పశ్చిమ దేశాలు గడ్డ కట్టే మంచుతో నిండే చలి సీజన్లకు పెట్టింది పేరు. చైనాలోని అత్యధిక భాగంలోని శీతా కాలం కూడా ఇంచు మించు ఐరోపా దేశాల లాగానే మంచు కింద కప్పబడి పోయి ఉంటుందని అక్కడి నుండి వెలువడే ఫోటోల ద్వారా స్పష్టం అవుతోంది. అంతర్జాతీయ వేడుకలకు గతంలో పెద్దగా చోటివ్వని చైనా ఇప్పుడు అంతకంతకు ఎక్కువగా అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహిస్తూ టూరిస్టులను సైతం ఆకర్షిస్తోంది.
చలి సీజన్ లో చైనా ప్రతి యేటా ‘హార్బిన్ అంతర్జాతీయ మంచు శిల్పాల వేడుక’లను నిర్వహిస్తోంది. దాదాపు పదేళ్లుగా నిర్వహిస్తున్న ఇప్పుడు ప్రపంచ స్ధాయిలో ఆకర్షణీయంగా మారింది. ‘హార్బిన్ ఇంటర్నేషనల్ ఐస్ అండ్ స్నో స్కల్ప్చర్ ఫెస్టివల్’ గురించి రాయని పశ్చిమ పత్రిక లేదంటే అతిశయోక్తి కాబోదు. ఈ యేడు జనవరి 5 తేదీన అధికారికంగా ప్రారంభమయిన హార్బిన్ ఫెస్టివల్ ఫిబ్రవరి నెలాఖరు వరకు ఉనికిలో ఉండబోతోంది. వాతావరణం సహకరిస్తే అంతకు ఎక్కువ కాలం కూడా ఉండవచ్చు.
మంచు, ఐస్ గడ్డలతో భారీ పరిమాణంలో కళాకృతులను నిర్మించడం ఈ అంతర్జాతీయ వేడుకల ప్రధాన లక్షణం. భారీ కోట గోడలను తలపించే భవనాలను మొదలు కొని బుర్రకు తోచిన సకల ఆకృతులను మంచుతో చెక్కి ప్రదర్శిస్తారు. వాటిలో వివిధ రంగుల్లో లైట్లు అమర్చడం వలన రాత్రి సమయంలో వేడుక మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చైనీయులతో పాటు విదేశీయులు కూడా కొన్ని మిలియన్ల మంది హార్బిన్ ఫెస్టివల్ కు హాజరవుతూ వేడుకకు మరింత సందడిని తెస్తున్నారు.
చైనా ఈశాన్య ప్రాంతం లోని హీలాంగ్ జియాంగ్ రాష్ట్రంలో అతి పెద్ద పట్టణం హార్బిన్ లో ఈ వేడుకను నిర్వహిస్తారు. ఎముకలు కోరికే చలిలో శిల్పులు అనేకమంది హార్బిన్ విచ్చేసి కొన్ని వందల తన్నుల మంచు/ఐస్ తో తమ కళను ప్రదర్శిస్తారు. హార్బిన్ నగరం మొత్తాన్ని మంచు శిల్పాలను సందర్శించే టూరిస్టులతో నిండిపోతుంది. చైనా నలుమూలల నుండి జంటలు విచ్చేసి హార్బిన్ లో పెళ్లి చేసుకోవడం కూడా ఇప్పుడు అలవాటుగా మారింది.
గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ యేడు మంచు శిల్పాల నిర్మాణానికి వాతావరణం సహకరించకపోవచ్చని హార్బిన్ ఫెస్టివల్ నిర్వాహకులు మొదట భయపడ్డారట. అయితే ఇంతవరకు అలాంటిది ఏమీ జరగకపోవడంతో చైనా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఫెస్టివల్ నిర్వహణ ద్వారా స్ధానిక ఆర్ధిక వ్యవస్ధ కూడా కాస్త పుంజుకుంటుంది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ప్రస్తుతం ఇంజన్ గా భావిస్తున్న చైనాలో వ్యాపారం తగ్గితే అది అంతర్జాతీయంగా ప్రతిబింబిస్తోంది. ఆ విధంగా ప్రపంచ జి.డి.పి తగ్గిపోకుండా లేదా స్ధిరంగా కొనసాగేలా చైనా సహాయం చేస్తుండగా అన్-సీజన్ లోనూ వ్యాపార వృద్ధి జరగడానికి స్ధానిక రాష్ట్రానికి ఫెస్టివల్ తోడ్పడుతుందని విశ్లేషకుల అంచనా.
ఈ కింది ఫోటోలను సరిగ్గా చూసినట్లయితే నోటిలో మాటరాక మ్రాన్పడిపోవలసిందే. శిల్పాలను నిర్మించినవారు అత్యంత ‘మంచు ప్రతిభావంతులు” అనడంలో ఎలాంటి సందేహము లేదు.
Photos: Daily Mail, The Atlantic