శ్రీలంక ఎన్నికలు: దక్షిణాసియాలో పెరుగుతున్న అమెరికా పెత్తనం


Rajapaksa

దక్షిణాసియాలో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో ఉన్న మన పొరుగు దేశం శ్రీలంకలో అద్యక్ష ఎన్నికలు ముగిశాయి. రాజ్యాంగాన్ని సవరించి మరీ మూడోసారి అద్యక్షరికం చెలాయిద్దామని ఆశించిన మహేంద్ర రాజపక్సేకు శృంగభంగం అయింది. పదవీకాలం ఇంకా రెండు సంవత్సరాలు మిగిలి ఉన్నప్పటికీ ఎన్నికలు జరిపించిన రాజపక్సే అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యాడు. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అధికార పార్టీ అయిన శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్.ఎల్.ఎఫ్.పి) లోనూ, ప్రభుత్వం లోనూ ప్రధాన బాధ్యతలు నిర్వహించిన మైత్రీపాల సిరిసేన రాజపక్సేపై తిరుగుబాటు చేసి బైటికి రావడమే కాకుండా ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా నిలబడి రాజపక్సేపై విజయం సాధించాడు.

శ్రీలంక ఫ్రీడం పార్టీలో గణనీయమైన పలుకుబడి కలిగి ఉన్నట్లుగా భావిస్తున్న మాజీ అధ్యక్షురాలు చంద్రిక కుమారతుంగ, సిరిసేన విజయంలో ముఖ్య పాత్ర పోషించింది. అధికార పార్టీ నుండి చీలివచ్చి ప్రతిపక్షాలతో జతకలిసిన ముఠాను సిరిసేన వెంట వచ్చేలా చేయడంలో ఆమెదే ప్రధాన పాత్ర. అయితే రాజపక్సే ఓటమిలోనూ చంద్రిక నిలబెట్టిన వ్యక్తి ఎన్నికయ్యేలా చూడడంలోనూ అమెరికా కీలక భూమిక నిర్వహించడం కార్పొరేట్ పత్రికలు పెద్దగా పట్టించుకోని సంగతి. తాను అధ్యక్షురాలిగా ఉన్న కాలంలో అమెరికా అడుగులకు మడుగులొత్తిన చంద్రిక తన సామ్రాజ్యవాద మాస్టర్ ప్రయోజనాల కోసం సొంత పార్టీని సైతం చీల్చడానికి వెనుకాడలేదు.

ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసి సిరిసెనను ఉమ్మడి అభ్యర్ధిగా నిలపడంలో అమెరికా సామ్రాజ్యవాదులు శ్రద్ధ తీసుకున్నారు. హిందూ మహా సముద్రంలో కీలక ప్రాంతంలో ఉన్న శ్రీలంకను వదులుకోలేమన్న అంచనాతో చైనాతో స్నేహంగా వ్యవహరిస్తున్న రాజపక్సేను పదవీచ్యుతుడిని చేయడానికి ఎన్ని చేయాలో అమెరికా అన్నీ చేసింది. తమిళులు, ముస్లింలు మూకుమ్మడిగా వ్యతిరేక ఓటు వేయడం వల్లనే రాజపక్సే ఓడిపోయాడని పత్రికలు కధనాలు వెలువరిస్తున్నాయి. ది హిందు లాంటి పత్రికలు సైతం సిరిసేన విజయాన్ని ‘ప్రజాస్వామ్యం సాధించిన విజయం’గా కీర్తిస్తున్నాయి.

8 సం.ల పాటు శ్రీలంకలో జాత్యహంకార, ఫాసిస్టు పోలీసు పాలన సాగించిన మహేంద్ర ఓటమిలో ఆయన స్వయం కృత్యాలు ముఖ్యపాత్ర పోషించాయనడంలో సందేహం లేదు. ఆయన సాగించిన అవినీతి కుటుంబ పాలన సింహళీయులలో వ్యతిరేకత పెరగడానికి కారణం కాగా, ముస్లింలు మరియు తమిళులపై సింహళ జాత్యహంకార సంస్ధలు, రౌడీ ముఠాలు సాగించిన అకృత్యాలు మైనారిటీ జాతులు, మతాల ప్రజలలో తీవ్ర అసంతృప్తిని ప్రోది చేశాయి. ఇవి కాకుండా ఐ.ఎం.ఎఫ్ ఆదేశాల ప్రకారం అమలు చేసిన పొదుపు ఆర్ధిక విధానాలు మహేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను సృష్టించాయి.

