ప్రజల మధ్య మత తత్వ సెంటిమెంట్లు రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు అలవాటు పడ్డ మతతత్వ శక్తులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఎత్తుగడలను అనుసరిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో కలిసి మెలసి జీవిస్తున్న ప్రజల మధ్య మతపరమైన భావోద్వేగాలను విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రత్యనిస్తున్నాయని ఐదోసారి మరో చర్చిపై జరిగిన దాడితో స్పష్టం అవుతోంది.
జాతీయ రాజధానిలో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడంలో హిందూత్వ శక్తులు నిమగ్నం అయ్యాయి. విధానాలను చూపి విజయం సాధించడం మాని ఎన్నికల్లో గెలుపుకు దగ్గరి దారులు, అడ్డదారులు వెతికి అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ రాష్ట్రంలో పలు చోట్ల హిందూ-ముస్లిం ప్రజల మధ్య తగవు రేపిన శక్తులు ఇప్పుడు హిందు-క్రైస్తవ భావోద్వేగాలు రెచ్చగొట్టి లబ్ది పొందేందుకు తయారయ్యాయి. ఢిల్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే భవిష్యత్తు ఎంత ఉద్రిక్తంగా మారుతుందో తాజాగా చర్చిపై జరిగిన దాడి స్పష్టం చేస్తోంది.
సోమవారం ఉదయం తెల్లవారు ఝామున దుండగులు కొందరు దక్షిణ ఢిల్లీలో వసంత్ కుంజ్ లో ఉన్న చర్చిపై దాడికి దిగారు. ఉదయం 3 గంటల ప్రాంతంలో ప్రధాన గేటు ఎక్కి లోపలికి దూకిన దుండగులు చర్చి తలుపులను పగలగొట్టి లోపలికి చొరబడ్డారని, లోపల ఉన్న వస్తువులను ధ్వంసం చేశారని ఢిల్లీ మైనారిటీ కమిషన్ మాజీ సభ్యుడు ఏ.సి.మైఖేల్ చెప్పారు. సెయింట్ అల్ఫోన్సో చర్చ్ గా స్ధానికులు ఈ దేవాలయాన్ని పిలుస్తారని తెలుస్తోంది.
“దుండగులు పవిత్ర కప్ బోర్డ్ లను ధ్వంసం చేశారు. ప్రార్ధనా వేదికను తెరిచి సిబోరియంను తీసేసుకున్నారు. సిబొరియంను ఖాళీ చేశారు” అని మాజీ మైఖేల్ తెలిపారు. చర్చిలపై వరుసగా జరుగుతున్న దాడుల పట్ల ఢిల్లీ ఆర్చ్ బిషప్ అనిల్ జె.టి.కౌటో ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రాజధానిలో పరమత సహనం లేకపోవడం అంతర్జాతీయంగా తప్పుడు సంకేతాలు అందిస్తుందని ఎత్తి చూపారు.
66వ రిపబ్లిక్ డే నాడు సంబరాలకు అతిధిగా హాజరయిన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఇక్కడి నుండి వెళ్తూ వెళ్తూ చివరి రోజు నాడు మత స్వేచ్ఛను గౌరవించాలని మోడి ప్రభుత్వానికి సూచించడాన్ని గుర్తు తెచ్చుకోవచ్చు. ఒబామా ఆ విధంగా సూచన చేయడం దురదృష్టకరం అని భారత హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ వ్యాఖ్యానించారు. కానీ ఒబామా అటు వెళ్ళిన వెంటనే క్రైస్తవ ప్రార్ధనా మందిరాలపై దాడులు జరగడం బట్టి మతతత్వ శక్తులు తమ కుట్రలను అమలు చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నాయని అర్ధమవుతోంది.
“ఢిల్లీలోని చర్చిలపై మరో విధ్వంసక దాడి జరిగింది. ఈ దేశంలో, ఢిల్లీలో మతపరమైన ఐకమత్యాన్ని, సామాజిక శాంతిని ధ్వంసం చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని విద్వేషపూరిత తప్పుడు ప్రచారాలకు దిగుతున్న శక్తుల ఫలితమే ఈ దాడులు. రిపబ్లిక్ డే జరుపుకుని వారం కూడా గడవక ముందే ఈ దాడి జరగడం బట్టి మైనారిటీలకు రక్షణ కల్పించడం లోనూ, వారి మతపర నిర్మాణాలను కాపాడడంలోనూ ప్రభుత్వం విఫలం అయిందని చెప్పవలసి వస్తోంది” అని ఢిల్లీ ఆర్చి బిషప్ ఒక ప్రకటనలో విమర్శించారు.
