అమెరికా అధ్యక్షుడి ఆగ్రా పర్యటన రద్దయిందని భారత అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు తన భార్య మిచెల్లే ఒబామాతో కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ సందర్శిస్తారని ఇప్పటివరకు ఇరు దేశాలు విడుదల చేసిన షెడ్యూళ్ళు చెబుతూ వచ్చాయి. కానీ ఆగ్రా పర్యటన సందర్భంగా ఒబామా భద్రత కోసం తీసుకోవలసిన చర్యల విషయమై భారత భద్రతా బలగాలకు, అమెరికా భద్రతా బలగాలకు స్వల్ప విభేదాలు తలెత్తడంతో ఒబామా తన ఆగ్రా పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
జనవరి 24వ తేదీ సాయంత్రం అమెరికాలో బయలుదేరే ఒబామా జనవరి 25, ఆదివారం ఉదయానికల్లా ఇండియా చేరుకుంటారు. జనవరి 25, 26 తేదీల్లో న్యూ ఢిల్లీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఒబామా జనవరి 27 తేదీన తాజ్ మహల్ సందర్శన తలపెట్టారు. ఆగ్రా పర్యటన రద్దు కావడంతో ఒబామా ఆగ్రా బదులు సౌదీ అరేబియా వెళ్లనున్నారు. సౌదీ రాజు మృతి చెందడం, కొత్త రాజు అధికారం చేపట్టడం నేపధ్యంలో ఒబామా సౌదీ అరేబియా వెళ్లడానికి నిశ్చయించుకున్నారని తెలుస్తోంది.
ఒబామా ఆగ్రా పర్యటన కోసం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లలో మునిగిపోయి ఉంది. పెద్ద సంఖ్యలో రాష్ట్ర అధికారులను, పోలీసు అధికారులను ఆగ్రాకు పంపి వివిధ రక్షణ, సందర్శన ఏర్పాట్లు చేస్తోంది. కానీ ఆయన ఆగ్రా రావడం లేదని తెలియడంతో రాష్ట్ర అధికారులు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారని పత్రికలు తెలిపాయి. భద్రతా ఏర్పాట్ల విషయంలో స్వల్ప విభేదాలు ఏర్పడిన మాట నిజమే అయినా ఏకంగా పర్యటనే రద్దవుతుందని తాము ఊహించలేదని వారు ఆశ్చర్యం వెలిబుచ్చారు.
“బారక్ ఒబామా తాజ్ సందర్శన సందర్భంగా రూపొందించుకున్న భద్రతా ఏర్పాట్ల విషయంలో అమెరికా మరియు ఇండియాల భద్రతా సంస్ధలు ఒకే పేజీలో లేవు. నిర్దిష్ట భద్రతా ఏర్పాట్లకు సంబంధించి స్వల్ప విభేదాలు తలెత్తాయి. కానీ సందర్శన రద్దు కావడం మాకు ఆశ్చర్యం కలిగించింది” అని పేరు చెప్పేందుకు ఇష్టపడని భారత భద్రతా అధికారి ఒకరు చెప్పారని ది హిందు తెలిపింది.
ఏ విషయంలో విభేదాలు తలెత్తినది చెప్పేందుకు భారత అధికారులు నిరాకరించారు. ఆగ్రా పాలనాధికారులు సైతం ఈ విషయమై పెదవి విప్పడం లేదు. “ఆగ్రా పర్యటన రద్దయ్యే అవకాశం ఉంది” అని కేంద్ర అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. పర్యటన ఎందుకు రద్దు చేసుకున్నదీ తమకు చెప్పలేదని వారు పత్రికలకు వివరించారు.
ఒబామా సందర్శన కోసం అమెరికా, భారత్ ల భద్రతా సంస్ధలు భారీ స్ధాయిలో భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఇందుకోసం ఖర్చు చేస్తోంది. జనవరి 26, రిపబ్లిక్ దినం నాడు ముఖ్య అతిధిగా బారక్ ఒబామా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. పర్యటనలో ఆయన రిపబ్లిక్ డే వేడుకలను తిలకిస్తారు. దానికి ముందు వివిధ వాణిజ్య, అధికార సమావేశాల్లో పాల్గొంటారు. భారత రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యే మొట్ట మొదటి అమెరికా అధ్యక్షుడు ఒబామాయే అవుతారు.
