ప్యారిస్ దాడి: ఉగ్రవాదులను సాయుధం చేసింది ఫ్రాన్సే


Paris terrorist attack

జనవరి 7వ తారీఖున, కొత్త సంవత్సరం మత్తు ఇంకా వదలని ప్యారిస్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడి మత్తు విదిల్చుకుని అప్రమత్తం అయింది. రెండు దశాబ్దాలలోనే అత్యంత తీవ్రమైన సాయుధ దాడి నగరంపై జరిగిందన్న వార్త ప్యారిస్ పౌరులకు కలవరం కలిగించింది. ముసుగులు ధరించిన దుండగులు కొందరు ప్రఖ్యాత వ్యంగ్య పత్రిక కార్యాలయంపై దాడి చేసి ఎడిటర్ తో పాటు 12 మందిని కాల్చి చంపారని ఆ వార్త వారికి తెలియజేసింది. ఎలాంటి ప్రాధమిక దర్యాప్తు ముగియకుండానే ‘ఇది తీవ్రవాద దాడే’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు సైతం తీర్మానిస్తూ ప్రకటన ఇవ్వడం వారి కలవరాన్ని రెట్టింపు చేసింది. సిరియాలో కొనసాగుతున్న సోకాల్డ్ ‘ప్రజాస్వామ్య తిరుగుబాటు’లో పాల్గొనడానికి వెళ్ళిన ఫ్రాన్స్ పౌరులు త్వరలోనే స్వదేశానికి తిరిగి వచ్చి సొంత గడ్డపై దాడులకు తెగబడవచ్చంటూ తమ పాలకులు గత రెండేళ్లుగా చేస్తున్న హెచ్చరికలు నిజం అవుతున్నాయా అన్న ఆందోళన బహుశా ఆ క్షణంలో వారిని చుట్టుముట్టి ఉండవచ్చు.

దాడి జరిగింది ‘చార్లీ హెబ్దో’ అనే వ్యంగ్య వార పత్రిక కార్యాలయం పైన. ఈ పత్రిక ముస్లిం మతానికి వ్యతిరేకంగా, ముస్లింలు కొలిచే అల్లాను పరిహసిస్తూ అనేకమార్లు కార్టూన్ లు ప్రచురించి ప్రపంచ వ్యాపితంగా ముస్లింల ఆగ్రహాన్ని పోగు చేసుకున్న పత్రిక. ఈ పత్రిక అల్లా చిత్రాన్ని గీసిన కార్టూన్ లను గతంలో ప్రచురించినప్పుడల్లా అనేక దేశాల్లో ఆగ్రహపూరిత ఆందోళనలు, హింసాత్మక దాడులు చెలరేగాయి. ఇలాంటి పత్రికపై దాడి చేసేది ముస్లిం ఉగ్రవాదులే అన్నంతగా పత్రిక ముస్లిం-వ్యతిరేక ప్రతిష్ట ఆర్జించింది. దుండగుల దాడిలో 12 మంది పత్రికా సిబ్బంది చనిపోగా మరో 8 మంది ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. పత్రిక చీఫ్ ఎడిటర్ చార్వ్, కార్టూనిస్టులు కబు, టిగ్నస్ , వొలిన్స్కీలు చనిపోయినవారిలో ఉన్నారు. దాడికి నిరసనగా ఫ్రాన్స్ నగరాలతో పాటు యూరప్ అంతటా ప్రదర్శనలు జరిగాయి. ప్యారిస్, తులుజ్, స్ట్రాస్ బర్గ్ తదితర ఫ్రెంచి నగరాలు, లండన్, బెర్లిన్, రోమ్ లాంటి ఇతర ఐరోపా నగరాలలో ఇస్లామిక్ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు జరిగాయి. ఆయా దేశాల్లోని మితవాద పార్టీలు, ప్రతీఘాతక శక్తులు ఈ ప్రదర్శనలకు నేతృత్వం వహించడం గమనార్హం.

