డిసెంబర్ 26, 2014 తేదీతో ఆనాటి సునామీకి పదేళ్ళు నిండాయి. ఇండోనేషియా తీరానికి సమీపంలో హిందూ మహా సముద్రంలో సంభవించిన భారీ భూకంపం వల్ల సంభవించిన సునామీలో 14 దేశాల్లో 2,30.000 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇందులో అత్యధికులు ఇండోనేషియాలోని సుమత్ర ద్వీపానికి చెందినవారే. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని చెప్పేవారూ ఉన్నారు.
సముద్రంలో ఆటు, పోటుల గురించి తెలియడమే గానీ సునామీ గురించి అప్పటికి ఎవరికీ తెలియదు లేదా తెలిసినవారు చాలా తక్కువ. సునామీ అన్న ప్రకృతి విలయం ఒకటుందని జనానికి మొదటిసారి ఘాటుగా తెలిసింది అప్పుడే. ఇండియా, ఇండోనేషియా, ధాయిలాండ్, మలేషియా, ఫిలిప్పైన్స్, బర్మా, బంగ్లాదేశ్, మాల్దీవులు, సోమాలియా, శ్రీలంక, కీన్యా, దక్షిణాఫ్రికా, టాంజానియా, యెమెన్ దేశాలు సునామీ పోటుకు గురయ్యాయి.
ఇండోనేషియాలో అత్యధికంగా 1,32,000 మంది చనిపోగా 37,000 మంది జాడ తెలియలేదు. ఇండియాలో 10,000 కు పైగా చనిపోయారు. ఇప్పటికీ జాడతెలియని భారతీయులు 5,000కు పైగా ఉన్నారు. శ్రీలంకలో 31,000 పైగా మృత్యువాత పడగా 4,000 మంది జాడ తెలియలేదు.
మొదట 9.1 పరిణామంలో హిందూ మహా సముద్రం అడుగున భారీ భూకంపం సంభవించింది. అనంతరం భూకంపం కేంద్రం నుండి నలు దిక్కులకు భారీ యెత్తున ఎగసిపడిన అలలు వందల కి.మీ దూరం ప్రయాణించి వివిధ దేశాల్లోని తీరాలను చేరాయి. ఆ చేరడం మామూలుగా కాకుండా తీర ప్రాంతాల్ని ముంచెత్తుతూ సమస్తం తమలో కలిపేసుకుంటూ చేరాయి. 6 విడతలుగా ఒకదానివెంట ఒకటి అలలు తీరాలను తాకడంతో, వాటిలో మునిగినవారికి తేరుకునే అవకాశం చిక్కలేదు.
అనేక చోట్ల అనేకమంది తమ తమ కుటుంబ సభ్యులను సైతం కాపాడుకోలేకపోయారు. అలలు ఎంత బలంగా తాకాయంటే సొంత ప్రాణాలను కాపాడుకునేందుకు అనేకమంది తమ పిల్లలను సైతం చేతుల్లో నుండి వదిలిపెట్టాల్సి వచ్చింది. ఇళ్ళు, భవనాలు, పడవలు, ఓడలు, పశువులు, తీర ప్రాంత హోటళ్లు ఇలా అన్నీ కొట్టుకుపోవడమో, కూలిపోవడమో, రూపం మారిపోవడమో, మట్టి-ఇసుకలో కప్పబడిపోవడమో జరిగాయి.
ఆ దెబ్బతో ప్రపంచవ్యాపితంగా సునామీ గురించి ముందుగానే హెచ్చరించే వాతావరణ కేంద్రాలు మొలిచాయి. ప్రభుత్వ సంస్ధలతో పాటు అనేక ప్రైవేటు సంస్ధలు కూడా ఇప్పుడు సునామీల గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఎక్కడన్నా సముద్రంలో చిన్న భూకంపం వచ్చిందంటే చాలు, సునామీ రాగల అవకాశాల గురించి తప్పనిసరిగా సమాచారం ఇస్తున్నారు. ప్రపంచవ్యాపితంగా విస్తరించిన సునామీ కేంద్రాలు తమలో తాము సమాచారం ఇచ్చుకుంటూ ఒక నెట్ వర్క్ వలె పని చేస్తున్నాయి.
ఆనాటి సునామీ దృశ్యాలు కొన్నింటిని అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది. వీటిలో కొన్ని ఒకే చోటులో అప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడాను చూపుతున్నాయి.