మొదటి భాగం తరువాత………………..
ప్యారిస్ పత్రికపై జరిగిన దాడిలో పాల్గొన్నవారు అసలు ఉగ్రవాదులే కాదని, ఫ్రాన్స్ గూఢచార సంస్ధల ప్రోద్బలంతో వారి ఏజెంట్లుగానే దాడి చేశారు తప్ప ఉగ్రవాదులుగా దాడి చేయలేదని అనుకోవలసిన అవసరం లేదు. ఫ్రాన్స్ లో పాలకవర్గాలు పనిగట్టుకుని వ్యాపింపజేసిన ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్ల వల్ల, ఫ్రాన్స్ సమాజంలోనూ ప్రభుత్వాల నుండి ఎదురవుతున్న వివక్ష వల్ల తీవ్ర నిరుత్సాహానికి గురయినందునే ఆ ముగ్గురు ముస్లిం పౌరులు ఉగ్రవాద దాడికి తెగబడి ఉండవచ్చు కూడా.
ఫ్రాన్స్ లో ప్రభుత్వ అంగాలన్నీ ముస్లిం వ్యతిరేక వివక్షను అనధికారికంగా పాటిస్తున్నాయి. ముస్లిం పౌరుల పట్ల అధికారులు అల్ప వైఖరిని ప్రదర్శించడం కద్దు. మధ్య ప్రాచ్యంలో అమెరికా, ఐరోపా రాజ్యాలు సాగిస్తున్న కిరాయి తిరుగుబాటుల ఫలితంగా పశ్చిమ దేశాల్లో ముస్లిం వ్యతిరేక ధోరణులు మరింతగా పెచ్చరిల్లుతున్నాయి. ఐరోపా ఋణ సంక్షోభం వల్ల తలెత్తిన నిరుద్యోగ సమస్య కారణంగా ముస్లిం ప్రజలను అక్రమ వలసదారులుగానూ, తమ ఉద్యోగాలను హరిస్తున్న బైటివారుగానూ స్ధానిక ప్రజలు పరిగణిస్తున్నారు. ఫలితంగా సమాజంలో ముస్లింలు నిరాదరణను ఎదుర్కొంటూ వ్యవస్ధపై కసిని పెంచుకుంటున్నారు. ఋణ సంక్షోభం సాకు చూపుతూ అమలు చేస్తున్న పొదుపు విధానాల వల్ల పెరిగిన అసంతృప్తి ఎలాగూ ఉంది. ఇటువంటి పరిస్ధితుల మధ్య యువత ఉగ్రవాదం వైపు మళ్లడం ఆశ్చర్యం కలిగించే విషయం కాదు.
ఫ్రాన్స్, ఇతర ఐరోపా దేశాలలో నెలకొని ఉన్న దుర్భర ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిస్ధితుల మధ్య ముస్లిం యువత ఉగ్రవాదం వైపు మళ్ళి ఉండవచ్చని చెబుతున్నంత మాత్రాన ఈ ఈక్వేషన్ నుండి ప్రభుత్వ గూఢచార సంస్ధలు, భద్రతా సంస్ధల పాత్రను రద్దు చేస్తున్నట్లు కాదు. ఉగ్రవాదం తలెత్తడానికి తగిన పరిస్ధితులు ఫ్రాన్స్, ఇతర ఐరోపా రాజ్యాల్లో ఉన్నాయని గుర్తించాలి. అదే సమయంలో ఆ పరిస్ధితులు ఏర్పడడానికి కారణమూ ఫ్రాన్స్ సామ్రాజ్యవాద పాలకవర్గాలే అన్న సత్యాన్ని కూడా గుర్తించాలి. అధికార వ్యవస్ధలోని అజ్ఞాత వ్యక్తులు లేదా వర్గాలు ఉగ్రవాద దాడులకు తగిన ఏర్పాట్లు చేయకుండా ప్యారిస్ పత్రికపై దాడి జరగడం అసంభవం. సిరియా, లిబియా లలో ఆల్-ఖైదా, ఇసిస్ లకు ధన, ఆయుధ సహాయం అందజేస్తూ, గూఢచార సమాచారం ఇస్తూ, అత్యున్నత స్ధాయి మిలట్రీ శిక్షణ గరుపుతూ తమ దేశానికి వచ్చేసరికి వారు సొంతగా దాడి చేశారని ఫ్రాన్స్ ప్రభుత్వం చెబితే ఎలా నమ్మడం?
