అమెరికా పౌరహక్కుల ‘రారాజు’ జనించి 86 యేళ్ళు! -ఫోటోలు


జాత్యహంకారానికి గురవుతున్న నల్లజాతి ప్రజలతో పాటు పెట్టుబడిదారీ పదఘట్టనల క్రింద నలుగుతున్న తెల్లజాతి కార్మికవర్గ హక్కుల కోసం, ఉద్యోగాల కోసం, గౌరవప్రదమైన జీవనం కోసం ఉద్యమించిన పౌరహక్కుల ఉద్యమ తరంగం మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్! ఆయన జన్మించి జనవరి 15తో 86 సం.లు నిండాయి. వాషింగ్టన్ డి.సి లింకన్ హాలు ముందు మెట్లపై నిలబడి ఆయన చేసినచరిత్రాత్మక ‘ఐ హేవ్ ఎ డ్రీమ్’ ప్రసంగం ఇప్పటికీ అత్యంత ఉత్తేజకరమైన ప్రసంగాలలో ఉన్నతమైనదిగా కొనియాబడుతోంది.

ఆధిపత్య వర్గాల కుట్ర మూలాన పౌర హక్కులు ఇప్పుడు మానవ హక్కులుగా రూపాంతరం చెందాయి. పౌర హక్కుల కంటే మానవ హక్కులు గొప్పవని అరకొర మేధో పుంగవులు భావిస్తుంటారు. వారిని అలా భావింపజేయడంలో ఆధిపత్య పాలకవర్గాలు సఫలం అయ్యారు మరి!

*********

పౌర హక్కులకు, మానవ హక్కులకు ఏమిటి తేడా?

పౌరులు అంటే ఒక రాజ్యం పాలనలో ఉన్న దేశంలోని పౌరులు అని అర్ధం. ఇది రాజకీయ పదజాలంలో భాగం. కనుక ఆర్ధిక హక్కులు కూడా ‘పౌర హక్కుల’ భావనలో ఇమిడి ఉంటాయి. ‘మానవ హక్కులు’  అన్నది సాధారణ పదబంధం. మనిషి అనడంలో పాలకులకు, పాలితుడికి తేడా వ్యక్తం కాదు. ప్రతి మనిషికి మానవ హక్కులు ఉండాలి అన్న అవగాహన ఇందులో ఇమిడి ఉంటుంది.

ఒక దేశ పౌరులు ఆ దేశాన్ని అదుపులోపెట్టుకున్న రాజ్యం (state) చేతా, రాజ్యానికి చెందిన వివిధ అంగాలచేత పాలించబడుతారన్నది తెలిసిన విషయమే. పౌర హక్కుల అవగాహన ఈ సత్యాన్ని ప్రధానమైనదిగా గుర్తిస్తుంది. చట్ట సభలు, బ్యూరోక్రసీ, కోర్టులు, సైన్యం, పోలీసులు ఈ అంగాలన్నీ కలిస్తే రాజ్యాంగ యంత్రం. ఈ యంత్రం రాజ్యాన్ని పాలిస్తుంది. మరి రాజ్యాంగ యంత్రం ఎవరికోసం పని చేస్తుంది? మామూలుగా అయితే ప్రజల కోసం పని చేస్తుంది అని చెబుతారు. కానీ వాస్తవంలో రాజ్యాంగ యంత్రం తాము ఎవరి ఆధీనంలో ఉంటే వారి ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తుంది.

అనగా, ఉదాహరణకి మన పార్లమెంటులో లేదా చట్ట సభల సభ్యులుగా ఎవరు కూర్చొని ఉంటారు? ఎవరైతే కోట్లాది రూపాయలు వెచ్చించి ఓట్లను కొనుగోలు చేసి, మద్యం తాగబోయించ గలుగుతారో వారే కూర్చోగలరు. వీరంతా భూస్వాములు, పెట్టుబడిదారులు, ధనిక గూండాలు, ఫ్యాక్షనిస్టులు తదితర ఆధిపత్య వర్గాలకు, తరగతులకు చెంది ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. (అప్పుడప్పుడూ కేజ్రీవాల్ లాగా కాస్త నిజాయితీగా పనిచేసేవారు రాజకీయాల్లోకి వచ్చి అధికారం చేపడితే అలాంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంగ్రెస్, బి.జె.పి లు ఏరకంగా ఏకం అయ్యాయో మనం చూశాం.)

