చైనా బులెట్ ట్రైన్ మనకు సాకారం అయ్యేనా?


భారత దేశంలో అతి పొడవైన మార్గంలో బులెట్ ట్రైన్ రైలు, ట్రాక్ నిర్మించాలని చైనా భావిస్తోంది. కానీ జపాన్ ఇస్తున్న పోటీ వల్ల చైనా ఇవ్వజూపుతున్న సహాయం వెనక్కి పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. జపాన్ చొరబడడంతో మెక్సికోలో బిడ్డింగ్ పూర్తయిన బులెట్ ట్రైన్ ప్రాజెక్టు సైతం చైనా చేజారడంతో ఇండియాలోనూ అదే జరగవచ్చని చైనా అనుమానిస్తోంది. ఇండియా మాత్రం అన్ని అవకాశాలను తెరిచి ఉంచుకుని చైనా అనుమానాలను మరింత బలపరుస్తోంది.

ఇండియాకు చెందిన ‘హై స్పీడ్ రైల్ కార్పొరేషన్’ సంస్ధ నుండి 5గురు ప్రతినిధుల బృందం నెల రోజుల క్రితం చైనాను సందర్శించింది. సంస్ధ ఛైర్మన్ సతీష్ అగ్నిహోత్రి ఈ బృందానికి నేతృత్వం వహించారు. ఢిల్లీ-చెన్నై నగరాల మధ్య ఉత్తర, దక్షిణ భారతాలను కలిపే బులెట్ రైలు మార్గాన్ని నిర్మించేందుకు తగిన అధ్యయనాన్ని నిర్వహించడానికి చైనా ముందుకు వచ్చింది. ఈ అధ్యయనాన్ని తన సొంత ఖర్చుతోనే పూర్తి చేస్తానని చైనా ఆఫర్ ఇచ్చింది. ఈ అధ్యాయనానికి సంబంధించిన విధి విధానాలను (Terms of Reference) ఖరారు చేసేందుకు భారతీయ బృందం చైనాను సందర్శించింది.

అయితే, ఢిల్లీ-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ లాభదాయకత అధ్యనాన్ని (feasibility study) చైనా పూర్తి చేసినంత మాత్రాన ఆ కాంట్రాక్టు చైనాకే అప్పగిస్తారన్న గ్యారంటీ ఏమీ లేదని భారత ప్రభుత్వ అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో తమకు పోటీగా వస్తున్న జపాన్ భారత్ తో తీవ్ర స్ధాయిలో లావాదేవీలు జరుపుతోందని చైనా అధికారులు భావిస్తున్నారు. అమెరికా+జపాన్ – చైనా + రష్యా ల మధ్య ఆసియా-పసిఫిక్ లో భౌగోళిక రాజకీయ ఆధిపత్యం కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపధ్యంలో చైనా అనుమానాలు అకారణమేమీ కావు.

ఢిల్లీ-చెన్నై రైలు కారిడార్ ను చైనా నిర్మించినట్లయితే 300 కి.మీ వేగంతో ప్రయాణించగల రైల్వే ట్రాక్ భారత్ గడ్డపై నిర్మించబడుతుంది. ఈ మార్గం వల్ల చెన్నై, ఢిల్లీ ల మధ్య ప్రయాణ కాలం 6 గంటలకు తగ్గిపోతుంది. ఈ రైలు మార్గం అధ్యాయనానికి చైనాయే చొరవ తీసుకుని ముందుకు వచ్చింది. ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ ల మధ్య బులెట్ ట్రైన్ ప్రాజెక్టును జపాన్ నిర్మిస్తోంది. అయితే ఈ మార్గం దూరం చైనా తలపెట్టిన ప్రాజెక్టు దూరంతో పోల్చితే తక్కువ. ఢిల్లీ-చెన్నై ప్రాజెక్టు 1754 కి.మీ దూరం కాగా, ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్టు 534 కి.మీ మాత్రమే. బులెట్ రైలు వేగం మాత్రం రెండు ప్రాజెక్టుల్లోనూ సమానం (గంటకు 300 కి.మీ).

