‘జనతా పరివార్’ గా చెప్పుకుంటున్న నేతల భాగోతం ఇది!
తమను తాము దళితోద్ధారకులుగా చెప్పుకోవడం ఈ నేతలకు ఉన్న అలవాటు. ముస్లిం ఓటు బ్యాంకు కోసం తాము సెక్యులరిస్టులం అని కూడా వీళ్ళు చెప్పుకుంటారు. వాస్తవంలో వీరి ఆచరణ అంతా అందుకు విరుద్ధం.
ఎన్నికల్లో బి.జె.పి చేతుల్లో చావు దెబ్బ రుచి చూసిన నితీశ్ కుమార్ పోయిన ప్రతిష్టను తిరిగి పొందడానికి ఒక దిష్టి బొమ్మను వెతుక్కుని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండ బెట్టారు. ఆయన పేరు జీతన్ రామ్ మంఝి.
మంఝి దళిత కులానికి చెందినవారు. (మహా దళిత కులం అని పత్రికలు చెబుతాయి. కానీ మహా దళిత అనే కులం ఉందా అని ఒక అనుమానం.) ఆయనను సి.ఎం సీటుపై కూర్చోబెట్టడం ద్వారా తాను గొప్ప దళితవాదిని అన్న ప్రతిష్ట కూడా పొందవచ్చని నితీశ్ తలపోశారు.
ఎందుకో తెలియదు గానీ కార్డులు తిరగబడ్డాయి. మంఝి తనకూ వెన్నెముక ఉందని చెప్పుకోవడానికి ప్రయత్నించారో లేక నితీశ్ మాట తీసిపారేస్తున్నారో, ఇంకేయే రాజకీయాలు పని చేస్తున్నాయో… కారణం ఏదైనా మంఝి అనే దిష్టి బొమ్మని నిలబెట్టిన కొద్ది వారాల నుండే దానిపై రెట్ట వేయడం మొదలు పెట్టారు. అనగా తాము నిలబెట్టిన వ్యక్తిని తామే విమర్శిస్తున్నారు.
ఫలితంగా బీహార్ మంత్రివర్గం మంఝి, నితీష్ శిబిరాలుగా నిలువునా చీలిపోయింది.
బి.జె.పి దెబ్బకి వివిధ ‘జనతా’ పార్టీలన్నీ కలిసి జనతా పరివార్ పేరుతో ఒక్కటయ్యేందుకు ఇటీవల కృషి మొదలు పెట్టాయి. బీహార్ వరకు చూస్తే ఒకప్పుడు కత్తులు నూరుకున్న లల్లూ, నితీష్ లు ఒక్కటయ్యారు. ఆ విధంగా రెట్ట వేయువారిలో లల్లూ సైతం ఉన్నారని కార్టూన్ చెబుతోంది. ఆ మూడో ఆయన శరద్ యాదవ్ అని వేరే చెప్పాలా!
ఇది చాలదన్నట్లు మంఝి శిబిరంలోని మంత్రులు బి.జె.పితో మంతనాలు జరుపుతున్నారని నితీష్ శిబిరం ఆరోపిస్తోంది. అది నిజమేనా అన్నట్లుగా బీహార్ బి.జె.పి మంఝికి మద్దతు ప్రకటిస్తున్నారు. మంఝిని కూల్చితే ఆయనకు తమ మద్దతు ఉంటుందని, ఎన్నికలు జరిగేవరకు ఆయనే ఆపద్ధర్మ సి.ఎంకు ఉండాలని బి.జె.పి చెబుతోంది.
బి.జె.పి మద్దతు కల్లోల జలాల్లో చేపలు పట్టుకునే లక్ష్యంతో ఇస్తున్నదే తప్ప వారికి మంఝి పైనా, దళితులపైనా ప్రేమ ఉండి కాదు. జె.డి(యు) + ఆర్.జె.డి లు ఎంతగా భ్రష్టు పడితే బి.జె.పి కి అంత లాభం.
ఈ కుమ్ములాటల్లో ఎర్ర ఏగానికైనా లెక్కకు రానిది బీహార్ ప్రజలే.