టి.సి.ఎస్ లో సామూహిక తొలగింపులు


TCS, Benguluru

భారత దేశంలో అతి పెద్ద సాఫ్ట్ వేర్ ఉత్పత్తి మరియు సేవల కంపెనీగా ప్రసిద్ధి గాంచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టి.సి.ఎస్) కంపెనీ గుట్టు చప్పుడు కాకుండా పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగిస్తోంది. కంపెనీ నుండి తొలగించబడిన ఉద్యోగులు ఈ మేరకు బెంగుళూరు/కర్ణాటక డిప్యూటీ లేబర్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వారు అధికారికంగా ఇంకా ఫిర్యాదు చేయవలసి ఉందని తెలుస్తోంది.

ఉద్యోగులను సామూహికంగా తొలగించే కార్యక్రమాన్ని టి.సి.ఎస్ కంపెనీ యాజమాన్యం చేపట్టిందని ఉద్యోగులు చెబుతున్నారు. సామర్ధ్య ప్రదర్శన లేని ఉద్యోగులుగా (non-performers) చెబుతూ తమను ఉద్యోగాల నుండి తప్పిస్తున్నారని, ముందస్తు నోటీసు, సమాచారం లాంటివి ఏవీ ఇవ్వకుండానే ‘ఇక ఆఫీసుకు రావొద్ద’ని చెబుతున్నారని ఉద్యోగులు ఆరోపించారు. తాము లేబర్ కార్యాలయంలో త్వరలోనే అధికారికంగా ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.

డిసెంబర్ 8 తేదీ నుండి లే-ఆఫ్ ప్రక్రియను టి.సి.ఎస్ యాజమాన్యం ప్రారంభించిందని తెలుస్తోంది. బెంగుళూరు, పూనే, కోల్ కతా, ముంబై మొదలైన సెంటర్లు అన్నింటిలోనూ ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారని ఉద్యోగులు తెలిపారు. తొలగింపుకు ముందు చట్టం ప్రకారం పాటించవలసిన చర్యలను ఏమీ పాటించడం లేదని, ముందుస్తు నోటీసు ఇవ్వడం గానీ, సమాచారం ఇవ్వడం గానీ, చట్ట రీత్యా దక్కవలసిన నష్టపరిహారం చెల్లించడం గానీ ఏమీ చేయడం లేదని వారు తెలిపారు.

లే-ఆఫ్ లో భాగంగా 7 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నవారిని ప్రధానంగా తొలగిస్తున్నారని ఉద్యోగులు తెలిపారు. వీరందరూ మధ్య స్ధాయి నుండి సీనియర్ స్ధాయి పొజిషన్ లలో ఉన్న ఉద్యోగులేనని తెలిపారు. ఉన్నట్లుండి ఉద్యోగం కోల్పోవడంతో వారంతా వీధిన పడ్డారని తెలిపారు.

“పునర్వ్యవస్ధీకరణ (restructuring) లో భాగంగా స్వచ్ఛంద రాజీనామా లేఖలపై సంతకాలు చేయాలని ఉద్యోగులను అడిగారు. అందుకు మాకు ఒక నెల నోటీసు ఇచ్చారు. (చట్ట ప్రకారం) మాకు తగిన నష్టపరిహారం ఇవ్వడం లేదు” అని బెంగుళూరులో ఎలక్ట్రానిక్స్ సిటీ క్యాంపస్ లో పని చేస్తున్న ఉద్యోగి తెలిపారు. ఈ ఉద్యోగి ఇప్పటికే తన ఉద్యోగాన్ని కోల్పోయారు.

“మొదట మిమ్మల్ని ప్రాజెక్టు నుండి తొలగిస్తారు. ఆ తర్వాత కంపెనీనే విడిచిపొమ్మని చెబుతారు” అని తన ఉద్యోగం కోల్పోయిన మరో వ్యక్తి చెప్పారని ది హిందు తెలిపింది.

మొదట ప్రాజెక్టు నుండి తప్పించడం ద్వారా ‘పిచ్చి కుక్క’ ముద్రను ఆ ఉద్యోగులకు తగిలించే కుట్రను టి.సి.ఎస్ యాజమాన్యం అమలు చేస్తోందన్నది స్పష్టమే. కుక్కను చంపాలనుకున్నప్పుడు దానికి పిచ్చి కుక్క ఉన్న ముద్ర వేస్తే చంపేందుకు అందరి ఆమోదం లభిస్తుంది. ఆమోదం ఇవ్వడమే కాదు, చంపడంలో భాగం పంచుకుంటారు కూడా. అలాగే ప్రాజెక్టు నుండి తొలగిస్తే ఇక ‘నాన్-పెర్ఫార్మర్’ అని ముద్ర తగిలించడం తేలిక. ఆ ముద్ర స్ధిర పడ్డాక ఇక ఉద్యోగం పీకేయడం సులభం. ‘అవున్లే. పని లేకపోతే ఉద్యోగులను కూర్చోబెట్టి ఎలా మేపుతారు? కంపెనీ యేమన్నా ధర్మ సత్రం నడపడం లేదు కదా!” అని రాజకీయ నాయకులు, అధికారులు, మంత్రులు…. ఇత్యాది పెద్దలు కంపెనీ చర్యకు ఆమోద ముద్ర వేయడం సులభం. చట్టాలు గిట్టాల ఊసే ఇక ఉండదు.

నరేంద్ర మోడి ప్రవేశ పెట్టిన కార్మిక సంస్కరణలు టి.సి.ఎస్ కంపెనీకి ధైర్యం ఇచ్చాయనడంలో ఎలాంటి అనుమానమూ అనవసరం. కంప్యూటర్ల ముందు కూర్చొని ఫేస్ బుక్, ట్విట్టర్లలో మోడి గారిని ఫాలో అవుతూ ఉబ్బితబ్బిబ్బు అయిపోయిన మేధో జీవులకు ‘శ్రమ యోగి’ అని తమకు బిరుదును తగిలించడంలో పరమార్ధం ఏమిటో బహుశా ఇప్పుడు అర్ధం కావచ్చు.

