కాంగ్రెస్ ఎం.పి శశి ధరూర్ మునుముందు మరిన్ని కష్టాలు ఎదుర్కొనే సూచనలు బలపడుతున్నాయి. ఆయన భార్య సునంద పుష్కర్ హత్య కేసులో శశి ధరూర్ ని కూడా ప్రశ్నిస్తామని, అనుమానితుల్ని ఎవరిని వదిలిపెట్టేది లేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీ స్పష్టం చేశారని పత్రికలు నివేదించాయి. ‘గుర్తు తెలియని వ్యక్తులు’ నిందితులుగా పేర్కొంటూ హత్య కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు తనను కేసులో ఇరికించడానికి చూస్తున్నారని ధరూర్ రెండు నెలల క్రితమే ఆరోపించడం గమనార్హం.
జనవరి 17, 2014 తేదీన ఢిల్లీ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో సునంద పుష్కర్ శవమై కనిపించిననాటి నుండి ఆమె మరణంపై వార్తలు అనేక మలుపులు తిరుగుతూ వచ్చాయి. ఆమెపై రేడియో ధార్మిక పదార్ధం పోలోనియంను ప్రయోగించి హత్య చేశారని ప్రస్తుతం ఏ.ఐ.ఐ.ఎం.ఎస్ డాక్టర్లు భావిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుబడిలో యాంటీ-డిప్రెసెంట్ ఔషధం అల్పాక్స్ అధిక మోతాదులో సునంద పుష్కర్ శరీరంలో ఉన్నట్లు చెప్పిన ఏ.ఐ.ఐ.ఎం.ఎస్ వైద్యులు, బి.జె.పి ఏలుబడికి వచ్చేసరికల్లా మాట మార్చారు. ఆమె శరీరంలో ఆల్పాక్స్ ఛాయలే లేవని విస్కెరా పరిశోధనలో తేలిందని వారు సరికొత్త నివేదిక వెలువరించడంతో అప్పటివరకూ అమాయక భర్తగా పత్రికల్లో కనిపించిన శశి ధరూర్ ఒక్కసారిగా ఆయనే విలన్ అన్న అభిప్రాయాలు పెరిగాయి.
బి.జె.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శశి ధరూర్ మోడిపై వివిధ సందర్భాల్లో పొగడ్తలు కురిపించారు. కానీ అవేవీ పని చేయలేదని ఢిల్లీ పోలీసులు, ఏ.ఐ.ఐ.ఎం.ఎస్ వైద్యులు యూ-టర్న్ తీసుకోవడం ద్వారా స్పష్టం అయింది. తన ఇంటిలోని పని మనిషి, తాను ఇద్దరం కలిసి సునందను హత్య చేశామని ఒప్పుకోవాల్సిందిగా తమ పని మనిషిపై ఢిల్లీ పోలీసులు వత్తిడి తెస్తున్నారని, తనకు ఇరికించేందుకు వారు కంకణం కట్టుకున్నారని శశి ధరూర్ గత నవంబర్ లో ఆరోపించడంతో సునంద హత్య చుట్టూ రాజకీయాలు అల్లుకుని విస్తరిస్తున్నాయని అప్పుడే పరిశీలకులు వ్యాఖ్యానించారు.
లాజికల్ గా ఆలోచించేవారు లేదా దోషులను చట్టానికి దొరకాలని కోరుకునేవారు మొదట సునంద మరణం వల్ల ఎవరికి లాభం అన్న ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తారు. ఈ ప్రశ్నకు సమాధానంగా శశి ధరూర్ ని నిందితుడిగా చూపే కారణాలు ఏవీ ప్రజలకు/పత్రికలకు అందుబాటులో లేవు. అలాగని శశి ధరూర్ ని అమాయకుడిగా చూడనవసరమూ లేదు. సునంద శరీరంపై ఒక గట్టి వస్తువుతో కొట్టిన గాయాలు ఉండడం బట్టి, ఆమెను శశి ధరూర్ కొట్టారన్న వార్తలను ధరూర్ స్ధిరంగా ఖండించకపోవడం బట్టి ఆయన ఆదర్శ భర్తగా, కనీసం సాధారణ భర్తగా భావించలేని పరిస్ధితి ఏర్పడింది.
