2014 నేషనల్ జాగ్రఫిక్ ఫోటో పోటీ విజేతలు -ఫోటోలు


నేషనల్ జాగ్రఫిక్ మేగజైన్ 2014 సంవత్సరానికి గాను ఫోటో పోటీ విజేతలను ప్రకటించింది. ఎప్పటిలాగానే జనం (People), ప్రకృతి (Nature), స్ధలం (Places) అనే మూడు విభాగాల్లో పోటీ నిర్వహించబడింది.

అత్యున్నతమైన గ్రాండ్ బహుమతిని పీపుల్ విభాగం విజేతకు దక్కింది. హాంగ్ కాంగ్ లో చీకటి ఆలుకుని ఉన్న ఒక రైలు పెట్టెను ఒక యువతి చేతిలోని మొబైల్ ఫోన్ ప్రకాశింపజేస్తున్న దృశ్యాన్ని బ్రియాన్ యెన్ చిత్రీకరించగా అది గ్రాండ్ ప్రైజ్ ను గెలుచుకుంది.

మొబైల్ ఫోన్ ఆధునిక మానవుడి వర్తమాన జీవనానికి గొప్ప ప్రతిబింబం అయిపోయింది. పర్సనల్ కంప్యూటర్ ఉన్న వారికి మాత్రమే పరిమితమైన ఇంటర్నెట్ ఈ రోజు మారు మూల పల్లెల్లోని వారికి సైతం కాస్తన్నా అందుబాటులోకి తెచ్చిన పరికరం మొబైల్ ఫోన్. మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో లేదా జేబులో పెట్టేసుకున్న భ్రాంతిని మొబైల్ ఫోన్ కలుగజేస్తోంది. ప్రపంచానికి సమాచార జ్ఞానాన్ని అందిస్తున్న అలాంటి ఒక మొబైల్ ఫోన్ మసక చీకట్లో ఉన్న ఒక రైలు పెట్టెను నీలపు కాంతితో నింపేసింది.

ఈ ఫోటో వివిధ రకాలుగా ఆధునిక జీవనాన్ని ప్రతిబింబిస్తోంది. ఫోన్లు లేని కాలంలో రైలు పెట్టెలో జనానికి పరస్పరం పలకరింపులే టైమ్ పాస్ గా ఉండేవి. ఆ విధంగా కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు, కొండొకచో కొత్త పరిణయాలకు పునాది కూడా ఏర్పడేవి. మొబైల్ ఫోన్/ స్మార్ట్ ఫోన్ లు వచ్చాక మనిషి సమూహంలోనూ ఒంటరిగా మారిపోయేడు. ఒంటరితనంలోనూ సమూహంలో ఉన్న అనుభవాన్ని ఇచ్చే మాట నిజమే గానీ అది కాస్తా దాని వ్యతిరేక అనుభవానికే ఎక్కువగా దారి తీయడం ఒక అభాస.

ఫోటోలోని యువతి ఫేస్ బుక్ ను తదేక దీక్షతో చూస్తున్నట్లు కాంతి రంగు చెబుతోంది. (ఈ సంగతి ఫోటో గ్రాఫర్ ధృవీకరించినట్లు తెలుస్తోంది.) ఆమె చుట్టూ జనం. కానీ ఆమె భౌతికంగా తన చుట్టూ లేని జనంతో తన చుట్టూ ఉన్నట్లే సంభాషిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రగతి ప్రయోజనం కోసం కాకుండా లాభం ప్రయోజనం కోసం మాత్రమే వినియోగించినప్పుడు ఇలాంటి చిత్ర విచిత్రాలు సంభవమే.

ప్రకృతి విభాగంలో విజేత “The Great Migration”. టాంజానియాలో అడవి దున్నలు గుంపులు గుంపులుగా మారా నదిని దాటుతున్నాయి. ఈ క్రమంలో ఓ అడవి దున్న ఎత్తైన చోటు నుండి దూకుతోందో, జారి పడుతోందో తెలియని చర్యలో ఉండగా ఫోటోగ్రాఫర్ ఆ దృశ్యాన్ని బంధించారు. ఇవి గడ్డి నేలల కోసం ఇలా దేశాలు దాటి పోవడం ప్రతి యేడూ జరుగుతుందని సమాచారం.

స్ధలం విభాగంలో బహుమతి గెలుచుకున్న ఫోటో హంగేరి రాజధాని బుడాపెస్ట్ లోనిది. “Bathing in Budapest” అన్న శీర్షికతో ఉన్న ఈ ఫోటో హంగేరియన్ ప్రజలకు ఇష్టమైన ఒక ‘స్పా’ కు చెందినది. ధర్మల్ స్పా గా పిలిచే ఈ స్పా వేడి నేటితో టూరిస్టులను ఆకర్షిస్తుంది. వేడి నీటికి దగ్గరగా ఉన్న గాలి ఆవిరి లేకుండా స్పష్టంగా ఉంటే పైకి పోయే కొద్దీ ఆవిరి పొగ గాలిలో నిండిన దృశ్యాన్ని బంధించడం బహుశా ఫోటోగ్రాఫిక్ విలువ కలిగినది కావచ్చు.

