శ్రీలంక ఎన్నికలు: ఆసియా-పివోట్ వ్యూహంలో ఆహుతి -2


Sri Lanka’s new President Maithripala Sirisena

Sri Lanka’s new President Maithripala Sirisena

చైనా, శ్రీలంకల మధ్య వాణిజ్యం ఏటికేడూ పెరుగుతూ పోతోంది. 2013లో ద్వైపాక్షిక వాణిజ్యం 3 బిలియన్ డాలర్లు దాటింది. శ్రీలంకకు దిగుమతులు ఇండియా తర్వాత చైనా నుండే ఎక్కువ వస్తాయి. కానీ శ్రీలంక ఎగుమతుల్లో 2 శాతం మాత్రమే చైనాకు వెళ్తాయి. ఫలితంగా శ్రీలంకకు చైనాతో భారీ వాణిజ్య లోటు (2012లో 2.4 బిలియన్ డాలర్లు) కొనసాగుతోంది. త్వరలోనే ఇరు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోగలవని పరిశీలకులు అంచనా వేస్తున్న దశలో ఎన్నికలు జరిగాయి. ఈ ఒప్పందం కుదిరితే వాణిజ్యపరంగా చైనాకే ఎక్కువ లాభం అయినప్పటికీ చైనా నుండి అందుతున్న అంతర్జాతీయ స్ధాయి రాజకీయ మద్దతు, సహాయం రూపంలో అందుతున్న డబ్బుతో పోలిస్తే శ్రీలంకకు ఇదేమంత లెక్కలోనిది కాదు.

చైనాకు చమురు సరఫరా అయ్యే అంతర్జాతీయ సముద్ర మార్గాల వెంట యుద్ధ నౌకలను మోహరించి అమెరికా చైనా సరఫరా మార్గాలను తన అదుపులో పెట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీనికి ప్రతిగా చైనా 21వ శతాబ్దపు మారిటైమ్ సిల్క్ రోడ్ (ఎం.ఎస్.ఆర్) ను తలపెట్టింది. హిందూ మహా సముద్రం వెంట పాకిస్తాన్ లో ఉన్న గ్వాదర్ పోర్టు, శ్రీలంకలోని హంబన్ తోట పోర్టు, బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ పోర్టు… ఇవి ఎం.ఎస్.ఆర్ లో భాగంగా ఉన్నాయి. ఈ పోర్టులన్నింటి ఆధునీకరణకు సహాయం చేయడంద్వారా వాటిని తన అదుపులో ఉంచుకోవడం చైనా లక్ష్యం. తద్వారా అమెరికా వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని చైనా రచించుకుంది. దీని వల్ల దక్షిణాసియా నౌకా రవాణా మార్గాలపై పట్టు లభిస్తుంది. 

హిందూ మహా సముద్రంలో చైనా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ప్రవేశించడానికి శ్రీలంక సహకరించింది. తన నౌకా రేవు పట్టణాల్లో వివిధ కారణాలతో ప్రవేశం కల్పించింది.  చైనా ప్రభుత్వ ఫైనాన్స్ కార్పొరేషన్ల నుండి బిలియన్ల కొద్దీ సాయాన్ని అందుకున్న దరిమిలా రాజపక్ష ప్రభుత్వం చైనా పట్ల ఈ విధంగా కృతజ్ఞత ప్రకటించుకుంది. అప్పటి వరకు బ్రిటిష్, అమెరికన్ యుద్ధ విన్యాసాలకు మాత్రమే కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో చైనా యుద్ధ నౌకలు కనపడడం పశ్చిమ సామ్రాజ్యవాదులకు ఒక పీడకలగా మారింది.

