టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టి.సి.ఎస్) కంపెనీ ప్రపంచంలో అతి పెద్ద, మెరుగైన 10 సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. భారత దేశంలో నయితే ఇదే అతి పెద్ద సాఫ్ట్ వేర్ సేవల కంపెనీ. ఈ కంపెనీలో చేరితో ఉద్యోగ భద్రత ఉంటుందని కూడా ఇటీవలి వరకూ ఒక భావన వ్యాప్తిలో ఉండేది. అలాంటి కంపెనీ ఆ వంకా, ఈ వంకా పెట్టి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోందని, ఎటువంటి నోటీసు, తగిన చెల్లింపులు లేకుండా ఇంటికి పంపుతోందని ఆరోపిస్తూ బెంగుళూరు శాఖలోని ఉద్యోగులు అక్కడి లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
ఈ వార్తను విశ్లేషిస్తూ ఈ బ్లాగ్ లో “టి.సి.ఎస్ లో సామూహిక తొలగింపులు“ శీర్షికన ఒక టపా రాశాన్నేను. ఈ టపాకు ముందరిదే ఆ టపా. పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లించవలసిన సీనియర్ ఉద్యోగులను తొలగించి వారి స్ధానంలో కొత్తవారిని రిక్రూట్ చేసుకుని తద్వారా లాభాలు పెంచుకోవాలని టి.సి.ఎస్ కుట్ర పన్నిందని నేను ఈ టపాలో రాశాను. మోడి గారు ప్రవేశపెట్టిన కార్మిక సంస్కరణలు, ‘శ్రమ యోగి’ లాంటి డాంబిక పద ప్రయోగాలు టి.సి.ఎస్ లాంటి కంపెనీలకు ధైర్యాన్ని ఇచ్చాయని కూడా రాశాను.
ఉదాహరణకు ఈ పేరాలు చూడండి:
నరేంద్ర మోడి ప్రవేశ పెట్టిన కార్మిక సంస్కరణలు టి.సి.ఎస్ కంపెనీకి ధైర్యం ఇచ్చాయనడంలో ఎలాంటి అనుమానమూ అనవసరం. కంప్యూటర్ల ముందు కూర్చొని ఫేస్ బుక్, ట్విట్టర్లలో మోడి గారిని ఫాలో అవుతూ ఉబ్బితబ్బిబ్బు అయిపోయిన మేధో జీవులకు ‘శ్రమ యోగి’ అని తమకు బిరుదును తగిలించడంలో పరమార్ధం ఏమిటో బహుశా ఇప్పుడు అర్ధం కావచ్చు.
యోగులు సర్వసంగ పరిత్యాగులు. శ్రమ యోగులు అయితే సర్వ -శ్రమ తప్ప- సంగ పరిత్యాగులు అవుతారు. అనగా వారు శ్రమ చేస్తూ ఉంటారు, కానీ ఫలితం ఆశించరు. ‘మీ పని మీరు చేయండి. ఫలితం అదే వస్తుంది’ అన్న భగవద్గీత బోధనను శ్రమ యోగులు పాటించాలి. శ్రమయోగుల శ్రమను మేస్తూ బ్రతికేవారి సంగతో అని అడగరాదు. ప్రపంచంలోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు అత్యల్ప వేతనాలు చెల్లిస్తూ (ఇండియా నుండి వెళ్ళిన ఉద్యోగులకు అమెరికాలో కనీస వేతనం కన్నా ఇంకా తక్కువ చెల్లిస్తున్నందుకు మన సాఫ్ట్ వేర్ కంపెనీలపైన అమెరికా కోర్టు జరిమానా విధించిన సంగతి గుర్తు తెచ్చుకోవచ్చు) వారి శ్రమను ఒకటికి పదింతలు దోపిడీ చేసి వారి శ్రమను మేసిన కంపెనీలు ఇప్పుడు ఎంచక్కా వేల కోట్లు పోగేసుకోగా, ఆ లాభాలు అందించిన సాఫ్ట్ వేర్ శ్రమ యోగులు మాత్రం ఉద్యోగాలు కోల్పోయి వీధుల పాలు కావాలి. ఇదే ‘శ్రమ యోగి’ పద ప్రయోగం లోని అంతరార్ధం అని టి.సి.ఎస్ ఉద్యోగుల పరిస్ధితిని చూస్తే గ్రహించవచ్చు.
