తమిళనాట కులాల కార్చిచ్చు రగిలి సమస్త సామాజిక గతిని నమిలి పారేస్తోంది. ముఖ్యంగా సమాజ ప్రగతికి దోహదం చేసే సృజనాత్మక రచనలను అది దహించివేస్తోంది. కాలకూట విషం కక్కుతూ అటు ప్రజా జీవనాన్ని అల్లకల్లోలం చేస్తూ ఇటు రాజకీయ చైతన్యాన్ని మొద్దుబార్చుతోంది. ప్రఖ్యాత రచయిత పెరుమాళ్ మురుగన్ తాను రచయితగా చచ్చిపోయానని, రచనలన్నింటిని ఉపసంహరించుకుంటున్నానని, ఇక రచనలు చేయబోనని ప్రకటించడం ఈ ఒరవడిలో జరిగిన పరిణామమే.
మురుగన్ నాలుగు సంవత్సరాల క్రితం రాసిన మధోరుబాగన్ నవల ఇటీవల ఆంగ్లంలోకి అనువదించబడింది. నాలుగేళ్లపాటు తమిళ నవలకు రాని అభ్యంతరం ఆంగ్లంలోకి అనువాదం అయ్యాక తలెత్తాయి. హిందూ మత సంస్ధలు, కుల సంస్ధలు ఆందోళన ప్రారంభించాయి. ఆయన బేషరతు క్షమాపణ చెప్పాలని, అమ్ముడు కాని కాపీలను వెనక్కి తీసుకోవాలని అవి డిమాండ్ చేశాయి. నమక్కల్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్న మురుగన్, ఆయన భార్య లపై కత్తి గట్టి వాతావరణాన్ని ఉద్రిక్తం కావించాయి.
జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఈ సమస్యను కేవలం శాంతి భద్రతల సమస్యగా మాత్రమే చూశాయి. కుల పిశాచులను, మతోన్మాదులను శాంతింపజేయడమే తమ ప్రధమ కర్తవ్యంగా ఎంచుకున్నాయి. మురుగన్ పై ఒత్తిడి తెచ్చి నమక్కల్ జిల్లా వదిలి పోవాలని ఆజ్ఞాపించాయి. అధికారుల ఆజ్ఞలను పాటించినప్పటికీ పిశాచుల ఉన్మాదం శాంతించలేదు. అధికార యంత్రాంగం శాంతి చర్చల పేరుతో మురుగన్ ను పిలిపించి, ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చి బలవంతంగా ‘బేషరతు క్షమాపణ’ చెప్పించింది. రాజ్యాంగం గ్యారంటీ చేసిన ‘సృజనాత్మక స్వేచ్ఛ’ను గుర్తించడానికి అధికారులు నిరాకరించారు.
జిల్లా ప్రభుత్వం తీరుతో పెరుమాళ్ మురుగన్ హతాశుడయ్యాడు. స్వతహాగా సున్నిత మనస్తత్వం కలిగిన మురుగన్ లోలోపల కుమిలిపోయాడు. తీవ్ర నిరాశా నిస్పృహలకు గురయ్యాడు. తానిక రచనలు చేయబోనని ప్రకటించాడు. రచయిత పెరుమాళ్ మురుగన్ చచ్చిపోయాడని ప్రకటించాడు. తన రచనలు అన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. తన రచనలను ప్రచురించిన ముద్రణా సంస్ధలకు వాటిల్లే నష్టాన్ని తానే చెల్లిస్తానని చెప్పాడు. ఇక ముందు కలం పట్టి రచన చేయబోనని కఠోర శపధం చేశాడు.