చైనా వ్యూహానికి శ్రీలంక సహకరించడం అమెరికాకు సహజంగానే నచ్చలేదు. సైద్ధాంతికంగా స్వేఛ్ఛా వాణిజ్య సూత్రాలను బోధించే అమెరికా ఆచరణలోకి వచ్చేసరికి ‘స్వేచ్ఛా వాణిజ్యం’లోని స్వేచ్ఛను తుంగలో తొక్కి ప్రత్యర్ధులను బలప్రయోగం ద్వారా తన దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. తన మిలట్రీ బలాన్ని చూపిస్తూ తనకు మాత్రమే స్వేచ్ఛావాణిజ్య ఫలాలు దక్కేలా జాగ్రత్తవహిస్తుంది. తనకు పోటీ వచ్చే ప్రత్యర్ధికి మాత్రం ఎటువంటి స్వేచ్చ ఉండరాదని కోరుకుంటుంది. అందరు తనకు లోబడి వాణిజ్యం చేయాలని డిమాండ్ చేస్తుంది. సమాన వాణిజ్యం అని చెబుతూ తనకు అనుకూలంగా ఉండే అసమాన సూత్రాలను రుద్దుతుంది.

ఉదాహరణకు సిరియాలో అస్సాద్ ప్రభుత్వాన్ని కూలదోయడంలో రష్యా రాజకీయంగా సహకరించనందుకు ఉక్రెయిన్ లో ఉగ్రవాద, ఫాసిస్టు మూకలను రెచ్చగొట్టి ఆ దేశాన్ని అల్లకల్లోలం కావించిన ఉదంతం వర్తమానం లోనిదే. తద్వారా రష్యాకు, ఉక్రెయిన్ ప్రజలకు శాంతి లేకుండా చేసింది అమెరికా. సౌదీ అరేబియా చేత మిలియన్ల కొద్దీ బ్యారెళ్ళ చమురును మార్కెట్ లో కుమ్మరింపజేయడమే కాకుండా తాను కూడా షేల్ చమురు, గ్యాస్ లను భారీగా ఉత్పత్తి చేస్తూ చమురు ధరలు అమాంతం సగానికి దిగ్గోయడం కూడా రష్యా ఆర్ధిక వ్యవస్ధను ఛిన్నాభిన్నం చేయడానికే. రష్యాతో పాటు తన మాట వినని ఒపెక్ దేశాలు వెనిజులా, ఈక్వడార్, నైజీరియాల ఆర్ధికశక్తిని దెబ్బతీసే లక్ష్యంతో అమెరికా అంతర్జాతీయ చమురు వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తోంది. ఇదే తరహాలో చైనా వాణిజ్య ప్రయోజనాలు విస్తరించకుండా అడ్డుకునే క్రమంలో శ్రీలంక ఎన్నికలలో తనకు అనుకూలంగా పని చేసే అభ్యర్ధులు విజయం సాధించేందుకు అమెరికా రంగంలోకి దిగింది.

రాజపక్ష అధ్యక్ష ఎన్నికలు ప్రకటించిన వెంటనే అమెరికా చురుకుగా పావులు కదిపింది. ఫలితంగా అనుకోని రీతిలో పాలక పార్టీ అయిన ఎస్.ఎల్.ఎఫ్.పి జనరల్ సెక్రటరీ, కేంద్ర ఆరోగ్య మంత్రి అయిన మైత్రీపాల సిరిసేన పదవికి, పార్టీకి రాజీనామా చేసేశాడు. అమెరికాకు అనుకూలంగా పనిచేసే ప్రతిపక్ష పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ (యు.ఎన్.పి)తో జత కలిశాడు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా దిగబోతున్నట్లు ప్రకటించి బైటిదేశాల పరిశీలకులను ఆశ్చర్యపరిచాడు. ఎస్.ఎల్.ఎఫ్.పిలో గణీయమైన పలుకుబడి మిగిలిఉన్న విశ్రాంత రాజకీయవేత్త, మాజీ అధ్యక్షురాలు, అమెరికా బంటు అయిన చంద్రిక కుమారతుంగ అమెరికా వ్యూహం అమలుకోవడంలో అమితమైన చొరవ తీసుకుంది. ఆమె తన పనిని క్లింటన్ ఫౌండేషన్ ద్వారా సమకూరిన నిధులతో చక్కబెట్టిందని అంతర్జాతీయ విశ్లేషకుల ద్వారా తెలుస్తున్న విషయం.

