[22/01/2015 తేదీ నాటి ది హిందూ సంపాదకీయం ‘The President’s counsel’ కు యధాతధ అనువాదం.]
ఆర్డినెన్స్ ల జారీ మార్గంలో చట్టాలను చేయగల విశేషాధికారాలకు ఉన్న రాజ్యాంగ పరిమితులను గుర్తు చేయడం ద్వారా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పదే పదే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వ ప్రవృత్తికి అడ్డుకట్ట వేయగలరని ఆశించబడుతోంది. ఇటీవలి వారాలలో ప్రభుత్వ సలహా మేరకు వరసబెట్టి ఆర్డినెన్స్ లపై సంతకాలు చేసిన రాష్ట్రపతి ముఖర్జీ -ఆ క్రమంలో ఆర్డినెన్స్ తేవలసిన అత్యవసరం ఎందుకు వచ్చిందో వివరణ ఇవ్వాలని ఒకటి రెండు సార్లు ఆయన ఆరా తీశారని కూడా సమాచారం- ఆర్డినెన్స్ మార్గానికి ఉన్న పరిమితుల గురించి ప్రభుత్వానికి సందేశం పంపవలసిన నైతిక మరియు రాజ్యాంగబద్ధ అధికారాన్ని కలిగి ఉన్నారు. “తప్పనిసరి పరిస్ధితులలో తలెత్తే నిర్దిష్ట అత్యావశ్యకతలను సంతృప్తి పరిచేందుకు మాత్రమే” ఆర్డినెన్స్ లు జారీ చేయాల్సి ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. తద్వారా అటువంటి అధికారాన్ని ఉపయోగించుకోగల న్యాయ సంబంధిత సందర్భాన్ని ఆయన నెలకొల్పారు.
అదే సమయంలో (సభా నిర్వహణకు) ఆటంకం కలిగించడం ద్వారా పార్లమెంటరీ జోక్యాన్ని నెరవేర్చుకోవచ్చన్న ధోరణికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఇష్టపూర్వకంగా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం ద్వారా పార్లమెంటులో ఒక హామీ లేదా ఒక రాయితీ పొందడం కూడా పార్లమెంటరీ విధులను చట్టబద్ధంగా నిర్వహించడంలో భాగమేనన్న ప్రతిపక్షాల సాంప్రదాయక జ్ఞానాన్ని సైతం ఆయన సూక్ష్మంగా ప్రశ్నించారు. ఆచరణలో ఈ రెండూ ఒకదానికొకటి చిక్కని చిక్కులతో ముడిపడి ఉంటాయి. తరచుగా అది ట్రెజరీ బెంచిల (స్పీకర్ కు కుడివైపున కేబినెట్ మంత్రులు కూర్చుని ఉండే బెంచీలు) మొండి వైఖరి, ప్రతిపక్షాల ఆటంకపూరిత ఎత్తుగడల మిశ్రమంగా ఉంటూ చట్టసభల ప్రతిష్టంభనకు, చివరికి ఆర్డినెన్స్ లు జారీ చేసేందుకు దారి తీస్తోంది. రాష్ట్రపతి అధికారం ద్వారా చట్టాలు చేసే అవకాశం అందుబాటులో ఉండడంతో ప్రభుత్వాలు ప్రతిపక్షంతో నిర్మాణాత్మక చర్చలను ఎగవేయడానికి అంతకంతకూ ఎక్కువగా ఆతృతపడుతున్నాయి.
