ఢిల్లీ ఎన్నికలు వేడెక్కాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో సహ ఉద్యమకారిణి కిరణ్ బేడీని తమ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బి.జె.పి ప్రకటించింది. ఈ దెబ్బతో ఏఏపి నేత కేజ్రీవాల్ దూకుడుకు పగ్గం వేయవచ్చని బి.జె.పి భావించి ఉండవచ్చు. కానీ వాస్తవంలో కిరణ్ బేడి అభ్యర్ధిత్వం సానుకూలం కావడం అటుంచి ప్రతికూలం అవుతున్నట్లుగా పత్రికల వార్తల ద్వారా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో బి.జె.పి అతిరధ మహారధులందరూ రంగంలోకి దిగి చెమటోడ్చుతున్నారు.
ఎన్నికల పోటీ పోటాపోటీగా జరుగుతుందని పార్టీలు భావిస్తుండడంతో ప్రచారంలో ఊహించని సంఘటనలు నమోదవుతున్నాయి. వినూత్న ప్రచారం తోనూ, వినూత్న ఎన్నికల గుర్తుతోనూ ఢిల్లీ ప్రజలను గత ఎన్నికల్లో ఆకర్షించిన ఏఏపి ఈసారి కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా దూకుడుగా ప్రచారం సాగిస్తోంది. ఏఏపి హోరును నిలువరించే ప్రయత్నంలో ఇతర పార్టీలు, ముఖ్యంగా బి.జె.పి సాధ్యమైనంత తీవ్రంగా కృషి చేస్తోంది. దానితో బరిలో నిలబడిన ప్రధాన అభ్యర్ధులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ, కార్టూన్లు గీసుకుంటూ, ఫోటో ప్రచారాలకు దిగుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
తన అనుమతి లేకుండా తన ఫోటో ను ఉపయోగించారని బి.జె.పి సి.ఎం అభ్యర్ధి కిరణ్ బేడి, ఏఏపి నేత అరవింద్ కేజ్రీవాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, అన్నా బ్రతికి ఉండగానే ఆయనకు దండ వేసి చంపేశారని కేజ్రీవాల్ ఆరోపించడం విశేషం. ఇంతలోనే ఏఏపికి మరో ముఖ్యనేత కుమార్ విశ్వాస్ సెక్సిస్టు వ్యాఖ్యలు చేశారని కిరణ్ బేడీ పోలీసులకు మరో ఫిర్యాదు చేయగా, సదరు వ్యాఖ్యల వీడియోలనే నేరుగా విడుదల చేస్తూ బేడి తన ఆరోపణలను నిరూపించాలని కుమార్ విశ్వాస్ సవాలు విసిరారు.
చివరి నిమిషంలో బి.జె.పి సి.ఎం అభ్యర్ధిగా కిరణ్ బేడి అవతరించిన సంగతి విదితమే. బేడి రాకతో ఏఏపి గుత్తస్వామ్యం వహిస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమ ప్రతిష్టలో తమకూ కొంత భాగం వచ్చేస్తుందని బి.జె.పి భావించి ఉండవచ్చు. కానీ బేడి అభ్యర్ధిత్వం సైతం ఏఏపి కి సానుకూలం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయం ప్రకటించినప్పుడు బేడి తీవ్రంగా వ్యతిరేకించారు. బి.జె.పికి లబ్ది చేయడం కోసమే ఆమె కేజ్రీవాల్ నిర్ణయాన్ని వ్యతిరేకించారని అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. చివరికి ఆ ఆరోపణలనే ఈ రోజు బేడి నిజం చేశారు. పైగా అనేక రాష్ట్రాల్లో బి.జె.పి నేతలపై అవినీతి కేసులు కొనసాగుతుండగానే ఆమె బి.జె.పి అభ్యర్ధిగా అవతరించడంతో ఆమె మొదటి నుండి బి.జె.పి కోసమే పని చేశారన్న అపప్రధ రావడానికి అవకాశం ఇచ్చారు.