చైనా అధ్యయనంలో భాగంగా ఇండియా నుండి ఐదు విడతలుగా, విడతకు 20 మంది చొప్పున, 100 మందిని శిక్షణ కోసం చైనా వెళ్తారు. భారీ సరుకులను మోసుకేళ్లే ట్రైన్ ల తయారీ లో పరస్పరం సహకరించుకోవాలని ఇండియా, చైనాలు ఒక అవగాహనకు వచ్చాయి. ఈ రంగంలో చైనా ప్రపంచ స్ధాయి టెక్నాలజీని అభివృద్ధి చేసిన పేరును సంపాదించడం విశేషం. చైనా సహాయంతో బెంగుళూరు, భువనేశ్వర్ రైల్వే స్టేషన్ లను మోడల్ స్టేషన్ లుగా అభివృద్ధి చేయాలని కూడా ఇరు దేశాలు సాధారణ అంగీకారానికి వచ్చాయి. ఇవే కాక రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు, గుర్తించిన రూట్లలో ప్రస్తుతం ఉనికిలో ఉన్న ట్రాక్ ల స్ధానంలో 180 కి.మీ వేగంతో ప్రయాణించగల ట్రాక్ లను నిర్మించాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. చెన్నై నుండి బెంగుళూరు మీదుగా మైసూరు వెళ్ళే రైలు మార్గాన్ని ఇందుకోసం గుర్తించారు.

ఢిల్లీ-చెన్నై బులెట్ రైలు మార్గం ఆచరణలోకి వస్తే ఇది ప్రపంచంలోనే అతి పొడవైన బులెట్ రైలు మార్గాల్లో రెండవదిగా చరిత్రకు ఎక్కుతుంది. ప్రస్తుతం చైనాలో బీజింగ్, గువాంగ్ ఝౌ ల మధ్య 2298 కి.మీ దూరం మేర నిర్మించిన హై స్పీడ్ బులెట్ రైలు మార్గం ప్రపంచంలో అత్యంత పొడవైనదిగా రికార్డులకెక్కింది. ఈ మార్గాన్ని గత సంవత్సరమే చైనా ప్రారంభించింది. చైనా పత్రికల ప్రకారం ఢిల్లీ-చెన్నై రైలు మార్గం పూర్తి చేసేందుకు 32.6 బిలియన్ డాలర్లు (దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకు సమానం) వ్యయం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కోసం నిధులను పాక్షికంగా గాని, పూర్తిగా కానీ చైనాయే సమకూర్చే అవకాశం ఉంది.

ఢిల్లీ-చెన్నై బులెట్ రైలు మార్గం నిర్మాణాన్ని చైనా చేతికి అప్పగిస్తే గనుక అది భారత్-చైనాల మధ్య సంబంధాలను ఒక్క మలుపు తిప్పడం ఖాయం. ఇంత పెద్ద ప్రాజెక్టును బహుశా మరే దేశానికి దక్కిన ఉదాహరణ ఇంతవరకూ లేదు. అయితే భౌగోళిక రాజకీయాలలో ముఖ్యంగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పేట్రేగి పోతున్న నేపధ్యంలో ఇండియా-చైనా మధ్య స్నేహ-సహకార సంబంధాలు అంత సులభం ఏమీ కాదు. సులభం కాకుండా చేయడానికి అమెరికా, జపాన్ తాము చేయగలిగినదంతా చేస్తాయి.

