(జనవరి 24 తేదీన ప్రచురించబడిన ‘Another Ebola battle won’ కు యధాతధ అనువాదం. -విశేఖర్)
*********
జనవరి 18 తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్ధ, మాలి ప్రభుత్వంలు మాలిని ఎబోలా వైరస్ నుండి విముక్తి అయిన దేశంగా ప్రకటించాయి. ఈ ప్రాణాంతక వ్యాధి నుండి విముక్తి అయిన దేశాలలో నైజీరియా, సెనెగల్ ల తర్వాత మాలి మూడవది. ఎబోలా వైరస్ నుండి విముక్తి అయినట్లుగా ఒక దేశాన్ని ప్రకటించాలంటే వరుసగా 42 రోజుల పాటు అక్కడ కొత్త ఎబోలా కేసు నమోదు కాకూడదు. ఒక్కొక్క ఎబోలా వరుసగా రెండుసార్లు పొదుగడానికి 42 రోజులు పట్టడం దీనికి కారణం. గినియాతో 800 కిలో మీటర్ల రక్షణ రహిత సరిహద్దు కలిగి ఉన్న మాలి ఈ ఫీట్ సాధించడం గణనీయమైన సంగతి. డిసెంబర్ 26, 2013 తేదీన నమోదై కనీ వినీ ఎరుగని రీతిలో పశ్చిమ ఆఫ్రికా అంతటా వ్యాపించిన మొట్ట మొదటి ఎబోలా కేసు నమోదైంది గినియాలోని ఒక మారుమూల గ్రామంలోనే మరి! అంతేకాక, రెండు సంవత్సరాల పాప ఎబోలా లక్షణాలతో గత సంవత్సరం అక్టోబర్ నెలలో మాలి దేశానికి వచ్చింది కూడా గినియా నుండే. సదరు బాలిక ద్వారా ఎబోలా బారిన పడ్డ 6వ పశ్చిమాఫ్రికా దేశంగా మాలి రికార్డులకు ఎక్కింది.
ఇలాంటి విజయ సమయంలో కూడా తాను ఒక యుద్ధాన్ని మాత్రమే జయించానన్న సంగతిని మాలి గుర్తుంచుకోవాలి. పశ్చిమ ఆఫ్రికాలో మొత్తంగా ఎబోలాపై యుద్ధం ముగియనంతవరకు, కొత్త కేసులు తలెత్తే అవకాశం ఎప్పుడూ పొంచి ఉన్నందున, తన కాపలాను మాలి విరమించుకోరాదు. నిజానికి మాలి నవంబర్ 2014 లోనే ఎబోలా నుండి విముక్తి అయిన దేశంగా ప్రకటించుకోగల పరిస్ధితిని సమీపించింది. ఇంతలోనే మరోసారి వ్యాధి విజృంభించి ఆ ప్రకటనను ఆలస్యం చేసింది. అత్యంత తీవ్ర స్ధాయిలో ఎబోలా వ్యాధికి గురయిన మూడు దేశాలకు -లైబీరియా, సియర్రా లియోన్, గినియా- సంబంధించి ఇటీవల వారాల్లో కొత్తగా నమోదవుతున్న కేసులు తగ్గుతున్నట్లు వార్తలు రావడం ఎబోలా సంక్షోభంలో ఒక మలుపుగా చెప్పుకోదగిన శుభపరిణామం. ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకారం జనవరి 21, 2015 నాటికి ఎబోలా వల్ల చనిపోయినవారి మొత్తం సంఖ్య 8,683 కాగా ఇప్పటివరకు నమోదయిన మొత్తం కేసులు 21,759.
- Nov. 14, 2014, a health A health worker sprays disinfectant near a mosque, Mali
- Ebola virus
- Mali
మొత్తం మీద మాలిలో 8 ఎబోలా కేసులు నమోదు కాగా 6గురు చనిపోయారు. నైజీరియాతో పోలిస్తే, 20 కేసులు నమోదై 8 మంది చనిపోయిన నైజీరియాతో పోల్చితే మాలి కాస్త నయం. మాలి విజయానికి కారణం వ్యాధి వెల్లడి అయిన మరుక్షణం నుండి దానిని అరికట్టడానికి కనీవినీ ఎరుగని రీతిలో తీసుకున్న చర్యలు. వ్యాధికి గురయిన పాప గినియా నుండి చేసిన ప్రయాణంలో, పాపతో సంబంధంలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ వెతికి పట్టుకోవడంతో మొదలు పెట్టి, ఒక దశలో ఏకంగా 600 మంది అనుమానితులను నిరంతర పరిశీలనలో ఉంచి, ప్రభుత్వము, ఆరోగ్య కార్యకర్తలు, ప్రజలు… అందరూ వ్యాధి, సంక్షోభంగా ముదరకముందే నిర్మూలించడానికి దూకుడుగా వ్యవహరించి కృషి చేశారు. ప్రజలకు అవగాహన కలిగించెందుకు పెద్ద ఎత్తున చెప్పట్టిన ప్రచార కార్యక్రమం, సరిహద్దుల వద్ద పర్యవేక్షణ, పూర్తి స్ధాయిలో సన్నద్ధం అయిన ప్రజారోగ్య వ్యవస్ధ, తాము స్వయంగా ముందు జాగ్రత్తలు తీసుకున్న ప్రజలు… ఇవన్నీ మాలిలో వైరస్ ను నిర్మూలించడానికి దోహదం చేశాయి.
వ్యాధి తీవ్రంగా ఉన్న మూడు దేశాలలోను తమ మధ్య విస్తరిస్తున్న ఎబోలా సంక్షోభం పట్ల అవగాహన నాసిరకంగా ఉండడం గమనార్హం. ఎబోలా విజృంభణ పట్ల నైజీరియా, మాలి దేశాలు వ్యవహరించిన తీరు నుండి నేర్చుకోవలసిన పాఠాలు ఇండియాకూ ఈ క్రమంలో ఉన్నాయి. కొన్ని కీలకమైన చర్యలు తీసుకున్నప్పటికీ ప్రధాన విమానాశ్రయాల వద్ద వ్యాధిని నిర్ధారించగల పరీక్షా కేంద్రాలు, వ్యాధి పీడితులను రక్షణ బంధంలో ఉంచగల కేంద్రాలు అతి తక్కువ సంఖ్యలో ఉండడం.. వైరస్ ను ప్రతిఘటించేందుకు తక్కువ స్ధాయిలోనే సంసిద్ధం అయి ఉన్నామని తెలియజేస్తోంది.