యోగులు సర్వసంగ పరిత్యాగులు. శ్రమ యోగులు అయితే సర్వ -శ్రమ తప్ప- సంగ పరిత్యాగులు అవుతారు. అనగా వారు శ్రమ చేస్తూ ఉంటారు, కానీ ఫలితం ఆశించరు. ‘మీ పని మీరు చేయండి. ఫలితం అదే వస్తుంది’ అన్న భగవద్గీత బోధనను శ్రమ యోగులు పాటించాలి. శ్రమయోగుల శ్రమను మేస్తూ బ్రతికేవారి సంగతో అని అడగరాదు. ప్రపంచంలోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు అత్యల్ప వేతనాలు చెల్లిస్తూ (ఇండియా నుండి వెళ్ళిన ఉద్యోగులకు అమెరికాలో కనీస వేతనం కన్నా ఇంకా తక్కువ చెల్లిస్తున్నందుకు మన సాఫ్ట్ వేర్ కంపెనీలపైన అమెరికా కోర్టు జరిమానా విధించిన సంగతి గుర్తు తెచ్చుకోవచ్చు) వారి శ్రమను ఒకటికి పదింతలు దోపిడీ చేసి వారి శ్రమను మేసిన కంపెనీలు ఇప్పుడు ఎంచక్కా వేల కోట్లు పోగేసుకోగా, ఆ లాభాలు అందించిన సాఫ్ట్ వేర్ శ్రమ యోగులు మాత్రం ఉద్యోగాలు కోల్పోయి వీధుల పాలు కావాలి. ఇదే ‘శ్రమ యోగి’ పద ప్రయోగం లోని అంతరార్ధం అని టి.సి.ఎస్ ఉద్యోగుల పరిస్ధితిని చూస్తే గ్రహించవచ్చు.

ది హిందు పత్రిక టి.సి.ఎస్ ఉద్యోగుల ఫిర్యాదు విషయమై కంపెనీని సంప్రదించింది. “సామర్ధ్య ప్రదర్శన పైనే ఆధారపడ్డ కంపెనీగా ఉద్యోగులను గరిష్ట స్ధాయిలో వినియోగించుకోవడం అనేది ఎల్లప్పుడూ జరిగే ప్రక్రియ. సంవత్సరం పొడవునా జరిగే ప్రక్రియలో ఉద్యోగి ప్రదర్శన, వ్యాపార అవసరాలు, ప్రజల ఆకాంక్షలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటాము. ఇది కంపెనీలో అనివార్యంగా కొంత రాపిడి జరుగుతుంది. ఇది సాధారణ సమస్యగానో లేదా ప్రత్యేక పరిస్ధితిలో పుట్టిన సమస్యగానో చూడనవసరం లేదు. ప్రపంచ వ్యాపితంగా ఉన్న ఐ.టి తెలివి తేటలను మేము రిక్రూట్ చేసుకోవడం కొనసాగుతుంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 55,000 మంది నిపుణులను రిక్రూట్ చేసుకోవాలన్నది మా టార్గెట్. దానిని సాధించే మార్గంలోనే మేము ఉన్నాం కూడా” అని ఈ మెయిల్ సమాధానంలో కంపెనీ చెప్పిందని పత్రిక తెలియజేసింది.

అయితే కంపెనీ దాచిపెట్టిన అసలు విషయం ఏమిటంటే వేతనాల వ్యత్యాసం. సీనియర్ ఉద్యోగులకు అధిక వేతనాలను కంపెనీ చెల్లించవలసి ఉంటుంది. పైగా తమ చిత్తానుసారం వారికి పని అప్పగించే సౌకర్యం కంపెనీకి ఉండదు. అదే కొత్త ఉద్యోగులైతే ప్రారంభ వేతనాలతో బండెడు చాకిరీ చేయించుకోవచ్చు. శిక్షణ పేరుతో కూడా చాకిరీ చేయించుకోవచ్చు. తద్వారా మరిన్ని లాభాలను కంపెనీ పోగేసుకోవచ్చు. 2008 ఆర్ధిక సంక్షోభం నుండి అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, యూరప్ లలో కంపెనీలు అనుసరిస్తున్న కార్యక్రమం ఇదే. పొదుపు విధానాల పేరుతో ఉన్న ఉద్యోగులను ఊడబెరికడం తద్వారా ఉద్భవించిన నిరుద్యోగ సైన్యం నుండి అతి తక్కువ వేతనాలతో చాకిరీ చేయించుకోవడం. ఈ విధంగా ఉద్యోగులకు, కార్మికులకు చెల్లించే వేతనాల భాగాన్ని బాగా తగ్గించి తమ లాభాలు తగ్గకుండా, మరిన్ని లాభాలు సంపాదించేట్టుగా కంపెనీలు చూసుకున్నాయి.

టి.సి.ఎస్ పాటిస్తున్న పద్ధతి కూడా ఇదే. నాన్-పెర్ఫార్మర్స్ అన్నది ఒట్టి అబద్ధం. వారి కోరికలకు తగ్గట్టుగా విచక్షణారహితంగా చాకిరీ చేయించుకోలేని సీనియర్ స్ధాయి ఉద్యోగులను తొలగించి వారి కంటే అతి తక్కువ వేతనంతో కొత్తవారితో పని చేయించుకోవడం కంపెనీ లక్ష్యం. లేకుంటే ఒక పక్క ప్రాజెక్టుల నుండి ఉద్యోగులను తప్పిస్తూ మరో పక్క వేలాది మందిని రిక్రూట్ చేసుకోవడం పొసగని విషయం. నరేంద్ర మోడి/బి.జె.పి/ఎన్.డి.ఏ హామీ ఇచ్చిన ‘అచ్చే దిన్’ అంటే ఏమిటో ఇంకా ఎవరికన్నా అనుమానాలు ఉన్నాయా?

24 thoughts on “టి.సి.ఎస్ లో సామూహిక తొలగింపులు

 1. సర్,ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం నిరంతరం జరిగే ప్రక్రియే కదా!అది యు.పి.ఏ హయంలో అయితేనేమి?
  మోదీ హయంలో అయితే నేమి? మీ ఉద్దేశ్యం మోదీని ప్రమోట్ చేసిన కంపనీలలో టి.సి.యస్ కూడా ఉందనా? కార్మిక చట్టాలను మార్చకుండా ఏ ప్రభుత్వమైనా ఏమి చేయగలదు? పోనీ,న్యాయ వ్యవస్థలోనైనా నిరుద్యోగులకు(ఉద్యోగం నుంచి తీసేసిన వారికి) న్యాయం జరిగే అవకాశం ఉందంటారా?

