అస్సాంలో మళ్ళీ హింస, 70 మంది బలి


Adivasi men stand guard to gutted houses of Bodos

అస్సాం రాష్ట్రంలో, ముఖ్యంగా బోడో స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో మరోసారి హింస ప్రజ్వరిల్లింది. బోడో మిలిటెంట్ సంస్ధల్లో ఒకటయిన నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ [ఎన్‌డి‌ఎఫ్‌బి(ఎస్)] కు చెందిన మిలిటెంట్లు హింసాకాండకు పాల్పడ్డారు. అత్యధికంగా స్త్రీలు, పిల్లలు చనిపోయిన హత్యాకాండలో 67 మంది ఆదివాసీ పౌరులు చనిపోగా, పోలీసు కాల్పుల్లో మరో ముగ్గురు ఆదివాసీలు చనిపోయారు. బోడో హత్యలకు ప్రతీకారంగా ఆదివాసీలు కొందరు బోడోల ఇల్లు తగలబెట్టారు.

దాదాపు వంద సంవత్సరాల క్రితం అస్సాంలోని ఇతర ప్రాంతాల నుండి బోడోలు నివసించే ప్రాంతానికి వలస వచ్చిన ఆదివాసీలను బోడోలు తాజాగా లక్ష్యం చేసుకున్నారు. ముస్లింలు, ఆదివాసీలు లేని బోడో లాండ్ దేశం కోసం కొన్ని గ్రూపులు, మరిన్ని అధికారాలు కలిగిన రాష్ట్రం కోసం కొన్ని గ్రూపులు మిలిటెంట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. స్ధానికంగా ఉన్న ఖనిజ వనరులను కొల్లగొట్టడంపై ఉన్న శ్రద్ధ అక్కడి ప్రజలపై కేంద్ర ప్రభుత్వాలు చూపకపోవడంతో అస్సాంలో బోడోల సమస్య రావణ కాష్టంలా రగులుతూనే ఉంది.

మంగళవారం పొద్దు బోయిన తర్వాత బోడో మిలిటెంట్లు ఆదివాసీలు నివసించే గ్రామాలపై దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆదివాసీలు చనిపోయారని పత్రికలు తెలిపాయి. సోనిట్ పూర్ జిల్లాలో 39 మంది, కొక్రాఝార్ జిల్లాలో 25 మంది, చిరంగ్ జిల్లాలో ముగ్గురు, పోలీసు కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. చనిపోయినవారిలో 62 మంది ఆదివాసీలు కాగా 5 గురు బోడోలు. మృతుల్లో 21 మంది స్త్రీలు కాగా, 18 మంది పిల్లలు.

మిలిటెంట్లు తేలికగా దొరికే లక్ష్యాలను ఎంచుకుని హత్యాకాండకు పాల్పడడం జాతుల స్వతంత్ర ఆకాంక్షలకు ఏ విధంగా తోడ్పడుతుందో అర్ధం కాని సంగతి. జాతుల అణచివేతకు, దోపిడీకి పాల్పడే రాజ్యాన్ని వదిలి అమాయకులైన ప్రజలను లక్ష్యంగా చేసుకుని మూకుమ్మడి హింసాకాండకు పాల్పడడం ఏ విధంగానూ సమర్ధనీయం కాజాలదు.

బోడో హత్యాకాండకు నిరసనగా బుధవారం ఆదివాసీలు నిరసన ప్రదర్శన నిర్వహించి పోలీసు స్టేషన్ పై దండు వెళ్లారు. ధేకీయాజుయి పోలీసు స్టేషన్ పైకి ఆదివాసీలు విల్లమ్ములు ధరించి దండెత్తి వచ్చారని, ఆగిపోవాలని, వెనక్కి వెళ్లాలని చెప్పినప్పటికీ వినకపోవడంతో మొదటి లాఠీ చార్జి చేశామని, అయినా వినకపోవడంతో కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఆదివాసీలు చనిపోయారు. ‘మమ్మల్ని చంపుతున్నారు బాబోయ్’ అని చెప్పుకోవడానికి వెళ్ళినవారిని పోలీసులు కాల్పులు జరిపి మరింతమందిని చంపడం మరో ఘోరం.

మిలిటెంట్లను అన్నివైపులా చుట్టుముట్టి ఊపిరి ఆడకుండా చేయడంతో మరోదారి లేక ఈ ‘పిరికి చర్యకు పాల్పడ్డారని అస్సాం పోలీసులు చెప్పారు. అస్సాం మారణకాండ ‘టెర్రరిస్టు చర్య’ అని హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అభివర్ణించారు. బోడో ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించగా, కేంద్ర ప్రభుత్వం అదనపు పారా మిలట్రీ బలగాలను పంపింది.