ఈ విశ్లేషణ గౌరవనీయ పాఠకుల్లో ఒకరికి తప్పుగా తోచింది. (స్పష్టత కోసం: తప్పుగా తోచడంలో ఎంతమాత్రం తప్పులేదు.) శ్రమ యోగి అనడంలో కేవలం శారీరక శ్రమ చేసేవారిని ఉద్దేశించి మాత్రమే అన్న అపోహ ఉండడం వల్ల ‘మీ రాజకీయ విశ్లేషణలు సాఫ్ట్ వేర్ కంపెనీలకు వర్తించవు’ అని సదరు పాఠకులు అభ్యంతరం తెలిపారు. ఆయన ఇలా తన అభిప్రాయం తెలిపారు.
సీనియర్ ఉద్యోగులకు ఎక్కువజీతం ఇవ్వటం బదులు కొత్త ఉద్యోగులతో బండెడు చాకిరీ చేయించుకోవచ్చును అని అనుకోవటం సులువే. కాని సాఫ్ట్‌వేర్ ఉదోగం గుమాస్తా గిరియో దర్జీపనియో కాదు. వచ్చిన నాటినూండే పూర్తిస్థాయిలో ప్రాజెక్టులలో వేగంగా నైపుణ్యంతో హాయిగా పనిచేసి కంపెనీకి లాభాలు గడించి పెట్టేయ్యటానికి. ఒక ప్రాజెక్టు పూర్వాపరాలూ, డిజైనూ, అప్పటి వరకూ పూర్తైన పనీ, నడుస్తున్న పనీ, ఇంకా కావలసిన కోడింగూ, టెస్టింగూ, క్వాలిటీ అనాలసిస్, డాక్యుమెంటేషనూ, గుర్తించిన లొసుగులూ పొరపాట్లకు సంబంధించిన సవరణాకార్యక్రమాలూ ఇలా సవాలక్ష విషయాలుంటాయి. లక్షలకొద్దీ లైనుల కోడింగు వేలకొద్దీ ఫైళ్ళలో ఉంటుంది, ఇంకా అదనపు సమాచారం వివిధ రకాలుగా వివిధ స్థలకాలావధుల్లో ఉంటుంది… …ఇవన్నీ తెలియని బయటి రంగంలోని వ్యక్తులు నోటికి వచ్చినట్లు కామెంట్లు చేయటమూ వ్యాసాలు రాయటమూ ఎబ్బెట్టుగా ఉంటుంది.
సుత్తి, కొడవలి, రంపం, లేత్ మిషన్, అనేక యంత్రాలు… ఇలాంటి ఉపకరణాలతో శారీరక శ్రమ చేసే కార్మికులను మాత్రమే కార్మికులు అనీ, ఇతర మేధో శ్రమలు చేసేవారు కార్మికుల కిందికి రారనీ ఈ వ్యాఖ్యాత అభిప్రాయం. శారీరక శ్రమ చేసే కార్మికులకైతే కార్మిక చట్టాలు, ప్రభుత్వాల విధానాలతో కూడిన రాజకీయ విశ్లేషణ నప్పుతుంది గానీ కోడింగు, టెస్టింగు, అనాలిసిస్… వగైరా పనులకు ఈ విశ్లేషణ నప్పదని వారి అభిప్రాయం. కాబట్టి వేతనాల వ్యత్యాసం ద్వారా లబ్ది పొందాలని టి.సి.ఎస్ యాజమాన్యం భావించినా అది కుదరదని, దానివల్ల వారికే నష్టం అనీ ఆయన చెప్పారు.
ఈ అభిప్రాయం లోని ఉచితానుచితాలు విశ్లేషించడం కోసమే ఈ టపా. వ్యాఖ్యాతను విమర్శించేందుకు ఉద్దేశించినది కాదు. ఇందులో విషయం మాత్రమే చర్చించబడుతుంది.