ఇక మిగిలిన ఫోటోలన్నీ గౌరవప్రదమైన స్ధానాన్ని దక్కించుకున్నవి. ఈ స్ధానం వారికి బహుమతి ఏమీ ఉండదు. గ్రాండ్ ప్రైజ్ విజేతకు 10,000 డాలర్లు చెల్లిస్తారు. దానితో పాటు వాషింగ్టన్ డి.సి లో ఉన్న నేషనల్ జాగ్రఫిక్ కేంద్ర కార్యాలయంలో జరిగే వార్షిక ఫోటోగ్రఫి సెమినార్ కు హాజరయ్యే అవకాశం ఇస్తారు. ఇతర ఇద్దరు విజేతలకు ఏమి ఇస్తారో నేషనల్ జాగ్రఫిక్ వాళ్ళు తమ వెబ్ సైట్ లో చెప్పలేదు. మొత్తం 150 దేశాల నుండి 9200 ఎంట్రీలు వచ్చాయని మాత్రం చాటారు.

తన ఆహారాన్ని ఏమైనా మిస్ అయ్యానా అన్నట్లుగా ఎగురుతూనే పక్కకు తిరిగి చూస్తున్న పొట్టి చెవుల గుడ్లగూబ, ప్లాస్టిక్ పెట్టెలో తన బొమ్మ స్నేహితురాలితో ముచ్చటిస్తున్న ప్యారిస్ బాలిక, ఒంటినిండా రామనామాన్ని పచ్చ బొట్టు పొడిపించుకున్న ఛత్తీస్ ఘడ్ అంధుడు, టర్కీలో సముద్రం ఒడ్డున సమీపిస్తున్న తుఫానును బంధించిన ఫోటో… మొ.వి కింది ఫొటోల్లో ఉన్నాయి.

ప్రకృతి విభాగంలో గౌరవ స్ధానం పొందిన మంచుతో చెక్కిన డ్రాగన్ ఫోటోను చూస్తే ఫోటోగ్రాఫర్ కంటే ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి పనితనమే మనల్ని ఆకర్షిస్తుంది. సిరియాలో కిరాయి తిరుగుబాటు పాలబడి ఇద్దరు మానసిక వికలాంగులు ఓ చీకటి గదిలో బిక్కు బిక్కు మంటున్న దృశ్యం, సిరియా యుద్ధంలోనే క్షిపణుల దాడులతో శిధిల నగరంగా మారిన హోమ్స్ నగరం మనకు ఆధిపత్యం కింద నలుగుతున్న పీడిత ప్రజల, దేశాల వర్తమానాన్ని గుర్తు చేస్తాయి. 

సీరియస్ గా ఆడుకుంటున్న రెండు కౌమార ప్రాయపు పులుల దృశ్యం ఎప్పుడో యుగాలకు ఒకసారి కనపడే దృశ్యం అని ఫోటో గ్రాఫర్ చెబుతున్నారు. ఈ దృశ్యం కేవలం 4-5 సెకన్ల పాటు మాత్రమే కొనసాగిందట. స్ధలం విభాగంలో టోకియో లోని ఒక రైలు స్టేషన్ లో తీసిన ఫోటో విచిత్రంగా కనిపిస్తోంది. ప్రజలు తరంగాలవలే ప్లాట్ ఫారంపై గుంపులు గుంపులుగా తోసుకు వస్తుంటే ‘ఫ్రీ షాట్’ తీశానని అది ఇలా దర్శనం ఇచ్చిందని ఫోటోగ్రాఫర్ చెప్పారు.

మృత సముద్రం ఒడ్డున ఖనిజ, లవణాలతో సమృద్ధిగా ఉండే తడి ఇసుకలో ‘మట్టి స్నానం’ చేస్తున్న ఫోటో ఒకటి ఉందిక్కడ. ఫోటోలోని ఆ నలుగురు ఇజ్రాయేలీయులకు శాశ్వత యౌవనం కోసం ఇలా మట్టిస్నానం చేస్తున్నారట. మృత సముద్రం బీచ్ లో మట్టిస్నానం చేస్తే శాశ్వత యౌవనం సిద్ధిస్తుందని ఇజ్రాయెలీ ప్రజల నమ్మకం(ట). మరి వీళ్ళు ఇంకా ముసలిగానే ఉన్నారో యౌవనులై గుర్తుపట్టలేని విధంగా మారారో ఫోటోగ్రాఫర్ చెప్పలేదు.

లండన్ లోని రిచ్ మండ్ పార్క్ లో ఎవరినో పిలుస్తున్న దుప్పి, భార్య తయారు చేస్తున్న రొట్టె కోసం ఎదురు చూస్తూ ఆలోచనల ఝరిలో మునిగిపోయిన రొమేనియా పెద్దాయన, నెపోలియన్ రాస్ అనే పెద్ద చేప ఫోటో కోసం సహజ ఫ్రేమ్ నిర్మిస్తున్నాయా అన్నట్లు తిరుగుతున్న గ్లాస్ చేపల గుంపు, బ్యాంకాక్ షాపింగ్ మాల్ లో ఏడ్చి సాధించుకునే పనిలో నిమగ్నం అయి ఉన్న పాప… మిగిలిన ఫోటోలు!

ఫోటోలను నేషనల్ జాగ్రఫిక్, ది అట్లాంటిక్ పత్రికలు ప్రచురించాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s