ఉగ్రవాదాన్ని పాక్ బాగా అణచివేస్తోంది -అమెరికా


Tough on paper

భారత పాలకులకు అమెరికా నుండి ఊహించని విధంగా (లేక ఊహించిందేనా?) చేదు అనుభవం ఎదురైంది. తమ దేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ను ఒంటరిని చేసి సాధించాలని మన పాలకులు డిమాండ్ చేస్తుండగా అమెరికా మాత్రం పాకిస్ధాన్ ని “భేష్, ఉగ్రవాదాన్ని బాగా అణచివేస్తున్నావు” అని సర్టిఫికేట్ ఇచ్చింది. లష్కర్-ఏ-తొయిబా (LeT), జైష్-ఏ-మహమ్మద్ (JeM) లను ఉగ్రవాద సంస్ధలుగా అమెరికా పరిగణిస్తుంది. కానీ ఈ సంస్ధల నేతలు గత యేడు భారీ ర్యాలీలు నిర్వహించినప్పటికీ వాటిని అణచివేయడంలో పాక్ ప్రభుత్వం సఫలం అయిందని అమెరికా ప్రకటించడం విశేషం.

అమెరికా విదేశీ మంత్రి త్వరలో జరగబోయే ‘వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్’ సభకు హాజరు కానున్నాడు. జనవరి నెలలోనే ఆయన పాకిస్తాన్ తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు జరపనున్నాడు. ఈ సం. రిపబ్లిక్ దినం (జనవరి 26) రోజున ఇండియాకు అతిధిగా హాజరు కానున్న బారక్ ఒబామా ఇండియాలో కాలు మోపక మునుపే పాకిస్తాన్ లో పర్యటించనున్నారు. ఒబామా పాక్ పర్యటనను విజయవంతం చేసేందుకు జాన్ కెర్రీ ఆయన కంటే ముందు పాక్ పర్యటించి చర్చలు జరుపుతారు. ఈ తతంగాన్ని  భారత్-పాక్ లలో అమెరికా ఏ దేశానికి ప్రాముఖ్యం ఇస్తుందన్న కోణంలో విశ్లేషకులు పరిశీలుస్తున్నారు. వారిలో భారతీయ విశ్లేషకులే ఎక్కువ ఆందోళనలో ఉంటారనడంలో సందేహం లేదు.

Hafiz saeed

Hafiz saeed

2009లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన కెర్రీ-లూగర్ బిల్లు ప్రకారం పాకిస్తాన్ కు పౌర ప్రయోజనాల కోసం సహాయం చెయ్యాలంటే గత సం. లో ఉగ్రవాదాన్ని అణచివేయడంలో పాకిస్తాన్ సంర్ధవంతంగా పని చేసిందా లేదా అన్న అంశాన్ని అమెరికా విదేశీ మంత్రి పరిశీలించి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈ సర్టిఫికేట్ ఇస్తేనే అమెరికా హామీ ఇచ్చిన సహాయ నిధులను విడుదల చేయాలి. లేదంటే ఆపేయాలి. ఈ షరతు మేరకు 2014 సం.లో ఆల్-ఖైదా, LeT, JeM తదితర ఉగ్రవాద సంస్ధలను అణచివేయడంలో పాక్ పాలకులు సమర్ధవంతంగా పని చేశారని జాన్ కెర్రీ సర్టిఫికేట్ ఇచ్చారు. ఫలితంగా పాక్ కు 532 మిలియన్ డాలర్ల గ్రాంటును త్వరలోనే ఇవ్వడానికి కాంగ్రెస్, అమెరికా అధ్యక్షుడికి అనుమతి ఇచ్చింది. ఈ సమాచారాన్ని పాక్ లోని అమెరికా రాయబారి రిచర్డ్ ఒల్సన్ పత్రికలకు వెల్లడించారు.

కానీ వాస్తవం ఏమిటంటే LeT, JeM లు 2014లో బహిరంగంగానే పాక్ లో కార్యకలాపాలు నిర్వహించారు. LeT వ్యవస్ధాపకుడు హఫీజ్ సయీద్, JeM వ్యవస్ధాపకుడు మసూద్ అజర్ లు భారీ బహిరంగ సభలు సైతం నిర్వహించారు. జనవరి 2014లో JeM ముజాఫరాబాద్ లో పెద్ద ర్యాలీ నిర్వహించింది. ర్యాలీని ఉద్దేశిస్తూ మసూద్ అజర్ బహావల్పూర్ లోని తన నివాసం నుండి ఫోన్ ద్వారా ప్రసంగించాడు. ఇండియాకు వ్యతిరేకంగా “భీతి గొలిపే విధంగా ప్రతీకారం తీర్చుకోవాలని” ఆయన తన ప్రసంగంలో పిలుపు ఇచ్చాడు. మసూద్ అజర్ గతంలో ఇండియా జైళ్ళలో ఉండేవాడు. ఎన్.డి.ఏ పాలనలో ఉగ్రవాదులు మన విమానాన్ని కిడ్నాప్ చేయడంతో వారి డిమాండ్ మేరకు మసూద్ అజర్ ను విడుదల చేశారు. అప్పటి మన విదేశీ మంత్రి జశ్వంత్ సింగ్ స్వయంగా మసూద్ అజర్ ను ప్రత్యేక విమానంలో వెంట తోడ్కొని వెళ్ళి పాక్ లో దించి వచ్చారు. విడుదల అయిన వెంటనే మసూద్ అజర్ JeM సంస్ధను స్ధాపించడం విశేషం.