ఎవరు ఏ అభిప్రాయంతో ఉన్నప్పటికీ వాటితో సంబంధం లేకుండా…. శ్రమ అన్నది ఒకటే. అది శారీరక శ్రమ కావచ్చు, మేధో శ్రమ కావచ్చు. రెండూ ఒకటే. రెండింటికీ శరీరంలో కాలరీలు ఖర్చవుతాయి. ఆయా పని తీవ్రతను బట్టి ఆ కాలరీల ఖర్చు ఉంటుంది. మేధో శ్రమ కంటే తక్కువ కాలరీలు ఖర్చయ్యే శారీరక శ్రమలు ఉంటాయి. ఒక్కోసారి తీవ్ర స్ధాయి మేధో శ్రమలకు తీవ్ర శారీరక శ్రమల కంటే క్యాలరీలు ఖర్చు కావచ్చు. ఈ రీత్యా శారీరక శ్రమ భౌతికమైనదని, మేధో శ్రమ బౌద్ధికమైనదని (బుద్ధితో కూడినది) తేడా చూపడం కరెక్ట్ కాదు. నిజానికి మేధో శ్రమ కూడా భౌతిక శ్రమే. మెదడులో వివిధ భౌతిక రసాయన పదార్ధాలు పరస్పరం చర్యోపచర్యలు జరుపుతూ నాడులను ప్రేరేపించడం వల్ల మెదడు ఆలోచించగలుగుతుంది. భౌతిక శ్రమల వల్ల శరీరంపై ప్రభావాలు ఉన్నట్లే మేధో శ్రమ వల్ల కూడా ఉంటాయి.
అయితే శారీరక, మేధో శ్రమల మధ్య వైరుధ్యం లెదంటారా అని అడగవచ్చు. ఖచ్చితంగా ఉంది. ఈ వైరుధ్యం వల్లనే ప్రస్తుతం ఈ చర్చ నడుస్తోంది. కానీ ఈ వైరుధ్యం శ్రమల లక్షణం వల్ల వచ్చినది కాదు. శారీరక శ్రమల ఫలితం నిర్దిష్ట రూపంలో మెదడుపై ప్రతిబింబించి జ్ఞానంగా ఏర్పడుతుంది. ఈ జ్ఞానాన్ని పునరుత్పత్తి చేయడం మేధో శ్రమ చేసే పని. అనగా శారీరక శ్రమలు లేకపోతే మేధో శ్రమకు అవసరమైన జ్ఞానం పోగుబడదు. ఈ విధంగా శారీరక, మేధో శ్రమలు ఒకదానికొకటి ప్రోత్సాహకరంగా (complimentary) పని చేస్తూ ఉంటాయి. అయితే ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకునే శ్రమలను కృత్రిమంగా విడదీయడం వల్లనే వచ్చింది అసలు తంటా.
శారీరక, మేధో శ్రమల వైరుధ్యం పైకి సహజంగా కనిపిస్తుంది. కొన్ని సహజత్వ లక్షణాలు కూడా లేకపోలేదు. కానీ సామాజిక వ్యవస్ధ పూనుకుంటే ఈ వైరుధ్యంలోని సహజ స్వభావాన్ని అధిగమించడం అంత కష్టం ఏమీ కాదు. కానీ దోపిడీ వ్యవస్ధలు వైరుధ్యాల పుట్టలు. వైరుధ్యాలు వాటికి ప్రాణ వాయువులు. శ్రామిక జనం వివిధ వైరుధ్యాలతో కొట్టుకు చస్తేనే దోపిడీ వర్గాల దోపిడీ పచ్చగా కొనసాగుతుంది. అందువల్ల ప్రాకృతికంగా ఉన్న సహజత్వాన్ని కృత్రిమంగా మరింత పెద్దదిగా చేసి ఒక పెను భూతంలా మన ముందు ఉంచారు. శారీరక శ్రమల ఫలితమైన జ్ఞానాన్ని పొంది అదే గొప్పగా దోపిడీ వ్యవస్ధలు ప్రొజెక్ట్ చేస్తాయి. కాలు కింద పెట్టకుండా కోట్లు గడిస్తే అది దోపిడీ వ్యవస్ధల్లో ఒక మహా ఆదర్శం. శ్రమ వల్లనే సంపదల సృష్టి సాధ్యం కనుక కాలు కింద పెట్టకుండా (శ్రమ చేయకుండా) ఎవరైనా ఎలా కోట్లు గడిస్తారు, దోపిడీ చేస్తే తప్ప! ఈ దోపిడీని న్యాయబద్ధం చేసే క్రమంలోనే శారీరక, మేధో శ్రమల వైరుధ్యాన్ని కూడా న్యాయబద్ధం చేశారు.
