కేంద్ర మాజీ మంత్రి, ఐరాస సెక్రటరీ జనరల్ కి పోటీ పడిన భారతీయుడు శశిధరూర్ మరోసారి చిక్కుల్లో పడ్డట్లు కనిపిస్తోంది. ఆయన భార్య సునంద పుష్కర్ ది ఆత్మహత్య కాదని, ఎవరో ఆమెకు విషం ఇచ్చి చంపారని ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు సునంద పుష్కర్ మరణం విషయమై హత్య కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆదేశించారు. రష్యాలో తయారయిన విషం ఇచ్చి సునందను చంపారని, ఈ సంగతి శశి ధరూర్ కు కూడా తెలుసని మొదటి నుండి వాదిస్తూ వచ్చిన సుబ్రమణ్య స్వామి వాదనే చివరికి నిజం అయ్యేటట్లు కనిపిస్తోంది.
సునంద మరణం కేసు ఆది నుండి అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. ఆమెది సహజ మరణం కాదని ఈ ఒక్క వాస్తవమే చెబుతోంది. సునంద శరీరం నిండా చిన్న చిన్న గాయాలు ఉన్నాయని మొదటి పోస్ట్ మార్టం రిపోర్టు లో స్పష్టం అయినప్పటికీ అవి ఎలా అయ్యాయన్న అంశంపై పోలీసులు దృష్టి పెట్టలేదు. ఆమె చనిపోవడానికి ముందు రోజు శశి ధరూర్ ఆమెను తీవ్రంగా కొట్టారని ఫలితమే ఆమె వంటిపై గాయాలు ఉన్నాయని సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. అయితే ఈ దెబ్బల వల్ల మాత్రం ఆమె మరణం సంభవించలేదని పోలీసులు గతంలో నిర్ధారణకు వచ్చారు.
సునంద పుష్కర్ మరణంపై నిర్వహించిన అటాప్సీ (పోస్ట్ మార్టం) నివేదిక, విస్కెరా నివేదిక… రెండూ పరస్పరం విరుద్ధ అంశాలను నివేదించడంతో కేసు మరింత పీట ముడి పడిపోయింది. పొత్తి కడుపులోని పేగుల భాగాన్ని తీసి పరీక్షించడాన్ని విస్కెరా పరీక్ష ఆంటారు. పోస్ట్ మార్టం నివేదికలో యాంటీ డిప్రెసెంట్ మందు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొనగా విస్కెరా నివేదికలో అలాంటి ఔషధం ఆనవాళ్లే లేవని వెల్లడి అయింది.
పోస్ట్ మార్టం రిపోర్ట్ ను తాము చెప్పినట్లు రాయాలని తనపై తీవ్రంగా ఒత్తిడి వచ్చిందని పోస్ట్ మార్టం బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ గుప్తా ఆరోపణలు చేయడంతో సునంద మరణం మరోసారి సంచలనం అయింది. అప్పటివరకూ డిప్రెషన్ ఔషధం ఎక్కువగా తీసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారన్న అవగాహన పత్రికల్లో వ్యాపించే విధంగా కావాలని తప్పుడు వార్తలు ప్రచారం చేశారన్న అనుమానాలు తీవ్రం అయ్యాయి. ఒక్కో వాస్తవం వెల్లడి అయ్యే కొద్దీ ఆ అనుమానాలే నిజం అని ధ్రువపడడం పెరుగుతూ వచ్చింది.
ఉదాహరణకి సునంద పుష్కర్ చనిపోయి ఉండడాన్ని మొదట చూసింది శశి ధరూరే అని మొదట ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఆమోదిస్తున్నట్లుగానే శశి ధరూర్ మాటలు కూడా కొనసాగాయి. కానీ వాస్తవానికి సునంద మరణించి ఉండడం చూసింది మొదట ఆమె బస చేసిన హోటల్ లోని ఒక మహిళా ఉద్యోగి అని అనంతర కాలంలో వెల్లడి అయింది. ఎలిజబెత్ అనే పేరుగల హోటల్ ఉద్యోగి ఆమె మరణాన్ని కనుగొని వెంటనే హోటల్ సిబ్బందిని అప్రమత్తం చేశారని వెల్లడి అయింది. ఆమె కొద్ది రోజులకే తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన స్వస్ధలానికి వెళ్లిపోయారని పత్రికలు తెలిపాయి.

