
ECB president Mario Draghi
[జనవరి 26 నాటి “Yet another QE programme” సంపాదకీయానికి యధాతధ అనువాదం.]
*********
అమెరికా ఫెడరల్ రిజర్వ్ అమలు చేసిన పరిమాణాత్మక సడలింపు (QE – Quantitative Easing) కార్యక్రమం ఉపసంహరణానంతర పరిణామాలతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ వేగుతుండగానే సదరు QE పెద్ద శబ్దంతో మళ్ళీ వచ్చేసింది, ఈ సారి యూరప్ నుండి! గతవారం ప్రకటించబడిన యూరోపియన్ QE ని ముందే ఊహించినప్పటికీ, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇ.సి.బి) ప్రకటించిన భారీ స్ధాయి బాండ్ల కొనుగోలు కార్యక్రమం, ప్రపంచవ్యాపితంగా ఉన్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులను, మార్కెట్లను, ఆర్ధికవేత్తలను దిగ్భ్రాంతికి గురి చేసింది. మార్చి నుండి మొదలయ్యే కార్యక్రమం నిబంధనల ప్రకారం ఇ.సి.బి 18 నెలలపాటు యూరోజోన్ ప్రభుత్వాల నుండి (సావరిన్) బాండ్లను 1.1 ట్రిలియన్ యూరోల (1.234 ట్రిలియన్ డాలర్లు) మేరకు కొనుగోలు చేస్తుంది. సెప్టెంబర్ 2016 వరకు లేదా “ద్రవ్యోల్బణ మార్గంలో స్ధిరమైన సర్దుబాటు నెలకొనే వరకూ” ఈ కార్యక్రమం అమలులో ఉంటుందని ఇ.సి.బి స్పష్టం చేసింది.
QE ద్వారా యూరోజోన్ ఆర్ధిక వ్యవస్ధలోకి కుమ్మరించనున్న డబ్బు పరిమాణం నిపుణులు అంచనా వేసినదాని కంటే రెట్టింపు మొత్తంలో ఉన్నది. అంతే కాకుండా ద్రవ్యోల్బణం లక్ష్యిత స్ధాయి “2 శాతం సమీపానికి” పెరిగేవరకూ ప్రభుత్వాల అప్పు కొనుగోలును కొనసాగిస్తామని ఇ.సి.బి ప్రకటించింది. దరిమిలా బాండ్ల ధరలు ర్యాలీలో పాల్గొనడం, డాలర్ తో పోల్చితే యూరో వెల గత 11 యేళ్లలోనే అతి తక్కువ స్ధాయికి పడిపోవడం ఆశ్చర్యకారకం ఏమీ కాదు. యూరో జోన్ లో వ్యక్తం అవుతున్న ప్రతి ద్రవ్యోల్బణ ధోరణులు, పడిపోతున్న చమురు ధరల వల్ల ఈ పరిస్ధితి మరింత తీవ్రం కావడం లను చూపుతూ ఇ.సి.బి అధ్యక్షుడు మారియో ద్రాఘి తన QE కార్యక్రమాన్ని సమర్ధించుకున్నారు. అమెరికా ఉద్దీపన వల్లా మరియు ఉద్దీపన ఉద్వాసన వల్లా ప్రభావితమైన వర్ధమాన (ఎమర్జింగ్) దేశాల సెంట్రల్ బ్యాంకుల సంకెళ్ళను ఇ.సి.బి ప్రకటించిన QE మరింత కఠినం కావించనుంది.
ఆర్ధిక మాంద్యం మరియు ద్రవ్యోల్బణంల బారిన పడకుండా ఉండేందుకు సాంప్రదాయ విరుద్ధ ద్రవ్య విధానాలకు పాల్పడిన అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంకులు ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ ల సరసన ఇప్పుడు ఇ.సి.బి కూడా చేరింది. అటువంటి విధానాలు వారికి పని చేయవచ్చు లేదా పనిచేయకపోవచ్చు. కానీ ఇండియా లాంటి వర్ధమాన దేశాలకు మాత్రం అవి తీవ్ర స్ధాయిలో ఆందోళన కారకం. భారత మార్కెట్లు, కరెన్సీ మరియు ఆర్దిక వ్యవస్ధలపైన అమెరికా ఉద్దీపనపన కార్యక్రమం నుండి ఉద్వాసన పలికినప్పటి ప్రతికూల ప్రభావాలు ఏమిటో చక్కగా నమోదై ఉన్నాయి. ఉదారంగా వెల్లువెత్తిన పెట్టుబడుల ప్రవాహం మూలంగా స్టాక్ ధరల్లో పొడచూపిన ద్రవ్యోల్బణం, బుడగ బద్దలై విరుచుకుపడిన తదనంతర సమస్యలు… ఇవన్నీ పెద్దగా వివరణ అవసరం లేనంతగా అనుభవంలోకి వచ్చాయి.