నిజానికి రాజపక్ష అమెరికాను వ్యతిరేకించిన దాఖలా ఏమీ లేదు. అమెరికా, పశ్చిమ రాజ్యాల కింద పని చేసే ఐ.ఎం.ఎఫ్ నిర్దేశించిన వ్యవస్ధాగత సర్దుబాటు కార్యక్రమాన్ని, పొదుపు ఆర్ధిక విధానాలను ఆయన త్రికరణ శుద్ధిగా, కర్కశంగా అమలు చేశాడు. ప్రజల్లో ఆయనపై వ్యతిరేకత ప్రబలడానికి అదే ప్రధాన కారణం. కానీ ఆయన చేసిన మరోపని చైనాతో కూడా వాణిజ్య సంబంధాలు పెంపోందించుకోవడం. చైనాతో అతి పెద్ద వ్యాపార భాగస్వామి అమెరికాయే. కానీ ఇతర దేశాలు మాత్రం తాను చెప్పిన దేశాలతోనే వాణిజ్యం చేయాలని అమెరికా శాసిస్తుంది. రాజపక్ష శ్రీలంక దళారీ పాలక వర్గాల ప్రతినిధి. ఆర్ధిక సంక్షోభంలో కునారిల్లుతూ తనను నమ్ముకున్న మూడో ప్రపంచ దేశాలకు ఆశించినంతగా సాయం చేయలేకపోతున్న అమెరికాను నమ్ముకోలేక ఆర్ధిక బలిమితో వృద్ధి చెందుతున్న చైనాతో చెలిమి చేసేందుకు అనేక మూడో ప్రపంచ దేశాలలోని దళారీ పాలకవర్గాలు సుముఖంగా ఉన్నారు. వారికి తమకు కావలసింది ఎవరు సమకూర్చినా ఓ.కె. ఇవ్వగలిగే స్ధితిలో అమెరికా లేదు గనక మెల్లగా చైనా పంచన చేరుతున్నారు. అమెరికా తన ఆర్ధిక శక్తి బలహీనపడే కొంది తన మిలట్రీ శక్తిపై అంతకంతకు ఎక్కువగా ఆధారపడవలసిన పరిస్ధితిలో పడిపోతోంది. మిలట్రీపై ఆధారపడే కొంది శత్రు శిబిరాన్ని కూడా పెంచుకుంటోంది.

అంతర్జాతీయ రాజకీయార్ధిక చలనంలో ఇది అనివార్యమైన పరిణామం. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ యుగంలో ఆర్ధిక బలిమి, తద్వారా రాజకీయ బలిమి వివిధ కేంద్రాల మధ్య బదలాయింపు అవుతూ ఉంటుంది. ఆర్ధిక స్ధిరత్వాన్ని నెలకొల్పలేని పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం గతిశీలతలోనే ఇది స్వాభావికంగా నెలకొని ఉంటుంది.

అమెరికా ప్రకటించిన ఆసియా-పివోట్ వ్యూహంలో శ్రీలంకను పూర్తిగా తన ప్రభావంలో ఉంచుకోవడం ముఖ్య అవసరంగా అమెరికా భావిస్తోంది. ఇప్పటి విదేశీ మంత్రి జాన్ కెర్రీ 2009లో తయారు చేసిన నివేదికలో హిందూ సముద్రంలో కీలక స్ధానంలో ఉన్న శ్రీలంకను ప్రత్యర్ధి శిబిరంలో ఉండడానికి ఎంత మాత్రం వీలులేదని హెచ్చరించడం ఈ సందర్భంగా గమనార్హం. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రభుత్వం తన ఆసియా హై కమాండ్ ను శ్రీలంక నుండే నిర్వహించడాన్ని కూడా గుర్తు తెచ్చుకోవడం సముచితం.

