షొరాబుద్దీన్ ఎన్ కౌంటర్: ఓ పనైపోయింది!


AMIT

‘గజం మిధ్య పలాయనం మిధ్య’ అని ముంబైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సి.బి.ఐ కోర్టు తీర్పు చెప్పేసింది. కేసులో అన్యాయంగా ఇరికించారని, తనపై కేసు కొట్టివేయాలని అమిత్ షా విన్నవించుకోగా ‘సరే, కానీండి!’ అని రాసేసింది. దేశవ్యాపితంగా సంచలనం సృష్టించిన ఎన్ కౌంటర్ కేసు చివరికి దూదిపింజలా తేలిపోయింది. ఎన్ కౌంటర్ సంగతి తర్వాత, అసలు షొరాబుద్దీన్ అన్న గ్యాంగ్ స్టర్ ఉన్నాడా లేదా అని రేపు కోర్టులు విచారణ మొదలు పెట్టినా ఆశ్చర్యం లేదేమో!

షొరాబుద్దీన్, అతని భార్య కౌసర్ బీ, అతని మిత్రుడు/బంటు తులసీరాం ప్రజాపతిల బూటకపు ఎన్ కౌంటర్ కేసుల్లో అమిత్ షా తో పాటు మరో 37 మంది పైన సి.బి.ఐ అభియోగాలు మోపింది. ఈ కేసులో కుట్రకు పధక రచన చేసి పూర్తయ్యేలా దగ్గరుండి చూసింది అమిత్ షా యే అని ఛార్జీ షీటు లో పేర్కొంది. తీరా మొన్న అమిత్ షా డిశ్చార్జ్ పిటిషన్ పై వాదనలు జరిపేటప్పుడు డిఫెన్స్ లాయర్ రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు వినిపించగా సి.బి.ఐ లాయర్ 15 నిమిషాల్లో తన వాదన ముగించిపారేశాడు. ఫలితంగా అమిత్ షా ‘అమాయకుని’గా దర్జాగా కోర్టు హాలు నుండి నడిచి వచ్చేశారు.

సి.బి.ఐ ని తన సొంత ప్రయోజనాలకు కాంగ్రెస్ ఉపయోగిస్తోందని, ప్రత్యర్ధి పార్టీలను సాధించడానికే సి.బి.ఐ పని చేయిస్తోందని, సి.బి.ఐ అంటే ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అనీ… ఇలా సి.బి.ఐ పైన బి.జె.పి చేయని విమర్శ లేదు. ప్రభుత్వాలు మారాయి. బి.జె.పి అధికారంలోకి వచ్చింది. సి.బి.ఐ ఇప్పుడు ఎవరి బ్యూరో గా పని చేస్తోందో కాంగ్రెస్ నాయకులు చెప్పాలేమో. బహుశా ఇంకొన్ని రోజులు పోతే గానీ సి.బి.ఐ గుట్టును కాంగ్రెస్ వారు విప్పరేమో!

సి.బి.ఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఏమన్నారో చూడండి. “నా అభిప్రాయం ఏమిటంటే, సి.బి.ఐ చేసిన నిర్ధారణ ఆమోదనీయం కాదని. మొత్తం రికార్డులను స్ధూలంగా పరిశీలిస్తే, (డిశ్చార్జ్ పిటిషన్) దరఖాస్తుదారు Mr. షా కు వ్యతిరేకంగా ఎలాంటి కేసూ లేదని అర్ధమవుతోంది.” ఈ తీర్పుతో కేసులో ప్రధాన ముద్దాయిగా పేర్కొనబడిన అమిత్ షా పైన ఇక వాదప్రతివాదాలు ఏమీ నడవ్వు. కేసు విచారణ మాత్రం కొనసాగుతుంది. కుట్రకు సూత్రధారిగా పేర్కొన్న వ్యక్తి పైనే కేసు లేదన్నాక ఇక కేసు మాత్రం ఏమి నిలబడుతుంది?

అందుకే “గజం మిధ్య. పలాయనమూ మిధ్యే!” అంటున్నది.