కానీ శశి ధరూర్ పైన అనుమానపు మేఘాలు కమ్ముకునే సమాచారమే తప్ప ఇదమిద్ధంగా ‘ఆయనే అయి ఉండవచ్చు’ అని చెప్పగల సమాచారం లేకపోవడం ఆయనకు అనుకూలిస్తున్న అంశం. రాజకీయాలు, డబ్బు, అధికారం… ఇత్యాది మసాలాలు ఇమిడి ఉన్న కేసు కావడం మూలాన అసలు దోషిని పట్టించే సాక్ష్యాలు కాకుండా వారి పైనా, వీరి పైనా అనుమానాలు పెంచే సాక్ష్యాలే ప్రజల దృష్టికి ఎక్కువగా వస్తాయి. పొరబాటున వాస్తవం వెలికి వచ్చినా, దాన్ని negate చేసే నకిలీ సాక్ష్యాలు పుట్టించడం ఊర్ధ్వ స్ధాయి నేతలకు లెక్క కాదు.
ఈ నేపధ్యంలో “అవసరం అయితే శశి ధరూర్ ని కూడా ప్రశ్నిస్తాం” అని ఢిల్లీ కమిషనర్ చెప్పడం శశి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నదన్న అనుమానం బలపడింది. సునంద హత్యకు గురయిందన్న వార్త తనను హతాశుడిని చేసిందని, ఆమె హత్యపై సమగ్ర విచారణ చేయాలని శశి ధరూర్ డిమాండ్ చేశారు. సునంద మరణానికి సంబంధించి వైద్యుల నివేదికల కాపీలను తనకు ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. సునంద మరణం విషయంలో శశి ధరూర్ మొదటి నుండి సహకరిస్తున్నారని పత్రికలు చెబుతున్న మాట. ఆయన పోలీసులకు సహకరిస్తే ఆయననే ఇరికించే ప్రయత్నం పోలీసులు ఎందుకు చేస్తారన్నది సమాధానం దొరకని ప్రశ్న.
పోలోనియం రేడియో ధార్మిక పధార్ధాన్ని ఇంజెక్ట్ చేసే టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉన్నది కాదు. ఇండియాలో అయితే అసలే లేదు. కనీసం పోలోనియం రేడియో ధార్మిక పదార్ధం శరీరంలో ఉన్నది లేనిదీ కనిపెట్టే పరిజ్ఞానం కూడా ఇండియాలో లేదు. ప్రపంచ స్ధాయి పోరాట నాయకుడుగా ప్రసిద్ధి పొందిన పాలస్తీనా నేత యాసర్ అరాఫత్ ను ఇజ్రాయెల్ పాలకులు పోలోనియం ప్రయోగం ద్వారానే చంపించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను స్విట్జర్లాండ్, రష్యా శాస్త్రవేత్తలు ధృవీకరించారు కూడా.
అదే పదార్ధాన్ని సునంద హత్యకు వినియోగించారంటే ఆమె హత్య వెనుక ఏ స్ధాయిలో కుట్ర జరిగిందో ఊహించడానికే వణుకు పుట్టించేదిగా ఉంది. అంతర్జాతీయ హత్యలకు పేరెన్నిక గన్న ఇజ్రాయెల్ సహకారంతో దుబాయ్ అండర్ వరల్డ్ మాఫియా కుట్ర చేసిన అవకాశాలను కొందరు పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలనకు ఇప్పటికయితే ఆధారాలు లేవు. భవిష్యత్తులో ఏమన్నా సాక్ష్యాలు పొరబాటున వెల్లడి అయితే తప్ప ఇందులో వాస్తవాలను అంచనా వేయలేము.