చైనాతో వాణిజ్య సంబంధాలు శ్రీలంక వైపు నుండి చూస్తే అవసరంతో కూడినది. కానీ శ్రీలంకతో వాణిజ్య సంబంధాలు చైనాకు వాణిజ్య పరంగా కంటే వ్యూహాత్మకంగానే ఎక్కువ ప్రాధాన్యత కలిగినవి. అందువల్ల చైనా-శ్రీలంకల మధ్య సంబంధాలు వృద్ధి చెందితే అందుకు ఎవరైనా, ఏ కారణంతోనైనా శ్రీలంకను తప్పు బట్టడం హ్రస్వ దృష్టి కాగలదు. భారత పాలకులు ఆ పని చేస్తున్నారు. అదీ కాక రెండు సార్వభౌమ దేశాలు తమ తమ ప్రజల ప్రయోజనాలకు సంబంధించినంత వరకు ఎలాంటి సంబంధాలనైనా పెట్టుకునే హక్కు ఉంటుంది. వాటిని తప్పు పట్టే హక్కు ఎవరికీ లేదు. కానీ అమెరికా మాత్రం ప్రపంచం నిండా తన జాతీయ ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంది. ఆ పేరుతో నేరుగా దాడులు చేస్తుంది. పరోక్ష యుద్ధాలు చేస్తుంది. సంఘ వ్యతిరేక శక్తులతో తిరుగుబాట్లు నిర్వహిస్తుంది. ఆయా దేశాల జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టి అస్తవ్యస్తం కావిస్తుంది. శ్రీలంకలో సైతం అమెరికా చేసింది అదే. అమెరికా అనుకూల శక్తుల ప్రమేయం, బహుళజాతి కంపెనీల కొనుగోళ్ళు లేకుండా కర్కశ పాలకుడిగా పేరు పొందిన మహేంద్ర రాజపక్ష పార్టీ నుండి సిరిసేన లాంటి మంది మార్బలం లేని వ్యక్తి బైటికి రావడం సాధ్యం కాదు.

2010 నుండి మహేంద్ర రాజపక్షను దారికి తెచ్చుకోవడానికి అమెరికా విశ్వ ప్రయత్నాలు చేసింది. ఎల్.టి.టి.ఇ పైనా, తమిళ ప్రజలపైనా, మహేంద్ర ప్రభుత్వం సాగించిన ఊచకోతలు అమెరికా అనుమతి లేకుండా ఏమీ జరగలేదు. అయినప్పటికీ రాజపక్ష చైనావైపు చూస్తుండడంతో ఆ దేశంలో తమిళుల మానవ హక్కులు, శ్రీలంక యుద్ధ నేరాలు అమెరికాకు హఠాత్తుగా గుర్తుకు వచ్చాయి. ఐరాస మానవ హక్కుల సంస్ధలో శ్రీలంక యుద్ధ నేరాలపై తీర్మానాలు ప్రతిపాదిస్తూ వచ్చింది. మొదట తీర్మానాన్ని కఠినంగా తయారు చేయడం, దానిపై పశ్చిమ పత్రికలు హడావుడి చేయడం, ఆనాటి వీడియోలు, ఫోటోలు ప్రచురించడం చివరి నిమిషంలో తీర్మానాన్ని నీరుగార్చడం… ఇలా ఒక పద్ధతిగా అమెరికా చేస్తూ వచ్చింది.

అయితే రాజపక్షను తనకు తగినంతగా దారికి తెచ్చుకోవడంలో, చైనాతో సంబంధాలను రద్దు చేసుకునేలా ప్రభావితం చేయడంలో అమెరికా విఫలం అవుతూ వచ్చింది. దానికి కారణం ముందు చెప్పుకున్నట్లు దళారీ ప్రభుత్వాలు మునిగిపోయే ఓడకంటే తేలిఉన్న ఓడలోకి దూకడానికి మొగ్గు చూపడమే. ఈ పరిస్ధితుల్లో రాజపక్షను ఇంకా సంవత్సరాల తరబడి బెదిరింపులతో, నచ్చజెప్పే ధోరణితో దారికి తెచ్చుకోవడం కుదరదని అమెరికా తేల్చుకుంది. ఇప్పటికే ఎక్కువ కాలం ఓపిక వహించామని కూడా అమెరికా భావించి ఉండవచ్చు. ఎన్నికలు ప్రకటించగానే పావులు కదిపి చంద్రిక ద్వారా సిరిసెనను తెరపైకి తెచ్చింది. ఉప్పు-నిప్పుగా ఉండే ప్రతిపక్షాలపై ఒత్తిడి తెచ్చి కనీసం ఎన్నికల వరకు ఏకం చేసింది. చివరికి సో-కాల్డ్ లెఫ్ట్ పార్టీలు కూడా (తమ అభ్యర్ధులను నిలుపుతూనే) సిరిసేనను ప్రజాస్వామిక అభ్యర్ధిగా ప్రకటించాయి.