 2. ఇక్కడ మీ దృష్టికి రాని అంశం ఒకటి ఉన్నది. సీనియర్ ఉద్యోగులకు ఎక్కువజీతం ఇవ్వటం బదులు కొత్త ఉద్యోగులతో బండెడు చాకిరీ చేయించుకోవచ్చును అని అనుకోవటం సులువే. కాని సాఫ్ట్‌వేర్ ఉదోగం గుమాస్తా గిరియో దర్జీపనియో కాదు. వచ్చిన నాటినూండే పూర్తిస్థాయిలో ప్రాజెక్టులలో వేగంగా నైపుణ్యంతో హాయిగా పనిచేసి కంపెనీకి లాభాలు గడించి పెట్టేయ్యటానికి. ఒక ప్రాజెక్టు పూర్వాపరాలూ, డిజైనూ, అప్పటి వరకూ పూర్తైన పనీ, నడుస్తున్న పనీ, ఇంకా కావలసిన కోడింగూ, టెస్టింగూ, క్వాలిటీ అనాలసిస్, డాక్యుమెంటేషనూ, గుర్తించిన లొసుగులూ పొరపాట్లకు సంబంధించిన సవరణాకార్యక్రమాలూ ఇలా సవాలక్ష విషయాలుంటాయి. లక్షలకొద్దీ లైనుల కోడింగు వేలకొద్దీ ఫైళ్ళలో ఉంటుంది, ఇంకా అదనపు సమాచారం వివిధ రకాలుగా వివిధ స్థలకాలావధుల్లో ఉంటుంది. అసలు ఇవన్నీ ఆకళింపు చేసుకుందుకే ఒక మోస్తరు ప్రాజెక్టులో దూరినవాడికి ఆరునెలలో సంవత్సరమో పటవచ్చును. ప్రాజెక్టు అన్నాక దానికి సంబంధించి కష్టమర్లకు చేసిన వాగ్దానాలు నెరవేర్చాలంటే హఠాత్తుగా సీనియర్లను పీకి కొత్తవారికి అప్పగిస్తే ఇబ్బందే. ప్రాజెక్టు చెడితే కష్టమర్లు గోల చేయటమే కాదు కోర్టులకూ పోతారు. కంపెనీకి అతిముఖ్యమైన ప్రాజెక్టుల విషయంలో ఆర్థికపరంగా కోలుకోలేని దెబ్బలూ తగలవచ్చును. ఇవన్నీ తెలియని బయటి రంగంలోని వ్యక్తులు నోటికి వచ్చినట్లు కామెంట్లు చేయటమూ వ్యాసాలు రాయటమూ ఎబ్బెట్టుగా ఉంటుంది. కేవలం జూనియర్లకు ఎక్కువ జీతాలు ఇవ్వక్కర్లేదు అని అలోచించి ఏ కంపెనీ కూడా ఉద్యోగులను చిత్తానుసారం మార్చదు – మార్చలేదు. చాలా లెక్కలుంటాయి. మీ రాజకీయవిశ్లేషణలు పాక్షికంగా కూడా వాటిని అర్థం చేసుకోలేవు.

 3. “ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం నిరంతరం జరిగే ప్రక్రియే కదా!”

  కాదు. ఇష్టానుసారం ఉద్యోగులు, కార్మికుల్ని తొలగించడం చట్టబద్ధం కాదు. కార్మికుల్ని తొలగించేతప్పుడు నిర్దిష్ట చట్టాలను అనుసరింఛాలి. లేబర్ డిపార్ట్ మెంట్ కు సమాచారం ఇవ్వాలి. ఉద్యోగులకి నోటీసు ఇవ్వాలి. కారణాలు చెప్పాలి. లేబర్ కమిషనర్ విచారణ చెయ్యాలి. అందరూ అనుమతిస్తే తగిన నష్టపరిహారం చెల్లించి గాని తొలగించరాదు. ఈ లోపు కార్మిక సంఘాలు చర్యలకు దిగితే వారికి సమాధానం ఇవ్వాలి. ఐ.డి చట్టం కింద, కార్మికులకు సంక్రమించిన ఉమ్మడి బేరసరాల హక్కును సంతృప్తిపరుస్తూ చర్చలు జరపాలి.

  ఇవేవీ ఆయాచితంగా కార్మికులకు దక్కిన హక్కులు కావు. దశాబ్దాల తరబడి దేశ విదేశాల్లో తీవ్ర సమ్మె పోరాటాలు చేసి త్యాగాలు చేస్తే వచ్చినవి. విధిలేక ఇచ్చినవి. ఈ హక్కులన్నీ అంతర్జాతీయ కార్మిక సంస్ధ కింద ఐరాస సభ్య దేశాలు అంగీకరించినవి కూడా. ఐ.ఎల్.ఓ నిర్దేశించిన ఇంకా అనేక హక్కులు ఇప్పటికీ ఇండియాలో ఇవ్వడం లేదు.

  మోడి పుణ్యాన ఈ హక్కుల్లో చాలా వరకు రద్దయ్యాయి. మరోకొన్ని రద్దు కానున్నాయి. యు.పి.ఏ, కాంగ్రెస్ పాలనలోనే ఈ చట్టాలను మొద్దుబార్చారు. ఇప్పుడు ఏకంగా రద్దు చేస్తున్నారు.

  ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వాలు వేల కోట్ల అప్పులు ఇస్తాయి. అవి ఎగ్గొడితే రద్దు చేస్తాయి. ఎగుమతి, దిగుమతి రాయితీలు ఇస్తాయి. సంక్షోభం వస్తే బెయిలౌట్లు పంచి పెడతాయి. ఉద్దీపనలు ఇస్తాయి. అదంతా జనం సొమ్ము. ఉద్యోగాలు ఇస్తామని, జనం సొమ్ము రుణాలుగా మింగి లాభాలు ఆర్జిస్తూ ఉద్యోగాలు రద్దు చెయ్యడం, తొలగించడం ప్రైవేటు కంపెనీల హక్కు ఎలా అవుతుంది? కంపెనీల పెట్టుబడుల్లో అధిక మొత్తం ప్రభుత్వాలు అప్పుగా ఇచ్చినవి. జనం నుండి పబ్లిక్ ఇస్యూల ద్వారా సేకరించినవి. అడ్డగోలుగా బాండ్లు జారీ చేసి సమీకరించినవి. సొంత డబ్బు పెడితే ఐ.టి కన్ను పడుతుందని పెట్టరు. దాన్ని విదేశాల్లో భద్రంగా దాచుకుంటారు. వారికే హక్కులన్నీ దాఖలు పరిచి జనానికి మాత్రం ఉండీ లేని హక్కుల్ని రద్దు చేస్తే అది సాధారణంగా తీసుకోవడం అవాంఛనీయం.