శశి ధరూర్ ఐరాసకు కోఫీ అన్నన్ కాలంలో అండర్-సెక్రటరీ జనరల్ గా పని చేశారు. ఆయన 2009లో మొదటిసారి కేరళ నుండి ఎం.పిగా ఎన్నికైనారు. ఇప్పటికీ ఆయన పార్లమెంటు సభ్యులే. 2010లో ఆయన సునంద పుష్కర్ ను వివాహమాడారు. దుబాయ్ లో వ్యాపారవేత్త అయిన సునంద, శశి ధరూర్ ఇరువురికీ ఆ వివాహం మూడవదే కావడం గమనార్హం. ఇంతటి హై ప్రొఫైల్ వివాహం సైతం, అది ఇద్దరికీ మూడవ వివాహమే అయినా, దంపతుల మధ్య పొరపొచ్చాలు ఏర్పడడం స్త్రీ కోణంలో ఒక బాధాకరమైన సంగతి. ఆస్తులు కలిగి ఉండి, వ్యాపార వేత్తగా రాణిస్తూ ఒక రాజకీయ నాయకుడిని పెళ్లి చేసుకుని కూడా భర్త చేతిలో దెబ్బలు తినవలసి రావడం అత్యంత విచారకరం.
మూడో వివాహం తర్వాత కూడా మరో స్త్రీ (పాక్ విలేఖరి) తో సంబంధం ఉన్నట్లు సునంద బహిరంగంగానే (ట్విట్టర్ లో) తన చావుకు ఒక రోజు ముందు ఆరోపించారు. సామాజిక వ్యవస్ధ ఎంతగా గబ్బు పట్టి పోయి ఉన్నదో స్పష్టంగా తెలియజేసే అంశం ఇది. ఈ అవస్ధ హై-క్లాస్ గా చెప్పుకునే ఉన్నత ధనిక వర్గాలలోనూ కొనసాగుతోందని ఈ వ్యవహారం తెలియజేస్తోంది. (బహుశా అక్కడే ఎక్కువ కావచ్చు!) శశి ధరూర్ గురించి మరిన్ని విషయాలు తాను బహిరంగం చేయాల్సి ఉందని కూడా ఆమె ట్విట్టర్ పేర్కొన్నారు.
భార్యాభర్తల వివాదం అన్న దృష్టిలో చూస్తే విస్తృత కోణంలో ఊహించడానికి సంస్కారం అడ్డు వస్తున్న పరిస్ధితి. శశి ధరూర్ రాజకీయ, అధికార స్ధాయి, ఆయన చుట్టూ ఏర్పడి ఉన్న వివాదాలను బట్టి చూస్తే విస్తృత కోణంలో ఊహించక తప్పని తలెత్తే పరిస్ధితి. మరిన్ని వాస్తవాలు వెల్లడి అయితే తప్ప ఒక అవగాహనకు రావడం కష్టం. కానీ వాస్తవాలుగా వెల్లడి అయ్యే అంశాల్లో వాస్తవం లేకపోతేనో! రాజకీయ నేతలు ఇమిడి ఉండే సామాజిక నేరాల్లో తరచుగా ఈ పరిస్ధితే ఎదురవుతుంది. ఎందుకంటే ఆ నేర విచారణ ప్రధానంగా రాజకీయ ప్రయోజనాల రీత్యానే సాగుతుంది కనుక!
మూడో వివాహం తర్వాత కూడా మరో స్త్రీ (పాక్ విలేఖరి) తో సంబంధం ఉన్నట్లు సునంద బహిరంగంగానే (ట్విట్టర్ లో) తన చావుకు ఒక రోజు ముందు ఆరోపించారు. సామాజిక వ్యవస్ధ ఎంతగా గబ్బు పట్టి పోయి ఉన్నదో స్పష్టంగా తెలియజేసే అంశం ఇది. ఈ అవస్ధ హై-క్లాస్ గా చెప్పుకునే ఉన్నత ధనిక వర్గాలలోనూ కొనసాగుతోందని ఈ వ్యవహారం తెలియజేస్తోంది. (బహుశా అక్కడే ఎక్కువ కావచ్చు!)
ఉన్నత ధనిక వర్గాలలోనూ అక్రమ సంభందం(ఏ విధంగా ఇది అక్రమ సంభందం? వ్యక్థిగతంగానా? సమాజ పరంగానా?) కొనసాగుతోందని పైవాక్యాలలో తెలియజేశారు!
అక్రమ సంభందం అనేది వర్గాలకు సంభంధించిన వ్యవహారమా?
అన్నివర్గాలలోనూ,అన్ని సమాజాలలోనూ అది ఉండేదేగదా!