(1.1.2015 తేదీన ది హిందూలో ప్రచురితం అయిన ‘CBI’s credibility impugned’ సంపాదకీయానికి యధాతధ అనువాదం. -విశేఖర్)
*********
సోహ్రాబుద్దీన్ షేక్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, గుజరాత్ మాజీ మంత్రి అమిత్ షా ను ముంబై లోని ప్రత్యేక కోర్టు విముక్తి చేయడం బి.జె.పికి ఉత్సాహం అందిస్తుంది. కానీ సి.బి.ఐ కి మాత్రం గట్టి ఎదురు దెబ్బ. తన రాజకీయ యాజమానులను సంతృప్తిపరిచేందుకు ఎప్పుడూ ఆతృతగా ఉండే సి.బి.ఐ తన పేరు ప్రతిష్టలకు తగినట్లుగా వ్యవహరించలేనట్లు కనిపిస్తోంది. షా పైన మోపిన కేసు రాజకీయ కారణాల రీత్యా మోపబడిందన్న డిఫెన్స్ వాదనలో తగిన ‘విషయం’ ఉందని చెబుతూ సి.బి.ఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.బి.గోసావి రూలింగ్ ఇచ్చిన దృష్ట్యా, దేశ అత్యున్నత నేర విచారణ సంస్ధగా తన విశ్వసనీయతను తిరిగి ప్రోది చేసుకోవడం సి.బి.ఐకి కష్టం కావచ్చు. షాను కేసు నుండి జడ్జి విముక్తి చేయడం, ఆయనపై ఇక ట్రయల్స్ నడపనవసరం లేదని నిర్ణయించడం… ఇవే సి.బి.ఐ సమకూర్చిన సాక్ష్యాల స్వభావం గురించి చాలానే చెబుతున్నాయి. ఏజన్సీ పరిశోధనా తీరును తప్పు పట్టడమే కాకుండా, దాని చర్యలకు రాజకీయ ఉద్దేశ్యాలను కూడా (జడ్జి) ఆపాదించారు.
అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని గత కేంద్ర ప్రభుత్వాన్ని సంతృప్తిపరిచేందుకు షా పైన సి.బి.ఐ అభియోగాలు మోపినట్లయితే, బి.జె.పి నేతృత్వంలోని ఇప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని సంతృప్తిపరిచేందుకే “బలహీనపరిచిన కేసు”ను (కోర్టు ముందుకు) సి.బి.ఐ తెచ్చిందని భావించకూడదా? ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి సన్నిహిత స్నేహితుడిగా, అమిత్ షా ఇప్పుడు దేశంలో రెండో శక్తివంతమైన వ్యక్తిగా పరిగణించబడుతున్నారు కాదా! సోహ్రాబుద్దీన్ సోదరుడు రుబాబుద్దీన్ షేక్ సరిగ్గా ఇదే ప్రశ్నను లేవనెత్తారు. ఇటీవల కాలంలో సి.బి.ఐ చర్యల దృష్ట్యా ఈ ప్రశ్న అంత తేలికగా, యధాలాపంగా కొట్టివేయదగినది ఏమీ కాదు. షా ను కేసులో ఇరికించడానికి సి.బి.ఐ పై రాజకీయ ఒత్తిడి పని చేసినట్లయితే, ఇక, తదనుసారంగా, కేసులో ఆయనను విముక్తుడిని చేసేందుకు కూడా అదే తరహా ఒత్తిడులు పని చేసి ఉండడం సాధ్యమే.
Mr. గోసావి చేసిన పరిశీలనలు సి.బి.ఐని అధికారంలో ఉన్నవారి ప్రభావం నుండి విముక్తి చేయాలన్న వాదనను మరింత బలీయం కావిస్తున్నాయి. సి.బి.ఐ డైరెక్టర్ ఇప్పుడు నిర్దిష్ట పదవీకాలాన్ని అనుభవిస్తున్నారు. ఆయన నియామకం ఉన్నత స్ధాయి కమిటీ సిఫారసులపై ఆధారపడి జరుగుతోంది. అయినప్పటికీ ఈ పరిశోధనా సంస్ధ ఇంకా కేంద్రంలో అధికారం నెరపుతున్న ప్రభుత్వం నుండి వివిధ ఒత్తిడులు, ప్రభావాలు ఎదుర్కొంటోంది. ఉన్నత స్ధాయిలలో అవినీతికి వ్యతిరేకంగా పౌర హక్కుల ఉద్యమం ఎగసిన దరిమిలా, సి.బి.ఐని రాజకీయ జోక్యం నుండి దూరంగా ఉంచే అవకాశాలను చొప్పిస్తూ లోక్ పాల్ చట్టం – 2013 ను ప్రవేశపెట్టారు.
కానీ షా నిందితుడిగా ఉన్న కేసు లాంటి రాజకీయంగా సున్నితమైన హై-ప్రొఫైల్ కేసుల్లోఉన్నత కోర్టులు ఖచ్చితమైన, స్ధిరమైన పర్యవేక్షణ అమలు చేయనట్లయితే, శక్తివంతమైన ధనిక వర్గాల అవసరాలకు అనుగుణంగా సి.బి.ఐ పరిశోధనను ఇప్పటికీ నిర్వహించుకునే అవకాశాలున్నాయి. అమిత్ షా విముక్తికి వ్యతిరేకంగా అప్పీలుకు వెళ్లడానికి సోహ్రాబుద్దీన్ బంధువులు నిర్ణయించుకున్నారు. కనుక సాక్ష్యాల్లోని కొంత భాగం మరోసారి పరిశీలనకు రానున్నది. ఈ దశలో, ఖచ్చితంగా చెప్పగల అంశం ఏదన్నా ఉన్నట్లయితే గనక, అది, షాకు వ్యతిరేకంగా ఉన్న కేసును సి.బి.ఐ నిర్వహించడం ప్రజల్లో ఎలాంటి విశ్వాసాన్ని కలుగజేయదు అన్నదే.
కాంగ్రెస్ అధికారంలో ఉండగా…వెంకయ్యనాయుడు ….CBI ని కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ అని ఆరోపించేవారు..
మరి ఇప్పుడు ఏమని అనాలో వారు సెలవిస్తే బాగుండు.
అధికార పక్షాలు వైరి వర్గం మీద కక్ష సాదింపు చేర్యలకే సి.బి.ఐ ని పరిమితం చేస్తున్నారు . దేశ అత్యున్నత దర్యాప్తు సంస్ధ రొజురొజుకు తన విస్వసనియత కొల్పొతుంది .స్వతంత్ర దర్యప్తు సంస్ధకు లేనిదల్ల స్వతంత్రమే! .