాణానికి మీరు నమ్మే సిద్దాంతాలు ఫలాలను అందరికి సమానంగా అందించవు, మీకు ఉన్నఅపారమైన జ్ఞానాన్ని , ప్రజ్ఞను యువతను నిర్మాణాత్మక దోరణిలో నడిపించేందుకు ఉపయోగిస్తారని ఆశిస్తున్నా , వార్తలను communism, socialism , nationalism లకు అతీతంగా nijam గా విస్లేశిస్తారని , సరైన దృక్పదాన్ని , ఆలోచనా విదానాన్ని దెశ యువతకు కలిగిస్తారని కోరుకుంటున్నా

  మనుషులు పుడతారు చస్తారు కాని చరిత్ర హీనులుగా మిగలకూడదు. జై హింద్

 7. ////////మీరు కళ్ళు తెరిచి చూస్తే ప్రస్తుతం మాతృదేశాన్ని అమ్మే కార్యక్రమం జోరుగా సాగుతున్న సంగతి తెలుస్తుంది. భూసేకరణ చట్టం సవరించి మరీ ఇష్టారాజ్యంగా మన భూముల్ని విదేశీ కంపెనీలకు ఇచ్చేయడానికి ఆర్డినెన్స్ జారీ చేసింది మీరు చెప్పిన సో కాల్డ్ ‘నేషనలిస్టు’లే. జాతీయ ఉపాధి చట్టాన్ని నీరుగార్చి దేశ పామర ప్రజలకి అందుతున్న కాస్త కూలీ/ఉపాధి కూడా దక్కకుండా చేస్తున్నది వారే. స్మార్ట్ సిటీల పేరుతో విదేశీ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నది ఆ ‘నేషలిస్టు’ పార్టీయే. ‘మేక్ ఇన్ ఇండియా’ పేరుతో ఆర్ధిక కార్యకలాపాల్ని దేశీయ కంపెనీలకి బదులు విదేశీ కంపెనీలకి అప్పజెపుతూ బొట్టు బెట్టి పిలుస్తున్నది ఆ ‘నేషనలిస్టు’లే.///////////

  i am’nt either pro capitalist or communist, inviting mnc’s for mutual benefits like job creation, initiation of economic activity is better than stand still position such as unemployment, lack of infrastructure, using age old marxist tools……………dont forget MARXIST RATE OF GROWTH (60’s 70’s) which shamelessly marxists termed as HINDU RATE OF GROWTH………we dont need that dark age again. Wake up !!!

 8. “దేశ మాతకు క్షమాపణ చెప్పినందుకు సంతోషం”

  మీకు అలా అర్ధం అయిందా. నా అర్ధం అది కాదు.

  “బ్రతకడం కోసం బతుకును ఇచ్చిన అమ్మనైనా అమ్మవచ్చు”

  అన్నారే, ఆ అమ్మకు క్షమాపణలు చెప్పాను. బతుకునిచ్చిన అమ్మ ప్రాణం లేని వస్తువు కాదు. రక్త మాంసాలు ఉండి, మరిన్ని రక్త, మాంసాల ముద్దలకు జన్మనిచ్చే మనిషి. హృదయం, ఆలోచన, అనుభావాలు, అనుభూతులు ఉండే వ్యక్తి. అలాంటి అమ్మని ఆమె ప్రమేయం లేకుండా ‘అమ్ముకోవచ్చు’ అని స్టేట్ మెంట్ ఇవ్వగల హృదయ విహీనులకి (తప్పలేదు మరి!) దేశమాతపై గౌరవం ఎక్కడినుండి వస్తుంది? ముందు మనుషులను గుర్తించడం, గౌరవించడం తెలుసుకుంటే దేశం అంటే నిజంగా ఏమిటో తెలుస్తుంది. నిజంగా దేశం అంటే ప్రజలే అని తెలుసుకున్న రోజున ఆ ప్రజల్ని పోషించే వనరులను కాపాడుకోవడమే దేశభక్తి అనీ, వాటిని విదేశీ కంపెనీలకు అప్పజెప్పడం దేశ ద్రోహం అనీ తెలుస్తుంది.

  అవును. అమ్మను అమ్ముకుని చరిత్ర హీనులు కాకూడదు.

