చైనాలో జీమెయిల్ బంద్!


Google, China

అధికారికంగా ప్రకటించకుండానే గూగుల్ మెయిల్ సర్వీస్ ను చైనా బొంద పెట్టింది. లేదా బంద్ చేసింది. తద్వారా అమెరికా సామ్రాజ్యం తరపున ప్రపంచ మెయిల్, సర్చ్, ట్యూబ్, మొబైల్ వినియోగదారులందరి వివరాలను రహస్యంగానూ, బహిరంగంగానూ సేకరిస్తున్న గూగుల్ కంపెనీ అరాచకాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న దేశంగా చైనా తన పేరు నిలబెట్టుకుంది.

ఇంటర్నెట్ ప్రపంచాన్ని, కంప్యూటర్ ప్రపంచాన్ని సొంత లాభాల కోసం విచ్చలవిడిగా వినియోగించడం మైక్రో సాఫ్ట్ ప్రారంభించగా అదే పనిని అనేక మెట్ల ఎత్తుకు సిగ్గు లేకుండా తీసుకెళ్లిన కంపెనీ గూగుల్. ప్రపంచంలో ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలతో డేటా బ్యాంకును ఏర్పరచడమే మా ధ్యేయం అని అనుమానం లేకుండా ప్రకటించిన కంపెనీ గూగుల్. అలాంటి దగుల్బాజీ కంపెనీని ఏ దేశం అరికట్టినా నిస్సందేహంగా సంతోషించవచ్చు.

గూగుల్ మెయిల్ సర్వీసులను చైనా బంద్ చేసిన సంగతిని ఆ కంపెనీయే ప్రకటించింది. గూగుల్ ట్రాన్స్ పరెన్సీ రిపోర్ట్ పేరుతో ఆ కంపెనీ అట్టహాసంగా ప్రకటించే నివేదికలో చైనా నుండి వచ్చే జీమెయిల్ ట్రాఫిక్ ను ‘జీరో’గా గూగుల్ చూపింది. గత శనివారం వెలువడిన నివేదికలో ఇలా జీరో చూపించగా, సోమవారం నాడు కొద్దిగా ట్రాఫిక్ పెరిగినట్లు చూపించింది. అది చాలా చాలా కొద్దిగా మాత్రమేనని ఎ.పి వార్తా సంస్ధ తెలిపింది.

చైనా ఇంటర్నెట్ నియంత్రణ సంస్ధ ‘చైనా ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్’ కు ఈ విషయమై సమాచారం కోరుతూ కాల్స్ చేశామని కానీ తమకు స్పందన అందలేదని ఎ.పి తెలిపింది. అయితే చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్ యింగ్ ఈ విషయమై కొద్దిగా సమాధానం ఇచ్చారు. చైనాలో చట్టబద్ధంగా వ్యాపారం చేసే కంపెనీలను తమ ప్రభుత్వం ఆహ్వానిస్తుందని ఆమె తెలిపారు. తద్వారా గూగుల్ కంపెనీ చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగతిని ఆమె పరోక్షంగా తెలియజెప్పారు.

2009లోనే చైనాపై గూగుల్ యుద్ధం ప్రకటించింది. (అవును. గూగుల్ పై చైనా యుద్ధం ప్రకటించడం కాదు.) తన సర్చ్ ఇంజన్ ఫలితాలపై చైనా విధించిన ఆంక్షలను అమలు చేసేది లేదని, చైనా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామిక, రాజకీయ హక్కులకు భంగకరం అనీ చెబుతూ గూగుల్ ఈ యుద్ధం ప్రకటించింది. వినియోగదారుల సమస్త సమాచారాన్ని దొంగతనంగా సేకరించి దాచిపెట్టే గూగుల్ తానే ఓ గొప్ప ప్రజాస్వామ్య సంరక్షక ఫోజు పెట్టింది. అచ్చం అమెరికా సామ్రాజ్యవాదం తరహాలోనే!