తాజా హింసాకాండ ఫలితంగా ఎప్పటి లాగానే ఇరువైపుల చెందిన ప్రజలు నష్టపోయారు. దాడులు జరుగుతాయన్న భయంతో ప్రజలు అనేకులు గ్రామాల నుండి పారిపోయి వివిధ చర్చిలు, స్కూళ్ళలో తలదాచుకుంటున్నారు. బోడోల ఇళ్ళు, ఆదివాసీల ఇళ్లూ రెండూ తగలబడిపోయాయి. మరణించినవారికి 2 లక్షల సాయాన్ని కేంద్రం ప్రకటించింది.

ఈశాన్య రాష్ట్రాల్లో జాతుల జాతీయ ఆకాంక్షలను గుర్తిస్తూ తగిన పరిష్కారం కోసం చూస్తే సమస్య అంత పరిష్కరించలేనిదేమీ కాదు. కానీ ప్రజలు సొంత తగాదాల్లో నిమగ్నమై ఉన్నంత కాలం, మిలిటెంట్లు తమ జాతీయ ఆకాంక్షలను ఇతర జాతులపై ద్వేషంగా వెలిబుచ్చుతున్నంత కాలం బోడో సమస్యకు ఎన్నటికీ పరిష్కారం కాదు.

6 thoughts on “అస్సాంలో మళ్ళీ హింస, 70 మంది బలి

 1. మిలిటెంట్లు తేలికగా దొరికే లక్ష్యాలను ఎంచుకుని హత్యాకాండకు పాల్పడడం జాతుల స్వతంత్ర ఆకాంక్షలకు ఏ విధంగా తోడ్పడుతుందో అర్ధం కాని సంగతి. జాతుల అణచివేతకు, దోపిడీకి పాల్పడే రాజ్యాన్ని వదిలి అమాయకులైన ప్రజలను లక్ష్యంగా చేసుకుని మూకుమ్మడి హింసాకాండకు పాల్పడడం ఏ విధంగానూ సమర్ధనీయం కాజాలదు.
  ఇలా,మిలిటెంట్లుగానీ,తాలిబన్లుగానీ,రాజ్యాలుగానీ ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా హింసా మార్గాలను ఎంచుకొంటుంటే ఆ చర్యలను ఏవిధంగా చూసినా సమర్ధించడం అభిలాషనీయం ఎలా అవుతుందో నాకు తెలియడంలేదు!
  నాగరిక సమాజం అంటూ ఇటువంటి హింసాత్మక చెర్యలను ఎలా సమర్ధించగలం?

  ఈశాన్య రాష్ట్రాల్లో జాతుల జాతీయ ఆకాంక్షలను గుర్తిస్తూ తగిన పరిష్కారం కోసం చూస్తే సమస్య అంత పరిష్కరించలేనిదేమీ కాదు-ఇది రాజ్యాన్ని ఉద్దేశించి అంటున్నమాటా? అలా అయితే ఆ పరిష్కారం ఏమైఉంటుందో తెలుపగలరా?

 2. హింసకు పాల్పడాలని జనం ఎప్పుడూ అనుకోరు. రాజ్యం నుండి హింస ఎదురైనప్పుడు జనానికి ప్రతిఘటించేందుకు మరో మార్గం ఉండదు. రాజ్య హింస ఆగినపుడు ప్రతి హింసా ఆగుతుంది. విన్నపాలు, మహాజరులతో పనైతే హింస అవసరం ఉండదు. పని కాకపోగా పోలీసు, సైనిక ప్రయోగిస్తారు. అందుకనే శ్రామిక ప్రజలు అనివార్యంగా హింస వైపు మళ్లుతారు.

  బోడోల హింస రాజ్యానికి బదులు తోటి ప్రజలపైకి ఎక్కు పెట్టారు. అలా చేస్తే బైటివారు భయపడి వెళ్లిపోవాలని వారి కోరిక. జాతుల స్వతంత్ర ఆకాంక్షలు తోటి జాతులపై ద్వేషంగా మారడం సమర్ధనీయం కాదు. దోపిడి వ్యవస్ధలలోని ఆధిపత్య వర్గాలు తమ దోపిడీ కొనసాగేందుకు జాతుల స్వతంత్ర ఆకాంక్షలను అణచివేస్తారు. తమ సొంత సంస్కృతీ, భాషలను రుద్దుతారు. దీన్ని ప్రతిఘటించేందుకు హింస తప్ప మరో మార్గాన్ని రాజ్యం మిగల్చలేదు.

  నాగరిక సమాజం అనే ఉదాత్తమైన అవగాహన ఒక్క జనానికే వర్తిస్తుందా? రాజ్యానికి వర్తించదా? నిజానికి రాజ్యమే మొదట ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. దానికి బదులు స్వార్ధం కోసం రాజ్య యంత్రాంగాన్ని జనం పైకి ఉసిగొల్పితే జనం ఏం చేయాలి? ఆ హింస పడుతూ చేష్టలుడిగి ఊరుకోవాలా? స్నేహితుడో, పొరుగు వాడో చులకన చేస్తూ ఒక మాట అంటేనే భరించలేం. అలాంటిది రాజ్యహింసను భరిస్తూ హింస లేకుండా ప్రభువులకు తమ సమస్యలు చెప్పుకొని పరిష్కారం కోరాలనడం అనాగరికం తప్ప నాగరికం ఏమీ కాదు.