ప్రతి బుధవారం పత్రిక సంపాదక వర్గం సమావేశం కావడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీ గురించి ముందే తెలిసిన దుండగులు పధకం ప్రకారమే అదే రోజు దాడి చేశారని పత్రికల ద్వారా తెలుస్తోంది. ఉగ్రవాదులు చీఫ్ ఎడిటర్, ప్రధాన ఎడిటోరియల్ సిబ్బందిని నేరుగా లక్ష్యం చేసుకున్నారు. అత్యంత పకడ్బందీగా, క్రమ శిక్షణతో, సుశిక్షిత మిలట్రీ సైనికుల వలే వారు పని పూర్తి కానిచ్చుకుని వెళ్లగలిగారు. కారు నుండి దిగడం, తుపాకి గురిపెట్టి తలుపులు తెరిపించడం, నేరుగా సమావేశం హాలుకు వెళ్ళి కాల్పులు జరపడం, ఈ మధ్యలో అడ్డం వచ్చినవారిని మట్టుబెట్టడం అన్నీ ఒక పద్ధతిగా, నింపాదిగా 5 నిమిషాల్లో ముగించుకుని వెళ్లారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అత్యున్నత స్ధాయి మిలట్రీ శిక్షణ లేనిదే ఈ తరహాలో హత్యాకాండ నిర్వహించడం సాధ్యం కాదని పరిశీలకులు ఏకాభిప్రాయం ప్రకటించారు. దుండగులు చక్కటి ఫ్రెంచి భాష మాట్లాడారని, ఆడవారిని చంపబోమని హామీ ఇచ్చారని, ఏ.కె-47, రాకెట్ ప్రొపెల్డ్ గ్రేనేడ్లు ధరించి ఉన్నారని పత్రిక సిబ్బంది చెప్పారు. దాడిలో ఉన్నంతసేపు అల్లాహు అక్బర్! అని నినాదాలు ఇచ్చారని వారు తెలిపారు. ‘దేవుడు ఒక్కరే’ అని సూచించే ఆల్-ఖైదా మార్కు సంకేతం (కుడి చేయి పైకెత్తి చూపుడు వేలును పైకి చూపడం) ప్రదర్శించిన సంగతి సి.సి కెమెరా వీడియోల్లో కనపడింది. ఈ వీడియో దృశ్యాలు కొద్ది గంటల వ్యవధిలో ఇంటర్నెట్ అంతా పాకిపోయాయి.

విచిత్రంగా దాడి చేసినవారు ఎవరో దాడి జరిగిన రోజు రాత్రే ఫ్రాన్స్ భద్రతా సంస్ధలు ప్రకటించాయి. ముగ్గురు ముస్లిం వ్యక్తులు -సయీద్ కువాచి, చెరిఫ్ కువాచి, హమీద్ మొరాద్- అనుమానితులుగా ప్యారిస్ పోలీసులు పేర్కొన్నారు. వీరిలో మొదటి ఇద్దరు సోదరులు. 30లలో ఉన్నవారు. మూడో వ్యక్తి 18 యేళ్ళ యువకుడు. ఈ మూడో అనుమానితుడు ప్యారిస్ కు 145 కి.మీ దూరంలోని పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. అనుమానితుల పేర్లు వెల్లడి చేశాక ఉగ్రవాదదాడి పైన పలు అనుమానాలు తలెత్తాయి. ఎందుకంటే ఈ ముగ్గురూ అప్పటికే అనేక సంవత్సరాలుగా ఫ్రెంచి పోలీసులు, గూఢచార సంస్ధల నిఘా కింద ఉన్నవారే. అమెరికా లోని బోస్టన్ నగరంలో మారధాన్ పరుగుపందెంపై 2013లో జరిగిన ఉగ్ర దాడిలో నిందితులుగా పేర్కొన్న సోదరులు కూడా ఇలాగే సి.ఐ.ఏ, ఎఫ్.బి.ఐ తదితర నిఘా సంస్ధల పర్యవేక్షణలో ఉన్న చెచెన్ జాతి ముస్లింలు. ఒక్క బోస్టన్ మారధాన్ దాడి మాత్రమే కాదు, 9/11 WTC జంట టవర్లపై దాడి తర్వాత పశ్చిమ దేశాలలో జరిగిన ప్రముఖ ఉగ్రవాద దాడుల్లో దాదాపు అన్నింటిలోనూ నిందితులు నిఘా సంస్ధల పర్యవేక్షణలో ఉన్నవారే. ఈ వాస్తవాలను పశ్చిమ పత్రికలు ఎన్నడూ నివేదించవు. ఉగ్రవాదులు ఎంత క్రూరులో, హత్యాకాండ ఎంతటి తీవ్రమైనదో చెబుతూ కధలు కధలుగా రాస్తూ తమ దేశాలలోని పౌరులలో ముస్లిం మత వ్యతిరేక భయాందోళనలను నింపడమే ఆ పత్రికలు త్రికరణశుద్ధిగా చేసే పని.

ఫ్రాన్స్ వార్తా సంస్ధల ప్రకారం ముగ్గురిలో చెరిఫ్ కువాచి ఫ్రాన్స్, అమెరికాల పోలీసు, గూఢచార సంస్ధలకు చిరపరిచితుడు. 2005లో ఆయన ఇరాక్ కు వెళ్ళి అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ ఫ్రాన్స్ లో అరెస్టు చేశారని అప్పట్లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. ఫ్రెంచి ముస్లింలను ఇరాక్ కు పంపిస్తున్న ఉగ్రవాదిగా 2008లో ఫ్రెంచి కోర్టులు నిర్ధారించి 3 సం.లు జైలు శిక్ష వేశాయి. అమెరికా ఇరాక్ లో నిర్వహించిన అబూ ఘ్రైబ్ జైలు దృశ్యాలు పత్రికల్లో చూసి తాను ఆగ్రహం చెందానని ఆయన చెప్పినట్లుగా అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్ధ తెలిపింది. 18 నెలలు జైలులో గడిపిన చెరిఫ్ విడుదలై అప్పటి నుండి నిరంతరం ఫ్రెంచి గూఢచార సంస్ధల పహారాలోనే ఉన్నాడు. భద్రతా సంస్ధల పర్యవేక్షణలో ఉన్న వ్యక్తి ఆ సంస్ధలకు తెలియకుండా ఆధునిక ఆయుధాలు ఎలా సంపాదించగలడు? అత్యంత నైపుణ్యంతో ప్రపంచ ప్రసిద్ధ జనసమ్మర్ధ నగరంలో పట్ట పగలు దారుణ హత్యాకాండను ఎలా నిర్వహించగలడు?

పైగా చార్లీ హెబ్దో పత్రికా కార్యాలయంపై ఉగ్రవాద దాడి ఎవరూ ఊహించలేనిది కాదు. ముస్లిం మత విశ్వాసాలను పరిహసించే పత్రిక ముస్లిం ఉగ్రవాదులకు టార్గెట్ గా ఉండగలదని ఎవరైనా ఊహించగలరు. 2011లో అల్లాపై కార్టూన్ ప్రచురించినప్పుడు (అల్లా బొమ్మ గీయడం ఇస్లామిక్ విశ్వాసాలకు విరుద్ధం) సదరు కార్యాలయంపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. ఆల్-ఖైదా హిట్ లిస్ట్ లో చోటు సంపాదించినందున అప్పటి నుండి చీఫ్ ఎడిటర్ చార్బ్ కు పోలీసు రక్షణ కల్పించారు. పత్రిక కార్యాలయానికి గార్డుల రక్షణ పెంచారు. అయినప్పటికీ సకల రక్షణల కన్ను గప్పి, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా సంస్ధలను ఏమార్చి నిఘాలో ఉన్న ఉవ్రవాదులు హత్యాకాండలను ఎలా సాగించగలరు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెతికితే అది మనల్ని నేరుగా ఫ్రాన్స్ సామ్రాజ్యవాద ప్రయోజనాల చెంతకు తీసుకెళ్తుంది. తమ బహుళజాతి కంపెనీల ప్రయోజనాలను నిర్విఘ్నంగా కొనసాగించడానికి, అందుకు అనుగుణంగా మధ్య ప్రాచ్యంలోని అరబ్ రాజ్యాల మధ్య కొత్త సరిహద్దులు గీయడానికి అమెరికా, బ్రిటన్ తదితర దేశాలతో కలిసి ఫ్రాన్స్ సాగిస్తున్న కుట్రల వద్దకు మనల్ని తోడ్కొని పోతుంది.

ఉదాహరణకు సిరియాలో పశ్చిమ దేశాల ప్రేరణతో 2011 నుండి కొనసాగుతున్న కిరాయి తిరుగుబాటుకు, లిబియాలో గడాఫీ కూల్చివేతకు, హత్యకు దారి తీసిన తిరుగుబాటుకు ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలు సంపూర్ణ సహకారం అందించాయి. ఇంకా అందిస్తున్నాయి. ‘ఉగ్రవాదంపై ప్రపంచ యుద్ధం’ అంటూ ఏ ఆల్-ఖైదా నెట్ వర్క్ పైనైతే యుద్ధం ప్రకటించా యో అదే ఆల్-ఖైదా గ్రూపులకు సాయుధ శిక్షణ ఇచ్చి లిబియా, సిరియాలలో ప్రవేశ పెట్టాయి. పశ్చిమ దేశాలు ఆయుధాలు, కమెండో శిక్షణ గరిపే మిలట్రీ గూఢచార నిపుణులను సరఫరా చేయగా ప్రపంచ ఉగ్రవాద సరఫరా దారులు సౌదీ అరేబియా, ఖతార్, యు.ఏ.ఏ తదితర దేశాలు ప్రపంచం నలుమూలల నుండి అసంతృప్త ముస్లిం యువకులను సమీకరించి జోర్డాన్, టర్కీ, పాకిస్తాన్ లలోని శిక్షణా శిబిరాలకు తరలించాయి. ఈ మేరకు ఆల్-ఖైదా గ్రూపులకు తామే ఆయుధాలు ఇచ్చామని, శిక్షణ ఇచ్చామని వివిధ సందర్భాలలో పశ్చిమ దేశాల నేతలే అంగీకరించారు.