New Delhi, 18/01/2014: Union Minister Shashi Tharoor along with his son inside the ambulance with Sunanda Pushkar’s body in New Delhi on Saturday. Photo: S_Subramanium
మొదటిసారి పోస్ట్ మార్టం నిరవహించిన వైద్య బృందం నేత డాక్టర్ గుప్తా తనపై తీవ్ర ఒత్తిడిలు తెచ్చారని ప్రకటించడంతో సునంద పుష్కర్ మరణంలో జరగకూడనిది జరిగిందన్న అనుమానాలు తీవ్రం అయ్యాయి. శశి ధరూర్ తరపున మాజీ వైద్య మంత్రి గులాం నబీ ఆజాద్ మంత్రి హోదాలో ఏ.ఐ.ఐ.ఎం.ఎస్ పై ఒత్తిడి తెచ్చారని ఆ మేరకు తమ డైరెక్టర్ నివేదికను వారికి అనుకూలంగా తయారు చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని డాక్టర్ గుప్తా తన అఫిడవిట్ లో ఆరోపించారు. డైరెక్టర్ నుండి ఒత్తిడి వచ్చిన విషయాన్ని తనకు వచ్చిన ఈ మెయిళ్ల ద్వారా ధృవీకరించుకోవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు. అఫిడవిట్ దాఖలు చేయడానికి మునుపే ఆయనపై ప్లాగియారిజం (ఇతరుల పరిశోధన లేదా రచనను తనవిగా చెప్పుకుంటూ పత్రాలు, పుస్తకాలు ప్రచురించడం) ఆరోపణలు రావడం గమనార్హం.
ఇక విస్కెరా నివేదికలో ఎలాంటి యాంటీ-డిప్రెసెంట్ ఔషధము కనుగొనలేదని వెల్లడి అయింది. దానితో పోస్ట్ మార్టం నివేదికలో వాస్తవాలను కాకుండా చేర్చబడిన అంశాలను పొందుపరిచారని స్పష్టం అయింది. ఫలితంగా సునంద పుష్కర్ మృత దేహం గదిలో లభించిన వాడి పారేసిన ఔషధ స్ట్రిప్ లను ఉద్దేశ్యపూర్వకంగా అక్కడ పెట్టారన్న అనుమానాలు బలపడ్డాయి.
రెండవసారి జరిపిన పోస్ట్ మార్టంలో విష ప్రయోగం ద్వారా సునంద మరణించారని వెల్లడి అయింది. ఆమె దేహంలో ఉన్న విష పదార్ధం మొదట పేర్కొన్నట్లుగా యాంటీ డిప్రెసెంట్ ఔషధం కాదని, అసలు ఆ విష పదార్ధం ఏమిటో కనిపెట్టగల పరికరాలు ఇండియాలోనే లేవని పత్రికల ద్వారా గత నవంబర్ నెలలో వెల్లడి అయింది. పైగా సునంద మృత దేహంపై గట్టి వస్తువుతో కొట్టిన గాయాలతో పాటు ఇంజెక్షన్ ఇచ్చిన గాయం కూడా ఉన్నదని రెండో పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడి అయింది. రేడియో ధార్మిక పధార్ధాన్ని బలవంతంగా ఇంజెక్షన్ ద్వారా సునంద దేహంలోకి ప్రవేశ పెట్టి ఉండవచ్చని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారు. తాము కనుగొన్న విష పదార్ధం రేడియో ధార్మిక లక్షణాలు కలిగి ఉన్నాయని వారు తెలిపారు.
ఈ నేపధ్యంలో విస్కెరాలోని కొంత భాగాన్ని పరీక్ష నిమిత్తం ఇంగ్లండ్ లోని అత్యాధునిక ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించాలని ఢిల్లీ పోలీసులు ఆలోచిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ ఆలోచనను వారు అమలు చేసింది లేనిది తెలియదు గానీ సునంద కేసును హత్య కేసుగా మార్చుతున్నామని ఢిల్లీ పోలీసులు ఈ రోజు ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ నిర్ణయించారని పత్రికలు, ఛానెళ్లు తెలిపాయి.