 3. ఈశాన్య రాష్ట్రాల స్వాతంత్ర్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మేఘాలయకి ఇప్పటికీ రైలు మార్గం లేదు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ వెళ్ళాలంటే అసాంలోని జాగీ రోద్ స్తేషన్‌లో దిగి బస్సు ఎక్కాలి. నాగాలాంద్‌లో దిమాపుర్ ఒక్కటే రైల్వే స్తేషన్. మిజోరాంలో రైలు మార్గం ఉంది కానీ అది భైరవి వరకే, రాజధాని ఐజాల్ వెళ్ళాలంటే భైరవిలో బస్సులోకి మారాలి. ఆ ప్రాంతంలో రోద్‌లూ, రైలు మార్గాలూ సరిగా లేకపోయినా బంగ్లాదేశ్, బర్మాల నుంచి అక్రమ వలసదారులు చొచ్చుకువస్తున్నారు. బర్మాలో సైనిక పాలన వల్ల అనేక మంది హిందువులు ఇందియాకి అక్రమంగా వలస వచ్చారు. బంగ్లాదేశ్ నుంచి హిందూ, ముస్లిం ఈ రెండు మతాలవాళ్ళూ ఇందియాలోకి వలస వస్తున్నారు. బంగ్లాదేశీ వలసదారులైతే ఇక్కడ ఆధార్ కార్ద్‌లు కూడా సంపాదిస్తున్నారు. ఇంత కళ్ళు మూసుకుని పని చేసే భారత ధృతరాష్ట్ర పాలకులు ఈశాన్య రాష్ట్రాల వాళ్ళకి స్వాతంత్ర్యం ఇవ్వకుండా దానికి అభ్యంతరం ఎందుకు చెపుతున్నారో?!

 4. స్వయం ప్రతిపత్తి కొసం బొడొలు అస్తిత్వం కొసం ఆదివాసిలు జరుపుతున్న హింసలొ సమిధలు అయ్యెది అమాయకులే. ప్రభుత్వాలు ప్రతి సమస్యను రాజకియ కొణం నుండి చూడడం వల్ల సమస్యలు మరింత తివ్రం అవుతున్నాయ్ . విభిన్న జాతులు మరియు జివవైవిద్యంతొ ఉండాల్సిన ఈశాన్య రాస్ట్రాలు నిరంతరం జాతుల ఘర్షణలతొ రావణ కాష్టన్ని తలపిస్తున్నాయ్ .మిలిటెంట్లు వారి సమస్యను చర్చనియాంశం చెయవలసిన పద్దతి బహుశ ఇదికాదు … ఇప్పటికైన ప్రభుత్వం ఈశాన్య రాస్ట్రాల జాతుల అకాంక్షలను గుర్తెరిగి వారి సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగెయాలి

 5. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలుగా చెప్పబడుతున్న ప్రాంతాలు ఒకప్పుడు ముఘల్ సామ్రాజ్యంలో లేవు. అసాం, మణిపుర్, త్రిపుర రాజులుహిందువులు కావడం వల్ల ఆ ప్రాంతాల్లో హిందువులు ఎక్కువగా కనిపిస్తారు కానీ ఆ ప్రాంతాలవాళ్ళు తాము భారతీయులమని చెప్పుకోరు. ముఘల్ సామ్రాజ్యం పశ్చిమాన బెలూచిస్తాన్ నుంచి తూర్పున బంగ్లాదేశ్ వరకే విస్తరించి ఉండేది. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయులు గెలిచిన తరువాత ముఘల్ సామ్రాజ్యం ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళింది. ఆ తరువాత క్రమంగా ఈశాన్య ప్రాంతాలనీ, బర్మాని కూడా ఆంగ్లేయులు ఆక్రమించుకుని వాటిని ఇందియాలో విలీనం చేసారు. బర్మా ఇందియా నుంచి విడిపోయింది కానీ ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలుగా చెప్పబడుతోన్న ప్రాంతాలు మాత్రం ఇందియాలోనే భాగాలుగా ఉన్నాయి. ఆంగ్లేయులు ఆ జాతుల్ని ఇందియాలో కలిపారే తప్ప వాళ్ళు తమ ఇష్ట ప్రకారం ఇందియాలో చేరలేదు. వాళ్ళు ఇందియా నుంచి వేరు పడతామంటే మన పాలకులకి అభ్యంతరం ఎందుకు? బెలూచిస్తాన్ ముఘల్ సామ్రాజ్యంలోనే కాదు, గుప్త & మౌర్య సామ్రాజ్యాల్లో కూడా భాగంగా ఉండేది. చరిత్ర పేరు చెప్పి బెలూచిస్తాన్‌ని క్లెయిం చెయ్యలేని మన పాలకులు ఈశాన్య రాష్ట్రాలని మాత్రం ఎలా క్లెయిం చేస్తారు? నేనైతే ఈశాన్య రాష్ట్రాల స్వాతంత్ర్యాన్నే సమర్థిస్తాను.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s