అందుకు మెక్సికో రైలు ప్రాజెక్టు ఒక ఉదాహరణ. మెక్సికోలో మెక్సికో నగరం, క్వెరెటారో నగరాల మధ్య 210 కి.మీ రైలు లింకు నిర్మాణానికి చైనా గత నవంబర్ లో కాంట్రాక్టు గెలుచుకుంది. ఈ మేరకు కాంట్రాక్టు చైనా కంపెనీకి దక్కిందని మెక్సికో ప్రభుత్వం నవంబర్ 3 తేదీన ప్రకటించింది కూడా. నిజానికి సదరు బిడ్డింగ్ లో ఏకైక బిడ్డర్ చైనా కంపెనీయే. కానీ ఇంతలోనే ఏమైందో గానీ మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో నవంబర్ 3 నాటి కాంట్రాక్టును రద్దు చేసినట్లు ప్రకటించాడు. మళ్ళీ కొత్తగా బీడ్ లు ఆహ్వానిస్తామని ఆయన ప్రకటించాడు. ఈ పరిణామం వెనుక జపాన్, అమెరికాల హస్తం ఉన్నదని చైనా అనుమానిస్తోంది. ఈ మేరకు అనుమానాలు వ్యక్తం చేస్తూ చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక గ్లోబల్ టైమ్స్, ప్రభుత్వ పత్రిక పీపుల్స్ డెయిలీలు విశ్లేషణలు ప్రచురించాయి.

ఆధిపత్య రాజ్యాల ఒత్తిళ్లకు తల ఒగ్గకుండా పొరుగున ఉన్న మిత్ర రాజ్యాల స్నేహ హస్తాన్ని అందుకుని లబ్ది పొందుతారో లేక ఒత్తిళ్లకు లొంగిపోయి భారత దేశ బంగారు భవిష్యత్తును అమెరికా-జపాన్ సామ్రాజ్యవాద ప్రయోజనాలకు తాకట్టు పెడతారో అన్నది భారత ప్రజల చేతుల్లో కాకుండా దళారీ పాలకవర్గాల చేతుల్లో ఉండడం ప్రజల దౌర్భాగ్యం.

6 thoughts on “చైనా బులెట్ ట్రైన్ మనకు సాకారం అయ్యేనా?

  1. బుల్లెత్ రైళ్ళు వేస్తామని వీళ్ళు చెపుతున్నవి కట్టు కథలు. ఇక్కడ ఐదు రూపాయలు పెట్టి పాసింజర్ తికెత్ కొనలేక తికెత్ లేకుండా ప్రయాణించేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ బుల్లెత్ రైళ్ళు వేస్తే ఎవరు ఎక్కుతారు? నిన్ననే విజయవాడ-రాయగడ పాసింజర్ బండిలో ఐదుగురు ప్రయాణికులు చెల్లని తికెత్‌తో ప్రయాణిస్తూ దొరికిపోయారు. వాళ్ళు విశాఖపట్నం వరకు మాత్రమే తికెత్ తీసి బొబ్బిలి వెళ్తూ విజయనగరం దగ్గర దొరికిపోయారు. వాళ్ళందరూ వ్యవసాయ కార్మికులు. వంతెనలూ, సొరంగాలూ లేకుండా రైలు మార్గం వెయ్యడానికి కిలో మీతర్‌కి కోటి రూపాయలు ఖర్చవుతుంది. రైల్వేల నిర్మాణం ఇంత ఖరీదైనది కనుక వ్యవసాయ కార్మికుల కోసం రైలు చార్జిలు తగ్గించలేరు. ఇక బుల్లెత్ రైళ్ళు నడిపితే నా లాంటి మధ్యతరగతివాడు కూడా అవి ఎక్కలేడు.

  2. డిల్లి -చెన్నై ల మద్య తలపెట్టిన బుల్లెట్ రైలు అహ్వనించదగ్గది. అదేసమయంలొ దేశంలొ రైల్వేల విస్తరణ రైల్వే స్టేషన్లలొ కనీస మౌలిక వసతులు కల్పించడం అవసరం.

