ప్రభుత్వమే ఖర్చు పెంచాలి -ఆర్ధిక సలహాదారు


మోడి ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న ప్రైవేటు పెట్టుబడులు ఎంతకీ ముందుకు రావడం లేదు. ‘మేక్-ఇన్-ఇండియా’ నినాదం కాస్తా హుళక్కి అయిపోయింది. బి.జె.పి/మోడి రాక వల్లనే మొదటి త్రైమాసికంలో జి.డి.పి 5.7 శాతం వృద్ధి చెందిందని తమ జబ్బలు తామే చరుచుకున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు మెల్లిగా ‘అబ్బే, ప్రభుత్వమే ఖర్చు పెంచక తప్పదు’ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ‘కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన’ అంటూ ప్రభుత్వ ఖర్చును తగ్గించి తద్వారా ఫిస్కల్ డెఫిసిట్ తగ్గించాలని ప్రబోధించిన బి.జె.పి పాలకులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రభుత్వ ఖర్చు పెంచాలని చెబుతున్నారో ముందు చెప్పాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణీయన్ ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచాల్సిన ఆవశ్యకత గురించి చెబుతూ మరోసారి పత్రికలకెక్కారు. మోడి ప్రభుత్వానికి ఆర్ధిక సలహాదారుగా రాకముందు అరవింద్ గారు అమెరికాలో ఉండేవారు. ఐ.ఐ.ఎం, అహ్మదాబాద్ లో మేనేజ్ మెంట్ పట్టా పుచ్చుకున్న అరవింద్ తన ఆర్ధిక పరిజ్ఞానాన్ని అమెరికాలోని సంస్ధలకే ప్రధానంగా వెచ్చించారు. ఈయన ఐ.ఎం.ఎఫ్ లో కూడా పని చేశారు. (ఐ.ఎం.ఎఫ్ ఆర్ధికవేత్తలే తరచుగా మనకు ఆర్ధిక సలహాదారులుగానూ, ఆర్.బి.ఐ గవర్నర్ లు గానూ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగానూ వస్తుంటారు.) ఇంత ఘనత వహించిన అరవింద్ గారు సైతం ఎఫ్.డి.ఐ లు, ప్రైవేటు పెట్టుబడుల జపం మానేసి ప్రభుత్వమే వ్యయం పెంచాలని చెప్పడం వెనుక మతలబు ఏమిటి?

“మునుముందు ఆర్ధిక వృద్ధిని పునరుద్ధరించాలంటే ప్రభుత్వ పెట్టుబడి మరింత గొప్ప మాత్ర పోషించాల్సి రావచ్చు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా వాటికి ప్రోత్సాహకారిగా (compliment) కూడా ప్రభుత్వ పెట్టుబడులు పని చేస్తాయి. కనుక అటువంటి పెట్టుబడులకు తగిన కోశాగార అవకాశాన్ని (fiscal space) కల్పించాలి” అని అరవింద్ చెప్పారు. అరవింద్ రచించిన మధ్య కాలిక ఆర్ధిక సమీక్ష కూడా ఈ అంశాన్నే ప్రధానంగా నొక్కి చెప్పిందని ది హిందు ఎడిటోరియల్ ద్వారా ఇప్పటికే గ్రహించాము.

బడ్జెట్ వనరులను ఎంత కాడికీ ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించడానికీ, వారికి పన్ను రాయితీలు కల్పించడానికి మాత్రమే కేటాయించాలనీ, ప్రజలకు వెచ్చించే సబ్సిడీలకు సాధ్యమైనంత తక్కువ కేటాయించాలని స్వేచ్చా మార్కెట్ ఆర్ధిక విధానాలు ప్రభోదిస్తాయి. ఉన్నదంతా ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేస్తే అక్కడి నుండి సమాజం లోని వివిధ సెక్షన్లకు ఆదాయం ఆటోమేటిక్ గా ప్రవహించేస్తుందని ఈ అవగాహనలో భాగంగా ఉంటుంది. మార్కెట్ ఎకానమీ, స్వేచ్చా మార్కెట్ విధానాలు, పెట్టుబడిదారీ విధానాలు… ఇలా ఏ పేరు పెట్టుకున్నా ఈ అవగాహననే కలిగి ఉంటాయి. ఈ విధానాలను కాస్త అటు తిప్పి, ఇటు తిప్పి వివిధ పేర్లు పెట్టినా అంతిమంగా తిరిగి ఈ అవగాహనకే వస్తారు.

