ఆధునిక ప్రపంచంలో ప్రజల జీవన విధానాల్ని దాదాపుగా శాసిస్తున్న ఉపకరణం, మొబైల్ ఫోన్! జీవన విధానాల్ని మొబైల్ ఫోన్ తిరగరాస్తోందని కొందరు చెబుతారు గాని అది ఒకింత ఓవర్ స్టేట్ మెంట్. అప్పటికే స్ధిరపడిన జీవన విధానంలో కొన్ని పనుల్ని మొబైల్ ఫోన్ చాలా సులభతరం చేసిన మాట నిజమే. కానీ మొబైల్ కంపెనీలా లేక వినియోగదారులా ఎవరు ఎక్కువ లాభ పడ్డారు అని ప్రశ్నించుకుంటే మాత్రం కంపెనీలే ఎక్కువ లాభం పొందుతున్నాయని తధ్యంగా చెప్పవచ్చు.
ఒకనాడు, నిజానికి ఇటీవల కాలం వరకూ, ల్యాండ్ లైన్ ఫోన్ అంటేనే లగ్జరీ. ఇండియాలో ల్యాండ్ లైన్ కనెక్షన్ పొందడం కనాకష్టంగా ఉండేది. ప్రభుత్వ టెలికాం కంపెనీలో (ఇప్పటి బి.ఎస్.ఎన్.ఎల్) తెలిసిన ఉద్యోగులు ఉంటే ఫోన్ కనెక్షన్ అనుకున్న సమయం కంటే కాస్త ముందుగా పొందవచ్చని నానుడి ఉండేది. తమకు కోపం ఉన్న కుటుంబాలకు ఫోన్ కనెక్షన్ త్వరగా అందకుండా పై స్ధాయి ఉద్యోగులు కక్ష తీర్చుకునే ఘటనలు అనేకం జరిగేవి. ఇక ఫిర్యాదుల వెల్లువ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. అయినా సరే ప్రజల జీవనం ఫోన్లు లేకపోవడం వల్ల కష్టంగా ఉంది అని మాత్రం ఎప్పుడూ అనిపించలేదు.
ఇప్పుడు ఒక మొబైల్ లేకపోవడం అంటేనే నామర్దా. మొబైల్ లేకుండా జీవితం గడుపుతున్నవారు ఎవరన్నా ఉంటే వారికి నిస్సందేహంగా సన్మానం చేయవచ్చు. మనిషికి ఉండే అవయవాల్లో మొబైల్ ఇప్పుడు మరో అవయవం అయిపోయింది. మొబైల్ ను అతిగా వాడితే రేడియేషన్ తరంగాల వల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్ర పరిశోధకులు హెచ్చరిస్తున్నప్పటికీ వారి మాట వినేవారే లేరు. ‘ఫలానా ప్రమాదం అట కదా’ అంటే తేలికగా కొట్టిపారేస్తున్నారు. ఒక మొబైల్ ఫోన్ పని చేయడం మానేస్తే వెంటనే అప్పు చేసయినా మరొకటి కొనకపోతే వారి జీవితం తలకిందులైపోయిందన్నట్లుగానే పరిస్ధితి తయారయింది.
మొబైల్ ఫోన్ ఒక ప్రమాదం అనుకుంటే దానితో పాటు మన జీవితాల్ని శాసిస్తున్న ఐ.టి కంపెనీలు మరో పెద్ద ప్రమాదంగా జనానికి తయారయ్యారు. ముఖ్యంగా ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, యాహూ, యాపిల్ లాంటి సామాజిక వెబ్ సైట్ కంపెనీలు ప్రజల భావోద్వేగాలను సైతం శాసిస్తున్నాయి. అవి నేరుగా తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం ఒక విషయం అయితే, తద్వారా ప్రజల వ్యక్తిగత జీవితాల పగ్గాలను ఆధిపత్య వర్గాల చేతుల్లోకి అప్పగించడం మరో ముఖ్యమైన అంశంగా మన ముందు నిలబడి ఉంది.
ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఈ మెయిల్, మొబైల్ ఫోన్ లను వినియోగించే ప్రతి ఒక్క వినియోగదారుడి పైనా నిఘా పెట్టగల వినాశకర సాఫ్ట్ వేర్ లను అమెరికా గూఢచార సంస్ధలు ఎన్.ఎస్.ఏ, సి.ఐ.ఏ లు అభివృద్ధి చేసి అనేక యేళ్లుగా వినియోగిస్తున్నాయని మాజీ సి.ఐ.ఏ-ఎన్.ఎస్.ఏ గూఢచారి ఎడ్వర్డ్ స్నోడెన్ వెల్లడించిన తర్వాత ప్రమాదం ఎంత తీవ్ర స్ధాయిలో మన నెత్తిపై కూర్చున్నదో తెలిసి వచ్చింది. అమెరికా-యు.కె-కెనడా-ఆస్ట్రేలియా-న్యూజీలాండ్ దేశాల కూటమి సంయుక్తంగా ఒకరినొకరు సహకరించుకుంటూ ఈ పాపకార్యం నిర్వహిస్తున్నాయని, వాటికి ఇండియా లాంటి దేశాలు కూడా పూర్తిగా సహకరిస్తున్నాయని ఇప్పుడు పూర్తిగా వెల్లడి అయింది. కానీ ఇదేమి పెద్ద ప్రమాదం కాదన్నట్లుగానే ప్రజల ధోరణి కొనసాగుతోంది.
ఇవన్నీ మొబైల్ ఫోన్ లను రాజ్యాధిపత్యం నుండి చూసినప్పుడు కనిపించే ప్రమాదాలు. ఇవి కాకుండా ఆరోగ్య రీత్యా ఎదురవుతున్న ప్రమాదాలు అదనం. ఒంటరిగా ఉన్నప్పుడు కాస్త తోడుగా ఉన్నట్లు అనిపించడం మొబైల్ ఫోన్ కి ఉన్న సానుకూల అంశం. కానీ సమూహంలో కూడా ఒంటరులుగా అది మనుషుల్ని మార్చివేయడమే పెను విషాధం. చివరికి పక్క పక్కన కూర్చుని ఉన్న కుటుంబ సభ్యులు సైతం ఫోన్లలో ఎవరితోనో సొల్లు వేస్తూ సమక్షం ద్వారా లభించే ఆనందానుభూతిని కాల దన్నుతున్నారు. ఎన్ని చెప్పుకున్నా ఇది తీవ్రమైన లోపం. సాంకేతిక పరిజ్ఞానాన్ని తాను శాసించడం మాని తానే సాంకేతికత పరిష్వంగంలోకి ఇష్టంగా ముడుచుకుపోవడం ఎంతమాత్రం అనుమతించరానిది.
ఫేస్ బుక్ లాంటి సామాజిక వెబ్ సైట్ల వల్ల ఎంతో దూరాన ఉన్నవారి మధ్య కూడా శతృత్వాలు పెరుగుతుంటే, ఎన్ని లోపాలతోనైనా అప్పటి వరకూ సజావుగా సాగే కాపురాలు నిలువునా కూలిపోవడం కంటే మించిన విషాదం మరొకటి ఉంటుందా? ఫేస్ బుక్ తో పరిచయమైన స్నేహాలు సరికొత్త మోసాలుగా మారిపోతున్నాయి. నిత్యజీవితంలో నీతులు వల్లించే వ్యక్తులు సైతం ఫేస్ బుక్ స్నేహాలతో సొంత జీవితాల్ని కలుషితం చేసుకుంటున్నారు.
నలుగురం కలిసి కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆ విషయంపై మిగిలిన ముగ్గురు ఏదో ఒకటి అనకుండా ఉంటారా? ఖచ్చితంగా అంటారు. అది ఊసుపోక కబుర్లు కావచ్చు, ఒక సీరియస్ విషయమై జరిగే చర్చ కావచ్చు, ఇతరులపై చాడీలు కావచ్చు, పుకార్లు కావచ్చు… ఏదైనా కావచ్చు. నలుగురు కూడినపుడు పరస్పరం సంబాషణలు జరుపుకుంటారు. అది సహజం. అదే సంభాషణ ఫేస్ బుక్ లోనో, ప్లస్ లోనో జరిగితే దానికి అంతకంటే మించిన ప్రాముఖ్యత ఉంటుందా? ఉండకూడదు, కానీ ఉంటోంది. ఫేస్ బుక్ లో ఒక వాక్యం రాస్తే దానిపైన స్నేహితులు ఒక వ్యాఖ్య చేయడం, ఇద్దరు స్నేహితులు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం లాంటిదిగానే ఉండాలి. దానికి బదులు అలా జరిగే ఫేస్ బుక్ సంభాషణకు ఎనలేని ప్రాముఖ్యాన్ని జనులు ఇచ్చేస్తున్నారు. ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారంటే నిజంగానే మన సమక్షంలో ఉన్న స్నేహితులను, కుటుంబ సభ్యులను, కొడుకులను, కూతుళ్లను, అమ్మా నాన్నలను అందరినీ విస్మరించి ఫేస్ బుక్ సంభాషణలో మునిగిపోయేంతగా.
ఫేస్ బుక్ సంభాషణలో అవతలి వ్యక్తి ఎవరో పూర్తిగా తెలియదు. కేవలం వారి వేళ్ళ నుండి జారిపడే అక్షరాలు, ఆ అక్షరాల్లోని అర్ధాలే మనకు అనుభవంలోకి వస్తాయి. ఆ అక్షరాలు ఒక్కోసారి చాలా గొప్పగా ఉండవచ్చు. చాలా పరిణతితో ఉండవచ్చు. చాలా తెలివితేటలతో, విజ్ఞానంతో కూడి ఉండవచ్చు. కానీ అవన్నీ ఆ వ్యక్తిని అనుభవ పూర్వకంగా తెలుసుకోవడం కంటే మించినవి ఎంత మాత్రం కాజాలవు. అవతలి వ్యక్తి నిజాయితీపరులు అయితేనే ఫేస్ బుక్ లో కనపడే మాటలకు విలువ. కానీ ఆ నిజాయితీ తెలిసే మార్గం ఫేస్ బుక్ కానే కాదు. ఆ నిజాయితీ చివరికి సమక్షంలోనే తెలియాలి. అవతలి వ్యక్తి యొక్క వాస్తవ ఆచరణ ద్వారానే తెలియాలి. అది తెలుసుకోకుండా అవతలివారి మొహంలో పడిపోవడం, పక్కన ఉన్న సన్నిహితులను కాలదన్నుకోవడం వాంఛనీయం కాదు.
ఈ రీత్యా ఫేస్ బుక్ లో మీరు రాసిన కామెంట్ ను పది మంది లైక్ చేసినందు వల్లనో, మరో పది మంది వ్యాఖ్యలు రాస్తేనో అది మన ఛాతీ ఉబ్బిపోవడానికి కారణం కాకూడదు. మనుషుల భావోద్వేగాలకు, ఒక అంశం (వ్యాసం, వీడియో, వ్యాఖ్య మొ.వి) యొక్క గొప్పతనానికి లైక్ లు, షేర్ లు అంతిమ కొలబద్దలు కాకూడదు. లైక్ లు, షేర్ లను కొలబద్దలుగా పరిగణిస్తున్నామంటే మనం మన దైనందిన జీవితంలో అద్భుతమైన వాస్తవ అనుభూతుల్ని కోల్పోతున్నామనే అర్ధం. ఎందుకంటే వాటిని కొలబద్దలుగా నిర్ణయించుకున్నాక అంతటితో ఊరుకోము. వాటిని సంపాదించడానికి ఇంకా ఇంకా ప్రయత్నిస్తూ ఉంటాము. ఆ క్రమంలో బోలెడు సమయాన్ని వృధాగా ఖర్చు చేస్తాము. తద్వారా సన్నిహితులతో, గొప్ప వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో సమక్షాన్ని గడిపే అద్భుతమైన ఆనంద సమయాల్ని కోల్పోతాము.
ఫేస్ బుక్ ద్వారా తమ పౌరుల భావోద్వేగాలను ప్రభావితం చేసే ప్రయోగాలను అమెరికా ప్రస్తుతం సాగిస్తోంది. ఫేస్ బుక్ వినియోగదారులకు తెలియకుండా వారి స్టేటస్ లలో మార్పులు చేస్తూ, ఆ మార్పులపై వారి స్పందనలను పరిశీలిస్తూ, రికార్డు చేస్తూ ప్రభావితం చేసే ప్రయోగాన్ని ఇటీవల ఫేస్ బుక్ చేపట్టింది. ఈ ప్రయోగాన్ని అమెరికా ప్రభుత్వం ఆదేశాలతోనే జరిగిన సంగతి వెల్లడి అయింది. పౌరుల కదలికలను, భావోద్వేగాలను, దైనందిన కార్యకలాపాలను సామాజిక వెబ్ సైట్ల ద్వారా ప్రభావితం చేస్తూ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు, తమ అక్రమ కార్యకలాపాలకు ఆమోదం పొందేందుకూ అమెరికా ప్రయత్నిస్తోందని ఈ ప్రయోగాల వెల్లడి ద్వారా స్పష్టం అయింది.
కనుక తెల్లనివన్నీ పాలుగా భ్రమించి మోసపోవడం తెలివైనవారి లక్షణం కాదు. మనల్ని పాలించే ఆధిపత్యవర్గాలకు ఫేస్ బుక్ లాంటి వెబ్ సైట్ల ద్వారా మరో ఆయుధాన్ని అందించడం పౌరులకు అభిలషణీయం కాదు. ఐ.టి మాయాజాలంలో పడిపోయి సొంత వాస్తవ జీవితాల్ని నరకప్రాయం చేసుకోకూడదని ప్రతి ఒక్కరూ శపధం చేయాల్సిన కాలంలో మనం జీవిస్తున్నాం.
ఈ కింది ఫోటోలు సెల్ ఫోన్ ల వల్ల కొన్ని సౌకర్యాలు సమకూరడంతో పాటుగా, మానవ జీవితంలోని వివిధ సంఘటనలు ఎలా కృత్రిమంగా, స్పందనా రహితంగా మారిపోయాయో తెలియజేబుతున్నాయి. ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించిన ఫొటోలివి.
మానవపరిణామక్రమంలో ముఖ్యమైన ఆవిష్కరణలు-నిప్పు,చక్రం,కాగితం,అచ్చుయంత్రం,బుల్బ్,టి.వి,ఇంటెర్నెట్ ప్రస్తుతం మొబైల్ ఫొన్!
ప్రస్తుతం మొబైల్ ఫొన్ ట్రెండ్ నడుస్తోంది రాబోయే కాలంలో ఇంతకన్నా మెరుగైన వస్తుసాధనం వచ్చేవరకు దీని హవా కొనసాగుతుంది!తరువాత మనం వద్దనుకొన్నా దీని వాడకం బాగా తగ్గిపోయి మరో వస్తువు దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది!
సాంకేతికత రెండువైపుల పదునువున్న కత్తి వంటిది దానిని మంచికి ఉపయోగించవచ్హు అలాగే చెడుకు కూడా. యువత ఎక్కువగా చెడు వైపె మొగ్గడం శొచనియం , పైపెచ్హు కంపేనిలు తమ సొంత అవసరాలకు వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వాడుకొవడం ,భద్రత పేరుతొ నిఘా సంస్థలు పౌరుల జివితాల్లొ మరింతగా చొరబడడం గర్హనియం .