అరుణ్ జైట్లీ: “ఇన్సూరెన్స్ పాలసీలోని ఫైన్ ప్రింట్ కి అనుగుణంగానే అది ఉంది”
*********
బి.జె.పి ప్రతిపక్షంలో ఉండగా భీమా రంగంలో ఎఫ్.డి.ఐ ల వాటా పెంపుదల బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. నిండా లాభాలు పండిస్తున్న భీమా రంగాన్ని విదేశీ కంపెనీలకు అప్పగిస్తారా అంటూ జాతీయవాద ఫోజులు పెట్టి ప్రశ్నించింది. ఇంకా ఎన్నాళ్లు ఇలా దేశాన్ని విదేశీ కంపెనీలకు అప్పగిస్తారు అని ఆగ్రహించింది. మేము అధికారంలోకి వచ్చాక బిల్లును చెత్త బుట్టలో వేస్తామని జనానికి హామీ ఇచ్చింది.
బి.జె.పి అచ్చమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అదేమి చిత్రమో! వారు వీరయ్యారు, వీరు వారయ్యారు.
యు.పి.ఏ ప్రభుత్వం హయాంలో బిల్లును వ్యతిరేకించిన వారు ఇప్పుడు అధికార పీఠంపై కూర్చుని అదే బిల్లును ఆమోదింప జేసుకోవడానికి పార్లమెంటులో శత విధాలా ప్రయత్నించి విఫలం అయ్యారు. అధికారంలో ఉండగా బిల్లును పాస్ చేయించడానికి ప్రయత్నించి విఫలమైన యు.పి.ఏ పక్షాలు ఇప్పుడు రాజ్యసభలో తాము తయారు చేసిన బిల్లునే ఆమోదం కాకుండా అడ్డుకున్నారు.
చివరికి మోడి ప్రభుత్వం విదేశీ బహుళజాతి కంపెనీలను సంతృప్తి పరిచేందుకు దొడ్డి దారిని ఎంచుకుంది. తాము ఎంతో గొప్పగా, ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించే పార్లమెంటు అభిప్రాయాన్ని పక్కనబెట్టి ఆర్డినెన్స్ రూట్ ని ఎంచుకుంది. పార్లమెంటు సమావేశాలు ముగిసిందే తడవుగా కేంద్ర కేబినెట్ సమావేశమై భీమా రంగంలో ఎఫ్.డి.ఐ ల వాటా 26 శాతం నుండి 49 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసేసింది.
ఇన్సూరెన్స్ బిల్లు విషయంలో తాము అవలంబించిన పద్ధతి బిల్లు లోని ఫైన్ ప్రింట్ కి అనుగుణంగానే ఉందని ఆర్ధిక మంత్రి చెబుతున్నట్లుగా కార్టూనిస్టు చూపించారు. ఫైన్ ప్రింట్ అంటే, ఒక advertisement లో గానీ, ఒక ఒప్పంద పత్రంలో గానీ చిన్న అక్షరాలలో ఉండే భాగం. ఒక ఉత్పత్తి గురించి గొప్పగా చెప్పే మాటల్ని (ఉదా: ఆఫర్లు) తాటికాయంత అక్షరాలలో చెబుతూ, వాటి వెనుక ఉన్న షరతులను మాత్రం చిన్న అక్షరాలలో ప్రచురించడం మనం రోజూ చూసేదే. ఇలా ఎందుకు చేస్తారు?
ఒక ఉత్పత్తి గురించీ, అది అమ్ముకోవడానికి ఇచ్చే ఆఫర్ల గురించీ పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేయాలని మన చట్టాలు చెబుతాయి. కానీ ఆ చట్టంలో ప్రతి వివరమూ ఒకే సైజు అక్షరాలలో ఉండాలని గానీ, అన్నీ పెద్ద అక్షరాలలోనే ఉండాలని గానీ నిర్దేశించవు. ఇది చట్టంలో ఉండే లూప్ హోల్. ఈ లూప్ హోల్ ని తమ వాణిజ్య ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించుకునే క్రమంలోనే ఇలా ఉత్పత్తి గురించి పటాటోపంగా చెప్పి, ప్రతికూలంగా ఉండే అంశాలను చిన్న చిన్న అక్షరాలలో (ఫైన్ ప్రింట్) చూపిస్తారు. ఆ విధంగా చట్టాన్ని పాటించినట్లుగా అవి చూపుకుంటాయి. వినియోగదారులకు తెలియగూడని అంశాలను చిన్న అక్షరాలలో రాయడం ద్వారా వాటిపైకి వినియోగదారుల దృష్టి పోకుండా జాగ్రత్త వహిస్తారు.
కాస్త పాజిటివ్ గా చెప్పుకోవాలంటే ఇది మార్కెటింగ్ టెక్నిక్. వాస్తవం మాట్లాడుకోవాలంటే పచ్చి దగా, మోసం. ఇలాంటి మోసాలతో అనేకానేక ఉత్పత్తులను జనానికి అంటగడుతూ లాభాలు ఆర్జిస్తాయి కంపెనీలు. ముఖ్యంగా ఔషధాల విషయంలో ఈ తరహా మోసాలు అత్యంత ప్రమాదకరమైనవి. కానీ కొనసాగుతూనే ఉన్నాయి.
ఇన్సూరెన్స్ బిల్లును కూడా ఇదే తరహాలో జనాన్ని మోసం చేస్తూ ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తున్నారని కార్టూనిస్టు సూచిస్తున్నారు. పార్లమెంటు భవనానికి ఆటో కాలు, ఇటో కాలూ వేసినట్లు చూపడం ద్వారా పార్లమెంటును మోడి ప్రభుత్వం బైపాస్ చేసిందని కార్టూనిస్టు చూపారు.
భీమా బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు అప్పుడూ, ఇప్పుడూ వివిధ రాజకీయ పక్షాలు ప్రదర్శించిన ఆగ్రహావేశాలన్నీ ఒక నాటకంలో భాగం. ఈ బిల్లుపైన రాజకీయ పక్షాలు ఒకరినొకరు మహా పోరాటం చేసుకుంటున్నట్లు జనానికి కనపడాలి. ఇద్దరూ జనం కోసమే కొట్లాడుతున్నట్లుగా ఫోజులు పెడతారు. చివరికి వారి తగాదా వల్ల పార్లమెంటులో ఏర్పడిన ప్రతిష్టంభన వల్ల ఆర్డినెన్స్ తప్పలేదన్న సందేశం జనంలోకి వెళ్ళాలి. ఆర్డినెన్స్ ద్వారా అటు కంపెనీలను సంతృప్తి పరచాలి. పార్లమెంటు ప్రతిష్టంభన ద్వారా అక్కడ జనం కోసం ఏదో మల్లగుల్లాలు పడుతున్నట్లు జనం భ్రమించాలి.
ఇలాంటి విద్యలను కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయగా, వాటిని బి.జె.పి నిస్సిగ్గుగా నేర్చుకుని అమలు చేస్తోంది. ఒక పక్క కాంగ్రెస్ ని తిడతారు. మళ్ళీ ఆ పార్టీ తయారు చేసిన బిల్లులను, చర్యలనే అమలు చేస్తారు. ఇంతోసి దానికి “మేము కాంగ్రెస్ కంటే భిన్నం” అని చెప్పుకోవడం ఎందుకట?