సుబ్రమణియన్ చెబుతున్న Fiscal space అంటే ఇలాంటి స్వేచ్ఛా మార్కెట్ విధాన కేటాయింపులకు కాస్త తెరిపిడి ఇచ్చి ప్రభుత్వమే స్వయంగా వ్యయం చేయాలనీ తద్వారా ఆర్ధిక వ్యవస్ధకు ఊపు తేవాలని చెప్పడం. ప్రభుత్వమే పెట్టుబడుల వ్యయం చేయడానికి బడ్జెట్ వనరులను తరలించడాన్ని ‘ఫిస్కల్ స్పేస్’ ఇవ్వడంగా అరవింద్ ప్రస్తావించారు. నిజానికి ప్రభుత్వ వ్యయం వల్ల ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోతుంది గనుక దాన్ని తగ్గించాలని ఎప్పుడూ చెబుతుంటారు. ఆయిల్ సబ్సిడీ, ఆహార సబ్సిడీ, వ్యవసాయ సబ్సిడీ.. ఇలాంటి సబ్సిడీలన్నీ ప్రభుత్వ వ్యయం కిందికే వస్తాయి. ప్రభుత్వం చేసే వ్యయంలో కంపెనీలకు ఇచ్చే లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు, సుంకం తగ్గింపులు, ప్రోత్సాహకాలు కూడా కలిసి ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వ పెద్దలు, వారి ఆర్ధిక వేత్తలు ఎన్నడూ తాకను కూడా తాకరు.

మోడి హామీ ఇచ్చిన ‘Minimum Government, Maximum Governance’ (కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన) నినాదం కూడా ఈ అవగాహనలో భాగమే. చిన్న/కనిష్ట ప్రభుత్వం అంటే ప్రభుత్వ వ్యయాన్ని బాగా తగ్గించడం. వ్యయాన్ని తగ్గిస్తామని స్వదేశీ, విదేశీ పెట్టుబడులకు హామీ ఇచ్చిన ప్రభుత్వానికి ఇప్పుడు ఆ వ్యయాన్ని పెంచాలని ఆర్ధిక సలహాదారు సుబ్రమణీయన్ అదే పనిగా సలహా ఇస్తున్నారు. దానికి కారణం ముందు చెప్పుకున్నట్లు ప్రైవేటు పెట్టుబడులు ఏవి ముందుకు రాకపోవడమే. ప్రైవేటు వాళ్ళు ముందుకు రాక, ప్రభుత్వమూ వ్యయం చేయకపోతే ఆర్ధిక వృద్ధి ఇంకా దిగజారుతుంది. మా వల్లనే ఆర్ధిక వృద్ధి పైకి చూస్తోంది అని జబ్బలు చరుచుకున్న మోడి ప్రభుత్వం గొప్పలు కాస్తా ఒట్టి గాలి కబుర్లుగా తేలిపోతాయి. దానితో ప్రభుత్వమే వ్యయం చేయాలని ఆర్ధిక సలహాదారు చేత చెప్పించుకుని ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసేందుకు మోడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది.

