భారత దేశ ఐ.టి దిగ్గజం ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ లే-ఆఫ్ (ఉద్యోగుల తొలగింపు) ఉదంతంలో వాస్తవాలు నానాటికీ మరింతగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కంపెనీ విడుదల చేసిన మూడవ త్రైమాసిక ఫలితాలలో వాస్తవ ఉద్యోగుల తొలగింపు సంఖ్య ఎంతో కంపెనీయే స్వయంగా ప్రకటించింది. కంపెనీ అధిపతులు మొదట చెప్పినట్లుగా కేవలం 1 శాతం మాత్రమే తొలగింపులు ఉన్నాయనడం నిజం కాదని కంపెనీ ప్రకటన ద్వారా తెలుస్తోంది.
‘నాన్-పెర్ఫార్మర్స్’ పేరుతో టి.సి.ఎస్ కంపెనీ పెద్ద సంఖ్యలో తన ఉద్యోగులను తొలగింస్తోందన్న వార్త గత కొద్ది రోజులుగా పత్రికల్లో నానుతోంది. ఉద్యోగుల ప్రకటనలు, కంపెనీ ఖండన మండనలు, వివిధ పత్రికల విశ్లేషణలు, కంపెనీకి వాణిజ్య పత్రికలు ఇస్తున్న మద్దతు… వీటన్నింటితో వాతావరణం వేడెక్కిపోయింది. తొలగించబడిన ఉద్యోగులు ‘ఫెడరేషన్ ఆఫ్ ఐ.టి.ఎంప్లాయీస్’ అనే యూనియన్ కింద సంఘటితమై కోర్టులో కేసు వేసేందుకు ఉద్యుక్తులు కావడంతో పరిస్ధితి మరింత తీవ్రం అయింది.
తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఉద్యోగుల సర్దుబాటు లేదా తొలగింపు (involuntary attrition) ప్రతి ఐ.టి కంపెనీలో, ప్రతేడూ జరిగేదేనని ఈ సంవత్సరం తాము తమ మొత్తం ఉద్యోగులలో 1 శాతం మాత్రమే తొలగిస్తున్నామని టి.సి.ఎస్ కంపెనీ ప్రతినిధి ఒకరు ట్విట్టర్ పోస్ట్ లో పేర్కొన్నారు. 2014-15 మూడవ త్రైమాసికం (Q3) కోసం కంపెనీ విడుదల చేసిన ప్రకటన మేరకు టి.సి.ఎస్ లో మొత్తం (ప్రపంచ వ్యాపితంగా) ఉద్యోగుల సంఖ్య 318,625. ఈ లెక్కన తొలగింపుల సంఖ్య 3,190 వరకు ఉండవచ్చు.
కానీ కంపెనీ ప్రకటనలోని వివరాలు ఇందుకు భిన్నమైన దృశ్యాన్ని మన ముందు ఉంచుతున్నాయి. ప్రకటన ప్రకారం డిసెంబర్ 31, 2014 నాటికి మూడో త్రైమాసికంలో మొత్తం 16,561 మందిని కొత్తగా ఉద్యోగంలో పెట్టుకుంది. కానీ మూడు నెలల్లో ఎంతమందిని తొలగించింది ప్రకటన నేరుగా చెప్పలేదు. దానికి బదులుగా నికరంగా పెరిగిన ఉద్యోగుల సంఖ్య 4,868 మంది అని తెలిపింది. దీని ప్రకారం మూడు నెలల్లో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2014) తొలగించిన ఉద్యోగుల సంఖ్య 11,693 (16,561 మైనస్ 4,868).