బ్యూరోక్రసీ విషయానికి వస్తే ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఎఫ్.ఎస్, గ్రూప్-1 తదితర ఉద్యోగులు బ్యూరోక్రసీలో ప్రధాన అధికారవర్గం. వీరు ప్రజలకు కాకుండా తమపై పెత్తనం చేసే రాజకీయ నాయకులకు సేవలు చేస్తారు. తద్వారా కోట్లాది రూపాయలు లంచాలుగా మేసి సరికొత్త నిరంకుశ దోపిడీదారులుగా అవతరిస్తారు. వారికి ప్రభుత్వంలోని రూల్స్ తప్ప మరొకటి పట్టదు. సామాజిక జ్ఞానం బొత్తిగా ఉండదు లేదా పట్టించుకోరు. అందువలన వీరు నిరంకుశంగా వ్యవహరిస్తుంటారు. వీరందరూ ధనికులే. ఒకవేళ పేదలు పరీక్షలు రాశి ఈ పొజిషన్ లోకి వస్తే అచిరకాలంలోనే ధనికులై పై వర్గంలోకి చేరిపోతారు. అలా చేరిపోవడానికి రహదారులను వ్యవస్ధ ఏర్పరిచి ఉంటుంది. వెళ్తే ఆ రహదారిపై వెళ్ళాలి. లేదా ఖేమ్కా తరహాలో సం.కి ఒక ట్రాన్స్ఫర్ ఎదుర్కొంటూ ఎలాంటి ప్రాధాన్యం లేని పోస్టుల్లో తీసుకుంటూ ఉండాలి.

భూస్వాములకి, పెట్టుబడిదారులకి, బ్యూరోక్రాట్లకి ప్రైవేటుగా సేవలు చేసే సైన్యం ఉంటుంది. గూండాలు, ఫ్యాక్షనిస్టులు, దాదాలు, ప్రైవేటు సెక్యూరిటీ తదితర రూపాల్లో వారు ఉంటారు. వారు అవడానికి ప్రాధమికంగా పేదలే అయినా సంఘ వ్యతిరేక శక్తులుగా పని చేస్తారు.

వీరందరూ కలిసి మన దేశాన్ని వివిధ స్ధాయిల్లో పాలిస్తున్నారు. వీరంతా కలిసినదే రాజ్యం. ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా వీరిలోనే ఒకరి తర్వాత ఒకరు అధికారం నిర్వహిస్తూ తమ ప్రయోజనాలను ఉమ్మడిగా కాపాడుకుంటారు.

రాజ్యం ఎవరు ప్రజలు ఎవరు అన్న తేడా ఇప్పుడు స్పష్టం అయింది.

ఈ అవగాహన ప్రకారం ఎవరు పౌరులు, ఎవరు మనుషులు? పౌరులు అంటే రాజ్యంలోని వివిధ అంగాలలోని ఆధిపత్య స్ధానాలలో ఉన్నవారు కాకుండా మిగిలినవారు. మనుషులు అంటే ఈ తేడా ఉండదు. మంత్రులు, గూండాలు, దాదాలు, అధికారులు అందరూ మనుషులే. కనుక వారందరికీ మానవ హక్కులు ఉంటాయి. అవి కాపాడబడాలి అని భావిస్తారు.

కానీ వాస్తవంలో ఆధిపత్య వర్గాలు మానవ హక్కులు లేకుండా ఏమీ ఉండరు. అసలు హక్కులు అన్నీ చెలాయిస్తూ ప్రజల హక్కులను నియంత్రించేది వారే. అలాంటి వారు కూడా తమకూ మానవహక్కులు ఉన్నాయని చెప్పడం ప్రారంభిస్తే పాలిత ప్రజలు తమను పాలించే ఆధిపత్య వర్గాలపై ఫిర్యాదులను ఎవరికి చెప్పుకోవాలి?