డిసెంబర్ 2వ తేదీన దిల్షాద్ గార్డెన్ లోని సెయింట్ సెబాస్టియన్ చర్చి పైన దుండగులు ఇదే విధంగా దాడి చేశారు. ఆ రోజు కూడా సోమవారమే. 1000 కుటుంబాల వరకు ఈ చర్చిలో ప్రార్ధనలు నిర్వహిస్తారు. చర్చిలోని వేదికను, గర్భ గుడి లాంటి చోటును దుండగులు కిరోసిన్ పోసి తగల బెట్టారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్ధులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. చర్చిలో మంటలు ఎలా మొదలయ్యాయో అన్నదానిపై అధికారులు ఇంకా ఒక అభిప్రాయానికి రాలేదు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చర్చి దాడిపై విచారణ చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
సెబాస్టియన్ చర్చిపై జరిగిన దాడిపై ప్రభుత్వంలోని మంత్రులు, రాజకీయ నాయకులు, ఎం.పిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుండగానే డిసెంబర్ 7వ తేదీన ఒఖ్లాలోని సిరో-మలబార్ కేధలిక్ చర్చిపై మరోదాడి జరిగింది. శనివారం నాటి ప్రార్ధనలు జరుగుతున్న సమయంలో చర్చిపై రాళ్ళ దాడి జరిగింది. అయితే దాడి జరగలేదని స్ధానిక డి.సి.పి కొట్టిపారేయడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదు. దాడి జరిగింది అనేందుకు సాక్ష్యంగా పగిలిన కిటికీ అద్దాలు ద్వంసమై కనిపించినప్పటికీ అవేవీ పోలీసు అధికారుల దృష్టికి రాలేదు.
జనవరి 4వ తేదీన రోహిణిలోని చర్చ్ ఆఫ్ రిసరెక్షన్ లో మరో దాడి జరిగింది. చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన గుడిసె (క్రిబ్) నిర్మాణం మంటల్లో ఆహుతై కనిపించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదంగా పోలీసులు దీనిని కొట్టిపారేశారు. కానీ చర్చి నిర్వాహకులు పోలీసుల క్రియా రాహిత్యాన్ని, నిర్లక్ష్య ధోరణిని తప్పు పట్టారు. షార్ట్ సర్క్యూట్ అయితే అదే సర్క్యూట్ లో ఉన్న ఇతర విద్యుత్ పరికరాలన్నీ ఎందుకు కాలిపోలేదని వారు ప్రశ్నించారు. చర్చిలో జరిగిన ప్రమాదాలకు మాత్రమే షార్ట్ సర్క్యూట్ కారణం కావడం ఏమిటో చెప్పాలని వారు నిలదీసినప్పటికీ పోలీసుల నుండి సమాధానం లేదు. చర్చి బైటి నుండి మండుతున్న వస్తువులను విసిరివేసినట్లు సి.సి.టి.వి లో స్పష్టంగా కనిపించిందని చర్చి నిర్వాహకులు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు.
కాగా జనవరి 14 తేదీన పశ్చిమ ఢిల్లీ లోని వికాస్ పురిలో మరోక చర్చిపై విధ్వంసక దాడి జరిగింది. తెల్లవారు ఝామున ఇద్దరు వ్యక్తులు చర్చిలోకి జొరబడి విధ్వంసానికి పాల్పడ్డారని చర్చి అధికారులు పేర్కొన్నారు. అద్దాలను పగలగొట్టి లోపల ఉన్న మేరీ విగ్రహాన్ని పడగొట్టారని నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధ్వంసక చర్య మొత్తం సి.సి.టి.వి లో రికార్డు కావడంతో కేసు నమోదు చేయక పోలీసులకు తప్పలేదు. 40 సం.ల వయసు కల ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్ పై రెండు విడతలుగా వచ్చి ధ్వంసానికి పాల్పడడం సి.సి.టి.వి రికార్డు చేసింది. మొదటిసారి అద్దం మాత్రమే పగలగొట్టిన దుండగులు రెండోసారి వచ్చి విగ్రహాన్ని పడగొట్టి పోయారు.
ఇవన్నీ ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిన దాడులని చివరి ఘటన తెలియజేస్తోంది. కేవలం అద్దం మాత్రమే ధ్వంసం చేస్తే ప్రజల్లో ఆశించిన విధంగా ఉద్రిక్తత తలెత్తదని దుండగులను నియోగించినవారు చెప్పడంతోనే రెండోసారి వచ్చి విగ్రహాన్ని పడగొట్టారని తేలికగా అర్ధం అయ్యే విషయం. మరీ తీవ్ర స్ధాయి విధ్వంసాలకు పాల్పడకుండా, స్వల్ప లేదా మధ్య స్ధాయి విధ్వంసాలకు పాల్పడుతూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి, వారి మధ్య విభేదాలు రగిల్చి రాజకీయంగా లబ్ది పొందే దురుద్దేశ్యంతో ఈ చర్యలు జరుగుతున్నాయి.
లోక్ సభ ఎన్నికలకు రెండు సంవత్సరాలకు ముందు నుండి ప్రారంభం అయిన ఈ తరహా చర్యలు నాలుగు అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా జరిగాయి. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల నేపధ్యంలో జరుగుతున్నాయి. ఈ చర్యల ద్వారా లబ్ది పొందే పార్టీ ఏమిటో అందరికీ తెలిసిన విషయమే. పోలీసుల నిష్క్రియా పరత్వం, ఉదాసీన వైఖరి, నిర్లక్ష్య ధోరణి ప్రజలకు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుందని గుజరాత్ హత్యాకాండ నేర్పిన పాఠం. ఈ తరహా లబ్ది ఆశిస్తున్న పార్టీకి అధికార పగ్గాలు అప్పగించకపోవడమే ఆ పార్టీకి ప్రజలకు ఇవ్వగల సరైన సమాధానం. అలాంటి పార్టీలను కుక్క కాటుకు చెప్పు దెబ్బ తరహాలో జనం పాఠం నేర్పవలసిన అవసరం ఉన్నది.