ఎన్నికలు జరిగిన రోజు కూడా ఒబామా ప్రభుత్వం హెచ్చరికలు విడుదల చేసింది. అమెరికా తెరవెనుక సాగించిన ప్రయత్నాలను ఈ హెచ్చరికలే స్పష్టం చేశాయి. “ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరుతున్నాము. స్వేచ్ఛగా, హింసారహితంగా నిర్వహించాలి. రాజపక్ష ఓడిపోయినట్లయితే గెలిచిన అభ్యర్ధికి శాంతియుతంగా అధికారాన్ని అప్పజెప్పాలి” అని ఎన్నికల దినాన విదేశీ మంత్రి జాన్ కేర్రీ ప్రకటన విడుదల చేశాడు. ఈ హెచ్చరిక అర్ధం స్పష్టమే. రాజపక్ష ఓడిపోతున్నాడని అమెరికా ముందుగానే నిర్ణయించింది. ఓడిపోయిన తర్వాత అధికారానికి అంటిపెట్టుకోరాదని, ఒకవేళ పొరపాటున గెలిచినా తాము చూస్తూ ఉండలేమని కెర్రీ తన ప్రకటన ద్వారా శ్రీలంక ప్రభుత్వ యంత్రాంగాలకు, రాజపక్షకు సందేశం పంపాడు.

దీనికి తగ్గట్టుగానే ఓడిపోతున్నానని తెలిసి రాజపక్ష అధికారంలో కొనసాగడానికి మిలట్రీ, పోలీసుల సహాయం కోరాడని వార్తలు వచ్చాయి. అయితే రాజపక్ష కోరికను మిలట్రీ అధిపతి, పోలీసు అధిపతి నిర్ద్వంద్వంగా నిరాకరించారని కొన్ని పత్రికలు తెలిపాయి. పశ్చిమ పత్రికలు ఈ వార్తకు భారీ ప్రచారం కల్పించాయి. సైన్యం, పోలీసులు సహాయ నిరాకరణ చేయడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో రాజపక్ష ఓటమి అంగీకరించి అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేశాడని సిరిసేన ప్రతినిధి కూడా ప్రకటించాడు. రాజపక్ష సాగించిన అకృత్యాలపై విచారణ జరపనున్నామని నూతన అధ్యక్షుడు సిరిసేన ప్రకటించాడు.

ఒక్క శ్రీలంకలోనే కాదు. గత అయిదేళ్లలో ఆసియాలో అమెరికా నిరంతరం జోక్యం చేసుకుంటూ వచ్చింది. ఈ జోక్యందారి విధానాలు నేరుగా చైనాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడ్డాయి. 2010లో జపాన్ ప్రధాని యూకీయో హటోయామా తొలగింపులో అమెరికా హస్తం ఉంది. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్ రడ్ తొలగింపులోను అమెరికా హస్తం ఉంది. వీరు ఇద్దరూ చైనాతో ఘర్షణ పడడం కంటే చెలిమి చేయడమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమేరకు కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. ఫలితంగానే జపాన్, ఆస్ట్రేలియాలలో ప్రభుత్వాలు మారిపోయేలా అమెరికా కృషి చేసింది. ఇప్పుడు ఈ రెండు దేశాలు చైనాకు వ్యతిరేకంగా దూకుడుగా ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఆస్ట్రేలియా అయితే రష్యాపైన కూడా విషం కక్కుతోంది. బర్మాలోనూ అమెరికా జోక్యం చేసుకుని చైనా పెట్టుబడులు సఫలం కాకుండా చూసింది. బెదిరింపులు, ఆర్ధిక ప్రోత్సాహకాలు రెండూ ప్రయోగించి బర్మాను దారికి తెచ్చుకుంది. దానితో చైనా పెట్టుబడులను బర్మా సస్పెండ్ చేసింది. మిలట్రీ సంబంధాల స్ధాయిని తగ్గించుకుంది. ఈ వరుసలో శ్రీలంకలో సైతం తనకు అనుకూల ప్రభుత్వాన్ని నిలపడంలో అమెరికా సఫలం అయింది. ఇండియాలోను మోడి గెలుపుకు అమెరికా బహుళజాతి కంపెనీలు కృషి చేయడం గమనార్హం.

