(True translation of the editorial published today i.e 31.12.2014 in The Hindu. -Visekhar)
*********
ఇండోనేషియాలోని సురబయ నుండి సింగపూర్ కు వెళ్తున్న ఎయిర్ ఆసియా విమానం కనపడకుండా పోయి రెండు రోజులు పూర్తయ్యాక రక్షణ బృందాలు విమానంలో ఉన్న 162 మంది ప్రయాణీకులు మరియు సిబ్బందిలో కనీసం 40 మంది మృత దేహాలను విమాన శిధిలాలను కనుగొన్నారు. ఫలితంగా, రాడార్ తెరపై నుండి విమానం అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయిన దరిమిలా విమానం ఆచూకి విషయమై నెలకొన్న ఉత్కంఠ, ఊహాగానాలకు ఇంతటితో తెరపడినట్లయింది. గత జులైలో ఎయిర్ అల్జీర్ విమానానికి జరిగిన ప్రమాదంతో ప్రస్తుత ప్రమాదాన్ని పోల్చుతూ రెండింటికీ పోలికలు ఉన్నాయని చెబుతున్నారు. బర్కినా ఫాసో నుండి అల్జీర్స్ వెళ్తున్న విమానం మాలి దేశ గగనతలంలో అల్లకల్లోలంగా ఉన్న వాతావరణ పరిస్ధితులను ఎదుర్కొని ఆకాశంలోనే విచ్ఛిన్నం అయిపోయింది. ఫలితంగా అందులో ఉన్న 116 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు.
ఇక్కడ, పొరుగు దేశాల నుండి కూడా రక్షణ బృందాలు వెనువెంటనే విమానం అన్వేషణ కోసం -ఆకాశం, సముద్రం రెండింటిలోనూ- ఆదివారం ఉదయం నుండే రంగంలోకి దిగాయి. మార్చి నెలలో కౌలాలంపూర్ నుండి బీజింగ్ కు వెళ్తూ నిగూఢ పరిస్ధితుల్లో అదృశ్యం అయిపోయిన మలేషియా ఎయిర్ లైన్స్ విమానం MH 370 వలె కాకుండా, ఎయిర్ ఆసియా విమానం అదృశ్యం కావడానికి ముందు ఇండోనేషియా లోని రేడియో కంట్రోల్ ను సంప్రదించింది. ఎదురుగా ఉన్న దట్టమైన మేఘాలను తప్పించడానికి తానున్న 32,000 అడుగుల ఎత్తు నుండి 38,000 అడుగుల ఎత్తుకు చేరడానికి అనుమతి కోరుతూ రేడియో కంట్రోల్ ను సంప్రదించింది. కానీ ఆకాశ వీధిలో ట్రాఫిక్ రద్దీగా ఉండడంతో అందుకు అనుమతి దక్కలేదు. ఆ తర్వాత విమానం నుండి ఎలాంటి సమాచారము అందలేదు. అందుకే విమానం తుఫానులో చిక్కుకుని సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని ఇండోనేషియాలోని కంట్రోల్ మేనేజర్లు, ఏవియేషన్ నిపుణులు భావిస్తున్నారు.