ఈ రెండు రోజుల కోసం న్యూ ఢిల్లీని చీమ కూడా చొరబడని దుర్భేద్యమైన కోటగా ఇరు దేశాల అధికారులు మార్చబోతున్నారు. భారత గడ్డపై ఒబామా అడుగు పెట్టే జనవరి 25 తేదీన మొత్తం 20,000 మంది భద్రతా బలగాలను ఇండియా నియమించింది. జనవరి 26 తేదీన ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ పెరుగుతుంది. ఆ రోజు 45,000 మంది బలగాలు కాపలా కాస్తాయని అధికారులు చెప్పారు.
పర్యటన సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు నగరం అంతటా 15,000 సి.సి.టి.వి కెమెరాలను అధికారులు అమర్చారు. ఒబామా మరియు ఆయన అనుచర, సహచర గణాలు సంచరించే చోట్లలో రోడ్లపైన వీటిని కొత్తగా అమర్చారు.
ఒబామా ఆగ్రా వెళ్ళినట్లయితే న్యూ ఢిల్లీ నుండి ఆగ్రా వెళ్ళే రూట్లన్నీ దిగ్బంధనం కావించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భావించింది. తాజ్ గంజ్ ఏరియాలో మొబైల్ ఫోన్ జామర్లను ఏర్పాటు చేస్తారు. దానితో అక్కడి ప్రజలు ఎవ్వరూ మొబైల్ ఫోన్లు వినియోగించే అవకాశం ఉండదు. తాజ్ గంజ్, ఫతేబాద్ రోడ్, మెయిల్ రోడ్ లన్నీ ప్రజలకు ప్రవేశం లేకుండా చేయాలని తలపెట్టారు.
కానీ ఎన్ని ఏర్పాట్లు చేసినా, అవేవీ సరిపోవని చెబుతూ అమెరికా భద్రతా సంస్ధలు తమ స్వంత ఏర్పాట్లను చేసుకోవడం పరిపాటి. బహుశా వీటిల్లో కొన్ని భారత అధికారులకు ఆమోదయోగ్యంగా లేనందునే పర్యటన రద్దయి ఉండవచ్చని కొందరు ఊహిస్తున్నారు. కానీ పర్యటన రద్దు చేసుకునే అభ్యంతరాలను భారత అధికారులు వ్యక్తం చేశారా అన్నది అనుమానమే.
బహుశా సౌదీ రాజు హఠాన్మరణం దరిమిలా జనవరి 27 తేదీని సౌదీ పర్యటన కోసం కేటాయించాలని ఒబామా తలపోసి ఉండవచ్చు. ముందే ఖరారైన కార్యక్రమాన్ని నేరుగా రద్దు చేసుకుంటే అది భారత్ కి అవమానమే అవుతుంది. అందువల్ల నెపాన్ని భద్రతా ఏర్పాట్లపై విభేదాల మీదికి మళ్లించారా అన్నది ఆలోచించవలసిన విషయం.
అమెరికా, పాకిస్తాన్ కు ఇచ్చే ఆర్ధిక సహాయం ఆపితే ప్రపంచంలో శాంతి సుమారు 80% పెరుగుతుంది. ఒబమ గారు భద్రత కోసం అంత కంగారుపడవలసిన అవసరం ఉండదు.
అయ్యో ప్రేమసందేశంగారూ, ఎంత అమాయకులండీ మీరు! పాకిస్తాన్ కు ఇచ్చే ఆర్ధిక సహాయం ఆపితే ప్రపంచంలో శాంతి సుమారు 80% పెరుగుతుందని లెక్కవేయగలిగారు కాని ప్రపంచంలో శాంతి పెరుగుతుందనేభయంతోనే అగ్రరాజ్యంవారు పాకిస్తాన్ కు ఇచ్చే ఆర్ధిక సహాయాన్ని ఎంతమాత్రం తాత్సారం చేయకుండా ఠంచనుగా ఇస్తున్నారు. ప్రపంచం అంతా శాంతిసౌఖ్యాలతో కళకళలాడుతూ ఉంటే అగ్రరాజ్యంవారికి కర్రపెత్తనం చేసేందుకు అవకాశం ఎలా దొరుకుతుందీ? జుట్లూజుట్లూ ముడేసే కదా ఆ అగ్రరాజ్యంవారు నిత్యం పబ్బం గడుపుకునేది? ఏమాటకామాట చెప్పుకోవాలి. అగ్రరాజ్యంగా అమెరికా ఉండబట్టే ఈ పరిస్థితి అనుకోకండి, ఎప్పుడు ఏ రాజ్యం అగ్రస్థానంలో ఉన్నా ఆ రాజ్యం తన ప్రాభవం సమున్నతంగా ఉండటంకోసం ఇలాగే వ్యవహరిస్తుంది. లోకంపోకడ అంతే.
సౌదీ మీద ప్రేమ కంటే సౌదీ అమ్మే చమురు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది అమెరికాకి.