వ్యాసంలో ముందు చెప్పినట్లు తాము సిరియా తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేశామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంషా ఒలాండే గతంలో స్వయంగా అంగీకరించాడు. వారు ప్రజాస్వామ్య పోరాటకారులుగా అమెరికా అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్ ప్రధాని కామెరాన్ లు అనేకసార్లు అభివర్ణించారు. అదే పోరాటకారులు తమ దేశాల్లో దాడి చేస్తే ఉగ్రవాదులు అవుతారని వారు చెప్పడం మోసం తప్ప మరొకటి కాదు. ఊహించనలవి కానంతగా అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం, ఆకాశంలో అత్యంత ఎత్తున ఎగిరే మానవ రహిత విమానాల ద్వారా అనుమానితుల కదలికలన్నింటినీ ఎప్పటికప్పుడు రికార్డు చేయగల వసతులు కలిగి ఉన్న గూఢచార సంస్ధల కన్నుగప్పి హత్యాకాండ నిర్వహించడం సాధ్యం కాదు. వాస్తవంలో ఫ్రెంచి గూఢచార సంస్ధలే తగిన శిక్షణ ఇచ్చి, దాడికి అవసరమైన సమాచారం ఇచ్చి, ప్రేరేపించకుండా ఇంత పకడ్బందీగా దాడి జరగదు. తమ నిఘాలో ఉన్న నేరస్ధులను, మాజీ ఉగ్రవాదులను వివిధ కేసుల్లో ఇరికించి, బ్లాక్ మెయిల్ చేసి, దాడులు నిర్వహింపజేయడం కూడా పశ్చిమ దేశాల భద్రతా సంస్ధలకు వెన్నతో పెట్టిన విద్య.
ఇటువంటి దాడులు అంతిమంగా తాము ద్వేషించే పాలకవర్గాల ప్రయోజనాలకే ఉపయోగపడతాయని వివిధ అసంతృప్తులకు గురయిన ముస్లిం యువకులు గుర్తెరగకపోవడం విచారించవలసిన విషయం. దాడి జరిగిన గంటన్నర లోనే అధ్యక్షుడు ఒలాండే పత్రిక కార్యాలయం వద్ద ప్రత్యక్షమై పెద్ద ఎత్తున పోలీసు ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాడు. 3,000 మంది పోలీసులను అప్పటికప్పుడు కదిలించి దుండగులు పారిపోయిన ఉత్తర ప్యారిస్ ను జల్లెడ పట్టించాడు. కష్ట కాలంలో జాతి ఐక్యంగా ఉండాలని గంభీరమైన పిలుపులు ఇచ్చాడు. ప్యారిస్ లోనూ, ఇతర నగరాల్లోనూ భారీ ఆయుధాలు ధరించిన బలగాలను పబ్లిక్ స్ధలాల్లో నిలపాలని ఆదేశాలు ఇచ్చాడు. మాజీ అధ్యక్షుడు సర్కోజీ అనుసరించిన పొదుపు విధానాలనే కొనసాగిస్తూ ప్రజల్లో గతంలో ఏ అధ్యక్షుడు ఎదుర్కోనంత అప్రతిష్టను మూట గట్టుకున్న ఒలాండే ఆ విధంగా ఉగ్ర దాడులను అవకాశంగా అందిపుచ్చుకున్నాడు. సిరియాలో కిరాయి తిరుగుబాటు నిర్వహిస్తున్న ఆల్-ఖైదా శక్తులకు మద్దతు ఇవ్వడాన్ని ఫ్రాన్స్ ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్న నేపధ్యంలో చార్లీ హెబ్దోపై జరిగిన దాడి ద్వారా మధ్యప్రాచ్యంలో అనుసరిస్తున్న హంతక విధానాలకు మద్దతు సమకూర్చుకునే ప్రయత్నాలను ఒలాండే ముమ్మరం చేశాడు.