దశాబ్దం క్రితం స్ధాపించినప్పటి నుండి ఎయిర్ ఆసియా మంచి భద్రతా రికార్డ్ ను కలిగి ఉంది. అలాగే ఎయిర్ బస్ A320 మిక్కిలి భద్రతా ప్రమాణాలు కలిగిన దృఢమైన విమానంగా పేరెన్నిక గన్నది. కాబట్టి అది అంత తేలికగా కూలిపోయి ఉండదు. విమానం నుండి సహాయం కోసం ఎలాంటి సంకేతం అందకపోవడం, కేవలం దారి మళ్లింపుకు అనుమతి కోరుతూ విన్నపం మాత్రం అందడం… ఈ ట్రాజెడీలోని ప్రధాన అంశం ఇదే. మళ్ళీ, ఉద్దేశ్యపూర్వకంగానే దారి మళ్లి ప్రయాణించి అనంతరం లోతైన హిందూ మహా సముద్ర జలాల్లో కూలిపోయి ఉంటుందని భావిస్తున్న మలేషియా విమానం వలె కాకుండా, ఎయిర్ ఆసియా విమానం కేవలం జావా సముద్రంలో మాత్రమే కూలిపోయి ఉంటుందని ముందుగానే తెలిసిన విషయం. ఎందుకంటే విమాన ప్రయాణం ఒక ద్వీపం నుండి మరో ద్వీపానికి వెళ్ళే దారిలో ఉన్నది ఈ ఒక్క సముద్రం మాత్రమే. ఫలితంగా అన్వేషణ జరపవలసిన ఏరియాకు తక్కువ పరిమితి ఏర్పడి అన్వేషణ విజయవంతం అయింది.
శిధిలాలు కనపడే వరకూ బాధితుల కుటుంబాలు -వారిలో అత్యధికులు ఇండోనేషియా దేశీయులే- ఉత్కంఠతో ఎదురు చూశాయి. ఇంతలోనే వారికి ఏ కొంచెమో మిగిలి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేస్తూ మృత దేహాలు కనపడ్డాయన్న వార్త వెలువడింది. ఇక ఈ దుఃఖాంత ప్రమాదానికి కారణాలు కనుగొనడమే మిగిలి ఉంది. ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయి రికార్డర్ లు నిర్ణీత సమయం లోపల దొరికితేనే ఇది సాధ్యం అవుతుంది. సాపేక్షికంగా చూస్తే 2014 సంవత్సరం ఆకాశ విహరణకు కాస్త భద్రంగా ఉన్నట్లే అని విమానయాన నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరంలో 900 మంది ప్రాణాలు ఇమిడి ఉన్న 8 పెద్ద ప్రమాదాలు సంభవించాయి. స్తంభనలో ఉండే గణాంకాలు వల్లించడం వల్ల ఎయిర్ ఆసియా ప్రయాణీకుల కుటుంబాలకు స్వాంతన చేకూరదు. ఏమి జరిగింది, ఎందుకు జరిగింది వివరాలు పూర్తిగా వెల్లడి కావడం అత్యంత అవసరం.
(సంపాదకీయంలో పేర్కొన్నట్లుగా 40 మంది మృత దేహాలు వెలికి తీయడం నిజం కాదు. ఇప్పటి వరకు 7 మృత దేహాలు మాత్రమే వెలికి తీశారు. వాతావరణం అనుకూలంగా లేనందున రక్షణ బృందాలు పూర్తి స్ధాయిలో పని చేయడం లేదు. 7గురు మృత దేహాల్లో ముగ్గురు మృత దేహాలు కనపడే సమయానికి ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఉన్నారని, ఒక మృతుడు లైఫ్ జాకెట్ ధరించి ఉన్నారని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు బిబిసి, రాయిటర్స్, డెయిలీ మెయిల్ లాంటివి తెలియజేశాయి. దీనిని బట్టి విమానం కూలిపోతున్న సంగతి ప్రయాణీకులకు ముందుగానే తెలుసన్న సంగతి ధ్రువపడుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రమాదం జరగబోతున్నప్పటికీ పైలట్ ‘సహాయం కోసం సంకేతాలు’ (distress call) ఎందుకు పంపలేదని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే కొందరు నిపుణులు మాత్రం విమానం కూలిపోతున్న పరిస్ధితుల్లో పైలట్ ప్రధానంగా ఆలోచించేది విమానాన్ని మళ్ళీ పైకి ఎలా లేపాలా అన్నదే తప్ప మరో విషయం పట్టదని, కనుక పైలట్ ను తప్పు పట్టడం భావ్యం కాదని చెబుతున్నారు. -విశేఖర్)