అనుకున్నట్లుగానే ఎయిర్ ఆసియా విమానం QZ 8501 విమానం జావా సముద్రంలోనే కూలిపోయిందని నిర్ధారణ అయింది. జావా సముద్రం లోని బోర్నియో ద్వీపానికి సమీపంలో విమానానికి సంబంధించిన అనేక శిధిలాలు కనపడడంతో ప్రమాదం నిర్ధారించబడింది. ప్రయాణీకులకు చెందిన 6 మృత దేహాలను రక్షణ సిబ్బంది వెలికి తీశారు. అనేకమంది ప్రయాణీకుల మృత దేహాలు ఇంకా విమానంలోనే ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.
40 మృత దేహాలను వెలికి తీశామని మొదట ఇండోనేషియా నౌకా బలగం ప్రకటించింది. అయితే అనంతరం ఈ ప్రకటనను సవరించుకుని 6 మృత దేహాలను మాత్రమే వెలికి తీశామని తెలిపారు. సముద్రంలో మృత దేహం తెలియాడుతుండగా తీసిన వీడియోను నేరుగా టి.వి లో చూపడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దృశ్యాలను ప్రసారం చేసిన టి.వి. వన్ ఛానెల్ చివరికి క్షమాపణలు చెప్పవలసి వచ్చింది.
రగడకు కారణం ఛానెల్ చూపిన హృదయవిదారక దృశ్యాలను సురబయ ఎయిర్ పోర్ట్ లోని ఓ హాలులో విడిది చేసి ఉన్న ప్రయాణికుల బంధువులు కూడా చూడడం. వారా దృశ్యాలను చూసిన వెంటనే బంధువుల్లోని అనేకమంది దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. ఇద్దరు బంధువులైతే అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించవలసి వచ్చింది. ఈ పరిస్ధితితో ఎయిర్ ఆసియా సిబ్బంది వార్తా ఛానెళ్లపై ఆగ్రహం ప్రకటించారు.
విమానం అదృశ్యమైన పాయింట్ కు కేవలం 6 మైళ్ళ దూరంలోనే శిధిలాలు సముద్రం పై తెలియాడుతూ కనపడడం గమనార్హం. దానితో ఆ పాయింట్ కు 100 మైళ్ళ దూరంలో శిధిలాలు కనిపించాయన్న వార్తలో నిజం లేదని ధ్రువపడింది. గత మార్చిలో అదృశ్యం అయిన MH370 విమానం ఇప్పటివరకూ ఆచూకీ దొరకలేదని, QZ 8501 విమానం అలాంటి దుస్ధితిని ఎదుర్కోలేదని కొందరు విచారంతో కూడిన సంతృప్తి ప్రకటిస్తున్నారు.
ప్రమాదానికి దారి తీసిన పరిస్ధితుల వివరాలు కొద్ది కొద్దిగా వెల్లడి అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం 9,000 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న QZ 8501, తుఫాను వాతావరణం, దట్టమైన మేఘాలను తప్పించేందుకు కాస్త ఎడమకు తిరిగి 11,000 మీటర్ల ఎత్తుకు ఎగరేందుకు పైలట్ అనుమతి కోరారు. కానీ ఆ ఎత్తులో ఆ ప్రాంతంలో అప్పటికే 6 విమానాలు ప్రయాణిస్తున్నాయి. దానితో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆలోచనలో పడి వెంటనే స్పందించలేకపోయారు. ఈ లోపే విమానం కంట్రోలర్ తో సంబంధం కోల్పోయింది. మరో 4 నిమిషాలు రాడార్ పైన కనపడిన విమానం అనంతరం అదృశ్యం అయింది.
కేవలం వాతావరణం వల్లనే విమానం కూలిపోవడం జరగదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆధునిక విమానాలు అత్యంత విధ్వంసకర వాతావరణ పరిస్ధితులను తట్టుకునే విధంగా తయారు చేస్తున్నారని వారు చెబుతున్నారు. అననుకూల వాతావరణం మధ్య అనుకోని విధంగా మానవ తప్పు తోడు కావడం వల్ల విమానం కూలిపోయి ఉండవచ్చని వారి అభిప్రాయం. అయితే ఈ అభిప్రాయాలు విమాన కంపెనీలకు అనుకూలంగా చెబుతున్నవని కొందరు కొట్టిపారేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా, చివరికి దానిని నిర్వహించవలసింది మనిషే కనుక మానవ తప్పును అంత తేలికగా కొట్టిపారవేయలేము.
ఈ కింది ఫోటోలను డెయిలీ మెయిల్, రాయిటర్స్ ప్రచురించాయి.