అమిత్ షా దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ పై వాదప్రతివాదాలు కొనసాగుతుండగానే ఆం ఆద్మీ పార్టీ విచారణ తంతు పైనా, సి.బి.ఐ నిబద్ధత పైనా తీవ్ర అనుమానాలు వ్యక్తం చేసింది. బి.జె.పి నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపధ్యంలో కేంద్రం చెప్పు చేతల్లో ఉండే సి.బి.ఐ కేసును నీరుగార్చడానికి ఎంత చేయాలో అంతా చేస్తోందని ఏఏపి ఆరోపించింది. అమిత్ షా క్షేమంగా తప్పించుకునే మార్గాన్ని సి.బి.ఐ సిద్ధం చేస్తోందని తెలిపింది. ఆ పార్టీ అనుమానమే నిజం అయింది.

“Mr షా లాయర్లు ఆయనపై ఉన్న కేసు రద్దు చేయాలని కోరారు. షొరాబుద్దీన్, తులసీరాం ప్రజాపతి హత్యలకు పన్నిన కుట్రలో అమిత్ షా కీలకం అనీ, ప్రధాన సూత్రధారి అనీ సి.బి.ఐ గతంలో చెప్పింది. ఈ ఇద్దరి గ్యాంగ్ స్టర్ లతో కూడిన బలవంతపు వసూళ్ల (extortion) ర్యాకెట్ కు కూడా అమిత్ షా యే సూత్రధారి అని, గుజరాత్ సీనియర్ పోలీసు అధికారుల సాయంతో ఈ ర్యాకెట్ నడుపుతున్నారని సి.బి.ఐ పేర్కొంది.

“(తాజా వాదనల్లో) సి.బి.ఐ తన ముందరి నిర్ణయానికే కట్టుబడి ఉంటుందని మేము భావించాము. కానీ కేసును బలంగా వాదించడానికి బదులుగా ఏవో కొన్ని వాదనలు చేసి కేసు కొనసాగాలని బలహీనంగా వాదించింది. షా లాయర్లు 3 రోజుల పాటు వాదనలు వినిపిస్తే సి.బి.ఐ లాయర్ 15 నిమిషాల్లో వాదనలు ముగించారు. సి.బి.ఐ తన పొజిషన్ ని మార్చుకోవడం బి.జె.పి కేంద్రంలో అధికారం చేపట్టిన ఫలితమే అన్నది సుస్పష్టం” అని ఏఏపి నేత ఆశిష్ కేతన్ నాలుగు రోజుల క్రితం పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు.

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏఏపి అభిప్రాయంతో ఏకీభవించింది. “తమ నేర న్యాయ వ్యవస్ధ ఎంత సమర్ధవంతమైనదో, ఎంత నిజాయితీ కలిగినదో, ఎంత సంపూర్ణమైనదో కొలిచేందుకు సోహ్రాబుద్దీన్-కౌసర్ బీ-తులసీరాం ప్రజాపతి హత్యల విచారణ ఒక పరీక్ష కేసు లాంటిది. సోహ్రాబుద్దీన్ ఒక నేరస్ధుడు అయినందువల్లనో, ప్రజా భద్రతకు ప్రమాదకరం అని భద్రతా సంస్ధలు భావించినందువల్లనో హత్య కావించబడలేదు. ప్రభుత్వ యంత్రాంగంలో ఆయన హాండ్లర్స్ (ఆయన చేత వివిధ హత్యలు, వసూళ్లు చేయించేవారు) కు అలవికాకుండా పోయి అసౌకర్యంగా మారినందునే సోహ్రాబుద్దీన్ హత్యకు గురయ్యాడు” అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సోమవారం (తీర్పుకు ముందే) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

“ముగ్గురిని హత్య చేసే కుట్రలో అమిత్ షా సూత్రధారి అని సి.బి.ఐ పేర్కొంది. గుజరాత్ లోని కొందరు పోలీసు అధికారులతోనూ, గ్యాంగ్ స్టర్ లతోనూ నిర్వహించిన బలవంతపు వసూళ్ల ర్యాకెట్ కు అమిత్ షా ప్రధాన నిర్వాహకుడు అని కూడా సి.బి.ఐ పేర్కొంది. అలాంటి సి.బి.ఐ ఇప్పుడు యూ టర్న్ తీసుకుంది” అని టి.ఎం.సి ప్రకటన ఆరోపించింది.

