రిపబ్లిక్ డే డాలరీకరణ! -కార్టూన్


Dolarized Republic Day

Dolarized Republic Day

స్వదేశీ నినాదం తమదిగా బి.జె.పి చెప్పుకుంటుంది. బి.జె.పి మాతృ సంస్ధ ఆర్.ఎస్.ఎస్ లో ఆర్ధిక విభాగం పేరే ‘స్వదేశీ జాగరణ్ మంచ్.’ విదేశాలకు, ముఖ్యంగా అమెరికాకు చెందిన బహుళజాతి కంపెనీల ఉత్పత్తులను బహిష్కరించాలని ఈ సంస్ధ అనేక దశాబ్దాలు పుస్తకాలు ప్రచురించి మరీ బోధించింది, ఇంకా బోధిస్తోంది.

అలాంటి స్వదేశీ బి.జె.పి తీరా అధికారానికి వచ్చాక పక్కా విదేశీ విధానాలను కాంగ్రెస్ కంటే ఎక్కువగా వాటేసుకుని అమలు చేయడాన్ని ఎలా అభివర్ణించాలి? ప్రపంచ దేశాలపై పెత్తనం చేసే అమెరికా ప్రభుత్వాధిపతులను, ఒక అలీన దేశంగా, రిపబ్లిక్ డే రోజున అతిధిగా పిలవకుండా ఇన్నాళ్లూ ప్రభుత్వాలు సంయమనం పాటించాయి. ఆ సంయమనం కాస్తా మోడి హయాంలో గంగలో (బహుశా వారణాసి వద్దనే) కలిపివేయబడింది.

అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ప్రధాని మోడి దేశ ప్రజలకు ఉత్తుత్తి నినాదాలు, ఊకదంపుడు ప్రసంగాలు ఉదారంగా పంచి పెడుతూ విదేశీ కంపెనీలకు మాత్రం దేశ వనరులను అప్పనంగా కట్టబెట్టే చట్టాలను పందేరం పెడుతున్నారు. చట్టాలు సాధ్యం కానిచోట ఆర్డినెన్స్ లు తెస్తున్నారు.

ఫలితంగా స్వదేశీ నినాదం నినాదంగా కూడా మాయమైపోయింది. రిపబ్లిక్ డే ప్రకటనలో భారత రాజ్యాంగం పీఠిక నుండి ‘సోషలిస్టు, సెక్యులర్’ పదాలను తొలగించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు కేంద్ర ప్రభుత్వం పాల్పడింది. ఒబామాకు రిపబ్లిక్ డే ఆతిధ్యం మాత్రమే ఇచ్చారో లేక భారత రాజ్యం యొక్క రిపబ్లిక్ స్వభావాన్నే ఇచ్చేశారో ప్రశ్నించుకోవలసిన అవసరం భారత ప్రజలకు వచ్చిపడింది.

ఒబామా వచ్చిన రోజే ఇరు దేశాల మధ్య 2004లో చేసుకున్న ‘పౌర అణు ఒప్పందం’ అను అమలులోకి తెచ్చే అవగాహన కుదిరిపోయిందని ప్రకటించారు. ఈ అవగాహన ఎంత స్వదేశీయంగా ఉందంటే అణు ఒప్పందం మరియు అణు చట్టాల విషయమై ఒబామాకు ఏయే హామీలు ఇచ్చారో ఇంతవరకు కేంద్రం ప్రజలకు చెప్పనేలేదు. అణు ఒప్పందాన్ని అమలులోకి తెనున్న అంశాలు ఇప్పుడు అమెరికా పాలకులకు తెలుసు గానీ భారత ప్రజలకు మాత్రం తెలియదు. బి.జె.పి/మోడి మార్కు స్వదేశీ ఇదేనా?!

రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా ఆకాశంలో విన్యాసాలు ప్రదర్శిస్తున్న ఆ విమానాలను చూడండి! అవి వదిలిన పొగలు ఆకాశంలో డాలర్ గుర్తును ఏర్పరిచాయి. భారత రిపబ్లిక్ రాజ్యంలోకి డాలర్ చొరబడిపోయిందని దానికి దేశ ప్రధాని గారే కర్తగా నిలిచారని కార్టూనిస్టు చెబుతున్నారు. నిజంగా నిజం!

