ప్రాకృతిక వింతలను రికార్డు చేయడం మొదలు పెట్టాలే గానీ దానికిక అంతూ పొంతూ అంటూ ఉండదు. అదొక మహా యజ్ఞం అనడం సబబుగా ఉంటుంది. కాదంటే రెండు రోజుల పాటు కురిసిన మంచు తుఫాను తూర్పు యూరప్ దేశాలలోని ఆల్ప్స్ పర్వత శ్రేణిపై విస్తరించిన అటవీ వృక్షాలను, ఇతర నిర్మాణాలను హిమనీ శిల్పాలుగా మార్చివేయడం గురించి ఎలా చెప్పగలం?
ఐరోపాలోని పలు దేశాలను తీవ్ర వాతావరణ పరిస్ధితులు చుట్టు ముట్టాయి. ఎముకలు కొరికేసే చలి వాతావరణం జనజీవనాన్ని మందకొడి స్ధాయిలోకి బలవంతంగా నెట్టివేసింది. అసలే ‘చలి భరించలేం’ అని జనం గొణుక్కుంటుండగానే అడపా దడపా మంచు తుఫాన్లు విరుచుకుపడి ‘అప్పుడే ఏమయింది?’ అని హెచ్చరించి పోతున్నాయి.
స్లొవేనియా, క్రొయేషియా, అల్బేనియా, సెర్బియా దేశాలను ఇటీవల రెండు రోజుల పాటు మంచు తుఫాను కుదిపేసింది. ఈ తుఫాను తన ప్రతాపాన్ని చాటుకుని చక్కా పోయాక చూస్తే ఏముంది? కనుచూపు మేరలో అంతా తెల్లటి మంచు తప్ప మరొకటి కానరాదాయే! ఐరోపా దేశాలకు తుట్టెలు తుట్టెలుగా మంచు కురిసే హిమ వాతావరణం కొత్త కాకపోవచ్చు గానీ మంచు తప్ప మరొకటి కనపడని పరిస్ధితి మాత్రం ఇటీవలి కాలంలో కనిపిస్తున్న పరిణామం.
ముఖ్యంగా పైన చెప్పిన పైన్ అటవీ వృక్షాలను హిమ పాతం కప్పివేసిన తీరు గతంలో ఎన్నడూ ఎరగనిదని స్ధానికులు చెబుతున్నారు. ఆకాశంలోకి నేరుగా దూసుకుపోతున్నట్లు ఉండే మహా కాయులైన పైన్ వృక్షాలు తమపై కురిసి గడ్డ కట్టిన హిమపాతం బరువుకి వంగిపోయి, విరిగిపోయిన దృశ్యాలు కూడా అనేక చోట్ల కనిపించాయని ప్రజలు చెబుతున్న మాట!
నాలుగు దేశాలలో విస్తరించిన ఆల్ప్స్ పర్వతాలను, ఆ పర్వతాలపై దట్టంగా అల్లుకున్న పైన్ వృక్షాలను దట్టమైన మంచు కప్పేసి సరికొత్త హిమ శిల్పాలను సృష్టించిన అద్భుత దృశ్యాలను కింది ఫొటోల్లో చూడవచ్చు. పైన్ అడవిని చూసేందుకు నిర్మించిన ఒక టవర్ కూడా పూర్తిగా మంచు పట్టి వింతైన, అపురూపమైన దృశ్యాలను మన ముందు నిలిపింది.
మనిషి చెక్కే మంచు శిల్పాలు మనకు (భారతీయులకు) కొత్తే అయినా వివిధ ఫొటోల్లోనూ, సినిమాల్లోనూ వాటిని చూసి ఉన్నాం కనుక అంత కొత్త కాదు. కానీ ఇవి ప్రకృతి చెక్కిన హిమ శిల్పాలు. ఒక మెదడు, రెండు చేతులు పూనుకుని ముందుగా అనుకున్న రూపాన్ని చెక్కడం కాకుండా ప్రకృతి ఏదో పని ఉన్నట్లు హడావుడిగా వచ్చి, శిల్పాలను చెక్కి, అంతే హడావుడిగా వెళ్ళి పోయిన భావనను ఈ హిమ శిల్పాలు మన మదిలో కల్పిస్తున్నాయి.
ముఖ్యంగా అదేదో మాయా డ్రాగన్ ను చెక్కినట్లున్న శిల్ప సౌందర్యాన్ని చూడండి! ఫొటోల్లోని దృశ్యాలను ‘ఫ్రోజెన్’ అనే సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాతో పోల్చి కొందరు సంతృప్తి పడుతున్నారు. యానిమేషన్ సినిమా అయిన ‘ఫ్రోజెన్’ (Frozen) లో మాయా శక్తులు పొందిన ఓ రాణి గారు పొరపాటున తన రాజ్యాన్ని శాశ్వత చలికాలం కలిగి ఉండేదిగా మార్చివేస్తుంది. ఈ సినిమాను క్రిస్మస్ రోజున స్టార్ సినిమా చానెల్ ప్రసారం చేసింది.
ఈ ఫోటోలను డెయిలీ మెయిల్ పత్రిక ప్రచురించింది. ఈ ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్ మార్కో కొరొసెక్ ప్రకృతి వైపరీత్యాలను ఫొటోల్లో బంధించడంలో నిష్ణాతుడట.
చివరి రెండు ఫోటోలు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో స్లొవేనియాలో మంచు తుఫాను సంభవించినప్పటి దృశ్యాలు. మంచు గడ్డల కింద కప్పబడిపోయిన తన కారును విముక్తి చేయడానికి అతగాడు ఏకంగా ఇనప సుత్తినే ఉపయోగిస్తున్నాడు.