కనుక శారీరక, మేధో శ్రమల మధ్య మనకు కనిపించే అగాధం కేవలం కృత్రిమంగా కల్పించినదే తప్ప సహజమైనది కాదు. శారీరక శ్రమ చేసేవాడు సైతం బుద్ధిని ఉపయోగించకపోతే లక్ష్యిత ఉత్పత్తిని తీయలేడు. ఒక కొడవలి తయారు చేయాలంటే ఇనుమును ఎర్రగా కాల్చినాక ఎక్కడ ఎంత దెబ్బ వేయాలో సుత్తి దెబ్బ వేసేవాడికి అవగాహన ఉండాలి. ఆ అవగాహన మేధో జ్ఞానం కాదా? అందమైన కారు స్తంభానికి గుద్దుకుని చొట్టబోతే ఆ చొట్టను సవరించడం టింకరింగ్ కార్మికుడికి మేధో జ్ఞానం లేకుండా సాధ్యపడుతుందా? తాను టింకరింగ్ చేసే రేకు కారులో ఏ భాగంలో ఉందో పరిగణిస్తూ, దానికి అంటుకుని ఉండే ఇతర భాగాలకు అసౌకర్యం కలగకుండా టింకరింగ్ చేస్తే తప్ప అది అతకదు కదా. కనుక శారీరక శ్రమల్లో మేధో శ్రమ అనివార్యంగా ఇమిడి ఉంటుంది. ఎటొచ్చీ మేధో శ్రమలలోనే శరీర భాగాలు తగినంతగా కదలవు. అందువల్లనే ఈ మేధో శ్రమల జీవులంతా వగర్చుకుంటూ మార్నింగ్ వాక్ లు చెయ్యడం, అసలు శ్రమలు వదిలేసి జిమ్ లలో ఇనప గుండ్లు మోస్తూ క్యాలరీలు ఖర్చు పెట్టుకోవాలని తంటాలు పడడం.
కనుక శారీరక శ్రమ చేస్తేనే కార్మికులు కాదు. బ్యాంకుల్లో, ఆఫీసుల్లో, ఇంకా అనేక కార్యాలయాల్లో కుర్చీల్లో కూర్చుని కంప్యూటర్ ముందూ, పుస్తకాల కట్టల వెనుకా పని చేసేవారూ కార్మికులే. కానీ శారీరక శ్రమలతో తమను సమానం చేసుకోవడం ఇష్టం లేక దోపిడీ వ్యవస్ధలు కనిపెట్టిన బ్లూ కాలర్ – వైట్ కాలర్ వర్కర్స్ విభజనను మేధో శ్రమల కార్మికులు స్వీకరించి సంతృప్తిపడుతున్నారు. రోడ్డుపై చీపురు పట్టి ఊడ్చినా శ్రమే – ఆసుపత్రిలో కత్తెర పట్టి వైద్యం (ఆపరేషన్) చేసినా శ్రమే. ఒక్కో శ్రమను మళ్ళీ మళ్ళీ చేస్తే వారే నిపుణులుగా అవతరిస్తారు. అవకాశాలు కల్పిస్తే శారీరక శ్రమల వాళ్ళు కూడా మేధో శ్రమలు చేయగలరు. వారికి అవకాశాలు రానంత మాత్రాన వారు హీనంగా చూడబడడానికి అర్హులు కారు. హీనంగా చూడవలసింది మనుషులను కాదు. విహీన చూపులను సంబద్ధం కావించిన దోపిడి వ్యవస్ధను హీనంగా చూడాలి.హీనంగా చూడడమే కాదు, దానిని మార్చుకునేందుకు ప్రయత్నించాలి. (ఎలా మార్చుకోవడం మరో చర్చ.)
ఈ రీత్యా కార్మికులు అంటే ఫ్యాక్టరీ కార్మికులే కాదు, బ్యాంకులు, ఇన్సూరెన్స్, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ఇత్యాది రంగాల్లో తమ శ్రమను వేతనానికి అమ్ముకుంటున్న ప్రతి వ్యక్తీ కార్మికుడే. ఉన్నత స్ధాయి నిపుణత్వం సాధించడం దోపిడీ వ్యవస్ధల్లో లగ్జరీ. అందుకే వారికి అధిక వేతనాలు లభిస్తాయి. అంతమాత్రాన వారు కార్మికులు కాకుండా పోరు. వ్యవస్ధను అంచెలు అంచెలుగా, దొంతరలు దొంతరలుగా నిర్మించడం, వాటి మధ్య వైరుధ్యాలను చొప్పించడం దోపిడీ వర్గాల అవసరం. ఆ వలలో కార్మికులు పడిపోరాదు.
ఇదంతా ఒక అంశం. టి.సి.ఎస్ విషయానికి మళ్ళీ వస్తే…. మరిన్ని అంశాలను మనం చూడాలి.