ఇక LeT నేత హఫీజ్ సయీద్ అయితే గత డిసెంబర్ నెలలోనే లాహోర్ లో 2 రోజుల పాటు భారీ ర్యాలీ నిర్వహించాడు. ఈయన జమాత్-ఉద్-దవా సంస్ధను కూడా స్ధాపించిన నాయకుడు. ఈ సంస్ధ LeT కి ఫ్రంట్ ఆర్గనైజేషన్ గా అమెరికా పరిగణిస్తుంది. లాహోర్ ర్యాలీలో లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యారని పత్రికలు అంచనా వేశాయి. విచిత్రం ఏమిటంటే ఈ జనాన్ని సమీకరించడంలో పాకిస్తాన్ ప్రభుత్వంలోని అన్నీ అంగాలు పని చేయడం. అధికారుల సహాయంతోనే ఈ జనాన్ని వివిధ చోట్ల నుండి లాహోర్ కు రవాణా చేశారని పత్రికలు వెల్లడి చేశాయి. ఈ ర్యాలీలో ప్రసంగిస్తూ హఫీజ్ సయీద్ “ఇండియాకు వ్యతిరేకంగా యుద్ధం కొనసాగించాలని” పిలుపు ఇచ్చాడు. ఇదే వ్యక్తి కొన్ని రోజుల తర్వాత జరిగిన పెషావర్ పాఠశాల దాడి అనంతరం టి.వి ఛానెళ్లలో ప్రత్యక్షమై దాడికి ఇండియాయే కారణం అని ఆరోపించాడు.

Masood Azhan

Masood Azhar

ఇక 26/11 ముంబై ఉగ్ర దాడులకు మాస్టర్ మైండ్ గా ఇండియా ఆరోపించిన జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీ కి డిసెంబర్ లోనే పాక్ కోర్టులు బెయిల్ మంజూరు చేశాయి. ఇండియా గగ్గోలు పెట్టడంతో మరో పెట్టీ కేసు బనాయించి లఖ్వీని మళ్ళీ జైలులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. అమెరికా సాయం కోసమే ఈ కాస్త చర్య తీసుకున్నారని అప్పుడే గుసగుసలు వినిపించాయి. ఆ గుసగుసలు నిజమే అని ఇప్పుడు భావించవలసి వస్తోంది.

ఇన్ని జరిగినప్పటికీ అమెరికా విదేశాంగ శాఖ ఉగ్రవాదాన్ని అణచివేయడంలో పాకిస్తాన్ స్ధిరంగా, శక్తివంచన లేకుండా కృషి చేసిందని సర్టిఫికేట్ ఇచ్చేసింది. అమెరికా ఏటా 1.5 బిలియన్ డాలర్ల సహాయాన్ని పాక్ కు ఇస్తుంది. ఈ సహాయం కోసం పాక్ పాలకులు నానా గడ్డి తింటూ అమెరికా చేయమన్నదల్లా చేస్తూ ఉండడం ఎప్పుడూ జరిగేదే. మిలట్రీ కోసం ఒక సాయం, పౌర ప్రయోజనాల కోసం అని చెబుతూ మరో సాయం అమెరికా చేస్తుంది. తద్వారా పాకిస్తాన్ లో రెండు ప్రధాన అధికార కేంద్రాలయిన మిలట్రీ, పౌర ప్రభుత్వాలు రెండింటినీ తన అదుపులో ఉంచుకుంటుంది. మిలట్రీని ప్రేరేపించి ఉగ్రవాద దాడులు చేయించడం, ఆ ఉగ్రవాదాన్ని అణచివేయాలని పౌర ప్రభుత్వంపై షరతులు, ఆంక్షలు విధించడం అమెరికా అనుసరించే సామ్రాజ్యవాద ఎత్తుగడల్లో ముఖ్యమైనది. ఒకే దేశంలో వివిధ గ్రూపులను తయారు చేయడం, వారి మధ్య ఎడతెగని ఘర్షణలు సృష్టించడం, ఆ ఘర్షణలు పరిష్కరిస్తానని తానే బయలుదేరడం అమెరికా ఎత్తుగడల్లో ప్రముఖమైనది. ఈ నేపధ్యంలో LeT, JeM లకు పోషకులు ఎవరో తెలియడానికి పెద్దగా తర్క జ్ఞానం అవసరం లేదు.

