నాకు బస్సు, నా గార్డులకు కార్లా? -యశోదాబెన్ ఆర్.టి.ఐ


Jashodaben 1

గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఈ దేశ ప్రధాని భార్య మండి పడుతోంది. ప్రోటో కాల్ పేరుతో తన రక్షణ కోసం 10 గార్డులను నియమించి వారి ప్రయాణానికి కార్లు ఇచ్చారని, తనకు మాత్రం ప్రభుత్వ ప్రయాణ వాహనం బస్సులో మాత్రమే వెళ్ళే అవకాశం దక్కిందని ఇదెక్కడి విడ్డూరమని ఆమె ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రోటోకాల్ అంటే ఏమిటో చెప్పాలని ఆమె సమాచార హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనకు గార్డులను నియమించిన ఆదేశాలు ఇవ్వాలని ఆమె చట్టం ప్రకారం కోరగా, ‘ఆ సమాచారం ఇవ్వడం కుదరదని’ ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.

భారత ప్రధాని నరేంద్ర మోడి భవిష్యత్తులో ఎదురయ్యే విమర్శలను ముందుగానే పసిగట్టి మొదటి సారిగా గత పార్లమెంటు ఎన్నికల నామినేషన్ పత్రాల్లో తన భార్య పేరు యశోదాబెన్ అని వెల్లడి చేశారు. అప్పటివరకూ మోడి దేశం కోసం వైవాహిక సుఖాన్ని వదులుకున్న బ్రహ్మచారిగా ప్రచారం చేసిన హిందూత్వ భక్తులకు మోడి వెల్లడితో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. తన భర్త సి.ఎం అయినప్పటికీ సాధారణ టీచర్ గా రోజులు వెళ్లదీస్తున్న యశోదాబెన్, మోడి అంగీకారంతో తన సామాజిక కష్టాలు తీరుతాయని భావించారు. ఆమేరకు ఆమె సంతోషం ప్రకటించారు. తీరా ప్రధాన మంత్రి భార్యగా సైతం ఆమెకు గౌరవ మర్యాదలు దక్కనట్లు కనిపిస్తోంది.

తనకు కల్పించిన భద్రతా కవచం విషయంలో సమాచారం ఇవ్వాలని యశోదాబెన్ సమాచార హక్కు చట్టాన్ని ప్రయోగిస్తూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే యశోదాబెన్ కోరిన సమాచారం స్ధానిక ఇంటలిజెన్స్ బ్యూరో కు సంబంధించిన వ్యవహారం అనీ, సదరు విభాగం ఆర్.టి.ఐ చట్టం పరిధిలో లేదని కనుక ఆమె కోరిన సమాచారం ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం నుండి తిరస్కృత సమాచారాన్ని యశోదాబెన్ అందుకున్నారు.

నవంబర్ 24, 2014 తేదీన యశోదా బెన్ మెహసానా పోలీసు స్టేషన్ లో ఆర్.టి.ఐ దరఖాస్తు దాఖలు చేశారు. తనకు కల్పించిన భద్రతా రక్షణకు సంబంధించిన అనేక పత్రాలను తనకు ఇవ్వాలని ఆమె అందులో కోరారు. ఏ ప్రోటోకాల్ ప్రకారం తనకు రక్షణ ఇచ్చారో చెప్పాలని, ప్రోటోకాల్ వివరాలు ఇవ్వాలని, ప్రభుత్వం జారీ చేసిన వాస్తవ ఆదేశాల కాపీలను ఇవ్వాలని ఆమె కోరారు. ఈ పత్రాలను తాము ఇవ్వలేమని ప్రభుత్వం సమాధానం చెప్పింది.