సరిగ్గా ఈ కారణం వల్లనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ డాక్టర్ రఘురాం రాజన్ సాంప్రదాయ విరుద్ధమైన విత్త విధానాలను విస్తరిస్తూ పోవడాన్ని ప్రశ్నించారు; గత సంవత్సరం ఒక బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ ఆయన అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్ధలు, ఇతర దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న సంగతిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ “విత్త సడలింపు కార్యక్రమాలను” ప్రకటించడాన్ని గట్టిగా ఆక్షేపించారు. ఇ.సి.బి ఉద్దీపన ప్రభావాన్ని స్విట్జర్లాండ్, డెన్మార్క్ దేశాలు ఇప్పటికే ఎదుర్కొన్నాయి; యూరోతో తమ కరెన్సీ ఫ్రాంక్ కి ఉన్న లంకెను గత వారం తెంచివేయక స్విట్జర్లాండ్ కు తప్పలేదు; దరిమిలా ఫ్రాంక్ విలువ రాత్రికి రాత్రే అమాంతం పెరిగిపోయింది. యూరోతో ఉన్న లంకెను స్ధిరంగా కొనసాగించేందుకు వీలుగా డెన్మార్క్ తన కరెన్సీ విలువలో కోత పెట్టవలసి వచ్చింది. యూరోపియన్ యూనియన్, ఇండియాకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. కనుక యూరో విలువలో ఏ మాత్రం తరుగు సంభవించిన అది భారత ఎగుమతిదారులను (ప్రతికూలంగా) ప్రభావితం చేస్తుంది. అలాగే పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా ఇండియాకు ప్రవహించి ఆస్తుల ధరలను పైకి నెట్టే అవకాశమూ లేకపోలేదు. కనుక మరోసారి అస్ధిరత పరిస్ధితులను ఎదుర్కోవడానికి సిద్ధపడవలసిన అగత్యం వచ్చిపడింది.
*********
[క్వాంటిటేటివ్ ఈజింగ్ -QE- అంటే ఏదో ఒక రూపంలో ఆర్ధిక వ్యవస్ధలోకి డబ్బు కుమ్మరించడం. అమెరికా సెంట్రల్ బ్యాంకు అయిన ఫెడరల్ రిజర్వ్ ఇటీవలి వరకు తమ ట్రెజరీలు జారీ చేసే సార్వభౌమ ఋణ పత్రాలను తానే కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్ లోకి డబ్బు కుమ్మరించింది. ఈ డబ్బు ప్రపంచవ్యాపితంగా వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్ల లోకి ప్రవహించి స్టాక్ ల ధరలను ఆకాశంలో విహరింపజేసింది. ఈ ఉద్దీపనను ఉపసంహరించుకోవడం మొదలు పెట్టగానే వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లే కాకుండా ఆర్ధిక వ్యవస్ధలు సైతం సంక్షోభ పరిస్ధితులను ఎదుర్కొన్నాయి.
ఇప్పుడు ఇదే తరహాలో యూరోపియన్ యూనియన్ లో యూరో కరెన్సీని కలిగి ఉన్న దేశాల ట్రెజరీలు జారీ చేసే సార్వభౌమ ఋణ పత్రాలను ఏకంగా 1.1 ట్రిలియన్ యూరోల మేరకు కొనుగోలు చేసేందుకు ఇ.సి.బి నిర్ణయించింది. సాధారణంగా ఒక దేశ ట్రెజరీ జారీ చేసే సావరిన్ బాండ్లను ఆ దేశ ప్రభుత్వ విభాగాలు కాకుండా ఇతరులు కొనుగోలు చేయాలి. అదే నిజమైన అప్పు. కానీ బాండ్లకు గిరాకీ లేనట్లయితే? ఋణ లభ్యత పడిపోతుంది. పెట్టుబడులు అందుబాటులో లేక దేశంలో ఆర్ధిక కార్యకలాపాలు మందగిస్తాయి. మొత్తంగా బిజినెస్ కాన్ఫిడెన్స్ దెబ్బ తింటుంది. ద్రవ్య చెలామణి తగ్గిపోయి ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.