  ఇటీవల మోడి ప్రకటించిన

 4. శ్యామల గారూ, పోనీ మీరు చెప్పండి.

  మీరు చెప్పకుండా ‘మీకు అర్ధం కావులే’ అని తోసిపారేయడం ఎలా ఉందంటే, ‘వేదాలు మీకు అర్ధం కావులే’ అని శ్రామిక జనాన్ని చదువుకి దూరంగా పెట్టినట్టే ఉంది.

  పోనీ అంత చాతగాకపోతే కంపెనీని ఉద్యోగులకు అప్పగించమనండి. టాటా కూడా ఊచించలేని భ్రహ్మాండమైన లాభాలు తీసుకొస్తారు. కాకపోతే ఆ లాభాల్లో ఉద్యోగులకి లాభాలు ఇవ్వాలి. అవసరమైన ప్రతి ఛోటా ఉద్యోగి ఉండాలి. ఇవన్నీ బహుశా మీకు అర్ధం కావులెండి. ధనికవర్గాల కష్టాల మీదనే గంపల కొద్దీ సానుభూతి ఉన్నవారికి కార్మికుల కష్టాలు ఏమి ఆనుతాయి చెప్పండి. మీ కష్టం కూడా అర్ధం చేసుకోదగిందే.

 5. ఉద్యోగులని తొలిగించడం ఒక individual unitకి మాత్రమే లాభం కలిగిస్తుంది కానీ ఒక ఆర్థిక వ్యవస్థకి మాత్రం కాదు. నిరుద్యోగులకి బ్యాంక్‌లు అప్పులు ఇవ్వవు కనుక నిరుద్యోగం వల్ల బ్యాంకింగ్ రంగానికి నష్టం. నిరుద్యోగులు ఉద్యోగాలు వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోతుంటారు కనుక ఈ అస్థిర జనాభా వల్ల real estates వ్యాపారానికి కూడా నష్టం. నిరుద్యోగులకి కొనుగోలు శక్తి ఉండదు కనుక వస్తువులకి demand తగ్గి వస్తు ఉత్పత్తి రంగానికి నష్టం. కార్మిక చట్టాల సంస్కరణ వల్ల దేశం అయ్యేది దివాలాయే.

 6. ఇదే విషయం జాన్ కీనెస్ కూడా చెప్పాడు కదా అని నేను పెట్టుబడిదారుణ్ణి అంటారేమో అనుకున్నాను! యూత్యూబ్‌లో macroeconomic paradoxes అని వెతికి వీదియోలు చూడండి. నేను చెప్పింది ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. రొనాల్ద్ రీగన్ వచ్చినప్పటి నుంచి కీనెసియన్ ఆర్థిక విధానాన్ని వదిలేసి క్లాసికల్ ఆర్థిక విధానాన్ని పట్టుకున్నారు పాలకవర్గాలవాళ్ళు.

 7. విశేఖర్ గారూ, మీకు నేను వ్రాసిన వ్యాఖ్య అర్థం కాలేదో లేదో దానిని మీరు సరిగా చదవలేదో తెలియదు. చెప్పకుండా ‘మీకు అర్ధం కావులే’ అని తోసిపారేయడం ఏమీ చేయలేదు నేను. సాఫ్ట్‌వేర్ ఉద్యోగమూ ప్రాజెక్టులయొక్క స్థితిగతుల గురించి వ్యాఖ్యకూ అవసరమైనంత మేరకు చెప్పనేచెప్పాను. గమనించండి. మీకు సాఫ్ట్‌వేర్ గురించి అవగాహన ఉన్నట్లుగా అనిపించటం లేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనేది ప్రభుత్వగుమాస్తాగిరీయో, ఫ్యాక్టరీకార్మికజీవితమో కానేకాదు. ఆ సంగతి మీకు తెలియదనే మీ ధోరణిని బట్టి అనుకుంటున్నాను. ఇకపోతే మీరు ఇచ్చిన సమాధానంలోని ఇతరవిషయాలు విషయసంబంధి కావు ఎందుకంటే అవి మీ అవగాహనారాహిత్యంలోనుండి పుట్టిన మాటలు కాబట్టి. ప్రవీణ్‌కు కూడా సాఫ్ట్‌వేర్ గురించి ఆట్టే తెలియదనే అతని వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఇక మీకు అతడి కామెంటు నచ్చటంలో అది అర్థవంతంగా కనబడటంలో విశేషమూ మిడ్డూరమూ ఏమీ లేదు. కాననివాని నూతగొని కాననివాడు విశేషవస్తువుల్ కానని భంగి అన్నదానికి సరిగ్గా ఒక ఉదాహరణ చూపారు. సంతోషం.

 8. “ఇవన్నీ తెలియని బయటి రంగంలోని వ్యక్తులు నోటికి వచ్చినట్లు కామెంట్లు చేయటమూ వ్యాసాలు రాయటమూ ఎబ్బెట్టుగా ఉంటుంది. కేవలం జూనియర్లకు ఎక్కువ జీతాలు ఇవ్వక్కర్లేదు అని అలోచించి ఏ కంపెనీ కూడా ఉద్యోగులను చిత్తానుసారం మార్చదు – మార్చలేదు. చాలా లెక్కలుంటాయి. మీ రాజకీయవిశ్లేషణలు పాక్షికంగా కూడా వాటిని అర్థం చేసుకోలేవు.”

  శ్యామల గారు, ఇవీ మీ వ్యాఖ్యాల్లోని మాటలు. వీటిని ఉద్దేశించే మీకు సమాధానం రాశాను.

  సాఫ్ట్ వేర్ కంపెనీలు చేసే శ్రమ దోపిడీ గురించి, ఉద్యోగ అబధ్రత గురించి చెప్పే మిత్రులు నాకు ఉన్నారు. సాఫ్ట్ వేర్ గురించి, కోడింగ్ గురించి, ఇంకా వేలాది ఫైళ్ళ గురించి నాకు తెలియదనీ, అందుకే నేనిలా రాశాననీ మీరు ఊహిస్తున్నారు. కానీ, విషయం ఏమిటంటే నేను రాసిన అంశాలు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు కూడా ఎలా వర్తిస్తాయో మీకు అర్ధం కాకపోవడం. పరస్పర సంబంధం మీకు అర్ధం కాక, అర్ధం చేసుకోలేక దాన్ని నాకు అర్ధం కాకపోవడంగా చెప్పుకుని మిమ్మల్ని మీరు సమాధానపరుచుకుంటున్నారు.