…………..ఇంకా ఉంది
శారీరక, మేధో శ్రమల వైరుధ్యం పైకి సహజంగా కనిపిస్తుంది. కొన్ని సహజత్వ లక్షణాలు కూడా లేకపోలేదు. కానీ సామాజిక వ్యవస్ధ పూనుకుంటే ఈ వైరుధ్యంలోని సహజ స్వభావాన్ని అధిగమించడం అంత కష్టం ఏమీ కాదు.
సర్, దీనిని వివరిస్తారా?
సామాజిక వ్యవస్ధ పూనుకోవడం అంటే సమాజంలో వైరుధ్యాలు పోయేలా ప్రజలే పూనుకోవడం. లేదా శ్రామిక వర్గ దృక్పధంతో ఉన్న ప్రభుత్వాలు సామాజిక ప్రయోజనాన్ని కాంక్షిస్తూ చర్యలు తీసుకోవడం. అది ఇప్పటి సమాజంలో జరిగేది కాదు. సమ సమాజ నిర్మాణానికి పూనుకునే వ్యవస్ధలే ఆ పని చేయగలవు.
చైనాలో సోషలిస్టు నిర్మాణం జరిగిన కాలంలో శ్రమలను కొన్ని తరగతులుగా విభజించారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క తరగతిలోని ఒక పనిని చేయాలన్న నిబంధన విధించారు. శారీరక, మేధో శ్రమలు ఎంతెంత ఇమిడి ఉన్నాయన్న అంశంపై ఆధారపడి ఈ తరగతి విభజన చేసినందున ప్రతి ఒక్కరూ శారీరక, మేధో శ్రమలు రెండూ చేసేవారు. ఒకే రోజు రెండు పనులు చేయాలని ఏమీ లేదు. ఒక రోజు, వారం, లేదా నెల… కాలాన్ని వీలును బట్టి తరగతుల మధ్య విభజించి పని/ఉద్యోగం/శ్రమ చేసేలా చూశారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎక్కువ-తక్కువ తేడా లేకుండా అన్నీ రకాల శ్రమలు చేసినందున శారీరక-మేధో శ్రమల వైరుధ్యం పరిష్కరించే ప్రయత్నం చేశారు. కానీ ఇది ఒక రూపానికి రాకముందే పార్టీలో రివిజనిస్టు శక్తులు పై చేయి సాధించి వైరుధ్య పరిష్కారం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత మావో మరణించడం దేశం పూర్తిగా పెట్టుబడిదారీ శక్తుల చేతుల్లోకి వెళ్ళడం జరిగిపోయింది.
చారిత్రిక మానవ క్రమ పరిణామంలో శారీరిక శ్రమ, మేదో శ్రమ అంటూ ప్రత్యేకంగా ఏమి లేదు. ఏ ఉత్పత్తి లేని కాలం లొ మానవునికి అకలైతే ఆ ఆకలికి కారణం శారీక శ్రమ కారణం – అంటే శరీరంలో కేలరీలు తగ్గి పోతే ఆ కేలరీల కొరతను నింపుకోవడం కోసం శరీరం కోరటమే ఆకాలి. ఈ ఆకలి అయినపుడు ఏ చెట్టు మీద కాయనో పండునో తెచ్చుకొని తినాలనిపించడం, శ్రమ కలిగించే ప్రేరణ ఎలా తెచ్చు కోవాలి అన్న ఆలోచనను కలిగిస్తుంది. ఆ ఆలోచనే మేదో శ్రమకు ప్రేరణ. ఈ ప్రేరణ కాస్తా ఇలా తచ్చు కోవచ్చు అన్న బావాన్ని కలిగిస్తుంది. అలా తెచ్చు కోవాలంటే శరీరం సహకరించాలి- అంతే అక్కడకెళ్లి తెచ్చుకోవడాన్ని శారీక శ్రం అంటున్నాము. ఈ రెండు ప్రస్పరాధిత శ్రమలే లేక పోతే ఆకలి తీరదు. అలా గే మానవుడు జంతువుల్ని వేటాది తినడం కూడా, ఆతరువాత ప్రకృతిలో లభించే గింజలు, పళ్లు, ఏమి తివచ్చు ఏమి తినకూడదు అన్న విచక్ష్ణ శారీరిక మానసిక అనుభావాలే. అభి వృద్ది క్రమంలో శ్రమ వర్గీకరణ జరిగినపు మాత్రమే రెండు వేరు పడి నాయి. ఈ వర్గీకణ సమాజం లో కొంత మందిని ఉన్నతులుగా కొంత మధిని తక్కువ గా చూడ బడింది. అప్పటి నుండె మేదో శ్రమ మాజంమ హాక్కు అది మాకు మాత్రమే ఉండాలి అని పట్టు పట్టి దోపిడిని కొనసాగిస్తుంది. మేదో శ్రమలేని శారీక శ్రమ లేని మేదో శ్సారీరిక శ్రమ లేని మేదో శ్రమ నిరుపయోగ మైనదే. ఈ రోజు ఒక సాప్ట్వేర్ ఇంజినీర్ తయారవలంటే వారికి వెనుక ఎంతమంది శారీరిక మేదో శ్రమలు ఇమిడి వున్నాయో అర్దం చేసుకోవాలి. తరాల అనుభ వాలే ఈ నాటి మేదో శ్రమలు. ఉన్నపలంగా చదువుకోడానికి యూనివర్శిటిల్లో దేవుడు పాటాలు తయారు చేసి పెట్టలేదు. ఆ చదువులకయ్యే ఖర్చు సమాజం భరిస్తుంది. అనుకో వచ్చు మేము డబ్బు తో కొనుక్కున్నామని. ఆ డబ్బు ఎక్కడనుండి వచ్చింది? ఆ చదువులు ఎవరు ఏర్పరిచారు? అని ఆలోచించాలి. ఆ మధ్య ఒక వార్త. ఏమిటంటే సంటానోపత్తి సమస్య వున్న దంపతులు ఆ అసమస్యను అధిగ మించడానికి స్పెర్మ డొనర్ కావాలను కున్నారు. అదీ ఆడోనర్ ఐ ఐటి లో చదివిన వాళ్ళు అయితే ఇంకా మంచిదని అంతర్జాలంలో వుంచారు. ఈ మేధో శ్రమల పిచ్చి ఎంత దూరం వెళ్ళి పోయిందో గదా?
చైనాలో సోషలిస్టు నిర్మాణం జరిగిన కాలంలో శ్రమలను కొన్ని తరగతులుగా విభజించారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క తరగతిలోని ఒక పనిని చేయాలన్న నిబంధన విధించారు. శారీరక, మేధో శ్రమలు ఎంతెంత ఇమిడి ఉన్నాయన్న అంశంపై ఆధారపడి ఈ తరగతి విభజన చేసినందున ప్రతి ఒక్కరూ శారీరక, మేధో శ్రమలు రెండూ చేసేవారు. ఒకే రోజు రెండు పనులు చేయాలని ఏమీ లేదు. ఒక రోజు, వారం, లేదా నెల… కాలాన్ని వీలును బట్టి తరగతుల మధ్య విభజించి పని/ఉద్యోగం/శ్రమ చేసేలా చూశారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎక్కువ-తక్కువ తేడా లేకుండా అన్నీ రకాల శ్రమలు చేసినందున శారీరక-మేధో శ్రమల వైరుధ్యం పరిష్కరించే ప్రయత్నం చేశారు.
సర్,మీరు తెలిపిన విషయం రాత పరంగా ఓ.కె.!చేతల పరంగా దీనిని ఎలా అమలుచేసారో తెలియజేయగలరా?
విశేఖర్ గారూ, వ్యాసం బాగుంది. మన ఆలోచనాధోరణుల్లో ఉన్న అంతరం కారణంగా మీతో ఏకీభవించలేకపోతున్నాను.
మీ దృక్పథంతో ఆలోచిస్తే మేథస్సు అధారంగా నడిచే ఉద్యోగాలను తదితరమైన ఉద్యోగాలతో విభిన్నంగా భావించటం సబబు కాదు. దానికి సమర్థనగా మీ రిచ్చిన ఉదాహరణ బాగుంది. ఐతే ఈ విషయంలో వాదించవచ్చును అవును కాదు అని కాని, మౌలికంగా మీరు చెప్పినది సబబే. ఐనా మేధోపరమైన అన్ని పనులూ మిగతావాటితో ఒక గాటన కట్టటంలో సామంజస్యం తక్కువ అనే నా అభిప్రాయం.
శ్రమను వేతనానికి అమ్ముకుంటున్న ప్రతివ్యక్తీ కార్మికుడే అన్న సూత్రీకరణ అలోచనీయం. కాని మేధస్సు కేవలం శ్రమసూత్రాల కొలబద్దలతో కొలవగలది కాదని నా ఉద్దేశం. మీరు భిన్నంగా అనుకుంటే నా అభ్యంతరం లేదు.