8 thoughts on “రిపబ్లిక్ డే డాలరీకరణ! -కార్టూన్

 1. ఓ పక్క మోదీ ప్రవేశపెడుతున్న ఆర్ధిక సంస్కరణలకు మద్ధతు తెలుపుతూనే,మరోపక్క మోదీ అమేరికాతో చట్టాపట్టాలేసుకు తిరగడాన్ని(అమేరిక అనుకూలవిధానాలు) విమర్శించడాన్ని ఏమనాలి?
  లేకపోతే కార్టూనిస్టే స్వతంత్రంగా వ్యవహరించాడనాలా?

 2. /‘సోషలిస్టు, సెక్యులర్’ పదాలను తొలగించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు కేంద్ర ప్రభుత్వం పాల్పడింది/
  ఉన్న ఒక్క బట్ట లాగే సుకున్నారన్నమాట. ఇంకేమి అంతా నగ్నత్వమే! ఈ గుడుగుడు గుంచం లేకుండా ఆటలో అరటి పండు పాటలెందుకురా అన్నట్లు, అంతా ముగిసి పోయింది. ఇక తొడ కొట్టడమే తరు వాయి. ఇక కాచుకో వలసింది ప్రజలేనా?

 3. దయచేసి ఒక్కమాట చెప్పండి. ఈ సోషలిస్టు, సెక్యులర్ పదాలు భారతరాజ్యాంగంలో మొదటినుండీ ఉన్నవేనా లేక మధ్యలొ ఏదైనా సవరణద్వారా వచ్చిచేరినవా?

  భారత రిపబ్లిక్ రాజ్యంలోకి డాలర్ చొరబడిపోయిందని ఆవేదన పడుతున్నారు. కాని డాలర్ మారకంతో వాణిజ్యం అనేది కొత్తగా మోదీరాకతో ఏర్పడిన పరిణామమా? ఇన్నాళ్ళూ భారతదేశం అంతర్జాతీయవాణిజ్యాన్ని కేవలం రూపాయల్లో నడిపించిందా?

  అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ప్రధాని మోడి దేశ ప్రజలకు ఉత్తుత్తి నినాదాలు, ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్నారన్నారు. ఇతఃపూర్వప్రభుత్వాలు వేరే ఏం ఒరగబెట్టాయో చెబుతారా ప్రత్యేకించి మోడీని వేలెత్తిచూపే ముందుగా?

 4. ఇరాన్‌కి చెందిన చమురు కంపెనీలకి కలకత్తాలోని యూకో బ్యాంక్‌లో అకౌంత్‌లు ఉన్నాయి. ఇరాన్ నుంచి చమురు కొనడానికి రూపాయల్లోనే డబ్బులు కట్టొచ్చు. ఈ విషయం తెలిసి కూడా దాలర్‌లు కట్టి సౌదీ అరేబియా నుంచి చమురు దిగుమతి మోదీ ప్రభుత్వం కూడా చెయ్యడం లేదా?

 5. శ్యామల గారు, డాలర్ చొరబడింది అన్నది మీరు చెప్పిన అర్ధంలో కాదు. అది సింబాలిక్ గా వాడిన పదబంధం. డాలర్ యజమాని అమెరికాయే కదా. అమెరికా మన ప్రభుత్వ పాలనలో, వాణిజ్య పెత్తనం రూపేణా, చొరబడిందనీ అందుకు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని చెప్పాను. మన దేశ ప్రయోజనాలు నెరవేర్చే వాణిజ్యం కోసం డాలర్లు నిలవ చేసుకోవడం, డాలర్ వాణిజ్యానికి దాసోహం కావడం రెండూ వేరు వేరు.

  గత ప్రభుత్వాలు ఒరగబెట్టాయని నేను ఎప్పుడన్నా అన్నానా? ఎప్పుడూ అనలేదు. మీ కోసం మరొకసారి నా అభిప్రాయం చెబుతాను: కాంగ్రెస్, బి.జె.పి లకు తేడా లేదు. రెండింటి ఆర్ధిక విధానాలు ఒకటే.

  కాకపోతే అవి ప్రజల ఆమోదం కోసం చెరొక ముసుగు తొడుగుతాయి. ఒకటి సెక్యులరిజం ముసుగు వేస్తుంది. మరొకటి హిందూ జాతీయవాదం ముసుగు వేస్తుంది. అంతే తేడా. రెండోది ప్రజల మధ్య లేని విభజనలు తెచ్చి చిచ్చు పెడుతుంది. అందువల్ల హిందూత్వ ముసుగు కంటే సెక్యులరిజం ముసుగు కాస్త ప్రగతిశీలంగా కనిపిస్తుంది. ముసుగులు తీస్తే రెండు కూటములు ఒకటే.