రాజ్యం ప్రతి పౌరుడికి కొన్ని హక్కులను గ్యారంటీ చేస్తుంది. వాటిని రాజ్యాంగంలో పొందుపరుస్తుంది. ఆ హక్కులను ప్రజలకు ఇవ్వడం దాని బాధ్యత. ఇవే పౌర హక్కులు. మరి మానవ హక్కులు ఎక్కడ లిఖించబడి ఉంటాయి? ఎక్కడా ఉండవు.

మానవ హక్కులు అన్న అవగాహనే ఒక మ్యుటేషన్ లాంటిది. సహజంగా రాజ్యం-పౌరులు అనే పరిణామ క్రమంలో ఉద్భవించినది కాదు. అది కేవలం చొప్పించినది మాత్రమే. పాలకులు తమ అణచివేతను సజావుగా కొనసాగించకుండా పౌరులు తమ హక్కులకోసం ఉద్యమిస్తున్నారు. వారి ఉద్యమానికి చట్టబద్ధమైన ప్రాతిపదిక ఉన్నది. రాజ్యాంగంలో గ్యారంటీ చేసిన పౌర హక్కులను పౌరులకు కల్పించవలసిన బాధ్యత రాజ్యాంపై ఉండడమే ఆ ప్రాతిపదిక.

ఈ ప్రాతిపదికను అపభ్రంశం కావించి పౌర హక్కుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించడం పాలకుల అవసరం. అందుకోసం ఎలాంటి చట్టబద్ధ ప్రాతిపదిక లేని మానవ హక్కుల ప్రాతిపదికను ప్రజల అవగాహనలోకి పాలకులు చెప్పించారు. ఈ విధంగా ప్రజలు/పాలితులు తమకు తెలియకుండానే తమ హక్కులకు వ్యతిరేకంగా అవగాహనను కలిగి ఉండేలా పాలకులకు అవకాశం ఇస్తున్నారు. హక్కుల భావజాలాన్ని ప్రేరేపించి మార్చివేసేలా పాలకులకు అనుమతి ఇచ్చేశారు.

మానవ హక్కుల ఉద్యమం ఇటీవల పుట్టిన పిలక. దశాబ్దాల తరబడిన పౌరహక్కుల ఉద్యమాలతో వేగిపోయిన పాలకవర్గాలు తాత్విక స్ధాయిలో కృషి చేసి కనిపెట్టిన ఉద్యమం మానవహక్కుల ఉద్యమం. ఇది మోసపూరితమైనది. పౌర హక్కుల స్ధానంలో మానవ హక్కులను చొప్పించడం ద్వారా భారీ ప్రోత్సాహకాన్ని పాలకులు పోందగలిగారు. ఇప్పుడు పౌర హక్కుల సంస్ధలకు బదులుగా మానవ హక్కుల సంస్ధలకే ఎక్కువ ఆడియెన్స్ ఉన్నారు. చివరికి దేశంలోనే శక్తివంతమైన పౌరహక్కుల సంస్ధగా పేరొందిన ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంఘాన్ని, అదే సంస్ధలోని యోధాన యోధుడైన బాలగోపాల్ గారే చీల్చి మానవ హక్కుల సంఘాన్ని నిర్మించేలా పాలకులు కృతకృత్యం కాగలిగారు.

*********

మార్టిన్ లూధర్ కింగ్ తన పౌర హక్కుల ఉద్యమాన్ని పాలకవర్గ ప్రయోజనాలకు బలిపెట్టారా లేదా అన్న విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఆయన చివరికి ఆ ఉద్యమం కారణం గానే ఆయన హత్యకు గురయ్యాడు. ఒక తెల్లజాతి దురహంకారి చేతిలో ఏప్రిల్ 4, 1968 తేదీన ఆయన హత్యకు గురయ్యారు. కేవలం 39 యేళ్ళ పిన్న వయసులోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాలనీల్లో, బస్సుల్లో, రోడ్లపై, పాఠశాలల్లో నల్ల, తెల్ల జాతి విభజన పాటించడం రద్దు చేయాలని భారీ ఉద్యమం చేపట్టడం, అది విజయవంతమై చట్టరూపం ధరించడంతో తెల్లజాతి దురహంకారులు కక్షగట్టి చంపేశారు.

మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ (సీనియర్ ఆయన తండ్రి. మైఖేల్ కింగ్ అని తన కొడుక్కి సీనియర్ పేరు పెట్టారు. అనంతరం జర్మన్ సంస్కరణవాది మార్టిన్ లూధర్ కి గుర్తుగా ఆ పేరును మైఖేల్ మార్టిన్ లూధర్ కింగ్ గా మార్చారు.) శాంతియుతంగా, హింసారహితంగా తెల్ల-నల్ల తేడాను రూపు మాపేందుకు కృషి చేశారని చెబుతూ నోబెల్ శాంతి బహుమతిని 1964లో బహూకరించారు. తద్వారా ఆయన్ని తమలో కలుపుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అమెరికా రాజ్యానికి మార్టిన్ లూధర్ కింగ్ లొంగలేదు. వియత్నాం దురాక్రమణ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రసంగాలు ఇచ్చి అనేకమంది పాలకవర్గ మిత్రులను ఆయన కోల్పోయారు.

1968లో పూర్ పీపుల్స్ కాంపెయిన్ పేరుతో దేశవ్యాపిత ఉద్యమానికి మార్టిన్ శ్రీకారం చుట్టారు. 1964లో మొదటిసారి “మార్చ్ ఆన్ వాషింగ్టన్ డి.సి” పేరుతో ఆయన సాగించిన ఉద్యమం లక్షల మందిని సమీకరించింది. లింకన్ మెమోరియల్ హాల్ వద్ద ‘ఐ హేవ్ ఎ డ్రీమ్’ ప్రసంగం చేసింది అప్పుడే. మళ్ళీ అదే తరహా ఉద్యమాన్ని దేశవ్యాపితంగా ఆయన తలపెట్టడంతో అమెరికా పాలకులు గంగవెర్రులెత్తారు. ప్రభుత్వ ఏజన్సీలే ప్రైవేటు హంతకుడిని నియమించి హత్య చేయించాయి. హత్య తెల్లజాతి దురహంకారులే చేయించారని అందరూ భావించారు. అది నిజం కూడా. కానీ అది పాక్షిక నిజం. అసలు నిజం ఏమిటంటే మార్టిన్ లూధర్ కింగ్ ఉద్యమం వర్గ ఉద్యమంగా మార్పు చెందుతున్న క్రమంలో పాలకవర్గాలు తెల్లజాతి దురహంకార శక్తులతో కుమ్మక్కై కింగ్ ను హత్య చేయించారు.

కింగ్ ను చంపిన వ్యక్తిని పట్టుకుని జైలు శిక్ష విధించినప్పటికీ ఆయన మృతిపై అనుమానాలు అంతకంతకూ పెరుగుతూ పోయాయి. చివరికి వివిధ ప్రజా సంస్ధల ఒత్తిడివల్ల పునర్విచారణ చేయవలసి వచ్చింది. ప్రభుత్వ భద్రతా సంస్ధలే ఈ హత్య వెనుక ప్రధాన పాత్ర పోషించాయని పునర్విచారణలో తేలింది. కానీ కుట్ర చేసిన నిందితులను మాత్రం గుర్తించకుండా దాటవేశారు.

ఈ క్రింది ఫోటోలు మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ ఉద్యమ జీవితంలోని ప్రధాన ఘట్టాలకు సంబంధించినవి. ఆయన జన్మదిన వార్షికం సందర్భంగా అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.

One thought on “అమెరికా పౌరహక్కుల ‘రారాజు’ జనించి 86 యేళ్ళు! -ఫోటోలు

  1. సర్,మీ నుండి వచ్చిన మరో ఉపయుక్తమైన వ్యాసం! సాధారణ మానవుడికీ,మిగతా వారికీ చూపించిన తేడా ఆలోచింపజేసేవిధంగా ఉన్నది.నేనూ ఒక ప్రభత్వ ఉద్యోగినే,నా పనిని నా సర్వీస్ రూల్స్ ప్రకారం చేయకపోతే నా పై అధికారికి ఏమని సమాధానం చెపుతాను(నిజానికి నా కా సంధర్భం ఎప్పుడూ ఎదురుకాలేదు)? నన్ను నేను ఏవిధంగా సమర్ధించుకొంటాను?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s