  పెట్టుబడిదారీ శ్రమ దోపిడీ, పెట్టుబడిదారీ కంపెనీల లేబర్ విధానాలు ఎలా ఉంటాయో మీకు తెలియాలంటే…. అది నేను చెప్పే విషయం కాదు. మీకు మీరు అర్ధం చేసుకోవాలి. దానికి మొదట శ్రమను గౌరవించే దృక్పధం ఉండాలి. మేధో శ్రమ, శారీరక శ్రమ కంటే గొప్పది కాదనీ, శారీరక శ్రమల వల్ల పుట్టినదే మేధో పరిజ్ఞానం అన్న తెలివిడి ఉండాలి. ఇవి లేకుండా కోడింగు, గాడిద గుడ్డూ అంటూ విషయాన్ని ఎక్కడో అంతెత్తున పెట్టి ‘మీకు అర్ధం కాదులే’ అని మీరే తీర్మానించేసుకుని దానిని మా నెత్తిన రుద్దడం మీబోటి మేధో జీవుల లక్షణం.

  సాఫ్ట్ వేర్ గురించి నాకు ఏమి తెలుసో, ఎంత తెలుసో మీకు తెలియాల్సిన అవసరం లేదు. కనీసం ఈ సందర్భంలో మీకు తెలియాల్సిందల్లా సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, శారీరక, మేధో శ్రమల పరిజ్ఞానాలకు అతీతంగా శ్రమ దోపిడీ చేయగల పెట్టుబడిదారీ వ్యవస్ధ లక్షణాల గురించే. మీ దృష్టి ఎలాగూ ఆ వైపు వెళ్ళదు. అందుకే మీకు ఎంత అవసరమో అంతే చెప్పి ఊరుకున్నాను. నా అంచనాను మీ రెండో వ్యాఖ్య ద్వారా ధ్రువపరిచారు. సంతోషం.

  ప్రవీణ్ వ్యాఖ్య మీ వ్యాఖ్యతో సంబంధం లేనిది. ఉద్యోగుల తొలగింపు వల్ల వ్యవస్ధకు ఎలా నష్టం వస్తుందో తన వ్యాఖ్యలో ఆయన చెప్పారు. దాన్ని కూడా మీ మీదికే లాగేసుకుని ఉక్రోషపడిపోతున్నారు చూశారూ, అదే మీ సాఫ్ట్ వేర్ పరిజ్ఞానం వ్యవస్ధని అర్ధం చేసుకోవడంలో ఏ మేరకు ఉపయోగపడుతుందో చెప్పేస్తోంది.

  -సమాప్తం

  ***********

  ఇతర మిత్రులకు

  ఒక సంగతి మళ్ళీ చెప్పడం అవసరం. సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, ఇంకా ఇతర అనేకానేక పరిశ్రమల లక్షణాలు వేటికవే ప్రత్యేకంగా ఉండేవి ఉంటాయి. అలాగే అన్ని రకాల పరిశ్రమలకు ఉమ్మడిగా వర్తించే ఉమ్మడి లక్షణాలూ ఉంటాయి. ప్రత్యేక అంశాలను సాధారణ అంశాలను రెండింటిని విడదీసి పరిశీలించడం ఎంత అవసరమో ఉమ్మడి అంశాలను ఉమ్మడిగా పరిశీలించడమూ అవసరమే. (దీనిని Generality of contradiction, Particularity of contradiction దృక్పధంలో చూడడంగా చెప్పవచ్చు.) ఈ రెండింటిలో ఏది తక్కువ చేసినా పైన శ్యామల గారు చెప్పినట్లు ‘మీకు తెలియదులే’ అన్న అల్ప చూపు (తక్కువ చేసి చూడడం, చెప్పడం…) రావచ్చు.

  ఇలాంటి ధోరణి అవాంఛనీయం. చర్చ చేయడం అవసరమే. కానీ ఆ పేరుతో, అవతలివారు చెప్పేది పాక్షికంగా అర్ధం చేసుకుని, తమ దృష్టితో తాము చూస్తూ ఎదుటివారిని హీనపరచడం మర్యాదస్తులు చేయవలసింది కాదు. పైగా ఇతర వ్యాఖ్యాతను మెచ్చుకోవడం కూడా సహించలేకపోవడం ఇంకా అమర్యాదకరం. ఇలాంటి ధోరణిని సానుకూలంగా అర్ధం చేసుకోవడం బొత్తిగా సాధ్యం కాదు.

  శ్యామల గారు చెప్పినట్లు సాఫ్ట్ వేర్ గురించి నాకు తెలియకపోవడం వల్లనే ఈ ఆర్టికల్ ఇలా నేను రాసి ఉండవచ్చు (నిజంగా నాకు తెలియదని నేను చెప్పడం లేదు). కానీ అది చెప్పే పద్ధతి ఇది కాదు. ఈ వ్యాసం దృక్కోణం విస్తృతమైనది. అది సాఫ్ట్ వేర్ – ఇతర వేర్ ల తేడాకు సంబంధించినది కాదు. పెట్టుబడిదారీ కంపెనీల శ్రమ దోపిడీకీ, దానికి ప్రభుత్వాలు ఇచ్చే విధానపరమైన మద్దతు గురించీ చెప్పేది. ఈ పరిశీలనలోకి సాఫ్ట్ వేర్ రంగం రాదని శ్యామల గారి అవగాహన. కానీ అది నిజం కాదు. శ్రమ దోపిడి సార్వజనీనం. అందుకు అనుసరించే ఎత్తుగడలు కూడా చాలా వరకు సార్వజనీనంగానే ఉంటాయి. ఇది అర్ధం కావాలంటే ఆయా వ్యక్తులు స్వయం కృషి చేసి తమ చూపును విస్తృతం చేసుకోవాలే తప్ప ఒకరు నోరు తెరిచి పోస్తే రాదు. ‘మీకు అర్ధం కాదు’ అన్న దృక్పధంతో చూస్తే అసలే రాదు.

