భారతీయ జనతా పార్టీ ఎం.పి సాక్షి మహారాజ్ చేస్తున్న (వివాదాస్పద ప్రతిపాదనలతో కూడిన) ప్రకటనలు ఆ పార్టీ ఆమోదంతోనే చేస్తున్నారా లేక తమ నేతలు ‘వద్దు, వద్ద’ని వారిస్తున్నా వినకుండా చేస్తున్నారా? ఆయనతో పాటు ఇతర బి.జె.పి నేతలు, హిందూత్వ సంస్ధల నేతలు చేస్తున్న విద్వేషపూరిత ప్రకటనల వెనుక ప్రధాని నరేంద్ర మోడి మద్దతు లేదా?
ప్రధాని నరేంద్ర మోడి ‘వద్దు, వద్ద’ని వారిస్తున్నా వినకుండా సాక్షి మహారాజ్ తన ధోరణిలో తాను వెళ్లిపోతున్నారని ఈ కార్టూన్ సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. ‘ఇది కూడా నీ పనే కదా’ అంటూ ప్రధాని, సాక్షి మహరాజ్ తో ఒకింత నిరసనతో అంటున్నట్లు చూపిన మాటల ఉద్దేశ్యం అదే కావచ్చు. ఈ అవగాహనలో వాస్తవం ఉన్నదా లేదా అన్నది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల మధ్య ఒక చర్చాంశంగా కొనసాగుతోంది.
ప్రధాని మోడి తలపెట్టిన ‘అభివృద్ధి’ పని విధానానికి సాక్షి మహారాజ్, సాధ్వి నిరంజన్ లాంటి ఎం.పిలు భారంగా తయారయ్యారని, ఆయన మానాన ఆయనను వదిలేస్తే దేశాన్ని అభివృద్ధి బాటపై పరుగులు పెట్టిస్తారని కొందరు చెబుతున్నారు. ఈ శిబిరంలో బి.జె.పి, మిత్ర పార్టీలతో పాటు వ్యాపార అవకాశాలకై మోడిపై ఆశలు పెట్టుకున్న కొన్ని వామపక్ష సంస్ధలు, మేధావులు కూడా ఉండడం విశేషం. హిందూత్వ జంఝాటం వదిలించుకుని మోడి, తన మెజారిటీతో సంస్కరణల అశ్వాన్ని పరుగెత్తించాలని వారి బలమైన కోరిక.
‘కాదు, కాదు. అదంతా ఒక నాటకం. ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, శ్రామిక వ్యతిరేక సంస్కరణలు ప్రజలను తీవ్రంగా బాధిస్తాయి. ఆ బాధను శ్రామిక ప్రజలు సహించలేరు. ఏదో ఒక రూపంలో ప్రతిఘటన ఇస్తారు. ఆందోళనలకు దిగుతారు. సమ్మెలు చేస్తారు. సంస్కరణల విధానాలు మోపే భారాన్ని కనీసం తగ్గించుకునేందుకు చర్యలకు దిగుతారు. ఈ ప్రతిఘటనను పక్కదారి పట్టించి, జనానికి వారి పని కాని పనిని అంటగట్టడం కోసమే అనుచరులతో అడ్డగోలు ప్రకటనలు, అజెండాలు ప్రకటింపజేస్తున్నారు’ అని మరి కొందరు వాదిస్తున్నారు.
ప్రధాని మోడి పాలనలో పదేళ్ళకు పైగా వర్ధిల్లిన గుజరాత్ ను చూస్తే ఈ రెండింటిలో ఏది నిజమో అర్ధం అవుతుంది. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తోడనే అక్కడ పేద ముస్లిం ప్రజలపై మారణకాండ జరిగింది. ధనిక ముస్లింల ఆస్తులపై దాడులు జరిగాయి. అనేక మసీదులను కూల్చివేశారు. కాలనీలకు కాలనీలనే తగలబెట్టారు. విధ్వంసం కావించారు. ఇవేవీ మోడీకి తనకు తెలిసి జరిగినవి కావని మోడి అభిమానులు, ఆయన పార్టీ నేతలు చెప్పే మాట. కాని మాజీ ప్రధాని వాజ్ పేయి చెప్పినట్లు నాగరికంగా చెబితే అప్పటి మోడి ‘రాజ ధర్మం నిర్వర్తించడంలో విఫలం అయ్యారు’ అన్నది వాస్తవం.