సిరియా, ఉక్రెయిన్, శ్రీలంకలలో జరిగిన పరిణామాలు అమెరికా తెగింపును సూచిస్తున్నాయి. ఆర్ధిక బలిమి తగ్గిపోతున్న క్రమంలో తన సైనిక బలిమితో ఆధిపత్యం కొనసాగించేందుకు అమెరికా ప్రయత్నాలు తీవ్రం చేస్తోంది. సంక్షోభం నుండి బైటికి రాలేకపోతున్న అమెరికా మరింత దూకుడుగా పోటీ లేకుండా మార్కెట్లను హస్తగతం చేసుకునేందుకు తెగిస్తోంది. ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకులతో పాటు ద్వైపాక్షిక ఒప్పందాలు, ఒత్తిడులు కూడా ప్రయోగిస్తూ సంక్షోభాన్ని అధిగమించేందుకు కృషి చేస్తోంది.

కానీ సామ్రాజ్యవాద సంక్షోభం పెట్టుబడిదారీ దోపిడి తీవ్రతను మరింత పెంచడం ద్వారా పరిష్కారం అయ్యేది కాదు. సైనిక బలిమి ద్వారా దోపిడి తీవ్రతను పెంచడం అంటే ఫాసిస్టు విధానాలకు మరింత దగ్గర కావడమే. ఫ్రాన్స్ లో పత్రికపై దాడిని సాకుగా చూపుతూ ఆ దేశంలోని పచ్చి ఫాసిస్టు పార్టీ ‘నేషనల్ ఫ్రంట్’ తో అక్కడి ‘సోషలిస్టు’ అధ్యక్షుడు ఒలాండే చర్చలు జరుపుతున్నాడు. శ్రీలంకలోనూ ప్రజాస్వామ్యం పేరుతో, అమెరికా పనుపున సిరిసేన ప్రభుత్వం రాజపక్ష ఫాసిస్టు పాలనను మరింత తీవ్రం చేయనున్నాడు. ఎల్.టి.టి.ఇ వంకతో రాజపక్ష కఠిన చట్టాలను ఉనికిలోకి తెచ్చాడు. సిరిసేన ప్రజాస్వామ్య పాలకుడు అయితే ఈ చట్టాలను రద్దు చేయాలి. వాస్తవంలో ఈ చట్టాలను సిరిసేన కొనసాగిస్తాడు. అమెరికా రుద్దే విధానాలను అమలు చేయాలంటే సిరిసేన మరిన్ని రాక్షస చట్టాలను చేసినా ఆశ్చర్యం లేదు.

అమెరికా సామ్రాజ్యవాద దూకుడుకు అంతిమంగా బలయ్యేది ఆయా దేశాల్లోని కార్మికవర్గ ప్రజానీకమే. సామ్రాజ్యవాద అణచివేతను, దోపిడీని, సామ్రాజ్యవాద సేవలో తరించిపోయే దళారీ పాలకుల విధానాలను ఎదుర్కోవాలంటే శ్రామిక ప్రజలకు పోరాటాలు తప్ప దారి లేదు. శ్రీలంక ప్రజలు సైతం ఈ సత్యాన్ని గ్రహించి అందుకు అనుగుణంగా రాజకీయంగా చురుకుదనాన్ని ప్రదర్శించాలి. పాలకవర్గ పార్టీలు కల్పించే భ్రమలను వీడి సొంత దారి వెతుక్కోవాలి.

 

One thought on “శ్రీలంక ఎన్నికలు: ఆసియా-పివోట్ వ్యూహంలో ఆహుతి -2

  1. ఈ లెక్కన మోదీ కూడా ఫాసిస్టు పాలనను మరికొన్ని రోజులలో తెరపైకి తేనున్నాడన్నమాట! వీలైతే ఎమెర్జెన్సి ని కూడా ప్రయోగించనున్నాడన్నమాట!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s