 9. విశేఖర్ గారూ, మీరు అపోహపడుతున్నట్లు నేనేమీ ఉక్రోషపడటం లేదండీ. అందుకు కారణాలూ యేమీ లేవు! నాకు తోచిన విషయాలు, నా అవగాహనమేరకు నేను చెప్పాను. మీ విశ్లేషణలూ, ఉమ్మడిగుమ్మడిపరిశీలనలూ, గాడిగగుడ్లూ వగైరా మీరు చెప్పారు. పోనివ్వండి – నాకు అర్థమైనట్లు నాకు అర్థమైతే మీకు అర్థమైనట్లు మీకు అర్థమౌతున్నవి విషయాలు. అంతమాత్రానికి తగాదా యేమీ లేదు. ఇందులో నేనైనా మీరైనా ఉక్రోషపడ వలసిందీ యేమీ లేదు. నా వైపునుండి కూడా చర్చ ఇంతటితో సమాప్తం.

 10. సాఫ్త్‌వేర్ గురించి ఏమీ తెలియనివాడు కూడా సి & అసెంబ్లీ లాంగ్వెజెస్ నేర్చుకుని ఒక operating system తయారు చెయ్యగలడు. ఇంజినీరింగ్ కాలెజ్‌లలో చదివేది కేవలం సర్తిఫికేత్ కోసం. ఒక సాఫ్త్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చెయ్యడానికైతే సర్తిఫికేత్ అడుగుతారు కానీ సొంతంగా సాఫ్త్‌వేర్ కంపెనీ పెట్టుకోవడానికి ఎవరూ సర్తిఫికేత్ అడగరు. నేను నేర్చుకున్నది హార్ద్‌వేర్ (కంప్యూతర్‌లు రిపైర్ చెయ్యడం) & LAN (Local Area Networking). అంతమాత్రాన నేను కంపెనీలలోని LAN operators జీతాల గురించి మాత్రమే మాట్లాడాలని రూల్ లేదు కదా.

 11. శ్యామల గారూ, అవును. అంత మాత్రానికే తగాదా పడిపోవలసిన అవసరం లేదు. పెద్దవారిగా మీలాంటివారి నుండి మాలాంటి వారు నేర్చుకోవలసిన విషయం ఇది. చాలా సంతోషం.

 12. అవసరమైనంత కాలం వాడుకుని…వారితో గంటల కొద్దీ చాకీరీ చేయించుకుని…అవసరం తీరాక… జీతం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని సీనియర్లను ఉద్యోగాలనుంచి తొలగించడం….చాలా ప్రైవేటు కంపెనీల్లో జరిగేదే….
  –ఈ మధ్యే మన రాష్ట్రంలోనూ ఓ పత్రిక సీనియర్లను వదిలించుకునేందుకోసం రకరకాలుగా పొగ పెడుతోంది.
  –కార్మిక సంఘాలు, హక్కులు, చైతన్యం లేకుండా ముందుగా జాగ్రత్త పడుతూ…ఆ తర్వాత తమ ఇష్టం వచ్చినట్లు చేస్తాయి.
  — కార్మిక సంఘాలు బలంగా ఉండో…, ఉన్న కాడికి చట్టాలు కూడా కార్మికులకు మద్దతుగా నిలిస్తే అంతో ఇంతో న్యాయం జరుగుతుంది. కానీ కార్పోరేట్ శక్తులు కార్మిక చట్టాల్ని తమ శక్తియుక్తులతో బలహీనపరచడంలో విజయం సాధించాయి. యాభై ఏళ్లకు పైగా కార్మికులు కష్టపడి సాధించుకున్న హక్కులు….ఇటీవలి కాలంలో సంక్షోభంలో పడ్డాయి.
  – మారుమూల పట్టణంలోని చిన్న కంపెనీ ఐనా….హైటెక్ సిటిలోని సాఫ్ట్వేర్ కంపెనీ ఐనా….కార్మికులకు భద్రత
  ( అన్నిరకాల) లేనిచోట…..సంక్షోభం తలెత్తడం ఖాయం.
  –తమది వేరే సమాజం…., విప్లవాలు, ఉద్యమాలు కేవలం వేరే కార్మికులకు తప్ప… లక్షల రూపాయలు తీసుకునే మాకు అవసరం లేదని అనుకునే వారు …..ఈ టీసీఎస్ ఉదంతంతోనైనా పునరాలోచించాలి.
  – జీవితం మారచ్చు. జీతాలు మారచ్చు. హోదా మారచ్చు. అంతస్తులు పెరగొచ్చు…. కానీ
  శ్రామికులందరూ ఒక్కటేనని….ఏకమైతే తప్ప తమస్యలు పరిష్కారం కావన్న ప్రాథమిక వాస్తవాన్ని మరవొద్దు.

  నిర్భయ ఘటనలోనూ…., అన్నా హజారేకూ.., అరవింద్ కేజ్రివాల్ కు ఎలా మద్దతు పలికారో….అలాగే తమ హక్కుల కోసం ఐటీ రంగ ఉద్యోగులు ఇకనైనా పోరాడాల్సిన అవసరం ఉంది.

 13. ప్రవీణ్, ఈ రోజుల్లో సాఫ్ట్‌వేర్ ప్రోడక్టులు తయారుచేయటంలో మీ రనుకున్నట్లు లేదు పరిస్థితి. సందర్భానుసారంగా ఒకే ప్రోడక్టు నిర్మాణంలో అనేక ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలు వాడటమూ, ఇంకా అనేకానేక టూల్స్ వగైరా వాడటమూ పరిపాటి. సీ లేదా అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అన్నది ఎంతమాత్రమూ సరిపడే ప్రసక్తి లేదు. ఒకే ప్రోడక్ట్‌లో రకరకాల స్కిల్స్ అవసరం అవుతున్నాయి. అందుకే ఏదైనా మాట్లాడే ముందు ఆ రంగంలో తగిన వైదుష్యం ఉండాలని నేను తరచూ సూచించేది. అపై మీ యిష్టం.