ఏదైనా ఒక శ్రమను ఎవరైనా మళ్ళీ మళ్ళీ చేస్తే వారే నిపుణులుగా అవతరిస్తారన్న సూత్రీకరణ మాత్రం పొరపాటు. సమర్థత పెరగటాని అభ్యాసం తోడ్పడుతుంది కాని అభ్యాసం సమర్థతను సృష్టించదు కాబట్టి అనేకులు ఎంతకాలం ఎంత పునరావృత్తిగా చేసినా పనిలో నిపుణులు కాలేకపోవటం పరిపాటి. మళ్ళీమళ్ళీ ఒక పనిని అలాగే చేయగలగటం వ్యుత్పత్తి అంటారు. ఈ వ్యుత్పత్తికి మించిన ప్రతిభ కూడా జోడవ్వాలి. నవనవోన్మేషశాలినీ ప్రతిభా అని నిర్వచనం – స్వంతంగా కేవల పునరావృత్తికి అతీతంగా కొత్తచిగుళ్ళు వేయగల ఆలోచనాపాటవం కలవారే ప్రతిభావంతులు. వారే నిపుణులు. వారికే డిమాండు ఉంటుంది. ఈ ప్రతిభ అనేది ఎదగటానికి నిరంతరాధ్యయనం కూడా తోడ్పడవచ్చును కాని నిజానికి ప్రతిభ అనేదానిని సృష్టించే అందులూ సూత్రాలూ విధానాలు సిధ్ధాంతాలూ ఏవీ లేవు.
ఇకపోతే హీనంగా చూడబడటమూ అధికులుగా చూడబడటమూ అనేవి వివాదాస్పద అంశాలు. ఐటీ రంగంలో వ్యక్తులకు కన్నా వ్యకక్తుల నైపుణ్యాలకే పెద్దపీట. అంతకనా ‘అవసరాల’కే మరింత పెద్దపీట. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒకానొక శుక్రవారం సాయంత్రం రెండుగంటలపాటి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ గారు మొత్తం ఉద్యోగులతో డివిజన్ రీ స్ట్రక్చరింగ్ గురించి సుదీర్ఘసమావేశం నిర్వహించారు. ఐతే సోమవారం ఉదయం మాకు తెలిసిన వార్త ఏమిటంటే ఆ వైస్ ప్రెసిడెంట్ గారికి ఉద్వాసన చెప్పి కంపెనీ మొత్తం డివిజన్‌ని వేరే విధంగా రీ-ఆర్గనైజ్ చేసింది. ఈయనకు పోష్ట్ లేదు కాబట్టి పింక్ స్లిప్ అన్నమాట. ఇది కేవలం అవసరం ఆధారంగా కంపెనీ చేసిన నిర్ణయం. అంతే కాని ఆయన అసమర్థత కారణంగా చేసినది కాదు. ఇది కల్పిత కథకాదు.
ఈ రంగాన్ని సాధారణకార్మికచట్టాలతో సూత్రాలతో బాగుచేస్తే మచిదని మీరనుకుంటే అలాగే, మధ్య నా అభ్యంతరం దేనికి? కాని ప్రపంచధోరణికి భిన్నంగా పోవాలనుకోవటం అవుతుంది. అంతే.
/అనగననగరాగమతిశయించునుండు తినగ తినగ వేము తియ్యగా నుండు/
అని వేమన ఎంతో జీవితానుంభవం నుండి వెలికి తీసిన సత్యాన్ని ఆవిస్కరించారు ప్రతిభ గురించి.