ఎన్నికలు ప్రకటించేనాటికి సిరిసేన ఆరోగ్య మంత్రి. ఆయన మందీ మార్బలం ఉన్న వ్యక్తి కాదు. తగిన ఆర్ధిక వనరులు కూడా లేని వ్యక్తి. కనీసం ఉపన్యాసాలు దంచగల నేర్పు కూడా ఆయనకు లేదు. అలాంటి సిరిసేన కొద్ది రోజుల్లోనే ప్రతిపక్షాల ఏకాభిప్రాయ వ్యక్తిగా బరిలో నిలవడం పరిశీలకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నికలు దగ్గరపడే కొంది ప్రచారం ఊపందుకున్నాక గాని వారికి అర్ధం కాలేదు, సిరిసేన గెలుపుకు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు తీవ్ర స్ధాయిలో కృషి చేస్తున్నాయని.

అంతర్జాతీయ కారణాలలోకి వెళ్ళే ముందు రాజపక్సే సాగించిన అకృత్యాల గురించి ప్రస్తావించుకోవడం అవసరం. 2009లో ఎల్.టి.టి.ఇ తో జరిగిన పోరులో విజయం సాధించి 30 యేళ్లకు పైగా నలుగుతున్న జాతి సమస్యను పరిష్కరించిన నేతగా మహేంద్ర రాజపక్ష సింహళ ప్రజల్లో భారీ ప్రతిష్ట సంపాదించాడు. పోరాటం చివరి రోజుల్లో పట్టుబడిన ఎల్.టి.టి.ఐ సైనికులతో పాటు  అమాయక తమిళ ప్రజలను సైతం వేలాది మందిని నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టించిన కర్కశ ఫాసిస్టు నేతగా ఆయన అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు. తమిళ ప్రజలను, నిరాయుధులైన ఎల్.టి.టి.ఇ సైనికులను చేతులు వెనక్కి విరిచి కట్టి సింహళ సైనికులు కాల్చి చంపిన దృశ్యాలు అనేకం ఇంటర్నెట్ లో బహుళ ప్రచారం పొందాయి.

శ్రీలంకలో మాత్రం రాజపక్ష ఎదురు లేని నేతగా కొనసాగాడు. ప్రభుత్వంలో ప్రధాన పదవులను తన కుటుంబ సభ్యులకు కట్టబెట్టాడు. రక్షణ మంత్రిగా తన సోదరుడు గోటబాయకు పెత్తనం అప్పగించాడు. ఐ.ఎం.ఎఫ్ ప్రేరేపించిన సంస్కరణల ఆర్ధిక విధానాల ఫలితంగా రాజపక్ష కుటుంబం, బంధువులు విచ్చలవిడి అవినీతితో కోట్లు గడించారు. రాజపక్ష తన పార్టీలో అసమ్మతిని అణచివేశాడు. పార్టీ సీనియర్ నేతలకు తగిన పదవీ గౌరవం ఇవ్వలేదు.  ప్రతిపక్షాలను చెల్లా చెదురు చేస్తూ ఫాసిస్టు పాలన అమలు చేశాడు. ఎల్.టి.టి.ఇ తో పోరాటం ముగిసిన దరిమిలా తాను హామీ ఇచ్చిన అధికారాల పంపిణీని అడ్డంగా నిరాకరించాడు. ఇదిగో ఇస్తున్నాం అంటూనే సంవత్సరాలు గడిపేశాడు.

ఐరాస లాంటి అంతర్జాతీయ సంస్ధలు నియమించిన విచారణ కమిటీలు దేశం నుండి ఖాళీ చేసేలా ఒత్తిడి చేశాడు. వారు దేశంలో అడుగు పెట్టకుండా కొన్ని నెలలపాటు నిరోధించాడు. అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి వచ్చాక మాత్రమే అనుమతించాడు. తీరా వచ్చాక, పార్టీ కార్యకర్తలతో ఐరాస ప్రతినిధులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయించాడు. తమిళులపై జరిగిన ఊచకోతపై విచారణ చేయడానికి ప్రభుత్వ కమిటీ నియమించినప్పటికీ అది పని చేసిన పాపాన పోలేదు. తూతూ మంత్రం విచారణలు జరిపించి, చర్యలు తీసుకున్నట్లు బూటకపు నివేదికలు తయారు చేయించాడు. యుద్ధం రోజుల్లో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో శ్రీలంక సైనికులు ఆక్రమించిన తమిళుల వ్యవసాయ భూములను, ఇళ్లను, గ్రామాలను తిరిగి అప్పజెప్పడానికి నిరాకరించాడు. లేదా అదిగో, ఇదిగో అంటూ వాయిదా వేస్తూ గడిపాడు. ఆ విధంగా తమిళ ప్రాంతాల మిలట్రీకరణ కొనసాగించాడు. తమిళులకు ఇస్తామని చెప్పిన పాలనాధికారాలను ఇవ్వడంలో విఫలం అయ్యాడు.