ఇదిలా ఉంటే అమెరికా సర్టిఫికేట్ పైన భారత పాలకులు స్పందన ఒకింత విచిత్రంగా ఉంది. అమెరికా తన డబ్బును ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో నిర్ణయించుకునే హక్కు అమెరికాకె సొంతం అని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. కానీ అమెరికా ఇచ్చిన సర్టిఫికేట్ సరైంది కూడా కాదని ప్రకటించింది. అమెరికా చెప్పినట్లుగా ఉగ్రవాదాన్ని అదుపు చేయడానికి పాక్ చేసిందేమీ లేదని గోణిగింది. ‘కర్ర విరగరాదు, పాము చావరాదు’ అన్నట్లున్న బి.జె.పి పాలకుల స్పందన కాంగ్రెస్ ప్రభుత్వ స్పందన కంటే ఘోరంగా ఉండడం బట్టి ఏమనుకోవాలి?

 

6 thoughts on “ఉగ్రవాదాన్ని పాక్ బాగా అణచివేస్తోంది -అమెరికా

  1. /ఎవరికి ఇవ్వకూడదో నిర్ణయించుకునే హక్కు అమెరికాకె సొంతం/ ఇంత ప్రజా స్వామ్యకరంగా నా? వింత వింత!

  2. భాజపా కంటే కాంగ్రెసే నయం. మావోయిస్త్‌లని అణచివెయ్యడానికి ఇందియాకి తాము సహాయం చేస్తామని అమెరికా అన్నప్పుడు “మా దేశ అంతర్గత వ్యవహారాలు మేము చూసుకోగలము” అని మన్మోహన్ సింగ్ అన్నట్టు నాకు గుర్తుంది. మన్మోహన్ సింగ్ కూడా పక్కా గ్లోబలైజేషన్‌వాదే కానీ వామనావతారంలా అమెరికా ఇందియాని ఆక్రమించుకుంటుందనే అనుమానంతో మన్మోహన్ సింగ్ అలా మాట్లాడి ఉండొచ్చు. అలా అనుకున్నా, ఆ అనుమానం రావడం తప్పు కాదు. అమెరికా విషయంలో భాజపాకైతే ఆ అనుమానం కూడా రాదు.

  3. ఏమనుకుంటాం సార్. పళ్లు రాలగొట్టుకోవడానికి కాంగ్రెస్ రాయైనా, బీజేపీ రాయైనా ఒకటే అని….

  4. ఇందులొ అశ్చర్యం ఎమి లేదు .అగ్రరాజ్యం (దుష్ట రాజ్యం) కుటిల నీతి వల్లె నేడు ఉగ్రవాదం విశ్వవ్యాప్తం అయ్యింది. తాను పెంచి పొషించిన ఉగ్ర వౄక్షం నేడు శాఖొపశాకలుగా విస్తరించింది . అమేరికా భారత్ కంటే ఒకింత ఎక్కువగా పాక్ వైపే మొగ్గుచుపుతుంది .ప్రపంచాన్ని తగలబెట్టీ ఆమంటలొ చలికాచుకొవడం దానికి వెన్నతొ పెట్టీన విద్య .భారత పాలకులు నమ్మకమైన రష్యాతొ కలిసినడవడం ఉత్తమం .

  5. అమెరికా ఇందియాకి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి సపోర్త్ ఇస్తుంది కానీ ఉల్ఫాకైతే సపోర్త్ ఇవ్వదు. జాతుల విముక్తి పోరాటాలకి సపోర్త్ ఇస్తే సామ్రాజ్యవాదులకి మొదటికే మోసం వస్తుంది. తాలిబాన్ కేవలం ఒక ఉగ్రవాద సంస్థ. దాని వల్ల ప్రజల్లో స్వేచ్ఛావాదం పెరగడం జరగదు. తాలిబాన్‌కో, పాకిస్తాన్‌కో సపోర్త్ ఇవ్వడం వల్ల అమెరికాకి వెంట్రుక నష్టం కూడా రాదు.

  6. ఉగ్రవాదం చెయ్యడం తప్పని ఒక మహోగ్రవాద దేశం ఒక చిన్న ఉగ్రవాద దేశానికి ఎలా చెపుతుంది? అమెరికాకి నయా ఉదారవాద ఆర్థిక అజెందా ఉంటే పాకిస్తాన్‌కి మత అజెందా ఉంది. అదొక్కటే ఇక్కడ తేడా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s