చైనా-ఇండియాల కోసం సుష్మా షడ్సూత్రాలు


Sushma Swaraj, Wang Yi (in India)

Sushma Swaraj, Wang Yi (in India)

మూడు రోజుల చైనా పర్యటనలో ఉన్న సుష్మా స్వరాజ్ ఇరు దేశాల స్నేహ సంబంధాలు వృద్ధి చెందడానికి ‘పంచశీల’ సూత్రాల తరహాలో ఆరు సూత్రాలను ప్రతిపాదించారు. వీటిని ‘షడ్శీల పధకం’ అనవచ్చో లేదో ఇంకా తెలియదు. బీజింగ్ లో భారత విదేశీ మంత్రి ఆవిష్కరించిన ఆరు సూత్రాలు 1 నుండి 6 వరకు కాకుండా A నుండి F వరకు ఉండడం విశేషం.

విదేశీ మంత్రి సుష్మా ప్రకటించిన ఆరు సూత్రాలు ఇలా ఉన్నాయి.

A – Action-oriented approach

B – Broad-based bilateral engagement

C – Convergence on common regional and global interests

D – Develop new areas of cooperation

E – Expand strategic communication

F – Fulfil the common aspiration to usher and ‘Asian Century’

వీటిని తెలుగులో చూస్తే….

చేతల సరళితో కూడిన అవగాహన

విశాల ప్రాతిపదికన ద్వైపాక్షిక చర్చలు

ప్రాంతీయ మరియు ప్రపంచ ప్రయోజనాలలో ఉమ్మడి అంశాలపై ఏకత్వం

నూతన సహకారాంశాల అభివృద్ధి

వ్యూహాత్మక సమాచార సంబంధాల విస్తరణ

అభివృద్ధి చెందాలన్న ఉమ్మడి ఆకాంక్ష మరియు ‘ఆసియా శతాబ్దం’ కలల సాకారం

ఇలా ఎ బి సి డి తరహాలో వివిధ పద బంధాలను కూర్చి ఒక దార్శనికతను సృష్టించే ధోరణి మనకు ఫేస్ బుక్ లో తరచుగా కనిపిస్తుంది. ఒక వరుసలో ఉన్న అక్షరాలు మొదట వచ్చేలా తమకు తోచిన విధంగా ఏర్చి కూర్చి వాటికి రంగులు చేర్చి సగర్వంగా ప్రవేశపెట్టడం ఫేస్ బుక్ లో జరుగుతూ ఉంటుంది. ఎవరో ఒకరు తయారు చేస్తే దానిని పలువురు షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఈ ధోరణి ఉన్నతమైన అర్ధాన్ని ఇవ్వడానికి బదులు చీప్ గా అక్షరాలతో జీమ్మిక్కులు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

నరేంద్ర మోడి ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించినప్పటి నుండి, ప్రధానిగా ఎన్నికయిన తర్వాత కూడా ఇదే తరహాలో అక్షర జ్ఞానం ప్రదర్శించడం మోడితో పాటు ఇతర బి.జె.పి నేతలకు ఒక ధోరణిగా ఉంటోంది. సుష్మా స్వరాజ్ ప్రకటించిన A to F సూత్రావళి సైతం మోడి అనుచర బృందం తయారు చేసినదే అయినా అయి ఉండవచ్చు (కాకపోనూవచ్చు).

ఇలాంటివి ఎన్నికల ప్రచారానికి, సభలో పామర జనాన్ని అలరించడానికి, అల్ప సంతృప్తిపరులను ఆకట్టుకోవడానికి పనికొస్తే పనికి రావచ్చు. కానీ ప్రభుత్వంలో బాధ్యతాయుత పదవులను చేపట్టిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగడం ఒకింత ఆశ్చర్యకరం. అందునా విదేశాలకు వెళ్ళినపుడు కూడా ఉద్దండపిండాలైన అంతర్జాతీయ విలేఖరుల ముందు ఆంగ్ల ఆల్ఫా బీటా లతో చాతుర్యం ప్రదర్శించబోవడం బాధ్యతాయుత మంత్రులకు తగునా అన్నది చర్చనీయం.

ఒక దార్శనికతతో కూడిన సూత్రావళిని ప్రకటించే ముందు దానికి ఒక లక్ష్యం, సందర్భ శుద్ధి, ఆమోదనీయత ఉండాలి. విదేశీ మంత్రి ప్రకటించిన సూత్రాలు రెండు దేశాల మధ్య సంబంధాలు వృద్ధి చెందడానికి ఉద్దేశించినది. కనుక దానికి ఇరు దేశాల ప్రభుత్వాల ఆమోదం ఉంటే దానికి అంతర్జాతీయ ఆమోదనీయత వచ్చి ఉండేది. ఒక లక్ష్య ప్రకటనలో రెండు దేశాలు ఉమ్మడిగా ప్రయాణం చేయబోతున్నాయన్న విశాల భావన కలిగి ఉండేది. ఒక నూతన చారిత్రక సందర్భం మొగ్గ తొడుగుతోందన్న ప్రతిష్ట వచ్చి చేరేది.

కానీ సుష్మా స్వరాజ్ ఆరు సూత్రాల ప్రకటన అలా జరిగినది కాదు. ఏకపక్షంగా ప్రతిపాదించబడినది. దీనికి చైనా అంగీకరిస్తే సరే. కానీ అది జరగకపోతే నిర్దిష్ట సూత్రాల ప్రతిపాదన మొదలైనప్పుడే ముగిసిపోయిన అప్రతిష్ట మాత్రమే మిగులుతుంది.

చివరి సూత్రంలో కనపడుతున్న ‘ఆసియా శతాబ్దం’ చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ ప్రతిపాదించినది. అది ఆయనకు ఇష్టమైన ప్రాజెక్టుగానూ, ప్రపంచ రాజకీయార్ధిక చిత్ర పటంపై చైనా వేయనున్న ప్రత్యేక ముద్రకు ఆరంభంగానూ ఇప్పటికే ప్రచారం పొందింది. అటువంటి ప్రాజెక్టును ఉమ్మడిగా ప్రకటించిన సూత్రాలలో భాగంగా చేర్చినట్లయితే దానికి భారీ ప్రతిష్ట చేకూరేది. ‘ఆసియా శతాబ్దం’ అనే చైనా ప్రాజెక్టులో ఇండియా చేరిందన్న సీరియస్ దృష్టి పరిశీలకులకు, విశ్లేషకులకు, పరిశోధకులకు కలిగేది. కానీ ఏకపక్షంగా ప్రకటించడం వల్ల ఆ అవకాశం, బహుశా, దూరం అయింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s