చైనా తన దేశంలోకి చొరబడే ఇంటర్నెట్ సమాచార ప్రవాహాన్ని నియంత్రించేందుకు ‘ది గ్రేట్ ఫైర్ వాల్ ఆఫ్ చైనా’ అనే సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసుకుంది. పొర్నోగ్రఫీ వెబ్ సైట్లను, పశ్చిమ దేశాలు ప్రచారం చేసే చైనా వ్యతిరేక రాజకీయ సమాచారాన్ని ఈ ఫైర్ వాల్ ద్వారా చైనా అడ్డుకుంటుంది. గూగుల్ సెర్చ్ ఇంజన్ లో ఈ తరహా వెబ్ సైట్ల నుండి వచ్చే ఫలితాలను చూపించకుండా అడ్డుకుంటుంది. గూగుల్ సెర్చ్ వ్యాపారంలో భారీ మొత్తం పోర్నోగ్రఫీ నుండే వస్తుందని ఒక అంచనా. తాము ప్రచురించే బూతు బొమ్మల్ని గూగుల్ ఉచితంగా చూపడం వలన తాము దివాళా తీశామని వివిధ బూతు పత్రికలు, వెబ్ సైట్లు గూగుల్ పై అమెరికా కోర్టుల్లో కేసులు కూడా వేశాయి. అలాంటి ఘన చరిత్ర కలిగిన గూగుల్ ను నిషేధించడం జనానికి శుభవార్త కాక ఏమవుతుంది?

చైనాలో స్ధానికంగా అభివృద్ధి చేసిన సర్చ్ ఇంజన్ బైదు చాలా పాపులర్. బైదుతో పోటీ నెగ్గాలంటే బూతు ఫలితాలు, రాజకీయ దుష్ప్రచార సమాచారం తన సర్చ్ ఇంజన్ లో అనుమతీస్తేనే సాధ్యం అవుతుందని గూగుల్ గ్రహించింది. కానీ పైకి అదే చెబితే ఉమ్మేస్తారు. కనుక ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, రాజకీయ స్వేచ్ఛ ఇత్యాది కాకమ్మ కబుర్లు చెబుతూ చైనాలో తన వ్యాపారంపై చైనా విధించిన పరిమితులను అమలు చేయబోమని 2009లో ప్రకటించింది. గూగుల్ కి మద్దతుగా అప్పటి అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ కూడా చైనా వ్యతిరేక ప్రకటనలు గుప్పించారు. మైక్రోసాఫ్ట్, యాహూ, యాపిల్ లాంటి ఇతర ఐ.టి కంపెనీలు కూడా గూగుల్ కి తోడు నిలవాలని ఆమె పిలుపులు ఇచ్చారు.

సాధారణంగా గూగుల్ లాంటి భారీ బహుళజాతి కంపెనీలు అలిగితే ఆయా దేశాల ప్రభుత్వాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రభుత్వాలు వణికి చస్తాయి. పెట్టుబడులు వెళ్లిపోతాయో ఏమో అని భయపడిపోతాయి. ఆ భయంతో కాళ్ళబేరానికి వస్తాయి. కానీ చైనా సింపుల్ గా “నా షరతులు అమలు చేస్తేనే ఇక్కడ వ్యాపారం చెయ్యి. లేదా నిరభ్యంతరంగా మూటా ముల్లె సర్దుకోవచ్చు” అని చెప్పేసింది. హిల్లరీ క్లింటన్ ను ‘ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని’ హెచ్చరించింది.

ఫలితంగా కొన్ని రోజులు ఎగిరెగిరి పడిన గూగుల్ తన పధకం పారకపోవడంతో తానే వెనక్కి తగ్గి చర్చలు చేద్దాం రమ్మంది. చైనాలో చైనీయ గూగుల్ వెబ్ సైట్ కు బదులు హాంగ్ కాంగ్ వెబ్ సైట్ కు చైనీయ సర్చ్ ట్రాఫిక్ మళ్లించాలని వేడుకుంది. ఆ విధంగా ‘ఇక చైనాలో వ్యాపారం చేసేది లేద’న్న తన మాట నెగ్గుతుందని భావించింది. చైనా దానికి ఓ.కె అంది. కానీ హాంగ్ కాంగ్ ట్రాఫిక్ ను కూడా వడకట్టడం చైనా మానుకోలేదు.

