మోడి వేవ్ అయింది, ఇక బేడీ వేవ్ మిగిలింది!


Bedi wave

బి.జె.పికి సంబంధించి ఢిల్లీ ఎన్నికల ప్రచార సరళిని పట్టిచ్చే కార్టూన్ ఇది.

లోక్ సభ ఎన్నికలకు చాలా రోజుల ముందు నుండే దేశంలో మోడి గాలి వీస్తోందని హిందూత్వ అభిమాన గణం విస్తృతంగా ప్రచారం మొదలు పెట్టింది. కొన్ని ప్రాంతీయ, జాతీయ పత్రికలు, ఛానెళ్లు కూడా దానికి సహకరించాయి. ‘తెలుగు దేశం’లో కూడా ప్రధాన పత్రికలు కొన్ని ‘గుజరాత్ అభివృద్ధి నమూనా’ను ఆకాశానికి ఎత్తేస్తూ వరుసగా స్టోరీలు ప్రచురించాయి.

సామాజిక వెబ్ సైట్లలోనైతే ఇక చెప్పనవసరం లేదు. ఫేస్ బుక్, ట్విట్టర్, ప్లస్… ఇత్యాది వెబ్ సైట్లలో ఒక పధకం ప్రకారం కృత్రిమంగా మోడి గాలిని సృష్టించారు. అనేకమంది ఇతరులు కూడా తమకు తెలియకుండానే భాగస్వామ్యం వహించారు. ఒక దశలో మోడీ గురించి విమర్శ చేసినా అది ప్రచారంగా మారిపోయింది. ‘కలిసొచ్చే కాలం వస్తే, నడిచొచ్చే…’ అన్నట్లుగా.

ఎన్నికలు ముగిశాయి. గాలో, బోలో (బోలు + ఓ) తెలియదు గానీ మోడి ప్రధాని అయ్యారు. ఢిల్లీ ఎన్నికలు రానే వచ్చాయి. ఢిల్లీలో ఇక బేడీ గాలి షురూ అయిందని బి.జె.పి ప్రచారం చేసుకుంటోంది. అరవింద్ కి సరైన ప్రత్యర్ధిని నిలిపామని బి.జె.పి నేతలు భావించారు.

కానీ బేడి గాలి సృష్టించడం అంత తేలిక కాదని బి.జె.పి కి త్వరలోనే అర్ధం అయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే బేడీ ప్రచారంపై ఆధారపడడానికి బదులు ఆ పార్టీ అతిరధ మహారధులు అందరూ రంగంలోకి దిగి దుమ్ము దుమ్ముగా ప్రచారం చేసేస్తున్నారు. కేంద్ర కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు అందరూ ఏరియాలు పంచుకుని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడెక్కడి ఎం.పిలు, ఎం.ఎల్.ఏ లు అందరూ దిగి జీవన్మరణ సమస్యగా ఢిల్లీ వీధుల్ని చుట్టేస్తున్నారు. ఢిల్లీ జనం ఎలా భరిస్తున్నారో వారికే ఎరుక!

తిప్పి కొడితే 60 సీట్లు మాత్రమే ఉన్న ఢిల్లీ అసెంబ్లీ పైన ఇంతగా కేంద్రీకరించడం ఎందుకు? ఎందుకంటే ఇది బేడి గాలి మాత్రమే కాదు. బేడి గాలి ఆచరణలో మోడి గాలిగానే పరిగణించబడుతుంది. రేపు ఎన్నికల్లో గెలిచినా, ఓడినా మోడికే చుట్టుకుంటుంది. మోడి గాలి లేదని రుజువైతే ఇక యేమన్నా ఉందా?!

అందుకే బి.జె.పి కేబినెట్ మంత్రులు, ఎం.పిలు, ఎమ్మేల్యేలు (కార్టూన్ లో జనంలో అక్కడక్కడా ఉన్న బోర్డులు చూడండి) ఢిల్లీ బరిలో దూకేశారు. బే(మో)డి గాలిని రుజువు చేసేందుకు త్రికరణశుద్ధితో కృషి చేస్తున్నారు.

కానీ ఢిల్లీ బరిలో పోటీ అంత తేలిక కాదు. కారణం? అప్పుడు మోడి గాలి ఉన్నా లేకున్నా కాంగ్రెస్ తప్పులు బోలెడు ఉన్నాయి. ఢిల్లీలో ఇప్పుడు అది లేదు మరి! ఉన్నది ఒక చీపురు, అది రేపుతున్న దుమ్ము మాత్రమే.

ఫలితంగా ‘అబ్ కీ బార్, మోడి సర్కార్’ అని సాధారణ ఎన్నికల్లో నినదించిన బి.జె.పి, ఢిల్లీ ఎన్నికల్లో ‘పాంచ్ సాల్, కేజ్రీ వాల్’ అంటూ నినదిస్తున్న ఏఏపి శ్రేణులకు సమాధానం ఇవ్వలేక చేష్టలుడిగింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s