[ఇద్దరు అనుమానితుల కోసం ఫ్రాన్స్ నగరాలలోని పబ్లిక్ స్ధలాలను, నివాస ప్రాంతాలను, చివరికి ఆకాశాన్ని కూడా మిలట్రీ దాడి తరహాలో నింపేసిన తీరును కింది ఫొటోల్లో చూడవచ్చు. Photos: Daily Mail]
ప్యారిస్ దాడిని అవకాశంగా తీసుకుని ఉగ్రవాదాన్ని అణచివేసే పేరిట విదేశాల్లో సాయుధ జోక్యానికి మద్దతు పొందేందుకు ఫ్రాన్స్ పాలకులు ప్రయత్నిస్తారు. దేశంలో సైతం ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేందుకని చెబుతూ పోలీసులకు, ఇతర భద్రతా సంస్ధలకు మరిన్ని అధికారాలను కట్టబెట్టుకోనున్నారు. ఈ మేరకు ప్రజాభిప్రాయాన్ని ప్రేరేపించేందుకు ప్యారిస్ దాడిని 9/11 దాడులతో పోల్చదగ్గవిగా ఫ్రాన్స్ పత్రికలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. భయాందోళనలకు గురైన ప్రజానీకం ఈ ప్రచారం వలలో తేలికగా పడిపోగలరు. తద్వారా ఫ్రాన్స్ పాలకుల జోక్యందారీ విదేశాంగ విధానానికి, దురాక్రమణ యుద్ధాలకు మద్దతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తారు. ఈ దెబ్బతో దేశంలో ప్రగతిశీల శక్తులు బలహీనపడి ప్రతీఘాతక శక్తులు మరింతగా బలహీనపడతాయి. “ప్యారిస్ లో జరిగిన మూకుమ్మడి హత్యాకాండ ఐరోపాలో ముస్లిం వ్యతిరేక సెంటిమెంటును తీవ్రం చేసి నేషనల్ ఫ్రంట్ లాంటి అతి మితవాద పార్టీలను శక్తివంతం చేయడం ఖాయం” అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కూడా విశ్లేషించడం గమనార్హం. ఇది కూడా ఫ్రాన్స్ పాలకుల లక్ష్యాల్లో ఒకటని వేరే చెప్పనవసరం లేదు. ప్రజల భావజాలాన్ని ప్రగతి వ్యతిరేక దిశలో ప్రేరేపించడానికి ఉగ్రవాద దాడులు ఎల్లప్పుడూ పాలకులకు అక్కరకు వస్తాయి.
ఫ్రాన్స్ పాలకుల కుట్రలను తిప్పి కొట్టడానికి, సంక్షోభ ఆర్ధిక పరిస్ధితుల మధ్య పెరిగిపోతున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి కార్మికవర్గ ప్రజలకు, ఉద్యోగులకు, ప్రగతిశీల శక్తులకు పోరాడడం తప్ప మరొక మార్గం లేదు. ముఖ్యంగా పాలకులు ప్రోత్సహిస్తున్న జాతి, మత, లింగ వైరుధ్యాలకు అతీతంగా ఫ్రాన్స్ ప్రజలు ఐక్యం కావాలి. అమెరికా, ఐరోపా రాజ్యాలు ఉమ్మడిగా అనుసరిస్తున్న జోక్యందారీ విదేశాంగ విధానాలను వారు తిరస్కరించాలి. కార్మికవర్గ అంతర్జాతీయతను గుర్తించి తదనుగుణమైన పోరాటాలను నిర్మించాలి. విదేశాల్లో కిరాయి ఉగ్రవాద మూకల్ని సాయుధం చేస్తూ, స్వదేశంలో అదే ఉగ్రవాదాన్ని సాకు చూపి ప్రజా పోరాటాలను అణచివేసే పాలకుల ఎత్తుగడలను తిప్పికొట్టాలి. మధ్య ప్రాచ్యంలో అరబ్ ప్రజల జాతీయ, ప్రజాస్వామిక పోరాటాలకు మద్దతు ఇవ్వాలి.
…………అయిపోయింది.