ఈ అయిదేళ్ళ కాలంలో చైనా వ్యాపారం, ఆర్ధిక శక్తి మరింత వృద్ధి చెందాయి. గూగుల్ వల్ల ఎప్పటికైనా ప్రమాదమే తప్ప ఉపయోగం లేదని భావించిందో ఏమో జీ మెయిల్ సేవలను కూడా ఇప్పుడు బంద్ చేసి బొంద పెట్టింది.

గూగుల్, ఫేస్ బుక్ తదితర ఇంటర్నెట్ కంపెనీలను మన జీవితాల్లో ఎంత పరిమితం చేయగలిగితే అంత ఉపయోగం. కానీ నేటి ఇంటర్నెట్ యుగంలో ప్రతి చిన్న, పాపులర్ స్టార్టప్ ఐ.టి కంపెనీలను గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ లాంటి దిగ్గజాలు కొనిపారేస్తున్న దశలో ఇది బొత్తిగా అసాధ్యంగా మారింది. కాబట్టి ఆయా దేశాలు తమ తమ సొంత కంపెనీలను అభివృద్ధి చేసుకుని అమెరికా ఐ.టి కంపెనీల దండయాత్రకు చెక్ పెట్టాలి.

గూగుల్, యాహూ, లైవ్ లాంటి ప్రైవేటు ఈ మెయిల్ సేవలను ప్రభుత్వ సంస్ధలు, అధికారులు ఉపయోగించడం మానుకోవాలని దీనివల్ల దేశ రహస్యాల భద్రతకు ప్రమాదం ఉన్నదని ఇటీవల భారత ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. వాటికి బదులు ఎన్.ఐ.సి సేవలను వాడుకోవాలని ఆ సర్క్యులర్ సూచించింది. కానీ ఎన్.ఐ.సి సేవలు ప్రభుత్వ సంస్ధలు, సిబ్బందికే తప్ప పౌరులకు అందుబాటులో ఉండవు. ఆ విధంగా భారత ప్రజలను భారత ప్రభుత్వమే గూగుల్, యాహూ, ఎం.ఎస్… లాంటి ఐ.టి మత్తగజాల వేటకు వదిలిపెట్టింది.

11 thoughts on “చైనాలో జీమెయిల్ బంద్!

 1. మన వ్యక్తిగత సమాచారం ఎవరూ దొంగలించకూడదంటే net4india లాంటి paid email services వాడాలి. Net4India వాడు మన దగ్గర డబ్బులు తీసుకుంటాడు కనుక వాడు దేనికో ఆశపడి మన వ్యక్తిగత సమాచారం దొంగిలించడు. వ్యారపరమైన మెయిల్స్ పంపుకునేవాళ్ళే net4india లాంటి paid services వాడుతారు తప్ప సాధారణ ఇంతర్నెత్ వినియోగదారులు గూగల్ లాంటి free services మీదే ఆధారపడతారు.

 2. ఇప్పుడే నా మొబైల్‌లో గూగల్ క్రోమ్ తీసేసి ఫైర్‌ఫాక్స్ ఇన్స్తాల్ చేసాను. గూగల్ లాంటి దొంగ కంపెనీల విషయంలో జాగ్రత్తగానే ఉండాలి.

 3. భద్రత పేరుతొ ప్రపంచం మీద గుడాచర్యం నెరుపుతున్న అగ్రరాజ్యం , తన భహుళ జాతి కంపెనీ ద్వారా సమస్త సాంకేతిక సమచారాన్ని తస్కరిస్తుంది . చైనా జిమెయిలు ,ఫేస్ బుక్లను నిరొదించడం గొప్పవిషయమే.

  కాని చైనా సైతం సైబర్ దాడులతొ భారత రక్షణ వ్యవస్తలమీద తరచు దాడిచేస్తుంది ,ఇటువంటి స్తితిలొ భారత్ తన సొంత సెర్చ్ ఇంజన్ ను అభివౄద్ది చెసుకొవడంతొ పాటు సైబర్ రక్శణ వ్యవస్తను పటిస్ట పరుచుకొవాలి .

