అన్ని కాలాల్లో నీకు ఏది ఇష్టం అని అడిగితే చాలామంది టక్కున చెప్పే మాట ‘చలి కాలం’ లేదా ‘శీతా కాలం’. ముఖ్యంగా డిసెంబర్, జనవరి నెలలు దాదాపు అన్ని వయసుల వారికి మధుర స్మృతుల్ని మిగుల్చుతాయి.
కాలేజీలు, పాఠశాలల విద్యార్ధులు ఎక్కువగా విహార యాత్రలకు వెళ్ళేది ఈ కాలంలోనే కావడంతో ఆ స్మృతుల్ని ఫొటోల్లో భద్రం చేసుకుని జీవితం అంతా చెప్పుకుంటూ చాలా మంది గడుపుతుంటారు.
యుక్త వయసులో ఉన్న యువతీ యువకుల సంగతి చెప్పనే అవసరం లేదు. విహార యాత్రల్లో ప్రేమ చిగురించని జంట ఒక్కటీ లేదంటే ఇక ఆ కాలేజీ పెంపకంలో ఏదో లోపం ఉన్నట్లే కాదా! కనీసం ప్రేమగా పొరబడే ఆకర్షణ అయినా చోటు చేసుకోకుండా ఉండదు.
చలి దేశాల్లో నైతే చలి కాలపు అనుభవాలు కాస్త విభిన్నం. మనుషుల మధ్య సంబంధాలు, భావనలు, భావోద్వేగాలు ఒకటే అయినా అక్కడ ప్రత్యేకంగా కనిపించేది తెల్లటి మంచుతో నిండిన పరిసరాలు. సమస్త పరిసరాలు మంచుతో నిండిపోయి ప్రత్యేక తరహా ఆట, పాటలకు, సంస్కృతీ అలవాట్లకు చలి దేశాలు ఆలవాలం కావడానికి దారి తీసింది.
వింటర్ ఒలింపిక్స్ కేవలం చలి దేశాలకు మాత్రమే పరిమితం కదా మరి! ఐస్ స్కేటింగ్, స్కీయింగ్, ఐస్ హాకీ లాంటి క్రీడలు చలి కాలంలో అక్కడి జనాన్ని ఊపేస్తూ సందడి నింపుతాయి. మానవ సంస్కృతికి, ప్రకృతి పరిసరాలకు ఎంతటి అవినాభావ సంబంధం ఉన్నదో స్పష్టంగా తెలిపేది చలి కాలం, ఆ కాలంలో కురిసే మంచు అంటే అతిశయోక్తి కాబోదు.
వ్యాపార కంపెనీలు కూడా ఈ చలి కాలాన్ని సొమ్ము చేసుకుంటాయి. క్రిస్టమస్, న్యూ ఇయర్ లను పశ్చిమ దేశాల్లో ఫెస్టివల్ సీజన్ గా పరిగణిస్తారు. ఈ సీజన్ ను దృష్టిలో పెట్టుకునే వ్యాపార సంస్ధలు తమ తమ షెడ్యూల్స్ ను రూపొందించుకుని అమలు చేస్తాయి. అమెరికాలో ‘ధ్యాంక్స్ గివింగ్ డే’ తర్వాత రోజు పాటించే ‘బ్లాక్ ఫ్రైడే’, క్రిస్టమస్ సీజన్ రీత్యా పుట్టినదే.
ఈ కింది ఫోటోలు ఆసియా, ఐరోపా ఖండాల్లో 2014లోని వివిధ దేశాల్లో చలి కాలం ప్రవేశించిన సందర్భంగా తీసిన ఫోటోలు. ఆసియా ఖండం అంటే అందులో దక్షిణాసియా కలిసి లేదు. చలికాలం పురస్కరించుకుని మంచు శిల్పాలు నిర్మించడం, వివిధ రకాల మంచు నిర్మాణాలకు పూనుకోవడం ఐరోపా, ఆసియాల్లో మామూలుగా జరిగే ప్రక్రియ.
ఐస్ హాకీ, ఐస్ స్కేటింగ్, స్కీయింగ్ లు కేవలం చలికాలంకు మాత్రమే పరిమితవైనవి కాగా ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో ఒక ఫుట్ బాల్ మ్యాచ్ సైతం దట్టమైన మంచు వానలో జరుగుతున్న దృశ్యాన్ని కింద ఒక ఫోటోలో చూడవచ్చు.
సహజ ప్రకృతి సహజసిద్ధంగానే అందంగా ఉంటుంది. ‘మంచు కురిసే వేళలో’ అయితే ప్రకృతి అందాలు వింత సొబగులు దిద్దుకుని ద్విగుణీకృత అందంతో మనలోని భావాలను కూడా తమవైపుకు లాక్కుంటాయి. ఈ ఫొటోలు చెబుతున్నదీ అదే.
ఫోటోలు: ది అట్లాంటిక్
యుక్త వయసులో ఉన్న యువతీ యువకుల సంగతి చెప్పనే అవసరం లేదు. విహార యాత్రల్లో ప్రేమ చిగురించని జంట ఒక్కటీ లేదంటే ఇక ఆ కాలేజీ పెంపకంలో ఏదో లోపం ఉన్నట్లే కాదా! కనీసం ప్రేమగా పొరబడే ఆకర్షణ అయినా చోటు చేసుకోకుండా ఉండదు.
ప్రేమకు కాలేజీ కు సంభందం అంటకట్టడం అంత సమర్ధనీయ అంశం కాదేమో!అయితే,మీరన్న ఆకర్షణ మాత్రం తప్పక కలిగుతుంది.(ఆ మాటకొస్తే ఆకర్షణకు స్థలము,కాలం కు సంభందం లేదు!)