“అయితే, మోడీజీ – మీ సుపరిపాలన బాగా సాగుతున్నట్లేనా?”
*********
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి కి మోడి ప్రభుత్వం ‘భారత రత్న’ ప్రకటించింది. ఆయనతో పాటు హిందూ మహా సభ నాయకుడు మదన్ మోహన్ మాలవీయకు కూడా, ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారని చెబుతూ ‘భారత రత్న’ ప్రకటించారు. (మాలవీయ 4 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా పని చేయడం విశేషం.) మాలవీయకు భారత రత్న ప్రకటించడం అనవసరం అనీ, రాజకీయ ఉద్దేశ్యాలతో ఆయనకు అవార్డు ప్రకటించారని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ విమర్శించడం గమనార్హం.
డిసెంబర్ 25 వాజ్ పేయి పుట్టిన రోజు. అదే రోజు మాలవీయ పుట్టిన రోజు కూడా. ఇక క్రీస్తు జన్మదినం కూడా ఆ రోజే అని తెలిసిందే. క్రైస్తవులు పండగ జరుపుకునే క్రిస్మస్ రోజును ‘గుడ్ గవర్నెన్స్ డే’ గా ప్రకటించిన మోడి ప్రభుత్వం ఆ పేరుతో కేంద్రీయ విద్యాలయ పాఠశాలల విద్యార్ధులకు వ్యాసరచన పోటీలు ప్రకటించింది. పోటీ కోసం, సెలవు రోజే అయినా, పాఠశాలలు పని చేయాలని అనధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయని కాంగ్రెస్ తదితర పార్టీలు విమర్శించాయి.
సెలవు దినమైన క్రిస్మస్ రోజును ‘గుడ్ గవర్నెన్స్ డే’ గా ప్రకటించడం ఏమిటని, మత ఉద్దేశ్యాలతోనే ఇలా చేశారని పలువురు విమర్శించారు. సుపరిపాలన అందించిన వాజ్ పేయి జన్మదినం కనుక ‘సుపరిపాలన దినం’ గా ప్రకటించాము తప్ప విమర్శకుల విమర్శలు నిజం కాదని కేంద్రం చెప్పుకుంది.
క్రైస్తవులకు పర్వదినం అయిన పండుగ రోజును సెలవు దినంగా ఉంచడం, తన పార్టీకి చెందిన నేత పుట్టిన రోజు బహుమతిగా భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ప్రకటించడం, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించిన కమ్యూనల్ అవార్డ్ తో విభేదించి కాంగ్రెస్ కు రాజీనామా చేసి ‘హిందూ మహాసభ’ ను స్ధాపించిన మాలవీయకు కూడా ‘భారత రత్న’ ప్రకటించడం… ఇవన్నీ మోడి ‘సుపరిపాలనకు సంకేతాలని కార్టూనిస్టు వ్యాఖ్యానించారు.
సుపరిపాలన అంటే ఏమిటి అర్ధం? కుల, మత, లింగ, ప్రాంత, వర్గ వివక్షలకు అతీతంగా ప్రజలను సమానంగా పాలించడం, కన్నబిడ్డల్లా చూసుకోవడం లాంటి గొప్ప గొప్ప అర్ధాల జోలికి పోవద్దు. రాజకీయ స్వార్ధంతో వ్యవహరించకపోవడం, దేశ వనరులను ప్రజలకే ఉపయోగపెట్టడం… లాంటి చర్యలు కనీసంగా ఆశించదగినవి. ‘సుపరిపాలన దినం’ అంటూ ప్రకటించి ఆ రోజునే ఈ కనీస సూత్రాలకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వ్యహరించిందని కార్టూనిస్టు సున్నితంగా విమర్శించారు.
పనిలో పనిగా గాడ్సేకూ భారతరత్న అవార్డ్ ప్రకటిస్తే సరి!(ప్రతీ వీధిలో గాడ్సే విగ్రహాలు నెలకొల్పాలి)
ఇండియాని భారత్ గా మార్చాలి!
భారత్ ను హిందూరాజ్యంగా ప్రకటించాలి!
గీతను జాతీయ గ్రంధంగా ప్రకటించాలి!
ఈ దేశంలో అమ్మే వస్తువులన్నిటికీ(ఇక్కడ ఉత్పత్తి అయ్యేవాటికీ,దిగుమతిచేసుకొనే వాటికీ) “మేక్ ఇన్ భారత్” అని ట్యాగ్ ను ముద్రించాలి!
పాఠ్య గ్రంధాలన్నిటిలోకీ జ్యొతిష్య శాస్త్రాన్ని,వాస్తు శాస్త్రాన్ని,మోదీ గారు ప్రభోధించిన సనాతన శాస్త్రియవిజ్ణానాన్ని చొప్పించాలి!
క్షమించాలి, నాకు తెలిసినవి చాలా తక్కువ ఇంకా ఏమైన ఉంటే వాటన్నిటినీ అమలుపరచడంద్వారా మోదీ తన సుపరిపాలనను సాధించాలి!
గాంది జయంతి నాడు స్వేచ్చ బారత్ నినాదం కూడా గాడ్సే తెరపైకి వస్తున్నాడు ని కాదా అర్ధం?