 4. శ్రీనివాస్ గారు, సెర్చ్ ఇంజన్‌కి కేవలం వాణిజ్య ప్రకటనల నుంచి డబ్బులు వస్తాయి. కేవలం ఇందియా కోసం ఒక సెర్చ్ ఇంజన్ పెడితే, దానికి ఎంత మార్కెత్ ఉంటుంది అనేది తెలియాలి. ఇందియా నుంచి rediff.com అనే వార్తల వెబ్‌సైత్ ఉంది. వాళ్ళు ఆన్లైన్ షాపింగ్, వెబ్ హోస్తింగ్ లాంటి వాటి ద్వార కూడా డబ్బులు సంపాదిస్తారు. కేవలం సెర్చ్ ఇంజన్ వల్ల అయితే అది పెట్టిన కంపెనీకి పెద్ద ఆదాయం రాదు.

 5. ప్రవీణ్ గారు నమస్తే ,ఈ సైట్ ద్వారా ఎన్నొ విషయాలు నేర్చుకుంటున్నాను అందుకు అందరికి దన్యవాదాలు .

  ఇక ఇండియా సొంత సర్చ్ ఇంజన్ను అభివ్రుద్ది చెసుకొవాలి అనడంలొ నావుద్దేశం మన సైబర్ వ్యవస్తలు మన అదినంలొ వుంటాయి మరియు కొద్దొగొప్పొ భద్రత వుంటుంది కదా!(పశ్చిమ రాజ్యాల అనుకూల ప్రభుత్వం చైనా తరహలొ ఇంటెర్నెట్ను సెన్సార్ చేయలేదుకదా)

 6. ప్రవీణ్ గారూ, ముందు మీరు ఆ ‘మార్క్సిస్ట్-లెనినిస్ట్’ అన్న పేరు మార్చుకోండి. లేదా ఆ పేరుకు వ్యతిరేకంగా రాయడం అన్నా మానుకోండి.

  పైన శ్రీనివాస్ గారు చేసిన సూచన జాతీయ దృక్పధంలో ఆహ్వానించదగ్గది. సామ్రాజ్యవాదం సైబర్ టెక్నాలజీని, కంపెనీలను గుప్పెట్లో పెట్టుకుని ఇండియా లాంటి దేశాల సైబర్, జాతీయ భద్రతలను ప్రమాదంలో పడవేసిందని, కాబట్టి ఇండియా దేశీయ (జాతీయ) సైబర్ కంపెనీలను అభివృద్ధి చేసుకుని తద్వారా దేశ భద్రతను పరిరక్షించుకోవాలని శ్రీనివాస్ సూచించారు.

  మీరు ఈ సూచనలో ఉన్న అసలు అర్ధాన్ని పెరికి అవతల పారేశారు. మీ సొంత జ్ఞానాన్ని అసందర్భంగా చొప్పించి వ్యాపార సూత్రాలు చెబుతున్నారు. దేశభక్తియుత, జాతీయవాద చైతన్యంతో తీసుకోవలసిన చర్యలను సూచిస్తున్నప్పుడు చర్చను ఆ కోణంలో కొనసాగించగలిగితే ఆ పని చేయాలి. లేదా గమ్మున ఉండాలి. ఇవి కాకుండా చర్చను పూర్తిగా వేరేవైపుకు తీసుకెళ్లి మీకు తోచిన ఉపదేశాలు చేసేస్తున్నారు.

  ఇది అవాంఛనీయం. గమనించగలరు.