ఈ పరిస్ధితుల్లో కిరణ్ బేడి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అవసరం కోసమే పాల్గొన్నారని ఏఏపి ప్రచారం చేస్తోంది. చివరికి ఏఏపి ప్రచార పోస్టర్లలో సైతం కిరణ్ బేడి ఫోటోను ఏఏపి ప్రచురించి ఈ అంశాన్ని ఎత్తి చూపుతోంది. అరవింద్, బేడీల ఫోటోలను పోస్టర్లలో ప్రచురించి కేజ్రీవాల్ ను నిజాయితీ గల వ్యక్తిగానూ, బేడీని అవకాశవాదిగానూ అభివర్ణిస్తూ ఏఏపి ప్రచారం చేస్తోంది. ఏ ఆటో వెనుక చూసినా ఇదే పోస్టర్ కనిపించడంతో తన అనుమతి లేకుండా తన ఫోటో వాడారని బేడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఢిల్లీ ఎన్నికల్లో వివాదాస్పదంగా మారిన మరో అంశం అన్నా హజారే ఫోటోతో కూడిన పోస్టర్! హజారే ఫోటోను తమ పోస్టర్లలో ముద్రించిన బి.జె.పి ఆయన ఫోటోకు దండ వేసి ఆయన పక్కనే కేజ్రీవాల్ ను కార్టూన్ రూపంలో చిత్రించింది. రాజకీయాల్లోకి రావడం ద్వారా కేజ్రీవాల్ అన్నా హజారేను మృతుడిగా మార్చారని అర్ధం వచ్చే విధంగా పోస్టర్ తయారు చేయగా అది కాస్తా బి.జె.పి కి వెనక్కి తన్నినట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది. బ్రతికి ఉన్న హజారేను మృతుడిగా చూపించడం ఏమిటని కేజ్రీవాల్ సోషల్ మీడియా ద్వారా ఘాటుగా ప్రశ్నించడంతో సమాధానం చెప్పుకోవలసిన పరిస్ధితిలో బి.జె.పి పడిపోయింది. సదరు పోస్టర్ లో అన్నాకు దండ వేయడం సింబాలిక్ గా మాత్రమే జరిగిందని బి.జె.పి నేతలు వివరణ ఇచ్చుకున్నారు. కానీ జరగవలసిన వ్యతిరేక ప్రచారం అప్పటికే వచ్చేసింది.
కుమార్ విశ్వాస్ తనను ఉద్దేశిస్తూ సెక్సిస్టు వ్యాఖ్యలు చేశారని బేడి ఫిర్యాదు! దానితో కుమార్ విశ్వాస్ తన ఉపన్యాసం ఉన్న వీడియోను విడుదల చేసి తన ఆరోపణలు నిరూపించాలని కిరణ్ బేడీని సవాలు చేశారు. ది హిందూ పత్రిక ప్రకారం వీడియోలో కుమార్ బిశ్వాస్ చేసిన వ్యాఖ్యలు ఇవి: బి.జె.పికి అరవింద్ కేజ్రీవాల్ తో రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి ఆయన మఫ్లర్ ధరిస్తాడని… అయితే ఏం? ఆయనేమన్నా మీ వద్ద (మఫ్లర్) లాక్కుని ధరిస్తున్నారా? రెండో సమస్య ఏమిటంటే ఆయన అదే పనిగా దగ్గుతారట. దానివల్ల మీకేమిటి సమస్య? ఆయన బెడ్ రూమ్ లో పడుకోవలసిన అవసరం మీకు లేదు కదా!”
ఇందులో సెక్సిస్టు వ్యాఖ్య ఏమిటో చెప్పాలని బిశ్వాస్ ప్రశ్న! ఈ ప్రశ్నకు బేడి నుండి ఇంతవరకు సమాధానం అందనట్లు కనిపిస్తోంది. “ఢిల్లీ సమస్యలకు వారి వద్ద సమాధానం లేదు. అందుకే ఇలాంటి పుకార్లు వ్యాపింపజేస్తూ, ఎఫ్.ఐ.ఆర్ లు దాఖలు చేస్తున్నారు. తద్వారా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అమిత్ షా భావజాలాన్నే కిరణ్ బేడీ అనుసరిస్తున్నారు. ఆమె తాను బి.జె.పికి రాహుల్ గాంధిగా రుజువు చేసుకోవాలని భావిస్తున్నారు. కానీ ఆమెను ఎలా తయారు చేస్తారో ఆమెకు తెలియడం లేదు” అని కుమార్ విశ్వాస్ విమర్శించారు.
ప్రస్తుతం అనేక మంది కేంద్ర మంత్రులు ఢిల్లీ గల్లీల్లో తిరుగుతూ ఏఏపికి వ్యతిరేకంగా అలుపు తెలియకుండా ప్రచారం చేస్తున్నారు. బడా నేతలంతా రంగంలోకి దిగడం బట్టే బి.జె.పికి తమపై తమకే విశ్వాసం సన్నగిల్లుతోందని భావించవచ్చని ఏఏపి నేతలు ఎత్తి పొడుస్తున్నారు.