  విశేఖర్ గారూ చందు తులసిగారూ ప్రస్తావిస్తున్న అంశం. వీరు శ్రమదోపిడీ జరుగుతోందని ఉద్యోగ భద్రత కరవౌతోందనీ అంటున్నారు. నిజం అనటానికి భేషజం ఏమీ అక్కరలేదు. కాని యావత్ప్రపంచంలోని ఐటి రంగం ఎలా నడుస్తోందో దానికి భిన్నంగా మనదేశంలో భద్రతపేరుతో యాజమాన్యాల చేతులు కట్టెయ్యటానికి ప్రయత్నించటం చేస్తే ఐటి రంగం కుదేలవుతుంది. నిజానికి ఈ ఐటీ రంగంలో ఉద్యోగులను తమదగ్గర అట్టేపెట్టుకుందుకు యాజమాన్యాల వద్ద తీవ్రమైన పోటీ నడుస్తూ ఉంటుంది. ఉద్యోగులు తరచుగా మంచి అవకాశాలకోసం వలసపోవటం చాలా హెచ్చు. అలాగే అనుత్పాదకమైన ప్రోడక్టులను యాజమాన్యాలు మూసెయ్యటమూ మామూలే. ప్రోడక్టులు మార్కెట్లో చలామణీ అవుతుంటేనే, కష్టమర్లు డిమాండు చేస్తుంటేనే ఆ ప్రోడక్టులకు మనుగడ. వేగంగా ఇక్కడ మార్కెట్ అవసరాలు మారుతూ ఉంటాయి. తదనుగుణంగా యాజమాన్యాలు ప్రోడక్టులను డిజైన్ చేసి అమ్ముతాయి. డిమాండుకు అనుగుణంగా నిపుణులూ సంస్థలను తరచూ మార్చేస్తూ ఉంటారు. కార్మిక చట్టాల పేరుతో ఈ వలయంలో వేలు పెడితే భారత ఐటీ రంగం దెబ్బతింటుంది. కాంట్రాక్టులతో ఉద్యోగులనూ, చట్టాల సంకెళ్ళతో యాజమాన్యాలనీ పట్టుకుని కర్రపెత్తనం చేయాలంటే అది ప్రపంచసరళికి విరుధ్ధమైన కార్యక్రమం కాబట్టి కుదరదు. మూలఛ్చేది పరాక్రమం ఐపోతుంది! మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్పందించే ప్రయత్నాలలో భాగంగానే సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ తమ ఉద్యోగులనూ, ప్రాజెక్టులూ – ప్రోడక్టులనూ, వాటికి సంబంధించిన ప్రాథమ్యాలనూ మార్పులు చేసుకుంటూ ఉంటాయి. ఒక్కోసారి కఠోర నిర్ణయాలు తప్పవు – లేకుంటే కంపెనీలు కూలిపోయే పరిస్థితులూ తరచూ వస్తుంటాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలు కేవలం ఆదా కోసమే ఉద్యోగులను తీసేయటం ఎన్నడూ‌ జరుగదు. ఈ ఐటీ రంగం అనూహ్యమైన మార్పులకు ఒడిదుడుకులకూ‌ నిలయం. అన్ని రకాల అంచనాలూ తరచుగా తప్పిపోతూ ఉంటాయిక్కడ. భద్రమైన భవిష్యత్తుకోసం యాజమాన్యాలూ, ఉద్యోగులూ కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారన్నది సత్యం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వర్తమానంలో భద్రంగా ఉండటానికే పోరాటజీవితం వీరందరిదీ. అందుకే ఈ రంగాన్ని శాసించేది ‘అవసరం’ అది మార్కెట్ అవసరం. అవసరం లేని ప్రోడక్ట్ – మూతబడుతుంది అది ఎంత ప్రియమైనదైనా. అవసరం లేని ఉద్యోగి – తొలగిపోవాలి – అమె/అతడెంత పెద్ద స్థితిలో ఉన్నా. అవసరం లేని టెక్నాలజీ – చచ్చిపోతుంది -దానికి ఎంత ఘన చరిత్ర ఉన్నా. అవసరం లేని – కంపెనీ మూతబడుతుంది – దానికి ఉదయందాకా ఎంత పెద్ద పేరున్నా. ఇదీ ఐటీ రంగం పరిస్థితి. అందుకే టెక్నాలజీలు, లాంగ్వేజీలు, కంపెనీలు, ప్రోడక్టులు, యాజమాన్యాలు, ఉద్యోగులు – అంతా ఉనికి కోసం పోరాటమే నిరంతరం. నిరంతరం ప్రపంచానికి తమ అవసరాన్ని పునర్నిర్వచించుకోవటానికి ఆరాటమే.

  ఇది నా అవగాహన మాత్రమే. మీరు నా అవగాహనలు తప్పని అనుకుంటే అభ్యంతరం ఏమీ లేదు నాకు

 14. జీవితం మారచ్చు. జీతాలు మారచ్చు. హోదా మారచ్చు. అంతస్తులు పెరగొచ్చు…. కానీ
  శ్రామికులందరూ ఒక్కటేనని….ఏకమైతే తప్ప తమస్యలు పరిష్కారం కావన్న ప్రాథమిక వాస్తవాన్ని మరవొద్దు.
  చందుతులసి గారు,హ్యాట్సాఫ్!!!!

 15. Windowsని పోలిన operating systemని కేవలం సి & అసెంబ్లీ లాంగ్వెజ్‌తో తయారు చేస్తారు. Linuxని పోలిన operating systemని కేవలం సి లాంగ్వెజ్‌తో తయారు చేస్తారు. మైక్రోసాఫ్త్ కంపెనీవాళ్ళు కూడా ఇతర కంపెనీల దగ్గర source codes కొని దానితో వివిధ operating systemsని అభివృద్ధి చేసారు. కాలెజ్‌లో చదువుకునేది కేవలం సర్తిఫికేత్ కోసం. మనం ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదివి మైక్రోసాఫ్త్ కంపెనీలో చేరినా, వాళ్ళు మనకి మళ్ళీ వాళ్ళ తెక్నాలజీలో శిక్షణ ఇస్తారు. నాకు LAN నేర్పించిన గురువు గారు తాను విద్యార్థిగా ఉన్నప్పుడు LANలో coaxial cables వాడేవాళ్ళు. Twisted pair cables ఎలా కలపాలో నాకు చెప్పడానికి ఆయన తన స్నేహితుని సహాయం తీసుకున్నారు. రేపు twisted pair cables కూడా పోయి wireless LAN వస్తుంది. అప్పుడు కంపెనీవాళ్ళే తమ దగ్గర పని చేసే LAN operatorకి wireless LAN వాడకంలో శిక్షణ ఇవ్వాలి. అయినా ఒకడికి తెక్నాలజీ ఎంత తెలుసు అనేది ఆర్థిక అంశాల నిర్ణయానికి ప్రమాణం కాదు.