 9. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యిందో చెప్పడానికి నేను “The Great Depression లాంటివి ఉదహరించగలను. ప్రజలు కమ్యూనిజం వైపు వెళ్ళకుండా చెయ్యడానికి కీనెసియన్ ఆర్థిక విధానాలని నమ్ముకున్న చరిత్ర కూడా పెట్టుబడిదారీ దేశాలకి ఉంది. 1951 తరువాత కాలంలో పశ్చిమ దేశాల్లో ఆతోమొబైల్ పరిశ్రమ అభివృద్ధి చెందింది. అందువల్ల పశ్చిమ పెట్టుబడిదారులకి కార్మికుల జీతాలు పెంచి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం సాధ్యమైంది. 1960 తరువాత మళ్ళీ ఆర్థిక సంక్షోభాలు వచ్చి పెట్టుబడిదారులు కీనెసియన్ ఆర్థిక విధానాలని వదిలించుకోవడానికే ప్రయత్నించారు. 1991లో సోవియత్ సమాఖ్య పతనమవ్వడం వల్ల పెట్టుబడిదారులకి ధైర్యం మరింత పెరిగి సంక్షేమ రాజ్య విధానాలని పూర్తిగా వదిలేసారు. ఎన్ని ఆర్థిక సంక్షోభాలు వచ్చినా వెయ్యి కోట్లు ఉన్న పెట్టుబడిదారుని ఆస్తి వంద కోట్లకి తగ్గుతుంది తప్ప పెట్టుబడిదారీ వ్యవస్థని రద్దు చెయ్యడానికి పెట్టుబడిదారులు ఒప్పుకోరు.

 10. చర్చకు స్వాగతం , విమర్శకు స్వాగతం , వితండవాదానికి వందనం , సమయం అమూల్యం , చర్చ జ్ఞానాన్ని పంచాలి విద్వేషాన్ని కాదు కాబట్టి మీకు మీ వార్తలకు నమస్కారం , సమస్కారంతో మీ భారతీయుడు

 11. అంతలోనే! అమ్మను అమ్ముకోవడాలు, ఆ ఇజాలూ,, ఈ ఇజాలూ అంటూ విషయాన్ని వదిలిపెట్టి ద్వేషం పంచింది మీరే సారూ. ఓసారి చూడండి. మీ చర్చకు స్పందించడంతోనే విద్వేషం అంటే ఎలా చెప్పండి. మీరు చెబితే జ్ఞానమూ, మేము చెబితే విద్వేషమూనా? అన్యాయం కదా!

  సరే అలాగే కానీండి! కానీ అమ్మ ప్రసక్తి మాత్రం ఎక్కడా తేకండేం! కరెక్ట్ కాదు.

 12. సుమన్
  దేశం వేరు, అమ్మ వేరు. నువ్వు ఒక మర్దర్ కేస్‌లోనో, రేప్ కేస్‌లోనో ఇరుక్కుంటే లాయర్‌ని పెట్టి నిన్ను విడిపించడానికి మీ అమ్మ ప్రయత్నిస్తుంది కానీ దేశం కాదు కదా. సమాజంలో ఎంత మంది నిన్ను అసహ్యించుకున్నా నీ కుటుంబ సభ్యులు మాత్రం నిన్ను నమ్ముతారు. అదీ సామాజిక సంబంధాలకీ, కుటుంబ సంబంధాలకీ మధ్య ఉన్న తేడా. దేశభక్తి అనేది పాలకవర్గంవాళ్ళు జనాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ప్రయోగించే కాన్సెప్త్. దాన్ని కుటుంబ సంబంధాలతో పోల్చక్కరలేదు.

 13. Grow up guys! The fellow “Suman Potugari” is clearly a troll!

  I don’t think he has posesses faculty to make a coherent and pertinent argument. All that he probably knows is how to play a namby pamby. Hence the emotional words “amma” etc…

  I didn’t get what the context of his comment pertaining to this post is.

  It’s time one ignore trolls.

 14. Dear Visheshajna, there is nothing here to get confused. I have checked the Facebook wall of that guy. అతను భాజపా అభిమాని. గతంలో కాంగ్రెస్‌ని దెబ్బతియ్యడానికి భాజపా అన్నా హజారే ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. ఆ ఉద్యమం నుంచి వచ్చిన అరవింద్ కేజ్రివాల్ ఇప్పుడు భాజపాకే కొరకరాని కొయ్య అయ్యాడని ఆ భాజపా అభిమాని బాధ, అంతే. నిజంగా అమ్మని అమ్మేసేవాడు ఎవడూ ఉండడు. తండ్రి తాగుబోతు, తల్లి వేశ్య అయితే ఆ పరిస్థితిలో పుట్టి పెరిగిన పిల్లల సంగతి వేరు. ఇది ఆ కేస్ కాదు. అతను నరేంద్ర మోదీ యొక్క నవ్య ఉదారవాద ఆర్థిక విధానాలని నమ్ముతున్నాడంటే అతను నా కంటే ఆర్థికంగా ముందున్నవాడు అయ్యుండాలి. ఆర్థికంగా అంత ముందున్నవాడు తన కుటుంబ సభ్యుల్ని అమ్మేసే అవకాశమే లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s