  రెండింటి మధ్య ఇప్పుడు యధేచ్చగా పార్టీ మార్పిడిలు జరిగిపోతున్నాయి. ఇది చాలదా వారి మధ్య తేడా లేదని చెప్పడానికి. ఇప్పుడు మోడి తెస్తున్న ప్రతి విధానమూ కాంగ్రెస్ అమలు చేసినదే. కాంగ్రెస్ ని తిట్టి ఆ కాంగ్రెస్ విధానాలనే అమలు చేయడంలో మోసం కనిపించడం లేదా మీకు?

  మోడిని అభిమానించడం మీ ఇష్టం. కానీ ఆ యిష్టం తప్పుల్ని సమర్ధించేదిగా ఉండకూడదని నా అభిప్రాయం. మోడి ఈ దేశానికి ప్రధాని. కాంగ్రెస్ వల్ల కానిది నేను చేస్తానని వాగ్దానాలు కురిపించి అధికారం చేపట్టిన ప్రధాని. ‘నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, భిన్నంగా చేసి చూపిస్తా’ అని పీఠం అధిష్టించిన ప్రధాని. అలాంటి ఆయన కాంగ్రెస్ విధానాలనే అమలు చేస్తుంటే విమర్శలు కూడదని మీరు ఆశించవచ్చునా?

  కాంగ్రెస్ ని విమర్శించే హక్కు మోడి గారికి, మీకు ఎలా ఉందో, చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా పోతే ఆయన్ని విమర్శించే హక్కు, బాధ్యత ఈ దేశ పౌరుల పైన ఉంటుంది. గమనించగలరు.

 6. కరెన్సీ విలువ తగ్గించుకుని విదేశీ పెట్టుబడులని ఆహ్వానించడం వల్లే దేశం అభివృద్ధి చెందుతుందనిపిస్తే అమెరికాయే ఆ పని చెయ్యొచ్చు కానీ అలా ఎందుకు చెయ్యడం లేదు? 1917లో రూపాయి విలువ కంటే దాలర్ విలువే తక్కువగా ఉండేది. అప్పట్లో forex marketలో ఒక్క రూపాయి కొనాలంటే 13 దాలర్‌లు ఖర్చుపెట్టాల్సి వచ్చేది. అప్పట్లో ఇందియా ఆంగ్లేయుల పాలనలో ఉండేది. ఇందియా కరెన్సీ విలువ తగ్గితే ఆంగ్లేయులకి నష్టం కనుక మన కరెన్సీ విలువ తగ్గించడానికి ఆంగ్లేయులు ఒప్పుకోలేదు. ఇప్పుడు అమెరికాయే ఇతర దేశాలని కరెన్సీ విలువ తగ్గించుకొమ్మంటుంది, అలా తగ్గించుకుంటేనే ఆ దేశాల్లో పెట్టుబడులు పెడతామంటుంది.

 7. విశేఖర్ గారు, మీరు మార్క్సిస్త్ కనుక భావవాదంలో ఆలోచనకీ, ఆచరణకీ మధ్య సంబంధం ఉండదని మీకు తెలిసే ఉంటుంది. భాజపా నాయకురాలు మేనకా గాంధీయే మందుల సీసాల మీద అది శాకాహారమా లేదా మాంసాహారమా అని ముద్రించాలని వాదించింది. అందుకు వైద్యులు ఎలాగూ ఒప్పుకోలేదు. మేనకా గాంధీ తన పిల్లలకి అనారోగ్యం కలిగితే శుద్ధశాకాహార మందులే ఇవ్వాలని అనుకుంటుందా లేదా తన పిల్లలు బతకడమే ముఖ్యమనుకుంటుందా? ఆయుర్వేద మందుల్లో ఎముకల పొడి కలిపే రామ్‌దేవ్ అయినా, బహుళజాతి కంపెనీల ఉత్పత్తుల్ని బహిష్కరించాలని ఉత్తుత్తి నినాదాలు చేసే స్వదేశీ జాగరణ్ మంచ్ అయినా అంతే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s