అమెరికా వెళ్ళి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడి త్వరలో చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మోడి చైనా సందర్శనకు తగిన దౌత్య ఏర్పాట్లు చేయడం కోసం భారత విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత తీవ్రం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సుష్మా పేర్కొనడం విశేషం. ఇందుకోసం ఇరు దేశాల మీడియా సహకరించాలని సుష్మా స్వరాజ్ తో పాటు చైనా దౌత్యవేత్తలు సైతం పిలుపులు ఇచ్చారు.
“మోడి త్వరలోనే ఇక్కడికి వస్తున్నారు. ఈ రోజే నేను వారికి (చైనా ప్రభుత్వానికి) తేదీలు ఇస్తాను. నేను రావడం (మోడి సందర్శనకు) తగిన ఏర్పాట్లు చేయడం కోసమే” అని విదేశీ మంత్రి సుష్మా బీజింగ్ లో విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. బీజింగ్ లో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె మోడి సందర్శన విషయం వెల్లడి చేశారు.
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఇటీవలే ఇండియా సందర్శించిన సంగతి తెలిసిందే. బారక్ ఒబామా భారత్ సందర్శన సమయంలోనే, చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్, రిపబ్లిక్ డే సందేశాన్ని విడుదల చేస్తూ భారత్-చైనాల సహకార సంబంధాలను నూతన స్ధాయికి తీసుకెళ్దామని ప్రతిపాదించారు. అమెరికా పన్నిన ‘ఏ విధంగానూ ఉపయోగపడని వలలో’ పడవద్దని ఇండియాను కోరారు.
చైనా పత్రికలు గ్లోబల్ టైమ్స్, పీపుల్స్ డెయిలీలు తమ అధ్యక్షుడి సందేశాన్ని మరింత తీక్షణం కావించి ప్రచురించాయి. అమెరికా పన్నిన వలలో పడవద్దని ఇండియాకు విజ్ఞప్తి చేస్తూ చైనాకు వ్యతిరేకంగా ఇండియాను నిలిపే దురుద్దేశంతో అమెరికా వల పన్నుతోందని, అనేక ఎత్తుగడలు వేస్తోందని, ఈ వలలో పడవద్దని అవి కోరాయి. పొరుగు దేశాల మధ్య స్నేహ సంబంధాలు నెలకొనడం అమెరికాకు ఇష్టం లేదని, స్నేహ సంబంధాలను శత్రు సంబంధాలుగా మార్చే ప్రయత్నాలు చేస్తోందని, కనుక అప్రమత్తంగా ఉండాలని పత్రికలు విశ్లేషణలు ప్రచురించాయి.
అమెరికా తన ‘ఆసియా-పివోట్’ వ్యూహంలో భాగంగానే బీజింగ్ కు వ్యతిరేకంగా న్యూ ఢిల్లీని నిలుపుతోందని అందులో భాగంగానే చైనా వ్యతిరేక వల విసిరి ఇండియాను బుట్టలో వేసుకుంటోందని వివరించాయి.
ఈ సంగతి తాము కనిపెట్టిన సంగతేమి కాదని అనేక పశ్చిమ పత్రికలు పలుమార్లు ఇదే సంగతి చెప్పాయని రెండు పత్రికల్లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ పేర్కొంది. “అమెరికా అధ్యక్షుడు మొదటిసారిగా తన పదవీ కాలంలో రెండోసారి ఇండియా సందర్శించడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్శించిందనడంలో సందేహం లేదు. చారిత్రకంగా అనేక క్లిష్టతలు ఉన్నప్పటికీ ఇండియాను భాగస్వామిగా, వీలయితే మిత్రుడిగా ఉండేందుకు ఒప్పించడానికి అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని వాషింగ్టన్ ప్రకటించిన ‘ఆసియా-పివోట్’ వ్యూహానికి ఇండియా నుండి మద్దతు రాబట్టేందుకు కృషి చేస్తోందని పశ్చిమ పత్రికలే విశ్లేషించాయని ఆర్టికల్ గుర్తు చేసింది.
చైనీస్ డ్రాగన్, ఇండియన్ ఎలిఫెంట్ లను సహజ శత్రువులుగా చిత్రీకరించేందుకు, నిలిపేందుకు అమెరికా కృషి చేస్తున్నదని పీపుల్స్ డెయిలీ వ్యాఖ్యానించింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు నెలకొని ఉన్నందున ఈ శత్రు భావనకు సంబంధించిన వార్తలు పశ్చిమ మీడియాలో పతాక శీర్షికలను ఆక్రమించడం కొనసాగుతుందని డెయిలీ తెలిపింది.
ఈ నేపధ్యంలో అటు ఒబామా దేశం వదిలి వెళ్లారో లేదో ఇక్కడ ఇండియా నేతలు చైనా వైపు దృష్టి సారించారు. ఒబామా తన సందర్శన సందర్భంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంపై ఇండియాతో కలిసి విడుదల చేసిన దార్శనిక పత్రం (vision document), తీవ్ర విమర్శలతో రష్యాకు వ్యతిరేకంగా విడుదల చేసిన ప్రకటన… రెండూ కలిగించిన ప్రతికూల ప్రభావాన్ని చక్కదిద్దే పనిలో పడిపోయారు. రష్యా-ఇండియా-చైనా విదేశీ మంత్రుల 13వ త్రైపాక్షిక సమావేశం వారికి సదవకాశంగా లభించింది.
