రిపబ్లిక్ డే రోజున భారత సంబరాలకు అతిధిగా హాజరయిన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఆ ముందు రోజున భారత ప్రధాని మోడితో మంతనాలు జరిపారు. మంతనాల అనంతరం 2008లో కుదుర్చుకున్న ‘పౌర అణు ఒప్పందాన్ని’ ఆపరేషనలైజ్ చేసేందుకు తాము ఒక అంగీకారానికి వచ్చామని ఇరువురు ప్రకటించారు.
విచిత్రం ఏమిటంటే ఆ ఒప్పందంలోని అంశాలు ఏమిటో ఇంతవరకు జనానికి చెప్పలేదు. అమెరికా అధికారులకు తెలిసిన ఒప్పందం వివరాలు భారత ప్రజలకు ఎందుకు తెలియకూడదు? భారత ప్రజలకు చెప్పకూడని సంగతులు ఒప్పందంలో ఏమున్నాయి? ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు చెప్పకూడని విదేశీ ఒప్పందాలు ఉండవచ్చా?
అణు రియాక్టర్లు అత్యంత సున్నితమైనవి. అత్యంత ప్రమాదకరమైనవి. ఏమాత్రం తేడా వచ్చినా ప్రమాదం ప్రభావం మాసిపోవడానికి వందల యేళ్ళు పడుతుంది. ఈ లోపు ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలవుతాయి. నాసిరకం అణు పరికరాలు సరఫరా చేస్తే అణు ప్రమాదం జరిగే అవకాశం అనేక రెట్లు పెరుగుతుంది.
అందువల్ల ఆనాటి ప్రతిపక్ష బి.జె.పి సహకారంతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అణు ప్రమాద పరిహార చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టంలో ఉన్నవే అరకొర అంశాలు. పూర్తి స్ధాయి రక్షణ ఇవ్వనివి. అయినా సరే, ఈ చట్టం వల్ల పౌర అణు ఒప్పందాన్ని ఆపరేషనలైజ్ చేయకుండా ఇంతకాలం అమెరికా తాత్సారం చేస్తూ వచ్చింది. నష్ట పరిహార చట్టం నుండి మినహాయింపు ఇవ్వనిదే ఒప్పందం ఆచరణలోకి రాదని తేల్చి చెప్పింది.
ఈ నేపధ్యంలో మోడి, ఒబామాలు కుదుర్చుకున్న రహస్య ఒప్పందం ఏమై ఉంటుందో ఊహించడానికి పెద్ద పాండిత్యం అవసరం లేదు. కనుకనే ఒబామా, మోడిల అణు కౌగిలిని ఈ విధంగా కార్టూనిస్టు అభివర్ణించారు. కార్టూన్ అర్ధం కానీ వారికి కింద ఉన్న అణు విస్ఫోటనం ఫోటో చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది.