మార్కెట్లను ఆశ్చర్యంలో ముంచెత్తగల సామర్ధ్యం సెంట్రల్ బ్యాంకింగ్ యొక్క ముఖ్యమైన లక్షణాలలో ఒకటి. ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్, గురువారం నాడు వడ్డీ రేట్లను 0.25 శాతం మేర తగ్గించడం ద్వారా దానిని కనబరిచారు. గత వారం రోజుల్లో ద్రవ్యోల్బణము, పారిశ్రామిక ఉత్పత్తిలకు సంబంధించి సానుకూల ఆర్ధిక ఫలితాలు వెలువడడంతో వడ్డీ తగ్గింపు ఉంటుందని అంచనా వేశారు. అలాంటి తగ్గింపు ఏదన్నా ఉన్నట్లయితే అది ఫిబ్రవరి 3 వ తేదీ నాటి ద్వైమాస విత్త విధాన సమీక్షలో మాత్రమే ఉంటుందని అందరూ భావించారు. కానీ డాక్టర్ రాజన్ అంతకు ముందుగానే చర్య తీసుకునేందుకు మొగ్గు చూపారు. ఒక విధంగా చెప్పాలంటే, గవర్నర్ డిసెంబర్ లో మునుపటి విత్త విధాన ప్రకటనలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఆర్ధిక పరిస్ధితులు సహకరించినట్లయితే విత్త సమీక్షకు సంబంధం లేకుండానే వడ్డీ తగ్గించవచ్చని ఆయన అప్పుడే చెప్పారు.
వడ్డీ కోత, దాని పరిమాణాన్ని బట్టి, ప్రధానంగా సంకేతాత్మకంగానే పరిగణించాలి. ఈ తగ్గింపు వల్ల వ్యక్తులకు, సంస్ధలకు రుణాల ఖరీదు గణనీయంగా ఏమీ పడిపోదు. కానీ సెంట్రల్ బ్యాంకు విత్త విధాన వైఖరిలోని ముఖ్యమైన మార్పును అది సూచిస్తోంది. సంకేతం ఏమిటో స్పష్టమే: (వడ్డీ) సడలింపు చక్రం మొదలయింది, సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం మరియు కేంద్ర ప్రభుత్వ కోశాగార లోటు (Fiscal Deficit) అదుపులో ఉన్నట్లయితే మరింత లోతయిన (వడ్డీ) కోతలు ఉండవచ్చు. 20 నెలల తర్వాత మొట్ట మొదటిది, రాజన్ పదవీ కాలంలో మొట్ట మొదటిది కూడా అయిన వడ్డీ కోతకు స్టాక్ మార్కెట్లు అంతటి ఉత్సాహాతిశయంతో స్పందించడం అంతగా ఆశ్చర్యం కలిగించేది ఏమీ కాదు. పెట్టుబడి మదుపు, వినియోగం పునరుజ్జీవం పొందుతాయన్న అంచనాతో బెంచ్ మార్క్ ఎస్ & పి బి.ఎస్.ఇ సెన్సెక్స్ సూచీ 729 పాయింట్లు లేదా 2.66 శాతం మేరకు ఎగసింది.
ఇండియా ఇంక్ (భారత గడ్డపై నడిచే కంపెనీలు, పరిశ్రమలు) ఎన్నాళ్లుగానో చేస్తున్న డిమాండ్ ను నెరవేర్చిన గవర్నర్, వడ్డీ సడలింపు చక్రాన్ని స్ధిరంగా కొనసాగేలా చూసే బాధ్యతను ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై మోపారు. తదుపరి మరింతగా సడలింపు జరిగితే అది కేవలం ఆర్ధిక వ్యవస్ధలోని ద్రవ్యోల్బణ వ్యతిరేక గమనం వల్లనే సాధ్యపడుతుందన్న సంకేతాలు ఇవ్వడంలో ఆయన ఎవరికీ ఎలాంటి అనుమానం మిగల్చలేదు. తన కోశాగార లోటు లక్ష్యం అయిన 4.1 శాతాన్ని అందుకోవడంలో ప్రభుత్వం విజయం సాధించడం కూడా ఈ ప్రక్రియలో కీలకమైనది. అంతే కాకుండా సరఫరా నిరోధకాలను అధిగమించాలని, విద్యుత్, భూమి, ఖనిజ వనరులు లాంటి మూలకాలు దండిగా అందుబాటులో ఉంచాలని డాక్టర్ రాజన్ సరిగ్గానే ఎత్తి చూపారు.
పన్ను రెవిన్యూల వసూళ్లు అనుకున్నదాని కంటే తక్కువ నిష్పత్తిలో పెరుగుతున్న నేపధ్యంలో ఫిబ్రవరిలో జరగనున్న టెలికాం (స్పెక్ట్రమ్) వేలం మరియు పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో వాటాల అమ్మకంలు కీలక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రభుత్వం యొక్క కోశాగార స్ధిరీకరణ (Fiscal consolidation) పధకాల గురించిన సమాచారం ఇస్తుంది కనుక 2015-16 ఆర్ధిక సంవత్సరానికి గాను ఫిబ్రవరిలో ప్రకటించే బడ్జెట్ కూడా ముఖ్యమైనదే. కార్పొరేట్ ఇండియా విషయానికి వస్తే, వడ్డీ కోత చిన్నదిగా కనపడవచ్చు. గణనీయ మొత్తంలో చౌక రుణాలు అప్పుడే వారికి అందుబాటులోకి రాకపోవచ్చు. కానీ అది ఏమి సూచిస్తున్నదో అంతవరకే తీసుకోవాలి: స్ధూల ఆర్ధిక సూచకాలతో సెంట్రల్ బ్యాంకు కాసింత సౌకర్యవంతంగా ఉన్నది; దరిమిలా వడ్డీ సడలింపు ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పుడిక డ్రాయింగ్ బోర్డ్ వద్దకు వచ్చి తాజాగా పెట్టుబడులు ప్రారంభించే పని కార్పొరేట్ రంగం చేతుల్లో ఉంది.
*********
[సంపాదకీయంలో ప్రధానంగా గమనించవలసిన అంశం: యు.పి.ఏ ప్రభుత్వ హయాంలో జరిగినట్లే కోశాగార స్ధిరీకరణ ఎన్.డి.ఏ పోటుగాళ్ల వల్ల కూడా కావడం లేదు. ‘యు.పి.ఏ వల్ల కాలేదు, మాకివ్వండి, మేము ఊడబోడిచేస్తాం’ అని కబుర్లు దంచి కొట్టిన ఎన్.డి.ఏ మేధావులు యు.పి.ఏ మధ్యంతర బడ్జెట్ కంటే ఎక్కువ పన్ను వసూళ్లను అంచనా వేసి అది సాధ్యం చేయలేక ఆపసోపాలు పడుతున్నారు. జనం నుండి పన్ను వసూళ్లు చేసుకోవడం చాలా తేలిక. ఎగువ మధ్య తరగతి వరకు ప్రజల ఆదాయం అంతా కాగితాలపై పొల్లు పోకుండా కనపడుతుంది. వారికి పలుకుబడి కూడా ఉండదు. కనుక ప్రభుత్వ డిమాండ్ మేరకు పన్నులు కట్టి తీరతారు. ఎటొచ్చీ పన్నులు కట్టకుండా ఎగవేసేది కార్పొరేట్ రంగమే.
ఆశించినంతగా రెవిన్యూ పెరగాలంటే పెంచిన పన్నులను జనం నుండి రాబట్టుకోవడంతో పాటు కార్పొరేట్ రంగం మెడలు వంచగల సామర్ధ్యం కేంద్రానికి ఉండాలి. సవాలక్షా పేర్లతో పన్ను రాయితీలు, పన్ను తగ్గింపులు, ఉద్దీపనలు వసూలు చేసుకునే కార్పొరేట్ కంపెనీలు పన్ను చెల్లింపుల వద్దకు వచ్చేసరికి మొండికి వేస్తాయి. సి.ఎ లను నియమించుకుని అనేక ఎగవేత మార్గాలను అనుసరిస్తాయి. పన్ను చట్టాల్లోని చీమ తలకాయంత రంధ్రాలను ఏనుగులు దూరే కంతలుగా మార్చి లాభాలు నల్ల డబ్బుగా గడిస్తాయి. ఈ నిలువు దోపిడిని అరికడితే కేంద్రానికి (జి.డి.పిలో) 4.1 శాతం ఫిస్కల్ డెఫిసిట్ ను సాధించడం అసలు లెక్కలోనిదే కాదు.
దానికి బదులు అంతర్జాతీయంగా తగ్గిన చమురు ధరలను ప్రజలకు అందకుండా ఎక్సైజ్ సుంకాల పెంపు ద్వారా మధ్యలోనే అడ్డుకుని తన ఖాతాలో జమ చేసుకుంటోంది మోడి ప్రభుత్వం. ఇప్పటికీ నాలుగు దఫాలుగా ఎక్సైజ్ సుంకం పెంచి 7 రూపాయలకు పైగా పెట్రోల్, డీజెల్ రేట్లు తగ్గకుండా కేంద్రం అడ్డం పడింది. తద్వారా 15,000 కోట్ల వరకు తన ఖాతాలో జమ చేసుకుంది. జనానికి అందాల్సిన సొమ్ము అడ్డ దిడ్డంగా తన ఖాతాలో వేసుకోవడం మోడి ప్రభుత్వం తెచ్చిన మరో ‘అచ్ఛే దిన్’ అన్నమాట! ఇది చాలక యు.పి.ఎ ప్రభుత్వం లాగే ప్రభుత్వ కంపెనీల వాటా, అనగా జనం వాటా, ప్రైవేటు కంపెనీలకు అమ్ముకుని, ప్రజల వనరు స్పెక్ట్రం వేలం ద్వారా ప్రజల అవసరాలు తీర్చకుండా తాను సృష్టించిన లోటులో పోస్తోంది మోడి ప్రభుత్వం.
ఇంతోసిదానికి యు.పి.ఎ వల్ల కాలేదు, మా వల్ల అవుతుందని బూటకపు వాగ్దానాలు ఇవ్వడం ఎందుకో జనం నిలదీయాలి. జనం నిలదీస్తారన్న భయంతోనే కుల, మత భావోద్వేగాలను రెచ్చగొడుతూ, స్వచ్ఛ్ భారత్ లాంటి పనికిమాలిన చేష్టలతో వార్తల్ని నింపుతూ వారి చైతన్యాన్ని మొద్దుబార్చే పనిలో కేంద్రం పెద్దలు నిండా మునిగిపోయారు. వారికి చెత్త బుర్రల సెలబ్రిటీలు తోడై చేయవలసినంత నష్టాన్నీ జనానికి చేస్తున్నారు.]
సర్,ద్రవ్యోల్భణం తగ్గిందంటూ కీలక వడ్డీరేట్లను తగించారు.మరి ఆ మేరకు ప్రతిఫలం మాలాంటీ సామాన్యులకు దక్కడంలేదేమి?
పెట్రోల్ తగ్గింపులను పక్కనపెడితే మిగతా వస్తుసేవల మాటేమిటి?
ఎగువ మధ్యతరగతుల ఆధాయ వ్యయాలన్నీ కాగితాలద్వారా తెలియజేయగలుగుతుంటే,వారిలో కూడా వారిపరిధులమేరకు పన్ను యెగవేతదారుల మాటేమిటీ?సామాన్య ప్రజలనుండి వసూలుచేసే అవినీతిసొమ్ముల మాటేమిటి? కేవలం వారి జీతభత్యాలద్వారా వారిజీవనం గడవడంలేదే! సరే,మీరన్నట్లు పై స్థాయివాళ్ళతో పొల్చుకొంటే తక్కువేకావచ్చు గానీ,వీరిది తీసిపారేయలేనంత చిన్నదేంకాదుకదా!
ఎవరైతే ప్రజల కోరికలను సమర్ధవంతంగా తీర్చుతామని మాయమాటలు,అబద్ధపు హామీలు ఎవ్వగలుగుతారో,కనీసం నమ్మించగలుగుతారో వారినేకదా ప్రజలు ఎన్నుకొంటారు!ఆ భ్రమలు తొలిగిననాడు మరొకరిని ఎన్నుకొంటారుకదా!అంతకుముంచి ప్రస్తుత తరుణంలో ఇంతకన్నా వారేమి చేయగలరు?
ప్రజల అమాయకత్వం తొ వ్యాపారం చేయగలగడమె ప్రజస్వమ్యం యొక్క లక్షణం.