ఇటువంటి ధోరణికి పురికొల్పే మరొక అంశం ఏమిటంటే ఎగువ సభలో మెజారిటీ లేని బలహీనతను, నిర్దిష్ట పరిస్ధితుల్లో, ఉభయ సభల సంయుక్త నిర్వహణ ద్వారా అధిగమించవచ్చన్న స్వయం సంతుష్ట నమ్మకం కలిగి ఉండడం. వెస్ట్ మినిస్టర్ (బ్రిటన్) – నమూనా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కేబినెట్ నిర్ణయాల వెనుక ఉన్న హేతుబద్ధతను ప్రశ్నించడానికి బదులు, మౌనంగా ప్రభుత్వ సలహాలకు ఆమోదం తెలిపేందుకె అధ్యక్షులు/రాష్ట్రపతి మొగ్గు చూపవచ్చు. అయితే కొన్నిసార్లు, విస్తృతమైన రాజ్యాంగ పరిధి ఇమిడి ఉన్న అంశాల విషయంలో తమ మనసులో మాటను వెల్లడించడం ద్వారా తమ ఆందోళనను వ్యక్తం చేయవచ్చు.
ఆ విధంగా ఆందోళన వ్యక్తం చేయవలసిన సాధారణ సందర్భాలు ఏమిటని చూస్తే, అసంబద్ధత నెలకొని ఉన్నట్లు సూచనమాత్రంగా తోచడం, అడ్డదిడ్డమైన ధోరణిలో ఆర్డినెన్స్ ల జారీకి తెగబడడం… ఇలాంటివని చెప్పవచ్చు. పార్లమెంటు ఇక ఎంత మాత్రం పని చేయలేని విధంగా సభా కార్యకలాపాలకు భంగం కలిగించడం మరో ఉదాహరణ. రాష్ట్రపతి అప్పుడప్పుడూ చిన్న చిన్న సలహాలు ఇవ్వడాన్ని కాలం చెల్లిన సూత్రాల బలహీన వ్యక్తీకరణగానూ, ఎన్నికల రాజకీయాలు అనివార్యంగా కొనితెచ్చే అసహ్యకరమైన గొడవలమారి వైఖరులతో పోటీ చేసి ఏ మాత్రం నిలవలేని అసమర్ధతగానూ కొందరు కొట్టిపారవేయవచ్చు. అయితే, అది రాజ్యాంగబద్ధ సంబద్ధతా పరిమితులను తోసిరాజనే తమ చర్యల నుండి వెనక్కి తగ్గలని భావించే బాధ్యతాయుత ప్రభుత్వానికి బాధ్యతాయుత ప్రతిపక్షానికి సముచితమే కాగలదు.
**********
(నా అభిప్రాయంలో ఈ సంపాదకీయంలో విలువైన భాగం చివరన హై లైట్ చేసినదే. మిగిలింది పోటీ పరీక్షలకు మాత్రమే పనికొస్తుంది. రాజ్యసభలో మెజారిటీ లేక, గొడవ చేస్తున్న ప్రతిపక్షాలను నియంత్రించలేక వరుసబెట్టి ఆర్డినెన్స్ లు జారీ చేయడాన్ని ఎలా చూడాలో ఈ భాగం స్పష్టంగా చెప్పింది. ‘కొంతమంది కొట్టిపారేయవచ్చు’ అంటూనే అసలు విషయాన్ని ఈ భాగం తెలియజేసింది. ఏమిటా అసలు విషయం? చట్టసభలు, పాలకులు చెప్పుకునేట్లుగా ప్రజాస్వామ్య నిలయాలు ఎంత మాత్రం కాదు. పాలకవర్గాల దోపిడి ప్రయోజనాలను ప్రజాస్వామ్యం ముసుగులో నెరవేర్చుకునే నాటకాలకు అవి కేవలం వేదికలు. మోడి ప్రభుత్వం తెచ్చిన ప్రజాస్వామ్య విరుద్ధ ఆర్డినెన్స్ లను రాష్ట్రపతి మా గొప్పగా నిలదీశారని చెప్పుకునేందుకు తద్వారా భారత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని చాటుకునేందుకు మాత్రమే కేంద్రం-రాష్ట్రపతిల సంవాదం పనికొస్తుంది తప్ప అందులో ప్రజాస్వామ్య విలువ అన్నదే లేదు. -విశేఖర్)