 16. ఐటి రంగం మానవాతీత ‘ గాడ్‌ పర్టికల్స్‌ ‘ ఒక మార్మికత, మానవ మాత్రులకు అర్ధం కాదు, సురులకు తప్ప. అది ఎక్కడో మార్స్‌ గ్రహంలో జరుగుతున్న దైవాంశం. కనుక శేఖర్‌ గారు మీ బోంట్లకు అది కొరక రాని కొయ్య! మన ఐటి రంగం మొదలైనది మొదలు అక్కడ ఉధ్యోగం చేసే వారంత దైవాంశ సంబూతులే. వారు జీవించేది స్వర్గం లోనే. భూమి మీద కాళ్లుంచకూడదన్నట్లు ఆ భూతల స్వర్గంలోకి ముఖ్యంగా మన తెలుగు వాళ్లను అయస్కాంతంలా లాక్కున్నది అమెరికా. ఈ ఎకనమిక్‌ బూం కాస్త 2008 ఆర్దిక తిరోగమం వారి కాళ్లను భూమి మీద నిలపెట్టే లా చేసింది. వారు కూడా వైట్‌ కాలర్‌ కార్మికులే అన్న స్ప్రహే లేకుండా చేసింది. అన్నీ రంగాల లాగనే ఐటి రంగాన్ని కూడా మానవ మాత్రులే నడుపుతున్నారు అన్న గ్రహింపు వుంటే అన్నీ రంగాల్లో ఉన్నవే ఐటి రంగంలో అమలవు తున్న వి అనుకొంటే, ఆ ఎకనమిక్‌ పాలసీనే, ఆ నీయమ నిబందనలే ఇక్క డ కూడా మౌలికంగా వుంటాయని తెలిసి వుంటే ఐటి రంగం దైవాంశం అని ఎవరు బావించరు. సంతలో వంకాయలు కూడా అవసరం వుంటేనే అమ్ముడు పోతాయి ఇందులో వింత ఏమీ ఉండదు దైవాంశ సంబూతులకు తప్ప.

 17. మీరు రాసిన ఆఖరి సుదీర్ఘవ్యాఖ్య చదివాను. ఇండియాలో ఉండే ఐ.టి. కంపెనీలు అధికభాగం కన్సల్టేన్సిలు. అవేమి రిస్క్ తీసుకోవటంలేదు. నష్టమోస్తే, రాబోతుందని అనిపిస్తే ఉద్యోగులను ఉడబెరకటమొక్కటే వాటికి తెలిసిన విద్య. అవి కొత్త కొత్త ప్రాడక్ట్ లు తయారు చేసి రిస్క్ తీసుకొంట్టున్నట్లు మీరు భావిస్తున్నారు.అవి గూగుల్ లా విడుదల చేసిన ప్రాడక్ట్ లు ఎమిటి? ఒకప్పుడు ఔత్సాహికులైన వారు చిన్న కంపెనీలను పెట్టుకొని కొత్త ప్రాడక్ట్ లు డేవెలప్ చేసేవారు. కాని ఈ పెద్ద సాఫ్ట్ వేర్ సర్విస్ కంపెనీలు, రాను రాను చిన్న కంపెనీలను కొనేస్తూ బ్రతకనీయకుండా చేశాయి. నేడు ఐ.టి.లో ఎన్నికంపెనీలు 100- 500 కోట్ల టర్నోవర్ తో ఉన్నాయి? ఉన్నా అవి నిలదొక్కుకొనే పరిస్థితిలో ఎన్ని ఉన్నాయి?

  ఇక ప్రతిభకి అంతంలేదు. టాలెంట్ ఉన్నవారు జంపులు చేయవచ్చు.అది మొదట్లో కొన్ని రోజులు మాత్రమే జరిగే యవ్వారం. ఇండియాలో ఉద్యోగం టాలేంట్ ఒక్కటే చూసి ఇవ్వరు. ఉద్యోగం లోకి తీసుకొనే ముందు ఎన్నోకోణాలు, పెళ్ళి సంబంధం చూసినట్లు చూస్తారు. వయసు,చదువు,టెక్నికల్ నాలేడ్జ్,రెఫెరెన్స్, థార్డ్ పార్టి యన్ క్వైరి ఇలా రాసుకొంట్టూపోతే లిస్ట్ కి అంతమే ఉండదు. ఏ ఒక్కటి నచ్చకపోయినా జాబ్ రాదు. అమెరికాలో అయితే ఇన్ని ఉండవు.ఇవ్వన్ని మీకు తెలుసనుకొంటాను.

 18. ప్రేమ సందేశం గారు, మీరు ఎవరిని ఉద్దేశిస్తూ పై వ్యాఖ్య రాశారో తెలియడం లేదు. సుదీర్ఘ అన్నారు కాబట్టి బహుశా శ్యామల గారిని అనుకుంటాను. కరెక్టేనా?

 19. బ్యాంక్‌లకి ఉన్న non-performing assetsలో సాఫ్త్‌వేర్ ఇంజనీర్‌ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులు కూడా ఉన్నాయి. అవి ఎక్కువగా నగర శివార్లలోని అపార్త్‌మెంత్‌లలో కొన్న ఫ్లాత్‌లు. బ్యాంక్‌లు వాటిని స్వాధీనం చేసుకుని వేలం వేస్తే ఒక్కరు కూడా కొనరు. అందుకే వాటిని non-performing assets అంటారు. 2007కి ముందు అన్ని బ్యాంక్‌లూ సాఫ్త్‌వేర్ ఇంజనీర్‌లకి ఋణాలూ, క్రెదిత్ కార్ద్‌లూ సులభంగా ఇచ్చాయి. 2007 తరువాత బ్యాంక్‌లు రికవరీలని వేగవంతం చేసాయి. కేవలం IT అభివృద్ధిని చూసి అది తప్ప ఏదీ అవసరం లేదనుకుంటే ఇలాగే జరుగుతుంది.

 20. @ సంతలో వంకాయలు కూడా అవసరం ఉంటేనే అమ్ముడు పోతాయి. తిరుపాలు గారు మీరు కేక…
  ఇంతకు మించిన వ్యాపార రహస్యం ఇంకోటి ఉండదు…..గొప్ప సత్యం వివరించారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s