ఎవరిది యుద్ధం? ఎవరిది సహకారం?

గడాఫీ నుండి రక్షణ పొందడం కోసం లిబియా పౌరులకు తాము తేలికపాటి అస్సాల్ట్ రైఫిళ్ళు సరఫరా చేశామని 2011లో ఫ్రెంచి మిలట్రీ ప్రతినిధి కల్నల్ బర్క్ హార్డ్ ప్రకటించారు. మూడు నెలల నాటో గగనతల వైమానిక దాడుల్లో గడాఫీని పదవీచ్యుతీడిని చేయడంలో విఫలం కావడంతో భూతలదాడులకు తిరుగుబాటుదారులను సిద్ధం చేసేందుకు  ఫ్రాన్స్ ఈ చర్య తీసుకుందని 2011లో జులైలో ఆయన చెప్పాడు. తమకు ఆల్-ఖైదాతో సంబంధాలు ఉన్నాయని లిబియా తిరుగుబాటు నాయకుడు ఒకరు అదే యేడు స్వయంగా అంగీకరించాడు. లిబియాపై విధించిన ఆయుధ నిషేధాన్ని ఫ్రాన్స్, బ్రిటన్ లు ఎత్తివేసి తమను అనుసరించాలని ఇతర ఈ.యు దేశాలను 2012లో ఆ దేశాలు కోరాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అస్సాద్ కూల్చివేతలో విఫలం అయిన ఫ్రాన్స్, బ్రిటన్ లు సిరియాపై విధించిన ఆయుధ సరఫరా నిషేధాన్ని ఎత్తివేయాలని 2013 ఈ.యు సమావేశాలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు కోరాడు. 2013లోనే యు.ఎస్.ఏ టుడే పత్రిక ప్రకారం మోడరేట్ ఉగ్రవాద సంస్ధగా అమెరికా పేర్కొని ఆయుధ సహాయం, మిలట్రీ సహకారం అందించిన జబ్బత్ ఆల్-నూస్రా, తాను ఆల్-ఖైదాకు అనుబంధ సంస్ధగా పని చేస్తున్నామని బహిరంగంగా చాటింది. ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా/ఇసిస్/ఇస్లామిక్ స్టేట్ గా పిలుస్తున్న అప్పటి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, తాము కూడా జబ్బత్ ఆల్-నూస్రాతో కలిసి పని చేస్తూ అస్సాద్ పై పోరాడతామని 2013లో ప్రకటించింది.

ఫ్రాన్స్ 24 పత్రిక ప్రకారం సిరియా తిరుగుబాటుదారులకు ‘కొద్ది నెలల క్రితం ఫ్రాన్స్ ఆయుధాలు సరఫరా చేసిందని’ ఆగస్టు 2014లో బహిరంగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంషా ఒలాండే అంగీకరించాడు. మంచి ఉగ్రవాదులుగా కొన్ని ఉగ్ర సంస్ధలకు మొదట ముద్రవేసి వారికి ఆయుధ శిక్షణ, నిధుల సరఫరా అందించి ఆనక అవి తమ స్వభావం మార్చుకుని తీవ్ర ఉగ్రవాద సంస్ధలుగా మారిపోయినట్లు ప్రకటించి యుద్ధం ప్రకటించడం పశ్చిమ దేశాలు పైకి చెప్పే కారణాలతో చేయవు. అదంతా జాగ్రత్తగా రూపొందించుకుని అమలు చేసిన సామ్రాజ్యవాద పధకం ద్వారానే చేస్తాయి. ఈ పనిని చేసేది ఒక్క ఫ్రాన్స్ మాత్రమే కాదు. అమెరికా, బ్రిటన్ లు ప్రధానంగానూ, ఇతర ఐరోపా దేశాలు అప్పుడప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. తద్వారా తమ తమ దేశాలలోని సామాజిక వాతావరణాన్ని ముస్లిం వ్యతిరేక భావజాలంతో నింపేస్తున్నాయి. ముస్లింలను ఏం చేసినా పాపం లేదన్న ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చేలా చేస్తున్నాయి. ఆ విధంగా కఠిన ప్రజా వ్యతిరేక, కార్మికవర్గ వ్యతిరేక చట్టాలను రూపొందించుకుని అమలు చేయడంపై ప్రజల దృష్టి పడకుండా చేస్తున్నాయి. చివరికి ఆ చట్టాలు దేశంలో సంక్షోభకారక ఆర్ధిక విధానాలకు వ్యతిరేకంగా తలెత్తే అసంతృప్త కార్మికవర్గ పోరాటాలను అణచివేసేందుకే అన్న విషయాన్ని ప్రజల దృష్టికి వెళ్లకుండా సమర్ధవంతంగా అడ్డుకుంటున్నాయి.

 

…………………………ఇంకా ఉంది

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s