    డిల్లి -చెన్నై బుల్లెట్ రైలు ప్రాజెక్టు చైనాకు దక్కకుండ అగ్రరాజ్యం చేయవలసినదంత చెస్తుంది. ఈ సందర్బంలొ భారత్ అచితుచి అడుగెయాలి.చైనాతొ స్నేహశిల సంబందాలను పెంపొందించుకొవడం అత్యవసరం.అర్దీక,రాజకీయ శక్తిగా ఎదుగుతున్న చైనాను నిలువరించడం అగ్రరాజ్యనికి అవసరం భారత్ ఆవ్యుహంలొ పావుకాకుండా జాగ్రత్త వహించాలి

  3. శ్రీనివాస్ గారు, మీకు income elasticity of demand గురించి తెలిసినట్టు లేదు. బుల్లెత్ రైలు ఎంత వేగంగా వెళ్ళినా ఇందియాలోని పల్లెటూరివాడు దానిలో ప్రయాణించడు.

  4. సార్ మీరు చెప్పింది నిజమే ,నెను ఇంకా నెర్చుకొనే దశలొనే ఉన్నాను .నా వాక్యలు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తే క్షమించండి .

    మనలాంటి సామాన్యులు బుల్లెట్ రైలు ఎక్కడం జరగని పని దాని ధర దాదాపుగా విమాన యాన ధరలతొ సమానంగా ఉంటాయి. ప్రస్తుత జనాబా అవసరాలకు తగినంతగా రైల్వేల సామర్ద్యం లేదు (ప్రయాణికులతొ కిక్కిరిసిన బొగిల దౄశ్యల్ని చెస్తునే ఉన్నాం).రైల్వేల భద్రత ప్రమణాలు కుడా అంతంతమాత్రమే ఇటువంటిపరిస్తితులలొ రైల్వేల విస్తరణ మౌలిక సదుపాయల కల్పనమరియు భద్రత గురించి ప్రభుత్వం అలొచించాలి.

    చివరగా ,బుల్లెట్ రైళ్ళు ,విమానయానం జనాభా లొ 10శాతం ఉన్న ఉన్నతస్థాయి వర్గాలకొసమే.కాని దానిని శాస్రసాంకేతిక అభివ్రృద్దికి సంకేతంగా భావించవచ్హ?

  5. నాకేమీ ఇబ్బంది లేదు. స్కూల్ పుస్తకాలలో ఆర్థిక శాస్త్రం గురించి వ్రాయకపోవడం వల్ల చాలా మంది ఆర్థిక అంశాలలో misconceptionsకి పోతుంటారు. వందేళ్ళ క్రితం Britainలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు మాంసం కొనేవాళ్ళ సంఖ్య తగ్గించి కానీ గోధుమలు కొనేవాళ్ళ సంఖ్య తగ్గలేదు. నీ దగ్గర వంద రూపాయలు ఉంటే నువ్వు ఆ వంద రూపాయలకి దొరికేదే కొంటావు కానీ ఐదు వందల రూపాయలు అప్పు చేసి ఖర్చు పెట్టవు కదా. ఐదు రూపాయల తికెత్ కొనలేక తికెత్ లేకుండా ప్రయాణించేవాడు వెయ్యి రూపాయలు పెట్టి బుల్లెత్ రైలు తికెత్ ఎలా కొంటాడు? రైల్వేలకి కేవలం ధనవంతుల నుంచి ఆదాయం రాదు. అందుకే రైల్వేవాళ్ళు పాసింజర్ తికెత్‌ని ఐదు రూపాయలకి, ఎ.సి. తికెత్‌ని ఐదు వందల రూపాయలకి అమ్ముతారు. బుల్లెత్ రైళ్ళు నడపడానికైతే వేరే infrastructure ఉండాలి. వాటి తికెత్‌లని కనీసం వెయ్యి రూపాయలకి అమ్మితే గానీ లాభం రాదు. విజయవాడ నుంచి ఒంగోలుకి వెయ్యి రూపాయలుగా తికెత్ ధర పెడితే ఒకరిద్దరు మాత్రమే ఆ రైలు ఎక్కుతారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s