ధనికులకు ఆర్.బి.ఐ పండగ కానుక, వడ్డీ రేటు తగ్గింపు


RBI

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ శత పోరును ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ మన్నించారు. ధనికులు, కంపెనీలకు మరిన్ని రుణాలను అందుబాటులోకి తెస్తూ రెపో రేటును 8 శాతం నుండి 7.75 శాతానికి తగ్గించారు. ద్రవ్య విధానం సమీక్షతో సంబంధం లేకుండానే ఆర్.బి.ఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

“లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ కింద పాలసీ రేపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని నిర్ణయించాము. తద్వారా వడ్డీ రేటు 8 నుండి 7.75 శాతానికి తగ్గుతుంది. ఇది వెనువెంటనే అమలులోకి వస్తుంది” అని గురువారం జారీ చేసిన ప్రకటనలో ఆర్.బి.ఐ పేర్కొంది.

జనవరి 2014 నుండి రెపో రేటును 8 శాతం వద్ద కొనసాగిస్తోంది. సరిగ్గా సంవత్సరం తర్వాత 25 బేసిస్ పాయింట్ల మేరకు వడ్డీ రేటును ఆర్.బి.ఐ తగ్గించింది. ఆర్.బి.ఐ విధానం ప్రకారం రివర్స్ రెపో రేటు కంటే రివర్స్ రెపో రేటు 1 శాతం ఎక్కువగా ఉండాలి. ఈ దృష్ట్యా రివర్స్ రేపో రేటును 7 శాతం నుండి 6.75 శాతానికి ఆర్.బి.ఐ తగ్గించింది.

ఆర్.బి.ఐ విధానం ప్రకారం మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎం.ఎస్.ఎఫ్) రేపో రేటు కంటే 1 శాతం ఎక్కువగా ఉండాలి. ఈ రీత్యా ఎం.ఎస్.ఎఫ్ ను 9 శాతం నుండి 8.75 శాతానికి ఆర్.బి.ఐ తగ్గించింది.

కేష్ రిజర్వ్ రేషియా (సి.ఆర్.ఆర్) తో సహా మరే ఇతర వడ్డీ రేట్లను ఆర్.బి.ఐ ముట్టుకోలేదు. బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత భాగాన్ని ఆర్.బి.ఐ వద్ద ఉంచాలి. దానినే సి.ఆర్.ఆర్ అంటారు. సి.ఆర్.ఆర్ ప్రస్తుతం 4 శాతం వద్ద కొనసాగుతోంది. అదే స్ధాయిలో సి.ఆర్.ఆర్ ని కొనసాగించాలని ఆర్.బి.ఐ నిర్ణయించింది.

వినియోగదారుల ధరల సూచీ గత జులై 2014 నుండి తగ్గుతూ వస్తోందని ఫలితంగా వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గుతూ వచ్చిందని అందుకే రేపో రేటు తగ్గించామని ఆర్.బి.ఐ తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గినట్లయితే ద్రవ్య విధాన సమీక్షతో సంబంధం లేకుండానే వడ్డీ రేట్లు తగ్గిస్తామని ఆర్.బి.ఐ డిసెంబర్ 2014 లో జరిపిన సమీక్షలో పేర్కొంది. చెప్పినట్లుగానే సమీక్ష లేనప్పటికి రెపో రేటును ఆర్.బి.ఐ తగ్గించింది.

మార్చి 2015 నాటికి ఫిస్కల్ డెఫిసిట్ ను 4.1 శాతానికి చేర్చడానికి కట్టుబడి ఉన్నట్లుగా ప్రభుత్వం చెప్పిందని, ద్రవ్యోల్బణం కూడా తగ్గు ముఖం పట్టడంతో వడ్డీ రేటు తగ్గింపుకు నిర్ణయం తీసుకున్నామని ఆర్.బి.ఐ తెలిపింది. ప్రభుత్వ కట్టుబాటు సంగతి ఏమో కానీ ఫిస్కల్ డెఫిసిట్ 4.1 శాతం వద్ద ఉంచవలసిన రుణాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. వ్యయాన్ని లక్ష్యం కంటే ఎక్కువగానే చేసింది. కనుక అదనపు ఆదాయ వనరులను చూసుకుంటే తప్ప 4.1 శాతం వద్ద లోటును ఉంచడం కుదరదు. సరిగ్గా ఈ కారణం చెబుతూ మరిన్ని ప్రభుత్వ సంస్ధల వాటాలను విక్రయించేందుకు మోడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది.