62 సంవత్సరాల యశోదాబెన్ తన భద్రతను కవర్ చేసిన ప్రోటోకాల్ ఏమిటో చెప్పాలని, సదరు ప్రోటోకాల్ నిర్వచనం ఇవ్వాలని కోరారు. సదరు ప్రోటోకాల్ ప్రకారం తనకు ఇంకా ఏమేమి లాభాలు పొందవచ్చునో వివరాలు ఇవ్వాలని కోరారు. తనకు కల్పించబడిన భద్రతా వ్యవస్ధ తీరు తెన్నుల పట్ల ఆమె తీవ్ర అసంతృప్తి ప్రకటించారని ది హిందు తెలియజేసింది. ఈ ఆదేశాల కింద తన గార్డులు ఎంచక్కా ప్రభుత్వం అందజేసిన కార్లలో ప్రయాణిస్తుంటే తాను మాత్రం ఎప్పటిలా ప్రజా రవాణా వాహనం అయిన బస్సుల్లోనే ప్రయాణించవలసి వస్తోందని, ఇదెక్కడి ప్రోటోకాల్ అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి స్వయంగా తన భార్య యశోదాబెన్ అని అధికారిక పత్రాల్లో పేర్కొన్నప్పటికీ ప్రధాని భార్యకు దక్కవలసిన సౌకర్యాలు ఏవీ తనకు దక్కకపోవడం పట్ల యశోదాబెన్ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. తన మానాన తాను బతుకుతుండగా భద్రత పేరుతో 10 మంది గార్డులను ఇచ్చి వారికి కార్లు ఇచ్చి తనకు మాత్రం ఏ వాహనమూ ఇవ్వకపోవడం ఏమిటన్నది ఆమె ప్రశ్న.

యశోదాబెన్ ఇతర భయాందోళనలు సైతం వ్యక్తం చేశారని తెలుస్తోంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తన సొంత గార్డుల చేతుల్లోనే హత్యకు గురయ్యారని ఆమె గుర్తు చేస్తున్నారు. దానితో తనకు గార్డులు అంటేనే భయం వేస్తోందని ఆమె తన దరఖాస్తులో పేర్కొన్నారు. ప్రతి గార్డు వద్దా తనకు అందజేసిన ఆదేశాల కాపీ తప్పనిసరిగా కలిగి ఉండేలా జాగ్రత్త వహించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

ఎన్ని విధాలుగా కోరినప్పటికీ ఆమె కోరిన సమాచారం మాత్రం పోలీసులు ఇవ్వలేదు. “మీరు కోరిన సమాచారం స్ధానిక ఇంటలిజెన్స్ బ్యూరోకు సంబంధించినది. గుజరాత్ హోమ్ డిపార్ట్ మెంట్ తీర్మానం నెంబర్ SB.1/1020018203/GOI/62, తేదీ నవంబర్ 25 ప్రకారం స్ధానిక ఇంటలిజెన్స్ బ్యూరో (Local Intelligence Bureau) ఆర్.టి.ఐ చట్టం పరిధిలోకి రాదు. కనుక మీరు కోరిన సమాచారం ఇవ్వలేము” అని యశోదా బెన్ కు మెహసానా జిల్లా డి.ఎస్.పి భక్తి థాకర్ నుండి సమాధానం అందింది.

యశోదా బెన్, నరేంద్ర మోడిల వివాహ సమస్య ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదని, అది కేవలం కార్పెట్ కిందికి నెట్టివేయబడిందని యశోదాబేన్ ఆర్.టి.ఐ దరఖాస్తు స్పష్టం చేస్తోంది. యశోదాబేన్ ను భార్యగా మోడి సంపూర్ణంగా అంగీకరించినట్లయితే ఆమె ఉండవలసింది మెహసానాలో కాదు, న్యూ ఢిల్లీ లోని ప్రధాన మంత్రి నివాసంలో ప్రధాన మంత్రి భార్యగా. ఆమె ప్రధాని మోడి భార్య కాకపోయినట్లయితే ఆ 10 మంది ఎస్.పి.జి గార్డులు ఆమెకు రక్షణగా ఉండనవసరం లేదు.

కానీ వాస్తవంలో ఆమెకు 10 మంది గార్డులు రోజుకు రెండు షిఫ్ట్ లుగా రక్షణ కల్పిస్తుండగా ఆమె మాత్రం ప్రధాన మంత్రి నివాసంలో ప్రధాని భార్యగా గౌరవ మర్యాదలు అందుకోవడం లేదు. సాధారణ మహిళగానే జీవనం కొనసాగిస్తున్నారు. ఇరువురి మధ్య సమస్య పరిష్కారం అయిందన్న సమాచారంలో నిజం లేదని కూడా యశోదా బెన్ ఆర్.టి.ఐ ప్రశ్నావళి స్పష్టం చేస్తున్నది. యశోదా బెన్ అసంతృప్తి పరిష్కారం అయ్యేంత వరకూ ప్రధాని నరేంద్ర మోడి గారి కప్ బోర్డ్ లో కంకాళాలు కొనసాగుతూనే ఉండగలవు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s