(టి.సి.ఎస్ ప్రకటన కోసం ఇక్కడ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ ప్రకటన పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ రూపంలో ఉంటుంది. టి.సి.ఎస్ వెబ్ సైట్ నుండి ప్రకటనను డౌన్ లోడ్ చేసుకుని ఈ బ్లాగ్ కు అప్ లోడ్ చేశాను. పైన ప్రస్తావించిన అంకెల కోసం రెండవ పేజీ చివరి పేరాను చూడగలరు. )
ఈ ప్రకటన ద్వారా కంపెనీ తన లెక్కలను తానే ఖండించుకున్నట్లయింది. తొలగింపుల సంఖ్య 11,693 అంటే అది మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 3.68 శాతంతో సమానం. ఫిబ్రవరి 2015 లోపల కనీసం 10 శాతం మందిని తొలగించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని టి.సి.ఎస్ ఉద్యోగుల ఆరోపణ. అనగా ఇంకా సంవత్సరం పైనే కాలం మిగిలి ఉంది. మూడు నెలల్లో దాదాపు 12,000 మందిని తొలగించిన కంపెనీ మరో సంవత్సరంలో (నిజానికి 13 నెలల్లో) మరో 18,000 మందిని తొలగించకుండా ఉంటుందా?
కేవలం 1 శాతం మాత్రమే తొలగింపులు ఉంటాయన్న టి.సి.ఎస్ ప్రకటనను పెద్ద అబద్ధంగా ఉద్యోగులు మొదటి నుండి చెబుతున్నారు. టి.సి.ఎస్ సమర్ధకులు ఉద్యోగుల వాదనను నమ్మడానికి ఇష్టపడలేదు. కొన్ని వాణిజ్య పత్రికలైతే టి.సి.ఎస్ కంపెనీ పైన కుట్ర జరుగుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషించాయి. ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ (ఐ,.బి.టి) పత్రిక ఏకంగా విచారణ జరిపి ఈ పుకార్లు పుట్టించిన వారిపై కేసు నమోదు చేయాలని కోరింది. కానీ టి.సి.ఎస్ త్రైమాసిక నివేదిక ఈ వాదనలను పూర్వపక్షం చేసేసింది.
తొలగించబడిన ఉద్యోగుల తరపున ఆందోళన చేసేందుకు ఎఫ్.ఐ.టి.ఇ సంస్ధ ముందుకు వచ్చినప్పటికీ సంస్ధ ఇచ్చిన ఆందోళన పిలుపుల్లో పాల్గొనేందుకు ఉ(నిరు)ద్యోగులు ధైర్యం చేయలేకపోతున్నారు. ఆందోళనల్లో పాల్గొంటే తమను ఇక ఏ కంపెనీ చేరదీయదేమోనన్న భయం వారిని వెనక్కి లాగుతోంది. కానీ వారు ఆందోళనలో పాల్గొనకపోయినా తొలగించబడిన టి.సి.ఎస్ ఉద్యోగులను చేర్చుకునేందుకు ఇతర కంపెనీలు ముందుకు రావడం లేదని ఐ.బి.టి చెప్పడం గమనార్హం. వారిని నాన్-పెర్ఫార్మర్స్ పేరుతో టి.సి.ఎస్ తొలగించడమే అందుకు కారణమని పత్రిక తెలిపింది.
కనుక తాను తొలగించిన ఉద్యోగులకు టి.సి.ఎస్ కంపెనీ తీవ్ర స్ధాయిలోనే హాని చేసింది. ఉద్యోగం నుండి తొలగించడం ఒక హాని కాగా వారికి ఇక ఎక్కడా ఉద్యోగం దొరక్కుండా ‘నాన్-పెర్ఫార్మర్’ ముద్ర తగిలించడం ఇంకా తీవ్రమైన హాని. టి.సి.ఎస్ లో ఉద్యోగం దొరకడం ఇక ఎంత మాత్రం అభిలషణీయం కాదని దీనితో స్పష్టం అవుతోంది. వాడుకున్నన్నాళ్లు వాడుకుని తన ఖర్చులు తగ్గించుకోవడానికి గోంగూరలో పురుగు లెక్కన తీసిపారేయడమే కాకుండా అవాంఛనీయ ముద్ర వేయడం టి.సి.ఎస్ కంపెనీకి తగని పని. ఇలాంటి దగుల్బాజీ కంపెనీకి మద్దతు పలకడం ఇంకా తగని పని.
One thought on “2014-15 Q3 లో టి.సి.ఎస్ తొలగింపులు 11,693”