కొడవటి గంటి కుటుంబరావు గారి బుద్దికొలత వాధం గూర్చి తెలుగు సాహిత్యం లోకం లో ఎంతో చర్చ జరిగింది. ఆయన మార్క్సిష్టు మేధావి అయినా ఈ బుద్ది కొలత వాధం గురించి ఎన్నేన్నో విమర్శలొచ్చాయి. ఇది ఆ కాలపు మాట. అయితే ప్రతిభ అనేదే లేదా? లేకేమి తప్పని సరిగా వుంది. అయితే దానికి కొలబద్ద ఏమిటి? పెట్టుబడి దారి ఆర్ధిక వ్యవస్తలో ప్రతిభను కొలిచే యార్డ్ స్టిక్ మాత్రం డబ్బే! ఎవడు అతిగా డబ్బు సంపాదిస్తున్నాడో, సంపదించడానికి దోహద పడుతున్నాడో వాడే ప్రతిభా వంతుడు. ఇది నిజమైన ప్రతిబేనంటారా? అవకాశాలు లేక ఎంతో ప్రతిభ మరుగున పడిపోతున్నది. వారికి ప్రతిభ ఉందని ఎవరూ వొప్పుకోరు. ఈ ప్రతిభకు ఇంకో పక్క డబ్బు, పలుకుబడి, రాజకీయం ఎన్నెన్ని దోదం చేస్తున్నాయో అనుభవ పూర్వకంగా తెలుసుకో వాలి. ఈ సూడో ప్రతిభలగురించి చర్చ జరగాలి. దీని చుట్టు ఒక రాజకీయం అల్ల బడి వుంది. చదువుకున్న దళిత వర్గాలను హేలన చేయడం ఇందులో ముఖ్య మైనది. ఐ టి రంగంలో వేతనాలు ఎక్కువ ఇస్తారు కాబట్టి అందరూ ఆ వైపుకు మల్లారు సమీప భవిష్యుత్తులో దాని రంగు బయట పడ బోతుంది. ఇప్పటికే వెలిసి పోవటం ప్రారంభ మైనది. అప్పుడui ప్రతిభ ఇంకో రంగానికి మల్లుతుంది. వేతనాల కోసం చదివే చదువుల్లో ప్రతిభ మేడి పండు లాంటిది. జీవితావగాహన లేని ప్రతిభ. వ్య్క్తిత్వాలు లేని ప్రతిభ. జీవితన్ని మెరుగు పర్చుకోలేని ప్రతిభ. మెరుగు పర్చు కోవడమంటే ధన సంపాధన కాదు.
శ్యామలీయంగారు,
మేధస్సు కేవలం శ్రమసూత్రాల కొలబద్దలతో కొలవగలది కాదని నా ఉద్దేశం. నిజమే. ఫాక్టరిలో ఇన్ని గంటల పని, ఇంతమంది అవసరం అని లెక్క వేసినట్లు, ఐ.టి. లో పనిని ఖచ్చితంగా కొలవలేము. ఒక ప్రోగ్రాం రాయటం వ్యక్తి యొక్క్ ప్రతిభ మీద, అనుభవం మీదా ఆధారపడి ఉంట్టుందన్న విషయం మీకుతెలిసిందే. ఈ రంగాన్ని సాధారణకార్మికచట్టాలతో సూత్రాలతో బాగుచేస్తే ప్రాజేక్ట్ లు వేరే దేశం వారు కొట్టుకొని పోతారేమో అనే భయం అందరికి ఉంది. కనుక ఈ సమస్యను బాగా ఆలోచించి పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా యజమాన్యాలు ఆడింది ఆట పాడింది పాట అని ప్రవర్తిస్తే దానికి బ్రేక్ వేయాలి. ఇండియాలో ఉండే పెద్ద కంపెనీలను లక్ష మంది చొప్పున చిన్న కంపేనిలుగా విడగొట్టాలి. రెండోది ప్రపంచవ్యాప్తంగా ఐ.టి. ఉద్యోగులు యునియన్ లు గా ఏర్పడి సంఘటితం కావాలి. అది జరుగుతుంది కూడా.
ప్రేమసందేశంగారూ, ఐటీరంగంలో యాజమాన్యాలకూ ఉద్యోగులకూ కూడా ‘మార్కెట్ అవసరం’ అనేది దారులు పరుస్తూ మూస్తూ ఉంటుంది. వారైనా వీరైనా ఏకపక్షంగా చేసేది ఏమీ లేదు. ఉందనుకోవటం భ్రమ. భారతదేశంలో ఉన్న కంపెనీలను కావలసిన సైజుకు ముక్కలుగా కోయటం అనేది చిత్రమైన ఆలోచన. ఈ ఐటీ రంగం పోకడలను ‘మార్కెట్ అవసరం’ నియంత్రిస్తూ ఉంటే మార్కెట్ అవసరాలను నిరంతరం అభివృధ్ధిచెందుతూ ఉండే సాంకేతికరంగం క్రొత్తపుంతలు త్రొక్కిస్తూ ఉంటుంది. ఈ రంగంలో ట్రేడ్ యూనియనిజమ్ తీసుకురావాలన్న కాలంచెల్లినట్లు భావించబడుతున్న కమ్యూనిష్ట్ ఆలోచన ఆచరణసాధ్యంకాదు.