ప్రభుత్వం వ్యయం పెంచాలంటే అప్పులు తప్ప మరో దారి లేదు. పన్నుల వసూళ్లయినా పెంచుకోవాలి లేదా అప్పులన్నా తేవాలి. ఈ రెండు మార్గాలను ఉమ్మడిగా ఎంచుకోవచ్చు కూడా. రానున్న రోజుల్లో మోడి ప్రభుత్వం మరిన్ని పన్నులు బాదకపోతే ఆశ్చర్యమే. ప్రజల నుండి వ్యతిరేకత సంపాదించడం ఎందుకు అనుకుంటే అప్పులు తేవడం పైనే ప్రధానంగా కేంద్రీకరించవచ్చు. అప్పులు తెచ్చినాసరే, ఆ భారం మళ్ళీ వివిధ పన్నుల రూపంలో ప్రజల నుండే వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్ధిక సలహాదారు ఇస్తున్న వ్యయం పెంపు సలహా ఈ విధంగా ప్రజల మెడకే చుట్టుకుంటుంది.

2 thoughts on “ప్రభుత్వమే ఖర్చు పెంచాలి -ఆర్ధిక సలహాదారు

  1. పెట్టుబడిదారులకి సబ్సిదీలు ఇచ్చినంతమాత్రాన కొత్త పెట్టుబడులు రావు. పెట్టుబడిదారులు ఆ సబ్సిదీ డబ్బుల్ని తమ సొంత ఖాతాల్లో వేసుకుంటారు. మా తమ్ముడు ఇరవై లక్షల FD మీద బ్యాంక్‌కి కోటి రూపాయలు లోన్ అడిగాడు. అలా ఇస్తే అతను ఎనభై లక్షలు పట్టుకుని పారిపోయి, బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం ఊడిపోయేలా చేస్తాడు. బ్యాంక్‌వాళ్ళు మా తమ్ముణ్ణి తిట్టి పంపించారు. అంబానీలు లాంటివాళ్ళకి మాత్రం ప్రభుత్వం అడక్కుండానే కోట్లకి కోట్లు దానం చేస్తుంది.

  2. మేక్ ఇన్ ఇండియా నినాదం తొ విదేశి ప్రత్యక్ష పెట్టుబడులకొసం ప్రపంచం అంత చుట్టి వచ్ఛిన మోడి ఇప్పుడు ప్రభుత్వమే వ్యయం చేయాలనడం ఎల అర్థం చేసుకొవాలి . ఒకపక్క మేక్ ఇన్ ఇండియా ,మేడ్ ఇన్ ఇండియా అంటు మరొపక్క ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెట్టడం (సెయిల్ వాటా అమ్మకం )దేనికి సంకేతం .

    ప్రయివేటు సంస్థలకు ,పెట్టుబడి దారులకు పన్ను మినహయింపులు పెంచుతు ,ప్రభుత్వ భుములను దారదత్తం చేస్తు మరొపక్క సంక్షేమ పథకాల్ని చారిటిగా అభివర్ణిస్తు కొతపెట్టడం (ఉపాది హామి పథకం ) బాదాకరం . వౄద్ది రేటు పెంచడానికి ప్రభుత్వ వ్యయం కొసం పన్నులు పెంచడం సామన్యుడికి శరాఘాతమే.అంతర్జాతియంగా దాదాపుగా సగం తగ్గినా చమురు ధరలకణుగుణంగా దేశియా విపణి లొ ధరలు తగ్గలేననేది నిర్వివాదాంశం పైపెచ్హు ఏక్సైజె సుంకం పెరిగి ప్రభుత్వాలు మరింత ఆదాయాల్ని గడిస్తున్నయ్ .ఇటువంటి పరిస్తితులలొ ప్రభుత్వం పన్నులు పెంచడం ఇబ్బందికరంగా పరిణమించవచ్హు ప్రభుత్వ వ్యయం కొసం మరిన్ని అప్పులు తేవడం ,ఇప్పటికే జి.డి.పీ లొ అప్పుల ఉన్న అప్పు శాతన్ని మరింత పెంచడం ఆర్దికవ్యవస్తకు శ్రేయస్కరం కాదు .

    మంచి ఫలితాలు వఛ్హీనపుడు తమఘనతగా చేప్పుకొని ,పరిస్తితులు తారుమారైనపుడు గత ప్రభుత్వాల విదాన లొపాల పుణ్యమేనని వాదించడం సహజమేగా !!!!!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s