హెచ్చరిక సంకేతాలు -ది హిందు ఎడిటోరియల్


(డిసెంబర్ 22 తేదీ ప్రచురించిన ఎడిటోరియల్ Cautionary signals కు ఇది యధాతధ అనువాదం.)

*********

2014-15 కు సంబంధించిన మధ్య సంవత్సర ఆర్ధిక సమీక్ష, ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆర్ధిక వృద్ధి 5.5 శాతం ఉంటుందని వాస్తవికంగా అంచనా వేసింది. ఆర్ధిక వృద్ధి యొక్క ఉరవడి ఇంకా బలహీనంగానే ఉన్నదనీ, ఆర్ధిక వ్యవస్ధ స్ధిరగతిని ఇంకా అందుకోవలసే ఉన్నదనీ… పారిశ్రామిక ఉత్పత్తి, వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణంలపై గత వారం విడుదల అయిన ఆర్ధిక గణాంకాలు స్పష్టంగా విప్పి చూపాయి. అక్టోబర్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 4.2 శాతం పడిపోవడంతో ప్రస్తుతం కొనసాగుతోందని భావిస్తున్న ఆర్ధిక స్వస్ధతపై అనుమానాలు పెరిగాయి. అక్టోబర్, నిజానికి పండగల సీజన్ నెల. సరుకులకు డిమాండ్ పెరుగుతుంది. కనుక ఈ డిమాండ్ తీర్చడానికి తయారీ రంగంలో ఉత్పత్తి వృద్ధి నమోదు కావలసి ఉండగా తగ్గుదల నమోదయింది.

అయితే, నవంబర్ నెల వాణిజ్య గణాంకాల ప్రకారం చమురేతర, బంగారమేతర దిగుమతులు మళ్ళీ పెరిగాయి – యంత్ర పరికరాల దిగుమతులు 20.32 శాతం వృద్ధి చెందాయి. ఈ కారణం చేత అక్టోబర్ నెలలో పారిశ్రామిక ఉత్పత్తి పడిపోవడం అపభ్రంశం మాత్రమేనని, నవంబర్ గణాంకాలు మెరుగైన పరిస్ధితిని సూచించవచ్చని ఆశించవచ్చు. కార్ల అమ్మకాలు 9.52 శాతం పెరగడం ద్వారా నవంబర్ నెలలో ఆటో పరిశ్రమ కనబరిచిన మెరుగైన పనితనం ఈ ఆశాపూరిత అంచనా సరైనదే అని సూచిస్తోంది. కానీ అదే నెలలో సుంకాలు తగ్గడం వల్ల బంగారం దిగుమతులు పెరగడం, అంతర్జాతీయ ధరలు పడిపోవడం, పండగ సీజన్ డిమాండ్… ఈ కారణాల వల్ల వాణిజ్య లోటు గత 18 నెలలోనే అత్యధికంగా నమోదయింది. చమురు దిగుమతుల బిల్లు 1.26 బిలియన్లు లేదా 9.73 శాతం మేరకు తగ్గిపోయినప్పటికీ వాణిజ్య లోటు పెరగడం గమనార్హం.

అక్టోబర్ లో పడిపోయిన ఎగుమతుల వృద్ధి నవంబర్ లో 7.27 శాతానికి పెరిగినప్పటికీ పడిపోతున్న చమురు ధరల వల్ల ఏర్పడిన అంతర్జాతీయ అనిశ్చిత వాతావరణంలో ఎగుమతిదారులకు ప్రయాణం ఇక కఠినం కానున్నది. భారత దేశం యొక్క మొత్తం ఎగుమతులలో ఐదో వంతు భాగం కలిగిన పెట్రోలియం ఎగుమతులు నవంబర్ లో 14.15 శాతం పడిపోయాయి. విదేశాల్లో నెలకొన్న కష్టతర మార్కెట్ పరిస్ధితులను ఇది ప్రతిబింబిస్తోంది. అప్పుడే ఆందోళన చెందవలసిన అగత్యం లేనప్పటికీ ప్రభుత్వము మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు వాణిజ్య వివరాలను సమీపం నుండి పరిశీలిస్తూ బంగారంపై తగిన దిద్దుబాటు చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. విధానకర్తలు ఆందోళన చెందవలసిన విషయం ఏమిటంటే, ఆర్ధిక వృద్ధిని పునరుద్ధరించడానికి కీలకమైన తాజా పెట్టుబడులు ముందుకు రాకపోవడం.

ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకోని విషయాన్ని మధ్య సంవత్సర ఆర్ధిక సమీక్ష తెలియజేస్తూ దీనిని పూడ్చుకోవడానికి ప్రభుత్వ పెట్టుబడి వేగం పుంజుకోవాలని సూచించింది. ఇది చెప్పడం తేలికే గానీ చెయ్యడమే కష్టం అని  ప్రభుత్వ ఆర్ధిక వనరుల దుర్బల స్ధితిని చూస్తే తెలుస్తుంది. నెమ్మదించిన ఆర్ధిక స్వస్ధతీకరణ ఫలితంగా ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను బడ్జెట్ అంచనాలు అతిగా వేసినవిగా పరిణమించడంతో రెవిన్యూ వసూళ్లు అంచనా కంటే 1.05 లక్షల కోట్లు తగ్గవచ్చని సమీక్ష తెలిపింది. ఈ నేపధ్యంలో కోశాగార లోటు లక్ష్యం (జి.డి.పి లో) 4.1 శాతం సాధించడం క్లిష్టం అవుతుంది. కనుక, స్వల్పకాలికంగా చూస్తే ప్రభుత్వ పెట్టుబడి రక్షకుడిగా అవతరించడం కష్టమే. కాకుంటే మధ్యకాలికంగా మెరుగైన ఎంపిక కాగలదు. అది కూడా వచ్చే ఒకటి రెండు సంవత్సరాలలో ఎలాంటి ఎదురుదెబ్బలు లేకపోతేనే. ఇక ఇప్పుడు మిగిలిన ఏకైక అవకాశం ప్రైవేటు పెట్టుబడులకు మద్దతు ఇచ్చి ప్రోత్సహించడమే. ఇందుకోసం ప్రభుత్వము, ఆర్.బి.ఐ లు కలిసి కృషి చేయవలసి ఉంటుంది.

*********

(ఏడ్చినట్లుంది ది హిందు చూపిన పరిష్కారం! మోడి గారు ఎంతగానో ఆశ పెట్టుకున్న ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సమీక్షే స్పష్టంగా చెబుతూ, ఇక ప్రభుత్వ పెట్టుబడులను నమ్ముకోవడమే ఉత్తమమని తేల్చేస్తే ది హిందూ వారు తిరిగి ఆ ప్రైవేటు పెట్టుబడులనే శరణు వేడడం ఏమిటో అర్ధం కాకుండా ఉంది.

పైన మూడో పేరా చివరి వాక్యం, నాలుగో పేరా మొదటి వాక్యం చూడండి. ప్రైవేటు పెట్టుబడులు రావడం లేదు గనక ఆర్ధిక వృద్ధి సాధించడానికి (బహుశా, కనీసం ఇంకా పదిపోకుండా ఉండడానికి) ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టాలని సమీక్ష స్పష్టంగా చెప్పింది. కాదు, కాదు ‘ప్రైవేటు పెట్టుబడులనే శరణు వేడండి’ అని ఎడిటోరియల్ చెప్పడం ఏమిటి? ‘ఆయనే ఉంటే…’ అన్నట్లు ప్రైవేటు పెట్టుబడులే వస్తే ప్రభుత్వ పెట్టుబడులే శరణ్యం అని సమీక్ష ఎందుకు చెబుతుంది? ప్రైవేటు పెట్టుబడులపై ది హిందు కు ఎందుకు ఆసక్తి?

చిత్రం ఏమిటంటే పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్ షిప్ మోడల్ విఫలం అయిందని సమీక్ష చెప్పడం. చిత్రాతి విచిత్రం: ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు గనుక ఎఫ్.డి.ఐలు, ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వమే ఆ ప్రైవేటు వారు మొహం చాటేసేశారో ఏమో గానీ ప్రభుత్వమే పెట్టుబడులు పెట్టాలని చెప్పడం. చూడబోతే ప్రభుత్వ సొమ్ముని ప్రైవేటు పెట్టుబడిదారులకు మేపే దురుద్దేశం ఇక్కడ దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. -విశేఖర్)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s