శ్రీలంకలో తమిళులు కాకుండా గణనీయ సంఖ్యలో ఉన్న మైనారిటీలు, ముస్లింలు. మొదటి రెండు పర్యాయాలు వారు రాజపక్షతోనే ఉన్నారు. కానీ రౌడీ మూకలతో కూడిన సింహళ జాత్యహంకార సంస్ధ ‘బోడు బాల సేన’ రాజపక్ష పాలన సాగినన్నాళ్లూ ముస్లింలపై అడపా దడపా దాడులకు పాల్పడుతూ వచ్చింది. 2013లో అయితే ముస్లింలపై భారీ మొత్తంలో హంతక దాడులు జరిగాయి. ఈ జాత్యహంకార మూకలను కట్టడి చేసేందుకు రాజపక్ష ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. 2013 నాటి అల్లర్లను నివారించడానికి గానీ, అల్లర్ల అనంతరం విచారణ జరిపించి ముస్లింలను స్వాంతనపరచడానికి గానీ కృషి చేయలేదు. ఫలితంగా ముస్లింలు కూడా ఆయనపై తీవ్ర వ్యతిరేకత పెంచుకున్నారు. అధికార పార్టీ ఎస్.ఎల్.ఎఫ్.పికి దూరం జరిగారు.

శ్రీలంక ఎన్నికలు మొదలుకే ఒక సంక్షోభం తరహాలో ప్రకటించబడ్డాయి. ఒకే వ్యక్తి రెండు కంటే ఎక్కువ పర్యాయాలు అధ్యక్షుడుగా పని చేయడం అక్కడ రాజ్యాంగ విరుద్ధం. కానీ తన అవినీతి సంపాదనను, కుటుంబ పాలనను మరో 6 సం.ల పాటు కొనసాగించడానికి, తన రాజకీయ బలగాలను సుస్ధిరం కావించుకోవడానికి రాజపక్ష రాజ్యాంగ సవరణకు పూనుకున్నాడు. సవరణ అయ్యాక తన ప్రభ కొనసాగుతుండగానే ఎన్నికలకు వెళ్ళడం మంచిదని భావించి రెండేళ్ల ముందే ఎన్నికలు ప్రకటించాడు. ఆనాటికి రాజపక్షకు ఎదురు లేదు. మళ్ళీ ఆయనే అధ్యక్షుడు కావడం తధ్యం అని అందరూ భావించారు.

కానీ రాజపక్ష ఒకటి తలిస్తే అంకుల్ సామ్ మరొకటి తలిచాడు. బారక్ ఒబామా ప్రకటించిన ‘ఆసియా-పివోట్’ వ్యూహానికి రాజపక్ష ఏలుబడిలోని శ్రీలంక ముల్లులా మారుతోందని అమెరికా సామ్రాజ్యవాదులు భావించారు. చైనాతో వాణిజ్య, రాజకీయ సంబంధాలను శ్రీలంక పెంపొందించుకోవడం అమెరికాకు బొత్తిగా రుచించలేదు. ‘ఆసియా-పివోట్’ వ్యూహాన్ని రచించిందే చైనా ఎదుగుదలను ఆటంకపరచడం కోసం. అలాంటి చైనా శ్రీలంకలో రెండు నౌకా రేవు పట్టణాలను నిర్మిస్తోంది.  హంబన్ తోట పోర్ట్ నిర్మాణం పూర్తి కాగా కొలంబోలో మరో పోర్ట్ టర్మినల్ నిర్మాణంలో ఉంది. శ్రీలంకలో మొదటి 4 లేన్ల ఎక్స్ ప్రెస్ వే చైనాయే నిర్మించి ఇచ్చింది. ఈ మౌలిక నిర్మాణాల ద్వారా శ్రీలంకతో బంధాన్ని చైనా పటిష్టం చేసుకుంది.

…………………ఇంకా ఉంది.

One thought on “శ్రీలంక ఎన్నికలు: దక్షిణాసియాలో పెరుగుతున్న అమెరికా పెత్తనం

  1. శ్రీలంక ఒకవైపు చైనాకు దగ్గరవుతున్నదన్న భ్రమలు కల్పించుతోంది,మరోవైపు అమెరిక పెత్తనంలోని ఐ.యం.యఫ్ సూచించిన మార్గంలో పయనిస్తూ ఉభయులకూ వారధిలా పనిచేస్తూంటే,శ్రీలంకలో ఆమెరిక పెత్తనాన్ని చైనా ఎందుకు ఉపేక్షిస్తూంది?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s