లక్ష్యిత లోటును మించకుండా మొదటి నుండి వ్యయాన్ని నియంత్రించుకోవడం తెలివిమంతుల లక్షణం. దానికి బదులు వచ్చిన ప్రతి ఖర్చూ చేసేసి ఆనక అదనపు వనరుల కోసం అని చెబుతూ ప్రభుత్వ కంపెనీలను తెగనమ్మడం కాంగ్రెస్ ప్రభుత్వాలు క్రమం తప్పకుండా పాటించిన ఎత్తుగడ. అదే ఎత్తుగడను బి.జె.పి/మోడి ప్రభుత్వం పాటిస్తోంది. కాంగ్రెస్ కంటే తాను ఎంతమాత్రం భిన్నం కాదని బి.జె.పి ఈ విధంగా మరోసారి చాటుకుంది.

“పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాల ధరలు తగ్గాయి. అంతర్జాతీయంగా కమోడీటీల ధరలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా క్రూడాయిల్ ధరలు బాగా పడిపోయాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం అంచనా కంటే ఎక్కువగా తగ్గడం సాధ్యపడింది. దానితో వడ్డీ రేటు తగ్గింపుకు మార్గం సుగమం అయింది” అని ఆర్.బి.ఐ తన ప్రకటనలో పేర్కొంది.

నిజానికి క్రూడాయిల్ ధరలు సగం కంటే ఎక్కువగానే తగ్గిపోయాయి. కానీ మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు మాత్రం కనీసం 10 శాతం కూడా తగ్గలేదు. అంతర్జాతీయంగా తగ్గిపోయిన ధరలను దేశంలో ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా కేంద్ర ప్రభుత్వం సొమ్ము చేసుకుంది. అనగా అంతర్జాతీయ ధరల తగ్గింపు ప్రజలకు అందకుండా తానే సొమ్ము చేసుకుంది. ధరలు పెరిగినప్పుడు నిర్మొహమాటంగా ధరలు పెంచే ప్రభుత్వాలు తగ్గినపుడు మాత్రం కొద్ది భాగాన్ని మాత్రమే ప్రజలకు అతి కష్టం మీద తరలిస్తున్నాయి.

సరఫరా నిరోధకాలను తొలగించినట్లయితే ధరలు మరింత తగ్గి వడ్డీ రేటు ఇంకా తగ్గించడానికి వీలవుతుందని ఆర్.బి.ఐ పేర్కొంది. సరఫరా నిరోధకాల తొలగింపు అంటే రవాణా మార్గాలను (రైలు, రోడ్డు, వాయు మార్గాలను) మెరుగుపరచడం, విద్యుత్, భూమి, ఖనిజాలు తదితర కీలక ముడి సరుకుల అందుబాటును పెంచడం, ఇతర మౌలిక నిర్మాణాలను మెరుగుపరచడం…. మొదలయిన చర్యలు తీసుకోవడం. ఇది అనేక దశాబ్దాలుగా ఆర్.బి.ఐ చెబుతున్న మాటే. కానీ ఉన్న డబ్బు అవినీతికే సరిపోతుండడంతో ఈ షరతు ఎప్పటికీ కొనసాగుతూ పోతోంది. ఉన్న డబ్బు అవినీతి ఖాతాలకు తరలించుకుని డబ్బు లేదన్న సాకుతో వినాశకర సంస్కరణలను ప్రజల నెత్తిన రుద్దడం మన ఏలికలకు ఉన్న అలవాటు.

One thought on “ధనికులకు ఆర్.బి.ఐ పండగ కానుక, వడ్డీ రేటు తగ్గింపు

  1. బ్యాంక్‌లకి ఉన్న మొండి బకాయీల వల్ల కూడా ద్రవ్యోల్బణం వస్తుంది. ఎగవేతదారులకి ప్రభుత్వం bailout ఇవ్వకుండా ఉన్నా ద్రవ్యోల్బణం తగ్గుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s