అల్లర్ల తర్వాత గుజరాత్ లో శాంతి నెలకొందని, మళ్ళీ ఒక్క దాడి జరగలేదని హిందూత్వ అభిమానులు చెబుతారు. కానీ అక్కడ నెలకొన్న శాంతి ‘శ్మశాన శాంతి’ మాత్రమేనని విమర్శకులు ఏకాభిప్రాయం. ఆ శ్మశాన శాంతిలో సంస్కరణలు హోరు మన్నాయి. విదేశీ పెట్టుబడులు గద్దల్లా వచ్చి వాలాయి. రైతుల భూములు అతి తక్కువ రేటుకు కంపెనీలకు ధారాదత్తం చేయబడ్డాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు నల్లేరుపై నడకగా సాగిపోయాయి. ప్రజల నుండి, ప్రకృతి నుండీ సంపదలు ధనికుల వద్దకు భారీగా తరలివెళ్లిపోయాయి.
ఇప్పుడు నరేంద్ర మోడి ప్రధాని అయ్యారు. గుజరాత్ లో చేసినట్లే కేంద్ర స్ధాయిలోనూ సంస్కరణలను పరుగులు పెట్టిస్తారని కంపెనీలు, ధనికులు, విదేశీ బహుళజాతి కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయి. వారి ఆశల మేరకు ప్రధాని వేగంగా పని చేస్తున్నారు కూడా. దేశ ఆర్ధిక నిర్మాణంలో ప్రభుత్వ ప్రాతినిధ్య సంస్ధగా ప్రధాన నిర్ణయాలు తీసుకున్న ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసేశారు. ‘నీతి ఆయోగ్’ అంటూ కోరలు పీకిన సంస్ధను ఏర్పరిచారు. ఇది ఎంత పనికొచ్చే సంస్ధ అంటే ‘విద్య, వైద్యం లాంటి సాధారణ ప్రజోపయోగ పనులను కూడా ప్రభుత్వం నుండి ఊడబీక్కుని ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేయ్యాలని దాని అధిపతి ప్రబోధిస్తున్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి కంపెనీలకు ‘అనుకూల వాతావరణం’ కల్పిస్తున్నారు. పాల పళ్ల ‘భూ సేకరణ చట్టం’ను సవరించి రైతుల భూములను విచక్షణారహితంగా లాక్కునే ఏర్పాట్లు చేశారు.
ఇవన్నీ ప్రజా వ్యతిరేక చర్యలు, ధనికులకు మేలు చేసే చర్యలు. స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీల విచ్చలవిడి దోపిడీకి దోహదం చేసే చర్యలు. కనుక ప్రజలు ప్రతిఘటించక తప్పదు. పైన చెప్పినట్లు అలాంటి ప్రతిఘటనను మొద్దుబార్చేందుకుకే సాక్షి మహారాజ్, సాధ్వి నిరంజన జ్యోతి లాంటి వ్యక్తులు బహిరంగంగా నోరు పారేసుకుంటూ అలజడి సృష్టిస్తున్నారు. జనం తమ సొంత అలజడిని మర్చిపోయి ఇలాంటివారు సృష్టించి అలజడిలో భాగం పంచుకోవాలని పాలకుల కోరిక.
కనుక సాక్షి మహారాజ్ తదితరులు ప్రధాని మూపురంపై భారం కాదు సరికదా, ఆయన అజెండాను అమలు చేసే కార్యకర్తలు. చెప్పిన పనిని తు.చ తప్పకుండా చేసే అనుచర నేతలు. చెప్పినట్లు చేసే వారు ఎన్నడూ నేతలకు భారం కాజాలరు. వారు తమ నేతల ఆస్తులు.