గుజరాత్/మోడి ప్రభుత్వం పేర్కొన్నట్లుగా సోహ్రాబుద్దీన్ లష్కర్-ఏ-తోయిబా కార్యకర్త కాదని ఆయన వాస్తవానికి ఒక గ్యాంగ్ స్టర్ అనీ సి.బి.ఐ గతంలో గుర్తించింది. అతన్ని హ్యాండిల్ చేసింది అమిత్ షా, ఆయన కింద ఉన్న కొందరు పోలీసు అధికారులు అని కూడా గుర్తించింది. ఇప్పుడు ఆ వాదన నుండి సి.బి.ఐ అధికారికంగా వెనక్కి వెళ్లిందా అన్న విషయంలో స్పష్టత లేదు. కానీ సి.బి.ఐ నిర్ధారణ నిజం కాదని సి.బి.ఐ కోర్టు చెప్పింది. జరిగింది ఏమిటన్నది జనమే గ్రహించాలి.

ఇష్రాత్ జహాన్ తో పాటు మరో నలుగురు యువకులను బూటకపు ఎన్ కౌంటర్ లో హత్య చేసిన కేసులోనూ అమిత్ షా నిందితుడుగా ఉండగా గత మే నెలలోనే సి.బి.ఐ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చి చేతులు దులుపుకున్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు.

3 thoughts on “షొరాబుద్దీన్ ఎన్ కౌంటర్: ఓ పనైపోయింది!

 1. ఆమాత్రం మర్యాద లేక పోతే మరి అధికారమెందుకూ?

  /సి.బి.ఐ ని తన సొంత ప్రయోజనాలకు కాంగ్రెస్ ఉపయోగిస్తోందని, ప్రత్యర్ధి పార్టీలను సాధించడానికే సి.బి.ఐ పని చేయిస్తోందని,/

  అవినీతి తో దండు కుంటున్నారు అని ఎవరైన అంటే ఆ అవకాశం మాకు రకపోయేనే అనే బాQధ తప్ప అవినీతి జరుగుతుందమని మాత్రం కాదు. వై యస్‌ ఆర్‌ చంద్ర బాబును విమర్శించిన, బాబు గారు వైసార్‌ నో కాంగ్రెస్‌ నో లేక బి జే పి కాంగ్రెస్‌ ను విమర్శించినా, కాంగ్ర్రేస్‌ బి జే పి ని విమర్శించినా అర్ధం అదే గధా ఈ రాజకీయ సంస్కృతిలో! ఇది ప్రజలు గ్రహించే వరకు.

 2. క్షణం ఆలస్యం చేయకుండా జగన్ తన పార్టీనీ బి.జె.పి లో కలిపేయాలి!
  అందులో మొదటి షరతు తనమీద ఉన్న అవినీతి కేసులు కొట్టివేయించాలి.
  రెండవ షరతు ఏ.పి రాష్ట్ర బి.జె.పి అధ్యక్షపదవి తనకే ఇవ్వాలి!

 3. ఇది చదువుతోంటే నాకు వీర్ సావర్కర్ కథ గుర్తొస్తోంది. గాంధీ హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు నాథూరాం గాడ్సే, నారాయణ ఆప్తేలు వీర్ సావర్కర్ ఇంటికి వెళ్ళారని తెలిసినా, కొందరు కాంగ్రెస్ పెద్దల ఒత్తిడి వల్ల పోలీసులు ఆ సాక్ష్యాన్ని కోర్త్‌లో ప్రవేశపెట్టలేదు. అందు వల్ల వీర్ సావర్కర్‌పై ఆరోపణ ఋజువు కాలేదు, అతను ఉరి శిక్షపడకుండా తప్పించుకున్నాడు. చార్జ్ షీత్ వ్రాయడం వేరు, ఆధారాలు చూపడం వేరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s