(ది హిందు, ఫిబ్రవరి 3, 2015 నాటి సంపాదకీయం ‘End the ambivalence’ కు యధాతధ అనువాదం. -విశేఖర్)
**********
రాజ్యాంగం పీఠిక నుండి ‘లౌకిక’ మరియు ‘సామ్యవాద’ పదాలను తొలగించాలన్న డిమాండ్లపై తలెత్తిన వివాదాన్ని తప్పించే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సరిగ్గానే కృషి చేశారు. ది హిందు కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇక అంతకంటే స్పష్టత ఉండబోదన్న రీతిలో వివరించారు: “ప్రస్తుతం ఉన్న పీఠిక ఇప్పుడు ఉన్నట్లుగానే యధాతధంగా కొనసాగాలని బి.జె.పి నమ్ముతోంది. దానిని మార్చవలసిన అగత్యమే లేదు.” ఇప్పుడు కావలసింది ఏమిటంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తన రాజకీయ సహాయకుడి అభిప్రాయాన్ని ఆమోదించడం; ఆ రెండు పదాలను కొనసాగిస్తామని బహిరంగంగా హామీ ఇవ్వడం; ప్రభుత్వ నిర్ణయంపై నెలకొన్న అనుమానాలను తొలగించడం.
ఇక్కడ ఆందోళన కారకం అవుతున్న విషయం ఇండియా తన రాజ్యాంగ పీఠికలో ‘సెక్యులర్’ అన్న పదాన్ని కలిగి ఉండాలా లేదా అన్నది కాదు, ఫిబ్రవరి 2 తేదీనాటి ది హిందు సంపాదకీయం “A needless controversy” లో పేర్కొన్నట్లుగా ఆ పదాన్ని తొలగించినట్లయితే దేశంలోని మైనారిటీలకు ఆ చర్య పంపే సంకేతాలే మరింత కలవరపాటు కలిగిస్తాయి. ఈ విషయంలో షా, మోడీ ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయనడంలో సందేహం అవసరం లేదు. కానీ బి.జె.పి అతి మితవాద మిత్ర పార్టీ శివ సేన ద్వారా రేకెత్తించబడిన వివాదం నుండి తన ప్రభుత్వాన్ని దూరంగా ఉంచుతున్నట్లు ప్రకటించడం ద్వారా ప్రధాన మంత్రి మోడి గొప్ప ప్రభావాన్ని పడవేయగలరు. లేనట్లయితే మంత్రులు, పార్టీ నాయకులు ఇటువంటి వివాదాలను తాజాగా మరిన్ని లేవనెత్తడానికి స్వేచ్ఛ లభించినట్లే కాగలదు.
రాజ్యాంగ పీఠికలో ఎలాంటి మార్పునైనా తలపెట్టడంపై తలెత్తిన వివాదానికి ముగింపు పలకాలని (అమిత్) షా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. అయితే హిందూత్వ సంస్ధలు చేపట్టిన ‘ఘర్ వాపసి’ కార్యక్రమం ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఎజెండాను పట్టాల నుండి తప్పిస్తుందని మాత్రం ఆయన భావించడం లేదు. నిజానికి, హిందూయిజంకు తిరిగి మార్పిడి చేసుకునే కార్యక్రమం ద్వారా ఉత్పన్నమైన వేడిని, అసలు మత మార్పిడులను మొత్తంగా నిషేదించే నిర్దిష్ట చట్టం ప్రతిపాదనకు సాకుగా ఆయన వినియోగించుకోదలిచారు. ఇండియాలో మత స్వేచ్ఛ గురించి ఒబామా ఇచ్చిన ప్రసంగానికి మద్దతు ఇస్తూనే, మత మార్పిడి ఒక సమస్యగా చూపే హిందూత్వ అవగాహనతో ఏకీభవిస్తున్నారు. ఈ అంశంపై ఎలాంటి చర్చ లేకుండా మత మార్పిడి వ్యతిరేక చట్టం తేవాలని భావిస్తున్నారు.
వాస్తవానికి ఇటువంటి కీలక అంశంపై బి.జె.పి లోని అధినాయకుల మధ్యనే విభేదాలు ఉన్నాయని అంతకంతకూ ఎక్కువగా స్పష్టం అవుతోంది. దేశంలో మత విభజనపై ఒబామా చేసిన వ్యాఖ్యలు ‘దురదృష్టకరం’ అని చెబుతూనే, ‘ఘర్ వాపసి’కి ఇండియాలో స్ధానం లేదని కేంద్ర హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ స్పష్టం చేయడమే అందుకు తార్కాణం. రాజ్యాంగ పీఠికకు సవరణలు చేయబోమని ప్రధాని మోడి బహిరంగంగా ముందుకు రావాలని కోరడానికి ఇది మరొక కారణం. మతపరమైన విభజనలు తెచ్చే రాజకీయాలను ప్రోత్సహించబోమని కూడా ఆయన హామీ ఇవ్వాలి. ఇలాంటి జోక్యం లేనట్లయితే జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ప్రభుత్వము, పార్టీ విభిన్న గొంతులతో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. నేటి హానికర రాజకీయ సవాళ్ళకు ప్రభావితం కాకుండా అద్భుతం జరిగినట్లుగా గుబాళించడానికి అభివృద్ధికి ప్రత్యేక మార్గం అంటూ ఏమీ ఉండదు మరి!
**********
(మతపరమైన విభజనలు తెచ్చే రాజకీయాలను ప్రోత్సహించబోమని ప్రధాని నరేంద్ర మోడి గారు హామీ ఇవ్వాలట! ఇంతకంటే అమాయకత్వం ఇంకేమన్నా ఉంటుందా? ది హిందు పత్రిక తన చదువురులను ఎలా, ఏమని పరిగణిస్తున్నట్లు?)
what is wrong in the hindu’s view on prime minister… why did you added a tag line like that I can’t understand.
స్వర్ణ కుమారి గారు, బి.జె.పి పార్టీయే మతతత్వ పార్టీ. ప్రజల మధ్య మతపరమైన విభజనలు తెచ్చి, వాటి ఆధారంగా ఓట్లు పొందే పార్టీ. ఆ పార్టీ సిద్ధాంతమే అది. అలాంటి పార్టీకి మోడి నాయకులు. గుజరాత్ లో తీవ్ర స్ధాయిలో మతచిచ్చు రగిలింది ఆయన హయాం లోనే. ముస్లింలపై హత్యాకాండ జరిగినా పదేళ్ళ పాటు కేసులన్నీ నీరు గారింది ఆయన హయాంలోనే. చివరికి సుప్రీం కోర్టు జోక్యం వల్ల కాసిన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయి. హత్యాకాండ సందర్భంగా మోడి రాజధర్మం నిర్వహించలేదని అప్పటి ప్రధాని వాజ్ పేయి స్వయంగా నిర్ధారించారు. అనగా రాజ్య పాలకుడిగా ముస్లిం ప్రజలను హంతక మూకల నుండి రక్షించలేదని ఆయన చెప్పారు. అలాంటి వ్యక్తి మత విభజనలు తెచ్చే రాజకీయాలు ప్రోత్సహించకుండా ఉంటారా? ప్రోత్సహించడం తర్వాత సంగతి ఆ రాజకీయాలు ఆయన చెయ్యకుండా ఉంటారా?
హిందూ ఆశించడం గురించి కాదు నా అభ్యంతరం. మోడి రాజకీయాలు ఏమిటో తెలిసికూడా, ఆ రాజకీయాలకు విరుద్ధమైన ఫలితం ఆయన నుండి ఆశించడం గురించే నా అభ్యంతరం.