సుష్మా స్వరాజ్ చైనాకు బయలుదేరుతుండగానే హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ కూడా చైనాను సంతృప్తిపరిచే మాటలు పలికారు. ఇండియా టిబెట్ బోర్డర్ పోలీస్ బెటాలియన్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ‘సరిహద్దు విషయంలో చైనాకు, భారత్ కూ మధ్య ఉన్నవి కేవలం దృక్పధాత్మక విభేదాలు మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. “వివాదాలన్నీ శాంతియుతంగా పరిష్కారం కావాలి. చర్చలకు చైనా ముందుకు రావాలి” అని రాజ్ నాధ్ సింగ్ పేర్కొన్నారు. కొద్ది నెలల క్రితం ఇదే హోమ్ మంత్రి ట్విట్టర్ లో చైనాకు వ్యతిరేకంగా పలు ట్వీట్ లో పోస్ట్ చేయడం విశేషం. భారత భూభాగంలోకి చైనా ‘చొచ్చుకు వస్తోందని’, ‘ఇండియాకు బెడదగా మారింద’నీ ఆగ్రహపూరితంగా ట్వీట్ చేశారు.
ప్రతిభావంతమైన దౌత్య ఎత్తుగడలు, విన్యాసాల పేరుతో భారత దళారి పాలకులు అటు అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఇటు చైనా సామ్రాజ్యవాదాన్ని సంతృప్తిపరిచేందుకు నాట్య విన్యాసాలు ప్రదర్శిస్తున్నారని మాత్రమే జనం అర్ధం చేసుకోవాల్సిన విషయం. సరిహద్దులో ఇండియా లోకి చొరబడుతున్న చైనాతో స్నేహ సంబంధాలు ఏమిటని ఎన్నికల ప్రచారంలో ప్రశ్నించి పరిహసించిన మోడి తదితర బి.జె.పి నాయకులు అవే విన్యాసాలను తాము ప్రదర్శిస్తే మాత్రం ‘దౌత్య విద్య’ అవుతుంది కాబోలు!
లేదంటే చైనాతో స్నేహం ఏమిటని ప్రశ్నించిన నరేంద్ర మోడి ఇప్పుడు ప్రధాన మంత్రిగా అదే చైనాలో పర్యటించేందుకు ముందుకు రావడం ఎలా అర్ధం చేసుకోవాలి? అమెరికా అధ్యక్షుడు దేశంలో ఉన్నప్పుడు దక్షిణ చైనా సముద్రంలో అంతర్జాతీయ సరఫరాలకు, ప్రయాణాలకు రక్షణ ఉండాలని అమెరికాతో కలిసి ప్రకటించిన బి.జె.పి ప్రభుత్వం, ఒబామా వెళ్లిపోగానే అదే చైనాతో స్నేహానికి చేతులు చాచడం వెనుక ఉన్న అర్ధం ఏమిటి?
ఇలా ప్రశ్నించడం అంటే చైనా-ఇండియాల స్నేహాన్ని వ్యతిరేకిస్తున్నట్లు అర్ధం చేసుకోరాదు. నిజానికి ప్రస్తుత ప్రపంచం, బహుళ ధృవ ప్రపంచంగా వేగంగా అవతరిస్తున్న పరిస్ధితుల్లో ఇండియా తన సొంత అభివృద్ధి మార్గాన్ని ఎంచుకోవడమే సముచితం. ఆ మార్గం దేశ ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలే తప్ప అమెరికా, చైనా కంపెనీల ప్రయోజనాలను మాత్రమే నెరవేర్చెదిగా ఉండరాదు. ప్రభుత్వాల ఆచరణ అందుకు విరుద్ధంగా ఉండడమే సమస్య.
తమ ఆచరణను సవరించుకోకుండా ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెరగడానికి మీడియా సహకరించాలని సుష్మా స్వరాజ్ కోరడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? శతాబ్దాల క్రితం చైనా యాత్రీకులు భారత్ సందర్శించిన ఉదాహరణలను సుష్మా తన పర్యటనలో ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. భారత్ సందర్శించిన చైనా యాత్రీకుడు హువాన్ సాంగ్ లాంటి స్కాలర్ల వారసత్వాన్ని ఇప్పటి జర్నలిస్టులు అందిపుచ్చుకోవాలని, ఇరు దేశాల మధ్య స్నేహ సహకార సౌరభం గుబాళించేందుకు పూనుకోవాలని ఆమె ఆకాంక్షించారు.
వచ్చే మే నెలలో జరగనున్న మోడి చైనా పర్యటన ఏ పరిణామాలకు దారి తీస్తుందో పరిశీలించడం ఆసక్తికరంగా ఉండగలదు.