యూరో జోన్ దేశాలు సరిగ్గా ఈ పరిస్ధితినే ఎదుర్కొంటున్నాయి. పొదుపు విధానాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి సరుకులు అమ్మకం కాక జి.డి.పి పడిపోతోంది. ఈ పరిస్ధితుల్లో ఆర్ధిక వ్యవస్ధలో కృత్రిమంగా ఊపు తేవడానికి QE లాంటి ఆర్ధిక ఉద్దీపనలను పెట్టుబడిదారీ దేశాలు ప్రకటిస్తున్నాయి. కానీ ఎన్ని సిద్ధాంతాలు వల్లించినా, ఆర్ధిక వ్యవస్ధలో నిజమైన ఊపు తేవడానికి ప్రజల కొనుగోలు శక్తి పెంచడం వినా మరో మార్గం లేదు. ఇందుకు జనానికి ఉద్యోగాలు ఇవ్వాలి; వేతనాలు పెంచాలి; కార్మికులకు, ఉద్యోగులకు సదుపాయాలు పెంచాలి; సబ్సిడీలు ఇవ్వాలి; ఇస్తున్న సబ్సిడీలను పెంచాలి; ఆర్ధిక వ్యవస్ధలో ప్రభుత్వ పాత్ర పెరగాలి. కానీ ఈ చర్యలకు బహుళజాతి కంపెనీలు ససేమిరా ఒప్పుకోవు. ఫలితంగా ఉద్దీపనల్లాంటి కృత్రిమ చర్యలకే పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద ప్రభుత్వాలు పరిమితం అవుతున్నాయి.
ఇది ఆ దేశాలు, ఉనికిలో ఉన్నట్లు అంగీకరించని సామ్రాజ్యవాద సంక్షోభం. పెట్టుబడిదారీ ఆర్ధిక వేత్తలకు ఎప్పటికీ కొరుకుడు పడని సహజ పెట్టుబడిదారీ సంక్షోభం. ఈ సంక్షోభాల నుండి బైటపడేందుకు అభివృద్ధి చెందిన దేశాలు ఇతర దేశాల ఆర్ధిక వ్యవస్ధలు ఇంకా ఇంకా తమకు పాదాక్రాంతం కావాలని కోరుకుంటాయి; డిమాండ్ చేస్తాయి. మార్కెట్ల కోసం తమలో తాము పోటీ పడతాయి. ఆ క్రమంలో మార్కెట్ల పునర్విభజనకు పూనుకుంటాయి. కార్మికవర్గ ప్రజలపై దోపిడీని ఇంకా తీవ్రం చేస్తాయి. యుద్ధాలను ప్రేరేపిస్తాయి. దోపిడీకి ప్రతిఘటన లేకుండా చేయడానికి కఠిన చట్టాలు చేసుకుంటాయి. ప్రభుత్వాన్ని మరింతగా మిలట్రీకరణ కావిస్తాయి.
ఇతర దేశాలలో జోక్యం తీవ్రం చేస్తాయి. ఇతర దేశాల విధానాలను నిర్దేశిస్తాయి. దానిని వ్యతిరేకిస్తే కక్ష గడతాయి. సిరియా, లిబియాలకు మల్లె ప్రభుత్వాలను కూలదోస్తాయి. ఇరాన్, రష్యా లకు మల్లె అంతర్గతంగా సంక్షోభం సృష్టించేందుకు కుట్రలు చేస్తాయి. చైనాకు మల్లె ఆర్ధికంగా గట్టి పోటీ ఇస్తే సైనికంగా చుట్టుముట్టి బ్లాక్ మెయిల్ చేస్తాయి. అంతర్జాతీయంగా ఒత్తిడిలు తెస్తాయి. సైనిక చర్యకు దిగుతామని బెదిరిస్తాయి. అక్కడి సమాజాల్లో లుకలుకలు సృష్టించి అల్లకల్లోలం చేస్తాయి. ఇవన్నీ వివిధ దేశాలలో ఆయా పరిస్ధితులకు అనుగుణంగా ప్రస్తుతం అమలులో ఉన్న చర్యలే. ఇలాంటి గూండా రాజ్యాలలో అగ్ర గూండా అయిన అమెరికా అధిపతిని మన అతిధిగా పిలుచుకుని మురిసిపోయే పరిస్ధితిలోనే మన పాలకులు ఉండడం కంటే మించిన విషాధం మనకేముంటుంది? విశేఖర్]
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…