ఢిల్లీ కమిషనర్ నిర్ణయంతో బి.జె.పి నేత సుబ్రమణ్య స్వామి మరోసారి గళం విప్పారు. రష్యా నుండి దిగుమతి చేసుకున్న విషాన్ని ప్రయోగించారని తన వాదనను పునరుద్ధరించారు. కేసును సి.బి.ఐ కి అప్పగించడం తప్ప మరో దారి లేదని, విష ప్రయోగాన్ని నిర్ధారించగల సౌకర్యాలు, అధికారం ఢిల్లీ పోలీసులకు లేదని స్వామీ చెబుతున్నారు. మోడి అధికారం చేపట్టినప్పటినుండి అవకాశం వచ్చినప్పుడల్లా శశి ధరూర్ ఆయనను పొగుడుతూ రావడానికి కారణం ఏమిటా అని ఆలోచించినవారికి బహుశా ఢిల్లీ పోలీసుల నిర్ణయంతో, ఆ విషయంపై ఒక అవాగాహనకు వచ్చి ఉండాలి.
అయితే సునంద పుష్కర్ హత్యకు కారణాలు ఏమై ఉంటాయి. పత్రికల ప్రకారం వివాహం అనంతరం సునందకు తెలియవలసిన విషయాల కంటే ఎక్కువ విషయాలు తెలిసాయి. వాటిలో ముఖ్యమైనది ఐ.పి.ఎల్ లోని కొచి ఫ్రాంచైజీకి సంబంధించినది. ఆమె తన డైరీలో ఐ.పి.ఎల్ కు సంబంధించి శశి ధరూర్ సాగించిన అవకతవకలను తనపై వేసుకున్నానని కానీ ఆయన పాకిస్తాన్ మహిళా విలేఖరితో సంబంధం పెట్టుకున్నారని రాసుకున్నారు. తాను త్వరలో ఐ.పి.ఎల్ వ్యవహారంలో నిజాలను వెల్లడి చేస్తానని ఆమె కొన్ని సార్లు శశి ధరూర్ ని బెదిరించినట్లు కొన్ని పత్రికలు చెబుతున్నాయి. కొచి ఫ్రాంచైజీ ని కోరుతున్న వ్యక్తులకు దానిని కట్టబెట్టేలా లాబీయింగ్ చేసినందుకు శశి ధరూర్ కు 60 కోట్లు ముట్టాయన్న ఆరోపణలు ఎలాగూ ఉన్నాయి. ఈ ఆరోపణలను మోడి సైతం తన ప్రచారంలో వినియోగించుకున్నారు.
శశి ధరూర్, సునందలు కొన్నాళ్లు దుబాయ్ లో నివాసం ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడి మాఫియా ముఠాలకు, ఐ.పి.ఎల్ కు మధ్య ఉన్న సంబంధాలు సునంద దృష్టికి వచ్చాయని కొన్ని పత్రికలు తెలిపాయి. ఐ.పి.ఎల్ తో అండర్ వరల్డ్ మాఫియా ముఠాలకు సంబంధాలు ఉన్న సంగతి వెల్లడి అయితే ఇండియాలో బ్రహ్మాండం బద్దలు కావడం ఖాయం. ఈ నేరం గల్ఫ్ దేశాల నుండి పాకిస్తాన్ మీదుగా ఇండియా వరకు విస్తరించిన బడా నేరం అనీ, అందులో భారత రాజకీయ నాయకులకు సైతం పాత్ర ఉందన్న సంగతి బహిర్గతం అయితే పాలక పక్షాలు, ప్రతిపక్షాలు కూడా సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఇవన్నీ జరగడం బెటరా లేక ఒక ప్రాణాన్ని తీయడం బెటరా అని సంబంధిత స్టేక్ హోల్డర్లు ఆలోచిస్తే ఏ వైపు మొగ్గు చూపుతారో సునంద పుష్కర్ మరణం ద్వారా మనకు ఒక సూచన అందున్నదేమో పాఠకులు నిర్ణయించుకోవాలి.
మళ్లీ ముసుగులో గుద్దులాట ఎందుకండీ శేఖర్ గారు. ఐపీఎల్ వెనక ఏ శక్తులున్నాయో అందరికీ తెలిసిందే కదా.