ప్రధాని నరేంద్ర మోడి, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీల సంస్కరణల వాహనం వింత పోకడలు పోతోంది. ఇన్నాళ్లూ దేశ ఆర్ధిక వ్యవస్ధకు పట్టుగొమ్మలుగా ఉంటూ వచ్చిన ప్రాధమిక వ్యవస్ధలను సమూలంగా నాశనం చేస్తున్నారు. వాటి స్ధానే విదేశీ బహుళజాతి కంపెనీల ప్రయోజనాలకు అనుగుణంగా పూర్తి పాలనా పగ్గాలను ప్రైవేటు వ్యక్తులు, కంపెనీల చేతుల్లో పెట్టే చర్యలను వారు వేగవంతం చేశారు.
ఫలితంగా అభివృద్ధి సాధించి ఉద్యోగాలు రావడం అటుంచి ఉన్న సమస్యలు మరింత తీవ్రమై భారత ఆర్ధిక వ్యవస్ధ మరిన్ని కష్టాలను ఎదుర్కోనుంది. లోక్ సభలో మెజారిటీ దక్కినప్పటికీ రాజ్య సభలో తమ సంస్కరణల చర్యలకు ఆమోదం సాధించలేని మోడి ప్రభుత్వం దొడ్డి దారిని వెతుక్కుని వరస బెట్టి ఆర్డినెన్స్ లను జారీ చేస్తోంది.
ఒకే సమావేశంలో 9 ఆర్డినెన్స్ లను జారీ చేయడం ద్వారా మోడి ప్రభుత్వం సో కాల్డ్ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలనలో ఒక రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు. ‘కనిష్ట ప్రభుత్వ, గరిష్ట పాలన’ నినాదాన్ని ఎలా అమలు చేస్తారా అని ఎదురు చూస్తున్న వారు కనిష్ట ప్రభుత్వంలో ప్రజాస్వామ్య విరుద్ధమైన ఆర్డినెన్స్ ల జారీ ఒక మార్గంగా వినియోగించబడుతుందని బహుశా ఊహించి ఉండరు.
ఎన్ని సంస్కరణలు ప్రకటించినప్పటికీ మోడి ప్రకటించిన ‘మేక్-ఇన్-ఇండియా’ ఒక్క అడుగూ వేయలేదు. ‘రండి బాబూ రండి’ అంటూ బొట్టు బెట్టి పిలిచినా పెట్టుబడులు రావడం గగనం అయింది. ఈ విధంగా జైట్లీ నడుపుతున్న సంస్కరణల కారు ఒక చక్రం కోల్పోయి స్టేపిని లేక కూలబడిపోగా మోడి ప్రభుత్వం కొత్త రకం స్టెపినిని కనిపెట్టారు. సదరు స్టెపినియే ఆర్డినెన్స్ లు అని కార్టూనిస్టు సూచిస్తున్నారు.
కాకపోతే కొత్త స్టెపినీ వల్ల కారు నడిచేది రోడ్డు మీద కాదు, గాల్లో మాత్రమే. ఈ స్టెపినీ ఊడిపోయిన టైర్ పాత్రను కాకుండా హెలికాప్టర్ ను పైకి లేపే గాలి పంకాల పాత్రను పోషిస్తుంది. కానీ కారు కారులా నడిస్తేనే మన్నిక. వింత పోకడలు పోతే ఈసారి ఏకంగా మొత్తంగానే తిరిగి లేవలేని విధంగా కుప్పకూలి పోవడం ఖాయం.
భారత దేశం వ్యవసాయ దేశం. ఇప్పటికీ 65 శాతం పల్లెల్లో నివసిస్తూ వ్యవసాయంపై ఆధారపడిన దేశం. చివరి తయారీ, సేవల రంగానికి కూడా వ్యవసాయ రంగమే ప్రధానంగా ముడి సరుకులు, ప్రాధమిక ద్రవ్యం అందించాల్సిన పరిస్ధితి. ఇలాంటి దేశంలోకి విదేశీ బహుళజాతి కంపెనీలకు పూర్తి అధికారం కల్పిస్తే ఒనగూరేది అల్లకల్లోలమే.
hi sir, i started my new blog ,please view that and give some valuable suggestions https://fairindian.wordpress.com/2015/01/02/afghanistans-modern-great-game-2/
నవ్య ఉదారవాదం (neoliberalism)ని మూడవ ప్రపంచ దేశాల పాలకులు నమ్మడమే స్తెప్నీ లేకుండా కారు నడపడానికి ప్రయత్నించడం లాంటిది. ఆ విధానమే అలాంటిదైనప్పుడు ఆ విధానాన్ని నమ్మే ఇద్దరి వ్యవహారంలో తేడా ఏమైనా ఉంటుందా? http://magazine.palleprapancham.in/2015/01/blog-post_15.html