 7. నేను సి లాంగ్వెజ్ & జావా నేర్చుకుని, ఓ పది మంది సాఫ్త్‌వేర్ ఇంజనీర్‌లతో కలిసి ఓ సెర్చ్ ఇంజన్ తయారు చెయ్యగలను. హైదరాబాద్‌లోని ఓ కంపెనీ దగ్గర ఒక dedicated server అద్దెకి తీసుకుని అందులో సెర్చ్ ఇంజన్ హోస్త్ చెయ్యగలను. కానీ వాణిజ్య ప్రకటనలు రాక ఆ dedicated serverకి అద్దె కట్టలేకపోతే ఆ కంపెనీవాడే నా సర్వర్ బంద్ చేస్తాడు. కేవలం ఇందియా కోసం సెర్చ్ ఇంజన్ పెట్టినా ఇతర దేశాలకి చెందిన దొమెయిన్‌లని క్రాల్ చెయ్యగలిగేంత శక్తివంతమైన సర్వర్ ఉండాలి. దానికి అద్దె కట్టుకోవడం అనేది మాటల్లో అయ్యే పని కాదు. నేను విశాఖపట్నంలో చేసేది వెబ్ దిజైనింగ్ పనే. పర్సనల్ వెబ్‌సైత్‌లో అయితే ఎవరూ ప్రకటనలు పెట్టుకోరు కానీ లక్షలు ఖర్చు పెట్టి సెర్చ్ ఇంజన్ పెట్టిన తరువాత ప్రకటనలు రాకపోతే మన ప్రయత్నం అయ్యేది బూడిదలో పోసిన పన్నీరే. ఖర్చు తగ్గించుకోవడానికి ఒక మార్గం ఉంది. Inktomi లాంటి వెబ్ క్రాలర్స్‌కి డబ్బులు కట్టి, వాళ్ళ దగ్గర సమాచారాన్ని కొని, దాన్ని మన సర్వర్ ద్వారా జనానికి అందించొచ్చు. అమెరికాకి అనుకూలంగా లేదా ఇందియాకి వ్యతిరేకంగా ఉన్న సమాచారాన్ని మనం ఇంతెన్షనల్‌గా మన సర్వర్ నుంచి తొలిగించొచ్చు. అలా చేసినా సర్వర్ నిర్వాహణకి లక్షలు ఖర్చవుతాయి. Another way to make money is, we should collect money from them who submit their links to our search engine for guaranteed inclusion. Lycos search engine does the same. I will be the first person to start a native search engine from India if Indian techies collaborate with me and the expected revenue is enough to maintain the server.

 8. వ్యాపారంలో వచ్చే లాభ నష్టాలు ఏమిటో వ్యాపారం చేసేవానికి తెలుస్తుంది కానీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఏ తెన్షన్ లేకుండా నెలాఖరున యాభై వేలు సేలరీ అకౌంత్‌లో పడెయ్యించుకునేవానికికాదు. నేను శ్రీకాకుళంలో వ్యాపారం చేసే రోజుల్లో నా దగ్గరకి హైదరాబాద్‌కి చెందిన Southern Online కంపెనీవాడు వచ్చాడు. అతను నాకు Airtel tower నుంచి నా ఇంతర్నెత్ కేఫ్ వరకు leased line ఇస్తానన్నాడు. ఆ కనెక్షన్‌ని నేను ఇళ్ళకి షేర్ చేసి డబ్బులు వసూలు చేసుకోవచ్చు. ఆ కంపెనీకి నేను సెక్యూరితీ దిపాజిత్ లక్ష రూపాయలు కట్టాలి, నెలసరి అద్దె ముప్పై వేలు కట్టాలి, నా సర్వర్ వేడెక్కకుండా 24 గంటలూ AC ఆన్‌లో ఉంచాలి. ఇంటిలో ISP సర్వర్ పెట్టుకుంటేనే ఇంత ఖర్చైనప్పుడు సెర్చ్ ఇంజన్ సర్వర్ పెట్టుకుంటే ఎంత ఖర్చవుతుందో ఆలోచించండి. ఒక సర్వర్‌కి traffic పెరిగితే దాని మీద load తగ్గించడానికి ఇంకో సర్వర్ కొనాలి, దానికి కూడా traffic పెరిగితే మరొక సర్వర్ కలపాలి. ఇలా మనం ఒక cloud network ఏర్పాటు చేసుకోవాలి. IRCTCవాళ్ళు సర్వర్‌లని మెయింతెయిన్ చేసేది ఇలాగే. వాళ్ళకి రైల్వే తికెత్‌లు అమ్మడం వల్ల కమిషన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి నష్టం రాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s