మతోన్మాద మూర్ఖులు, కుల పిచ్చి ఎక్కిన శక్తులు ఐక్యం అయితే ఎంతటి విషం విరజిమ్మబడుతుందో తెలిసేందుకు మురుగన్ ఒక ఉదాహరణ. రాజకీయాధికారం చేపట్టిన హిందూత్వ శక్తులు, స్ధానిక కులోన్మాదులు ఐక్యమై ఒక పధకం ప్రకారం పని చేశాయని దాని ఫలితమే రచయిత పెరుమాళ్ మురుగన్ మరణం అనీ పత్రికలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చివరికి నాస్తికత్వం తమ ఊపిరిగా చెప్పుకునే ద్రావిడ పార్టీలు కూడా నోరు తెరిచి ఒక్క మాట అన్న పాపాన పోలేదు. పత్రికలు తీవ్రంగా విమర్శించడంతో డి.ఏం.కె కోశాధికారి స్టాలిన్ మాత్రం ఈ రోజు ఒక ఖండన ప్రకటన విడుదల చేశారంతే.
అప్పుడెప్పుడో పెరియార్ రామ స్వామి నాయక్కర్ రాసిన ‘ రామాయణం కీమాయణం ‘ అనే పుస్తకాని దక్షి నాది రాష్ట్రాల్లో అలా ఉంచి అక్కడెక్కడో ఉత్తర ప్రదేశ్ లో నిషేదించారట. ఇపుడు అలాంటివి చేస్తే ఆధునికి ఆత్మ ఒప్పుకోదనేమో ఇండెరక్టు గా అంతపని చేశారు.
అంతా జేసి ఈకధాంశం గొడ్ర్రాళ్లు అని పేరుపెట్టిన అభాగ్యు రాళ్లు దైవం పేరుతో పిల్లలు కనడం. ఇలాంటి కధాంశం తో చాలా కధలే తెలుగులో చదివినట్లు గుర్తు. కాక పోతే ఇక్కడ వ్యక్తిగతమైనది పెరుమాల్ మురుగన్ విషయం లో సామాజికమై కూర్చుంది.
అప్పుడెప్పుడో వైధ్యరంగాభివృద్ది లేని కాలంలో అనేక మహామ్మారి రోగాలతో జనాభా కుంచించుక పోయే కాలంలో జనాభాను ప్రోత్స హించడం కోసం అనేక ఆచారాల పేరుతో ఒక్కో ప్రాంతం లో వివిధ పద్దతుల్లో ఈ మూడాచారలు పెంపొందినట్లు సామజిక,చారిత్రకంశాలు తెలిసిన వారెవరైనా అర్ధం చేసుకో గలరు. పుత్ర సంతానం లేని వారికి పున్నామ నరకం పాలౌతారని స్త్రీ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు.
సర్,ఈ పరిస్థితి దేశం మొత్తం ఉన్నదికదా!దేశంలోని మిగతా రాష్ట్రాలలో ఇంతకన్నతక్కువగా ఏమీలేదుకదా!
అయినా ఇక్కడ హక్కుల అమలు శూన్యం!ఇక్కడ యంత్రాంగం పద్ధతే ఇంత,దానికి ప్రధానకారణం రాజకీయపార్టీలే!
ఇది భావప్రకటన స్వేచ్చకు గొడ్డలిపెట్టు .మతొన్మాదులు కుల సంస్థలు కలిసి ఒక రచయిత మరణానికి కారణం అయ్యాయి. ఐనా రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవ దేశంలొ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చాల తివ్రంగా ఉన్నాయ్. ప్రజల్ని మత,కుల ,వర్గ ,వర్ణ ప్రాతిపదికన విభజించి రాజ్యధినేతలు పబ్బం గడుపుతున్నారు .”రాంజాదే హరాంజదే” అంటు ,ప్రతి హిందు మహిళ నలుగురిని కనాలి అంటు ప్రజలను భావొద్వేగాలతొ రెచ్చగొట్టి ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామిలను దాటవెస్తున్నయ్.మత చాందసులను సంతౄప్తి పరచడంలొ మునిగిన ప్రభుత్వాలు అన్నివిషయాలను రాజకియ కొణంలొనే చూడడం ఘోరం.